సముద్ర స్నాన విధి

బ్రహ్మ ఇట్లనియె- ”శ్వేత మాధవుని దర్శించి ప్రళయమందు ఏకార్ణవమైన తఱి మత్స్యావతారమెత్తిన మాధవుని దర్శింపవలెను. వేదములను హరించిన హిరణ్యాక్షుని సంహరించి వేదరక్షణము చేసిన మొదటి అవతారమెత్తిన విష్ణువునకు నమస్కరించిన నరుడు దుఃఖ విముక్తుడగును. విష్ణు లోకమును పడయును. మరల ఈ పుడమికి వచ్చి వత్సమాధవ స్వామిని అచ్చట దర్శించి దాతయు, ఐశ్వర్య భోక్తయు, యజ్ఞకర్తయు, విష్ణుభక్తుడును సత్యవ్రతుడును అయి హరిసన్నిధాన మొంది మోక్షము పడయును. సర్వ కామప్రదమయిన మత్స్య మాధవ మాహాత్మ్యమును వర్ణించితిని. అనవిని మునులు “స్వామి! సముద్ర జలమార్జనము స్నానము, దానము చేయుటచేతను అందువలన కల్గు అశేష ఫలము చెప్పు”మని అడుగగా బ్రహ్మ ఇట్లనియె.

మునులార! వినుడు. భక్తి మనసు నందు ఉంచిన యెడల సముద్రజల మార్జనము, మార్కండేయ ప్రదమందు ప్రాతః స్నానము ఉత్తమ పుణ్యఫల మిచ్చును. చతుర్దశియందు పూర్ణిమకు స్నానము జేసిన అశ్వమేధ ఫలమందును.

మార్కండేయ ప్రదము, కృష్ణవటము, బలరాముడు, మహోదధి ఇంద్రద్యుమ్న సరస్సును వీనికి పంచ తీర్థములని పేరు. జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠా నక్షత్రము కలసి వచ్చిన పుణ్యకాలమున ఈ తీర్థ సేవనము పరమ శుభమని చెప్పబడినది. త్రికరణములచేతను శుద్ధుడయి రాగద్వేషాదులను ద్వంద్వములను బాసి కల్పవృక్షమును బోలిన మర్రిచెట్టునకు స్నానపూర్వకముగ ప్రదక్షిణము చేసి విష్ణువునకు కూడ ముమ్మార్లు ప్రదక్షిణము చేసి సప్తజన్మ పాపములనుండి ముక్తుడయి కోరిన సద్గతి బడయును. ఆ వటవృక్షమునకు వటేశ్వరుడు కృష్ణుడు, పురాణపురుషుడు అను మూడు పేర్లచేత కృతాది యుగములందు కీర్తింపబడినది. కృత యుగమునందు నీ వృక్ష ప్రమాణము ఒక యోజనము. త్రేతాయుగము నందు నాల్గవ వంతు తగ్గినది. ద్వాపర మందు సగము యోజనము. కలిలో దానిలో సగము వైశాల్యమని చెప్పబడెను. ఎడమ పాదమున ప్రణవమును, దక్షిణ పాదమున ‘న’ కారము, వామ కటియందు ‘మో’ కారము, కుడివైపున ‘నా’ కారము, నాభియందు ‘రా’ కారము, ఎడమ భుజమున ‘య’ కారమును, కుడిభుజమున ‘ణా’ కారము, శిరస్సున ‘యు’ కారమును న్యాసము చేయవలెను. క్రిందను మీదను హృదయ మందును ఇరుప్రక్కలను పుష్టభాగమునను నారాయణుని ధ్యానించి నారాయణ కవచ పారాయణము ప్రారంభించవలెను. గోవిందాది నామములతో తూర్పు మొదలుగనలు దిక్కులయందును విష్ణువు, మొదలుగా గల నామములతో ఆగ్నేయాది విదిక్కుల యందు (మూలలందు)ను విష్ణువు రక్షించుగాక అని పలుకవలెను. వరాహమూర్తి భూతలము నందును త్రివిక్రముడు మీదను రక్షించుగాక అని పలికి నారాయణుడను నేనేయని ఆత్మానుసంధానము చేయవలెను. (అద్వైతమును) అభేదమును సాధింపవలెను.

అటుపై ఈ క్రింది మంత్రమును జపింపవలెను. ఆ మంత్రభావము ఇది. మనుజులలో నగ్నివి నీవు. అనగా వైశ్వానరాగ్నియను జఠరాగ్ని నీవె. కామోద్దీపనము చేయు వీర్యా ధానము చేయువాడవు నీవె. సర్వ భూతములకు ప్రధాన భూతము నీవు. సర్వజీవులకు ప్రభువవు. అమృతములకు నరణివి. అనగా జన్మస్థానము. దేవతలకు మూల పురుషుడవు. నా పాపము హరింపుము. ఓ తీర్థరాజమా! నీకు నమస్కారము అని పలికి ఆ పైన స్నానము చేయవలెను లేనియెడల స్నానమవసరమూ లేదు. ఆ తీర్థ జలములందు వైదిక మంత్రములతో అభిషేకముచేసి మార్జనము చేసుకొన్నను చాలు. మోకాళ్ళు నీళ్ళలో నిలిచి అఘమర్షణ ఋక్కులను మూడు ఆవృత్తులు జపించుచు స్నానము చేసిన అశ్వమేధ యాగఫలము వచ్చును. గట్టునకు వచ్చి, మడిబట్టలను ధరించి ప్రాణాయామము ఆచరణములను జేసి, సంధ్యను ఉపాసించి సూర్యోపస్థానము చెప్పిపూలతో జలాంజలి ఇచ్చి బాహువులు మీదికెత్తి సూర్యుని ఉద్దేశించి నూటఎనిమిది మార్లు జపించవలెను. నిలువబడి ఇంకను గల సౌరమంత్రములను జపించవలెను. సూర్యుని ఉద్దేశించి ప్రదక్షిణము జేసి నమస్కరించి తూర్పు ముఖమై బ్రహ్మయజ్ఞము, దేవర్షి పితృ తర్పణములను, గోత్రములతో పితృ దేవతలకును తర్పణము చేయవలెను. దేవతా తర్పణమయిన తరువాతనే పితృ తర్పణమునకు అధికారి అగును. శ్రాద్ధకాలమందు హోమ కాలమందు ఒంటిచేతితో చేయ వచ్చును. తర్పణము రెండు చేతులతో చేయవలెను.

తర్పణము చేయువాడు నీటిలో నిలబడి ఒడ్డున తర్పణము చేసిన యెడలను, వొడ్డున కూర్చుండి నీటిలో తర్పణము చేసినను అది ఆయా దేవతలకు చెందదు. వృధా అగును. పితృ తర్పణము నీటిలో చేయరాదు. కుపితుడై చేయరాదు. ఒంటి చేతితో చేయరాదు. గట్టుమీదికి వచ్చి శుచియైన చోట పితృ తర్పణము చేయవలెను. ఉదకమందు పాత్రలయందు జేయరాదు. అట్లు చేసిన అది పితృ దేవతలకు అందదు. భూమీయందు జేసిన పితృ తర్పణము అక్షయము అందుకొరకె నేను భూమిని ఇచ్చితిని. జలము భూమిలో పుట్టినది. భూమియందు పారుచున్నది. భూమియందే లయమగుచున్నది. కావున పితృ తర్పణమునకు భూమి ప్రధాన స్థానము. అగ్రములతో ఉన్న దర్భలను తూర్పు అగ్రములుగ పఱచి దేవతలకును, దక్షిణాగ్రములుగ పలుచి పితృ దేవతలకును తర్పణము జేయవలెను. (60)