ఓ విప్రులారా! వివేకియగు జీవుడు ఆధ్యాత్మికములు-ఆధిభౌతికములు-ఆధి దైవికములు అను మూడు విధములగు తాపములవలన దుఃఖమును దోషమును గుర్తెరిగి వైరాగ్యముతో జ్ఞానము సంపాదించుటచే ఆత్యంతిక లయమును-మోక్షమును పొందును. వీనిలో ఆధ్యాత్మిక తాపము దైహికము, మానసికము అని రెండు విధములు. శిరోరోగము-ప్రతిశ్యాయము-జ్వరము-శూలవ్యాధి-భగందరము-గుల్మము-అర్శస్సు-శ్వయథువు-శ్వాసవ్యాధి-ఛర్ది-అక్షరోగములు-అతిసారము-కుష్ఠము-అవయవముల రోగములు. ఈ మొదలగు దైహిక తాపము బహువిధములు. కామము-క్రోధము-భయము-ద్వేషము-లభ్యము-మోహము-విషాదము-శోకము-అసూయ-అవమానము-ఈర్ష్య-మత్సరము-తిరస్కారము మొదలుగ మానసతాపము అనేక విధములు ఈ రెండును కలిసి ఆధ్యాత్మిక తాపమనబడును. ఆత్మ అనగా ఇచట దేహమని అర్థము. పాంచభౌతిక దేహముతో సంబంధించినవి ఆధ్యాత్మికములు. పైవాని వివరము ఆయుర్వేదాది శాస్త్రముల నుండి తెలియదగినవి.
మృగములు-పక్షులు-మనుష్యులు-పిశాచములు-సర్పములు-రాక్షసులు-ప్రాకెడి ప్రాణులు మొదలగు వానిచే మానవునికి కలుగు తాపములు ఆధి భౌతికములు-భూతముల-ప్రాణుల వలన కలుగునవి. చలి-ఉష్ణము-గాలి-వర్షము-నీరు మెఱుపులు మొదలగు వానివలన కలుగు తాపము ఆధిదైవికము.
గర్భము-జన్మము-ముసలితనము- అజ్ఞానము-మృత్యువు-నరకము-మొదలగు వానివలన కలుగు దుఃఖములు వేలకొలది విధములు. ఎట్లనగా-సుకుమార శరీరము కల జీవుడు తల్లి గర్భములో అనేక మలినములు క్రమ్మియున్న గర్భములో మావిలో చుట్టబడి వెన్ను వీపు మెడ ఎముకలు వంగి దాన పుల్లనివి-కారపువి-చురుకైనవి చాల వెచ్చనివి-ఉప్పనివి అగు ఆహారములు తల్లి తినగా, అవి కలిగించు తాపమువలన చాల బాధపడుచుండును. అవయవములు స్వేచ్ఛగా చాచలేక ముడువలేక మలమూత్రముల రొంపిలో పండుకొనుచు ఊపిరాడక చైతన్యమున్నందున గడచిన వందల కొలది జన్మములను జ్ఞాపకము చేసికొనుచు తన పూర్వ కర్మలకు బద్ధుడై దుఃఖము లనుభవించు చుండును. ఇది గర్భ దుఃఖము. ప్రసవ కాలపు గాలులచే తలక్రిందులుగా త్రిప్పబడి మలము రక్తము మూత్రము శుక్ర శోణితములు మొదలగు వానిచే నోరంతయు మలినము కాగా ప్రాజాపత్యము అను ప్రసవద్వారపు గాలిచే ఎముకల సంధులు బాధపడుచుండ తల్లి గర్భము నుండి ఎన్నో క్లేశములతో వెలుపలికి వచ్చును. ముళ్ళు గ్రుచ్చుకొనినట్లు రంపముతో కోసినట్లు అవయవములు బాధపడుచుండ క్రుళ్ళిన పుండులో నుండి బయట పడిన క్రిమివలె బయటపడి గోకికొనుటకును అటు ఇటు దొరలుటకును శక్తి లేక ఇతరుల ఇచ్ఛకులోబడి పాలుమొదలగు ఆహారము గ్రహించును. మలినమగు ప్రక్కలపై పరుండియు పురుగులు దోమలు కుట్టుచున్నను తినుచున్నను వాటిని తోలుకొననైన లేకుండును. ఇటువంటి జన్మ దుఃఖములును జన్మకు అనంతరము పొందు ఆధ్యాత్మికాది దుఃఖములను అంతులేనివి.
నరుడు అజ్ఞానాంధకారముతో కప్పబడి మనస్సు మూఢమై నేను ఎక్కడినుండి వచ్చితిని? ఎవడను? ఎట్టివాడను? ఎక్కడికి పోవలెను? నన్ను ఏ బంధము బంధించినది? ఇది సకారణమా? అకారణమా? చేయదగినదేది! తగనిదేది? పలుక దగినదేది? తగనిదేది? ధర్మమేది? అధర్మమేది? గుణము ఏది? దోషమేది? అని ఎరుగక పశువులవలె ఆహార మైథునములకై మాత్రము ప్రాకులాడుట అజ్ఞానము వలన కలుగు దుఃఖము. అజ్ఞానము తమోగుణ ధర్మము. దానివలన నరులు చేయవలసిన కర్మలను చేయక చేయరాని వానిని చేయుచుందురు.
కర్మల లోపమువలన మానవులకు నరక యాతనలు కలుగును. ఈ విధముగ అజ్ఞానులకు ఇహలోకమునను పరలోకమునను దుఃఖములే.
ముసలితనమున దేహమును, దేహావయవములును శిథిలములై దంతములు కదలుచు ఊడుచు చర్మము ముడతలు పడి నాడులు నరములు తేలుచు, దూరపుచూపు కనబడక కంటిపాపలు ఆకాశములోనికి పెట్టి చూచుచు, నాసికారంధ్రముల నుండి వెంట్రుకలు వెలికివచ్చుచుండ, శరీరము వణకుచుండ, ఎముకలు బయటపడి, వెన్ను వంగి, ఆకలి నశించి, ఎక్కువ తినలేక, తిన్నది జీర్ణముకాక పనులు చేయుటకు శక్తిలేక ఎంతో శ్రమతో నడచుట లేచుట కూర్చుండుట పనులు చేయుట కలిగి, చెవులు సరిగా వినబడక కన్నులు సరిగా కనబడక నోట చొల్లు కారుచు ఇంద్రియశక్తి తగ్గి చావునకు సిద్ధమై ఎప్పటికప్పుడు విషయములు మరచుచు ఒక్కమాట పలుకుటకు చాలా శ్రమపడుచు దగ్గుతో ఆయాసముతో నిద్రపట్టక లేచుటకు పండుకొనుటకు కూడ ఇతరులపై అధారపడుచు సేవకులు భార్యపుత్రులు కూడ అలక్ష్యము చేయుచుండగా శౌచము చేసికొనుటకు కూడా శక్తి లేక ఏమో తినవలెనని తిరుగవలెనని కోరికలు మాత్రము అధికమై పరిజనులు కూడ ఎగతాళి చేయుచుండ చుట్టములు విసుగుకొనుచుండ తాను తన యౌవనములో శక్తి ఉన్నపుడు చేసిన పనులను ఏదో పూర్వ జన్మములో చేసిన పనులనువలె జ్ఞాపకము చేసికొనుచు, ఇట్టి అనేక బాధలను అనుభవించును.
మరణకాలమున కాళ్లు చేతులు మెడ శిథిలమగును. అంతలోనే శ్రమ అంతలోనే తెలివి-బలము కలుగుచుండును. తన భార్య, సంతానము, ధనము, ఇల్లు, సేవకులు తన తరువాత ఏమగునో అని చింత-అంపములతో కోయుచున్నట్లు మర్మస్థానములలో రోగబాధ-అస్థిసంధులలో యమునిబాణములు గ్రుచ్చుకొన్నట్లు బాధ-మెలికలు తిరిగి పోవుచున్న కనుగ్రుడ్లు-కాళ్లు చేతులు కలిగి తన్నుకొనుట-పెదవులు దౌడలు కంఠము ఎండిపోవుచు గురగురలాడుచు కంఠమునుండి శ్వాస ఆడక బాధ-ఆకలి దప్పులచే బాధ పడుచు యమభటులచే బాధ నొందుచు ఎంతో క్లేశముతో ప్రాణములు బయటికి పోవుచుండును. తరువాత యాతనా దేహములో ప్రవేశించును.
నరకములో యమకింకరులు పాశములతో కట్టుట-కర్రలతో కొట్టుట-యమ దర్శనము-భయంకరమగు మార్గములు చూచుట-మండుచున్న ఇసుక-అగ్ని యంత్రములు, శస్త్రములు మొదలగు వానితో భయంకర బాధలు-ఱంపములతో కోయుట మూసలలో వేసి కాచుట, గొడ్డళ్ళతో పగుల కొట్టుట, భూమిలో పాతిపెట్టుట, శూలములపై గ్రుచ్చుట, పులి నోటిలో వేయుట, గ్రద్దలచే తినిపించుట, నూనెలో ఉడికించుట, కారపు అడుసులో నాన వేయుట, ఎత్తునుండి పడవేయుట, ఒడిసెలలతో కొట్టుట మొదలైన యాతనలు జీవులు తాము చేసిన పాపానుసారము అనుభవింతురు. ఇంతేకాదు. స్వర్గము నకు వెళ్ళినవారికి కూడ ఆ పుణ్యము పూర్తికాగానే క్రిందికి పడిపోవలెనను భయము వెంటాడును. కనుక అచ్చటను సుఖము లేదు.
పిమ్మట మరల గర్భ ప్రవేశము-పుట్టుట-కడుపులో గాని పుట్టుచుకాని పుట్టిన తరువాత ఏదో సమయమున బాల్యముననో యౌవనముననో మరణించుట-ఇట్టి జన్మ మరణ పరంపర సాగును. ఈ సంసారములో ఏది సుఖమునకు కారణమో అదే దుఃఖమునకు కారణము. కనుక దార పుత్త్రధనాదులయందు మక్కువ పెంచుకొనక ఈ తెలిపిన తాపత్రయములలోని దోషములను గుర్తించి ముక్తి కొరకై యత్నించుట ఒక్కటియే ఈ బాధను తొలగించుటకు ఔషధము. కనుక వివేకులు అందుకే యత్నింపవలెను. కర్మాచరణము జ్ఞానము-ఈ రెండును ముక్తికి సాధనములే. ఆగమములో చెప్పిన శబ్ద బ్రహ్మో పాసనము-వివేకమువలన కలిగెడి బ్రహ్మతత్త్వ జ్ఞానము అని జ్ఞానముకూడ రెండు విధములు. శబ్ద బ్రహ్మతత్త్వమున కృతార్థుడైనచో పరబ్రహ్మత్వము ప్రాప్తించును. పరా-అపరా అను రెండు విద్యలు ఎఱుగవలసి ఉన్నది అని అధర్వణవేదీయమగు ముండకోపనిషత్తు చెప్పుచున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్తమగు కర్మానుష్ఠానము అపరావిద్యా. అక్షరతత్త్వమగు పరబ్రహ్మమును అందించునది పరావిద్య. పరబ్రహ్మ తత్త్వము అవ్యక్తము అజరము అచింత్యము అవ్యయము అనిర్దేశ్యము అరూపము అపాణిపాదము సర్వగతము సత్యము భూతయోని వ్యాప్తము. ఈ తత్త్వమును సూరులు మాత్రమే ఎల్లప్పుడును దర్శింపగలరు. ఆ తత్త్వమే విష్ణుభగవానుడు. భూతములయొక్క ఉత్పత్తిని-నాశమును-వాటిరాకడను-పోకడను విద్యను అవిద్యను ఎటిగిన మహానుభావుడు భగవానుడనబడును. హేయములగు దుర్గుణములుకాని దోషములుకాని ఏవియు లేక జ్ఞానశక్తి బలైశ్వర్యవీర్య తేజస్సులు అను అణుశక్తులు కలవాడే భగవానుడు అనబడును. ఆ పరమాత్ముని యందు సమస్త భూతములును-అతడు సమస్త భూతముల యందును వసించును. అతడు సర్వాత్మకుడు. అందుచేతనే ఆ పరతత్త్వమునకు వాసుదేవుడని పేరు. పూర్వము మహర్షులు చేసిన ప్రశ్నమునకు సమాధానముగా ప్రజాపతియే ఈ వాసుదేవ పదమునకు అర్ధమును ఇట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందుచేతనే జగములను నిర్మించాడు. వాటి స్థితి వ్యవస్త చేయువాడుకూడ ప్రభువగు వాసుదేవుడే. అతడు సర్వ భూతములకును ప్రకృతి-మూలతత్త్వము, సమస్త దోషములకును గుణములకును అతీతుడు. సర్వావరణములకును అతీతుడు. అభిలాత్ముడు. ఈ భువనాంతరాళ మంతయు ఆయనచేతనే ఆవరింపబడి ఉన్నది. అతడు సమస్తకల్యాణ గుణాత్మకుడు. స్వశక్తి లేశ మాత్రము చేతనే సమస్త భూతసృష్టిని చేయువాడు. తన ఇచ్చచేత తనకిష్టములగు గొప్ప రూపముల ధరించి సమస్త లోకములకు హితమును సాధించును. తేజో బలైశ్వర్య వీర్య శక్తి జ్ఞానములకు రాశి. పరమైనవాటి కంటె పరుడు. ఆ పరాపరునియందు ఎట్టి క్లేశములును లేవు. అతడు ఈశ్వరుడు. వ్యష్టి సమిష్టి రూపుడు. వ్యక్తరూపుడు. అవ్యక్తరూపుడు. సర్వేశ్వరుడు. సర్వద్రష్ట-సర్వశక్తియగు పరమేశ్వరుడు. సమస్త దోష రహితమును శుద్ధమును పరమును నిర్మలమును ఏక రూపమునునగు ఆ మహాతత్త్వమును ఏది తెలుపగలడో, చూపగలదో, లభింపజేయగలదో అది మాత్రమే జ్ఞానమనబడును. మిగిలినది అంతయు అజ్ఞానము. (234)