బ్రహ్మ ఇట్లు అనియె-
అనంత వాసుదేవమూర్తిని సేవించినవారు పాపముక్తులై పరమపద మందుదురు. ఈస్వామిని నేనును ఇంద్రుడును సేవించినాము. అటుపై విభీషణుడు, రాముడు సేవించిరి. శ్వేతగంగ యందు స్నానముచేసి శ్వేత మాధవుని, మత్స్యమూర్తియైన మాధవుని దర్శించిన అతడు శ్వేతద్వీపమునకు పోవును.
అనగా అటుపై మునులు “శ్వేత మాధవుని మాహాత్మ్యమును చెప్పుడు. శ్వేతమాధవుని విగ్రహమును ప్రతిష్ఠించిన వారెవరు?” అని అడిగిరి.
అప్పుడు బ్రహ్మ కృతయుగమందు బుద్ధిమంతుడు, ధర్మజుడు, శూరుడు, సత్య సంధుడు, వ్రత నిష్ఠుడు అయిన శ్వేతుడను రాజు యొక్క రాజ్యమందు మానవులు పదివేల సంవత్సరముల ఆయుర్దాయము గల్గియుండిరి. కొంతకాలమునకు కపాల గౌతముడను ఋషి పండ్లుకూడ రానిస్థితిలో మరణించిన తన కుమారుని ఎత్తుకొని రాజు ఒద్దకు తీసుకొని వచ్చెను. రాజు వానినిజూచి ఆ శిశువును యమలోకము నుండి తిరిగి తీసికొనిరానిచో ఏడు రోజులలో చితిని ఎక్కెదనని ప్రతిజ్ఞచేసెను. అట్లుచేసి వేలకొలది పద్మములతో మహాదేవుని పూజించి శివమంత్రమును జపించెను. అతని భక్తికిమెచ్చి మహేశ్వరుడు ఉమాదేవితో సాక్షాత్కరించెను. అంతేకాదు “నీభక్తికి సంతుష్టుడ నైతిని” అనెను. శరత్కాల మందలి చంద్రబింబమట్లు మొల్లమొగ్గలవలె తెల్లగ ఉన్న విభూతి దాల్చి శార్దూల చర్మమూని, చంద్రశేఖరుడునై దర్శనమిచ్చిన ఫాలాక్షుని దర్శించి నమస్కార మొనరించి శ్వేతుండు ఇట్లనియె. “స్వామీ! నాయందు దయకలదేని ప్రసన్నుడవైతివేని, కాలవశుడైన ఈ బ్రాహ్మణ శిశువు బ్రతుకుగాక! అకాల మృతుడైన ఈ బాలుని సంపూర్ణాయుష్మంతుని, క్షేమవంతుని చేయుమని కోరెను. శ్వేతుని ఆ పలుకులువిని శివుడు ఆనందపడి కాలమును నియమించి, సర్వ భూత భయంకరమైన యముని శాశించి మృత్యుముఖగ్రస్తుడైన ఆ బాలుని జీవింపచేసెను. మహాదేవుడు గౌరితో ముని కుమారుని సర్వ జగత్తును క్షేమ సంపన్న మొనర్చి అంతర్ధానమయ్యెను” అచి చెప్పగా విని మునులు “ఆ శ్వేత నృపతి వృత్తాంతమును సవిస్తరముగా దెల్పుమని అడుగగా జగత్ప్రభువు ఇట్లు పలికెను.
ఈ కథ సర్వజీవ హితకరము. మాధవుని మాహాత్మ్యము సర్వపాప ప్రణాశనము. సర్వకామ ఫలప్రదము. నేను ఋషుల వలన వింటిని. భయదుఃఖములను హరించు ఈ దివ్యకథను వినుడు. శ్వేతుడు వేలేండ్లు చక్కగ పాలించి లౌకిక, వైదిక ధర్మవిచారణ చేసి దక్షిణ సముద్ర తీరమందలి క్షేత్రములకు పోయి కృష్ణాష్టమినాడు సలక్షణమైన విష్ణు ప్రాసాదమును నిర్మించెను. అది నూరు ధనుస్సుల పరిమాణము గలది. శ్వేతశైలమయమైన భగవన్మూర్తిని మాధవుని మూర్తిని అందు స్వయముగా ప్రతిష్ఠించెను. బ్రాహ్మణులకు తపస్వినులకు దీనులకు అనాధలకు అమాధవుని సన్నిధిని దానముల చేసి, స్వామి ఎదుట పుడమిపై వ్రాలి ప్రణవ పూర్వకమైన ద్వాదశాక్షర మంత్రమును జపించుచు, ఒక మాసము మౌనవ్రతుడై, నిరాహారుడై ఆ విష్ణుపదమందు సమాధి నిష్ఠుడు అయ్యెను. జపాంతమందు దేవేశ్వరుని విష్ణునామ మధురము, సరళము, సులభార్ధములుగ స్తోత్రములచేత స్తుతించెను.
ఇంకను “ప్రభో! నన్ను నరకము నుండి ఉద్ధరింపగల బంధువు నీకంటె లేడు. కాయిక మలము మానసిక మలము అను వానికంతము లేదు. వానిని క్షాళనము చేయ నీకంటె ఎవ్వరులేరు. సర్వసంగముల నుంచి విముక్తుడనై నిన్ను చేరితిని. నీతో ఎల్లప్పుడును నాకు సంగము కలుగుగాక. అది ఆత్మలాభము (స్వరూప దర్శనము) కొఱకు సమర్ధమగు గాక. ఈసంసారము అపార కష్టభరితము. నేను తాపత్రయ పరితప్తుడను. నిన్ను శరణు చొచ్చితిని. దారేషణ, పుత్రేషణ ఫలేషణచే మాయా మోహితుడనై లోభాది గుణములచే ఆకర్షితుడనై నిన్ను శరణందితిని. సాంసారిక సుఖమించుకైన లేదు. యజ్ఞేశ్వరా! మనసునీవంక ప్రవర్తించి నిష్కామమైన అత్యంతిక సుఖము (మోక్షము) పొందుదును గాక. వివేకశూన్యుడనై ఉన్నాను. జగత్తు వ్యక్త్యావ్యక్తము. ఓ గోవిందా! రక్షింపుము. నన్ను సంసారమునుండి ఉద్ధరింపుము. ఓ పుండరీకాక్ష! మోహ రసమయము, దుస్తరము అయిన భవాబ్ధిలో మునిగిన నన్ను ఉద్ధరింపగలవాడు నీ కంటే మఱి కనబడడు.”
అని ఇట్లు శ్వేతునిచే వినుతుడై ఆ పురుషోత్తమ క్షేత్రమందు జగద్గురువు హరి సర్వ దేవతలతో సాక్షాత్కరించెను. ఆ మూర్తి నీలమేఘుడు. పద్మనేత్రుడు. తేజోమండ లాంతర్గతుడు. ఆయన వామహస్తమున పాలవెల్లి చందమామ వలె పాంచజన్యమను శంఖము వెలుగొందుచుండెను. గదా శార్ఙ్గఖడ్గధరుడై గరుడ ధ్వజుడు వచ్చి రాజా! నీ బుద్ధి స్వచ్ఛమైనది. భక్తి భరితమైనది. ఓ పుణ్యశాలి! ప్రసన్నుడనైతిని. అభీష్టవరమును కోరుకొనుము అనగా శిరసువంచి తద్గతమనస్కుడై, స్వామి పరమామృత వాక్యములను విని శ్వేతుడు ఇట్లనియె. ప్రభో! నేను భగవద్భక్తుడనేని బ్రహ్మ లోకము కంటెను మీదిది, విమలము, విరజము శుద్ధము సంసార సంగరహితము అవ్యయము అగు విష్ణుపదమును, నీ అనుగ్రహమున అందగోరుచున్నాను అని విన్నవించెను.
భగవంతుడు ఇట్లు అనియె-దేవ, ముని, సిద్ధ, యోగిగణముల కందని పరమరమ్యమైన స్థానమునకు నీవు వెళ్ళగలవు. రాజ్యాసనము, రాజ్యామృతమును ఉపాసించి సర్వలోకములు దాటి నా లోకమున కేగగలవు. నీకీర్తి త్రిలోక వ్యాప్తమగును. ఎల్లప్పుడు నా సాన్నిధ్యము కలుగును. ఇది శ్వేతగంగయని దేవదానవులు గానము చేయుదురు. ఈ శ్వేత గంగా జలమును కుశాగ్రముచేత స్పృశించి నాభక్తులు సమాధి నిష్ఠులై స్వర్గమునకు పోగలరు. ఈ శ్వేతమాధవ విగ్రహము వెన్నెల కాంతిని మించును. శంఖము గోక్షీరము వలె అచ్ఛమైనది. ఈ మూర్తి సదా అఘవినాశిని. తెల్లతామర పూలవలె మెఱయు నేత్ర శోభ గలది. ఈ ప్రతిమకు నమస్కరించి సర్వలోకములను దాటి, నాకలోకమందు అనేక మన్వంతరముల పాటు దేవ సుందరీ పరివృతుడై మధురముగ గానము చేయబడు కీర్తిగలవాడై సిద్ధ గంధర్వ సేవితుడై నా భక్తులతో అతడు విపుల భోగముల అనుభవించును. అటనుండి పుడమిపై బ్రాహ్మణుడై వేద వేదాంగ వేత్తయై భోగియై, సమృద్ధుడై, శుచియై, అదృష్టవంతుడై, రూపవంతుడై పుత్ర పౌత్రాదులతో సుఖించు పురుషోత్తముని మరలచేరి ఆ వట మూలమందు చేరి ఈ సముద్రమందు హరిస్మరణ చేయుచు దేహమును వదిలి శాంత పదమందుదువు. (59)