వ్యాసుడు అనియె -
ఇంద్రుడేగిన తరువాత గోవర్ధనగిరిని అవలీలగ ఎత్తిన కృష్ణునికని ప్రీతితో గోపాలురు ఇట్లనిరి. ‘కృష్ణా! కొండ ఎత్తిన అద్భుత లీలచే నీవు గోవులను మమ్ములను మహాభయము నుండి కాచితివి. నీ ఈ బాల్యలీల అనుపమము. అలకాపరి అగుట నింద్యము. నీ చేసిన పని దివ్యము. ఇదెట్లు జరిగెనో తెలుపుము. మడుగులో కాళీయుని అణగ ద్రొక్కితిని. ప్రలంబుడు నీ చేతిలో కూలెను. ఈ గోవర్ధనమును లేవనెత్తితిని. ఇవి చూడగా మా మానసములు సంశయ గ్రస్తములగుచున్నవి. శ్రీహరి! నీపాదములే మేము ఆశ్రయించెదము. నీ బలిమి చూచి నిన్ను నరమాత్రునిగ భావింపలేకున్నాము. సత్యము! సత్యము. నీవు దేవుడవో, దానవుడవో, యక్షుడవో, గంధర్వుడవో ఆ విమర్శ మాకేల? మాకు బంధువుడవు. నీకు నమస్కారము. ఆబాలగోపాలమునకు నీయెడల ప్రీతిగల్గినది. నీవు చేసిన పని ఎల్ల దేవతలు ఒక్కటైనను జేయజాలరు. ఒకవంక బాల్యము వేఱొకవంక అద్భుత వీర్యము విని అన్నియు ఇట్లుండ సామాన్యులమైన గొల్లలమగు మాలో నీవు జన్మించుట ఆలోచించగా మాకు సంశయము గల్గించుచున్నది”. అనగానే కృష్ణుడు క్షణమాత్రము పలుకకుండ నిలిచి ప్రణయ కోపము నటించి ఇట్లు వారికి బదులు పలికెను. “నా సంబంధముచే మీకు సిగ్గు గలుగదేని నేను శ్లాఘ్యుడనే గద! అందువలన కార్యాకార్య విమర్శ ఎందులకు? మీకు నాయందు ప్రీతి ఉన్న ఎడల మీమెప్పునే పొందదగిన వాడనయిన యెడల బంధు సమానమైన గౌరవము మీరు చూపుడు. నేను దేవుడను కాను గంధర్వుడను, యక్షుడను, దానవుడనుకాను, నేను మీకు చుట్టమునై పుట్టితిని. ఇందువలన వేఱొక విధముగ మీరు అలోచింపపనిలేదు” అని పలికిన శ్రీహరి వాక్యము విని మహానుభావులైన గోపకులు మౌనము వహించి పొలయలుక చెందిన అతని వద్ద నుండి బలరాముని దరికేగిరి.