బ్రహ్మ మహా పురాణము
అవంతీ వర్ణనము
బ్రహ్మ ఇట్లు అనెను-
విప్రులార! మున్ను కృతయుగమునందు ‘ఇంద్రద్యుమ్నుడు’ అనురాజు ఉండెను. అతడు ఇంద్రతుల్య పరాక్రముడు. సత్యవాది, సమర్థుడు, సర్వశాస్త్ర విశారదుడు. రూపవంతుడు, సుభగుడు, శూరుడు, దాత, భోక్త, ప్రియభాషి. యజ్వ బ్రహ్మజ్ఞాని, సత్య ప్రతిజ్ఞుడు, ధనుర్వేదమందు, వేదమందు, శాస్త్రమునందు నిపుణుడు, స్త్రీ పురుషులకు పున్నమచంద్రుని విధముగా అందగాడు. ప్రతాపమున సూర్యునివలె తేరిపారజూడ అలవి కానివాడు. శత్రు కూటమునకు భయంకరుడు. విష్ణు భక్తుడు. సత్త్వశాలి. జితక్రోదుడు, జితేంద్రియుడు. యోగశాస్త్ర సాంఖ్య (జ్ఞాన) శాస్త్రములను అధ్యయనము చేసినవాడు. మోక్షమునందు ఇచ్ఛగలవాడు. ధర్మనిష్ఠుడు. ఇట్లు సర్వలక్షణ నిధియైన ఆరాజు భూమిని పాలించుచుండ అతనికి హరిని ఆరాధింపవలెనను నిశ్చయము కల్గినది.
దేవేశ్వరుడైన జనార్దనుని నేను ఎట్లారాధింపగలను? ఏ క్షేత్రము తీర్థము నదీతీరము ఆశ్రమము ఇందులకు అనువైనవి! అని తలచి మనసుచే పృథివినెల్ల పరికించి అన్ని తీర్థక్షేత్రపుర సముదాయము నెల్ల వదలి పురుషోత్తమ క్షేత్రమందు ఆలయమున కేగెను. ఆతనిని బలము (సేన) వాహనములు వెంబడించినవి. అక్కడ భూరిదక్షిణలొసంగి యథావిధిగ అశ్వమేధము చేసెను. స్వామికి మహోన్నత ప్రాసాదము గట్టించి అందు సంకర్షణుని (బలరాముని), కృష్ణుని, సుభద్రను ప్రతిష్ఠించి పంచతీర్థములు ఏర్పరచి స్నాన దాన తపో హోమాదులు ఆచరించి దేవతా దర్శనముచేసి భక్తితో ప్రతిదినము హరిని ఆరాధించి ఆస్వామి అనుగ్రహముచే మోక్షమును పొందెను. మార్కండేయుని, కృష్ణుని, బలరాముని దర్శించి ఇంద్రద్యుమ్న సాగరమున స్నానముచేసిన మానవుడు తప్పక మోక్షమును పొందును.
మునులు-ఇంద్రద్యుమ్న ప్రభువు మున్ను ఆ ముక్తి క్షేత్రమునకు ఎందులకు వెళ్లెను. వెళ్లి ఆ స్వామిని అశ్వమేధముచేసి ఎట్లు ఆరాధించెను? త్రిలోక ప్రఖ్యాతమైన ఆలయము అక్కడ ఎట్లు నిర్మించెను? సుభద్రా, బలరామకృష్ణుల మూర్తులను ఎట్లు నిర్మించెను? ఆ క్షేత్ర రక్షణ ఎట్లు చేసెను? ఆలయమందు కృష్ణాదుల ప్రతిష్ట ఎట్లు జరిగెను? ఇదంతయు జరిగినది జరిగినట్లు విపులముగ ఆనతిమ్ము నీ వాగమృతము సేవించిన కొలది మాకింకను అది గ్రోలవలయును అనిపించుచున్నది. వినవలెనని మిక్కిలి కుతూహలమగుచున్నది.
అని ఇట్లు మునులు అడుగ బ్రహ్మ “బాగు బాగు! పురాతనకథను అడిగితిరి. ఇది సర్వపాప హరము. భుక్తిముక్తి ప్రదము. శుభకరము. కృతయుగమందు జరిగిన చరిత్ర ఇదె చెప్పుచున్నాను. శ్రద్దగా ఇంద్రియములను అదుపులో ఉంచుకొని వినుడు.
మాళవ దేశమునందు అవంతి అను నగరమున్నది. అది భూ మండలమను ఋషభమునకు మూపురమా అన్నట్లు తలమానికమై ఉండెను.
అక్కడి త్రిపురవైరి (శివుడు) ‘మహాకాలుడు’ అను పేర వెలసియున్నాడు. ఆయన సర్వాభీష్ట ప్రదాత. అచ్చట పాపహరమైన శివకుండమున స్నానముచేసి దేవ ఋషి. పితృతర్పణాదులుచేసి శివాలయమునకేగి ప్రదక్షిణముచేసి ధ్యాన ఆవాహనాది ఉపచారములతో స్వామిని అర్చించిన నరుడు అశ్వమేధ యాగ ఫలమునందును. దివ్య విమానములో శివలోకమున కేగును. అట దివ్య రూపాంబరాభరణాదులతో గూడి మహాభోగములు అనుభవించి ఇక్కడికి వచ్చి బ్రాహ్మణుడై జనించి నాల్గు వేదములు సర్వశాస్త్రములు నేర్చి పాశుపత యోగముల పొంది ముక్తిని పొందును.
అక్కడ శిప్రా అను నది గలదు. అట స్నాన తర్పణాదులు చేసిన అతడు విమానమున స్వర్గమేగును. అక్కడనే విష్ణువు గోవిందస్వామి అనుపేర ఉన్నాడు. ఆయనను సేవించిన ఇరువది యొక్క తరములు తరించును. ఈ మున్ను చెప్పిన ఫలములన్నియు అచ్చట కల్గును. తిరిగి ఈ లోకమునకు వచ్చి వైష్ణవ యోగమున ముక్తిని పొందును. అక్కడనే విక్రమస్వామి అను పేరనున్న విష్ణువు ఆరాధించిన మగవాడుగాని స్త్రీగాని మున్ను చెప్పిన ఫలమందుదురు. అక్కడ ఇంద్రాది దేవతలు, మాతృకలు గలరు. వారును కోరిన కోర్కులిత్తురు. వారిని సేవించిన స్వర్గము లభించును. అవంతి అను ఆ నగరమును రాజసింహుడను రాజు పాలించెను. అందులో పదునెన్మిది పురములు (మహాపుర భాగములు) గలవు. అవి సువిస్తీర్ణ రాజమార్గములు. అచ్చట అందఱును విద్యావంతులు వేద ఘోషచే అది ప్రతి ధ్వనించుచుండును. అట ఇతిహాస శాస్త్ర పురాణాది ప్రసంగములు నిత్యము వినబడును. దీనికి ఒకానొక కాలముల ఇంద్రద్యుమ్నుడు పరిపాలకుడు. (43)