తరువాత బ్రహ్మ ఇట్లు అనెను-మహాదేవుడు నిజభవన మందాసనమున గూర్చుండ దుష్టుడగు మన్మథుడాయనను వేధింప ఏతెంచెను. అది ఎఱింగి ఆ ఆతతాయిని శిక్షింప నిటలాక్షుండు తృతీయ నేత్రమున వీక్షింప ఆ ముక్కంటి మంటకెఱయై మన్మథుడు మూర్చపడెను. ఆయన భార్య రతి మిక్కిలి శోకించెను. అంత జాలిగొని ఆ ఉమాశంకరులు రతీదేవినిచూచి ఇట్లనిరి. కళ్యాణీ! శరీరములేకయు నీ భర్త పూర్వమట్లు సర్వకార్య సమర్ధుడగును. విష్ణువు కృష్ణావతార మెత్తినపుడు అతనికి కుమారుడై నీపతి జనింపగలడు అని వరమిచ్చిరి.
అచట అప్సరసలాడిరి. గంధర్వులు పాడిరి. కొందరు దివ్యవాద్యములను వాయించిరి. కొందరు స్తుతించిరి. ఇంద్రయమ అగ్నితుల్యులగు ప్రమథ గణములతో ఇట్లు శివుడు దేవితో కూడి విహరించుచు దేవికి ప్రియమ్ము కూర్చుటకై ఆ పర్వతమును విడువడయ్యెను. ఆ మీద దేవేశుండు ఏమి కావించెనని ఋషులడుగ బ్రహ్మ ఇట్లనియె: భగవంతుడు శివుడు ఆ హిమగిరి శిఖరము దేవికి వినోదము గూర ప్రమథగణములు పలురూపులుదాల్చి ఆడుననట్లొనర్చి దేవికి పరిహాసము గల్పించెను. అటుపై గిరికన్య ఒంటరిగ బంగారు పీఠముపై గూర్చున్న జనని సన్నిధి కేగెను. మేనా దేవియు దేవరూపిణియగు శర్వాణికి ఆసనమిడి ఆదరించి ఆమె కూరుచున్న తర్వాత నిట్లు పలుకరించెను.
మేన “కుమారీ! చిరకాలమునకు నీవు వచ్చితివి. ఆటవస్తువుల లేమికి గురియై భర్తతో ఆడుకొనుచున్నావు. ఎవ్వరులేనివారు దిక్కులేనివారో వారీ విధముగ నీ మగనివలె వినోదింతురు” అని తల్లి పలుక విని పార్వతి అంతరంగ మందంతట సంతోషపడలేక పోయెను. మిక్కిలి ఓర్మితో కూడి అమెకు ఇంచుకయు బదులీయదయ్యెను. మఱియు తల్లిచే విడువబడి పరమేశ్వరుని సన్నిధికి పోయి ఆ మహాదేవునికి ఇట్లనియె.
స్వామి! దేవదేవేశ్వర! ఈ పర్వతమందు వసింపను. ఓ తేజోనిధీ! ఈ భువనములందు ఎందేని నాకు వేఱొక నివాసము ఏర్పరుపుము. అన విని దేవి! నివాసార్ధమై నేను ఎల్లప్పుడు చెప్పుచున్నను వేఱొక నివాసమునకెన్నడు ఇష్టపడవైతివి. ఓ కళ్యాణి. ఇప్పుడు నీ అంతట నీవే వేఱొక నివాసము ఎందులకు వెదకెదవో? నాకది తెలుపుము అనిన దేవి మహానుభావుడు మా తండ్రి ఇంటికి ఇప్పుడే నేను వెళితిని. మా అమ్మ అచ్చట నన్ను చూచి ఏకాంతమున నాకు ఆసనాదులిడి ఆదరించి ఉమా! నీ మగడు దరిద్రుడు. నిరంతరము. ఆటవస్తువులతో (బొమ్మలతో) ఆడుకొనును. దేవతల కటువంటి ఆట కూడదనెను. మహాదేవ! నీవు ప్రమథ గణముతో పలుకరకములగు భూత ప్రేత పిశాచములతో వినోదింతువు. వృషభవాహన! అది మా అమ్మకు ఇష్టము కాదు అని చెప్పెను. ఈశ్వరుడు అది విని ఆ దేవిని పరిహసింప జేయుటకు “ఇంతీ! మీ అమ్మ అన్నది సత్యము. నీకేల కోపము. నేనిదిగో కృత్తివాసుడను. నిర్వాసుడను, శ్మశానవాసిని, నిలువనీడ లేనివాడను. అడవులలో, కొండలలో, గుహలలో, దిగంబరుల గుంపులతో తిరుగుదును. మీ అమ్మ యెడ కినియకుము. తల్లికి సాటియగు చుట్టము మఱి లేదు. అని హరుడన ఆ ఇల్లాలు నాకు బంధువులతో పనిలేదు. నేను సుఖపడు మార్గము ఏదైనా చేయుమనెను.
పరమేశ్వరుడు ప్రియురాలి ప్రీతి కొఱకామెతో కైలాసమునండి ప్రమథ గణపరివారముతో సురసిద్ధ సేవితమగు మేరువునకు పోయెను. (38)