నైమిత్తిక ప్రాకృత ప్రళయ కథనము

వ్యాసుడిట్లు మునులతో పలికెను: ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ ప్రళయ మేఘములు వర్షించుటచే కలిగిన జలము సప్తమహర్షులుండు స్థానము వరకు వ్యాపింపగా ఈ త్రైలోక్యమంతయు ఏక సముద్రముగ ఏర్పడును. విష్ణువంతట తన నిట్టూర్పు వాయువుతోనే దానిని నూరేండ్లకు పైబడిన కాల వ్యవధిలో నశింపజేయును. సర్వ భూతమయుడును ఊహింపను అలవికానివాడు, భూతముల నన్నిటిని సృష్టించువాడు అదిలేకయు లోకమునకు ఆదియగు విష్ణు భగవానుడు వాయువు నంతటిని పూర్తిగా పీల్చివేసి బ్రహ్మ రూపమును ధరించి ఆ ఏకార్ణవమున శేషశయ్యపై పరుండును. అప్పుడతనిని జనలోకమండలి సనకాది సిద్ధులు బ్రహ్మలోకము నందలి వారు స్తుతించు చుందురు. మోక్షము కోరినవారు ధ్యానించుచుందురు. ఆ పరమేశ్వరుడు వాసుదేవుడను తన స్వరూపమును చింతించుచు తన స్వమాయా రూపయగు యోగనిద్ర నాశ్రయించి యుండును. ప్రళయాంతమున హరి సృష్టికి నిమిత్త కారణుడుగా బ్రహ్మ రూపము ధరించి శయనించి యుండుటచే దీనికి నైమిత్తిక ప్రళయమని పేరు. వేయి చతుర్యుగముల పరిమాణముకల బ్రహ్మ దేవుని పగటి వలెనే అతని రాత్రియు అంతే పరిమాణము కలది. అంతకాలము గడచిన తరువాత విష్ణువు మరల బ్రహ్మ యొక్క రూపముతో సృష్టిని ఆరంభించును. ఇట్లు ఓ విప్రులారా! మీకు నైమిత్తిక ప్రళయ విధము తెలిపితిని. ఇక ప్రాకృత ప్రళయము తెలిపెదను వినుడు.

అనావృష్టి, అగ్ని మొదలగు ఉపద్రవములతో, భూలోక పాతాళాది లోకములందలి ఉపరితలమునగల పదార్థములు అన్నియు మొదట నశించును. తరువాత విష్ణుని ఇచ్ఛకు లోబడి మహదాది ప్రకృతి వికారములన్నియు నశించును. ఇదే ప్రాకృత ప్రళయము. దాని క్రమమిది. మొదట జలము పృధివియొక్క గంధగుణమును హరించును. అంతట పృథివియు జలరూపము ధరించును. అపుడవి మహాధ్వనితో మహావేగమున ప్రవహించి లోకాలోక పర్వతమువరకు నిండి పోవును. అంతట అగ్నితత్త్వము జలమును దానిలోని రసతన్మాత్రను హరించును. అంతట జలము జలరూపము వదలి అగ్నిగా అగును. అపుడీ జలమంతయు పృథివిలేక, జలములేక, కేవల మగ్ని జ్వాలలతో నిండి ఉండును. అంతట వాయువు అగ్నియొక్క విశేష గుణమగు రూపతన్మాత్రను హరించును. అప్పుడు అగ్ని యంతయు అగ్నిత్వమును కోల్పోయి వాయువుగా అగును. ప్రపంచ మంతయు వాయువు మాత్రమే అయి అది పదిదెసల వీచుచుండును. అంతలో ఆకాశము వాయువు యొక్క విశేష గుణమగు స్పర్శతన్మాత్రను తనలోనికి లయము చేసికొనుటచే వాయువు వాయువుగా నుండక లయము నొందుటచే అంతటను ఆకాశము కేవల శూన్య తత్త్వము మాత్రము-ఉండును. అంతలో ఆకాశము యొక్క విశేష గుణమగు శబ్ద తన్మాత్రను భూతాదితత్త్వము తనలో లయ మొందించుకొనును. అదియు మహత్తత్త్వమునందును-అదియు ప్రకృతి యందును లయము నొందును. అదియే త్రిగుణముల సామ్యావస్థ. అనగా అప్పుడు సత్త్వ రజస్తమో గుణములలో ఏ యొక్కటియు ఎక్కువగ ఉద్రేకింపక మూడును సమస్థితిలో నుండును.

ఈ ప్రకృతినే ప్రధాన హేతువు పరమ కారణమనియు వ్యవహరింతురు. ఇది వ్యక్త, అవ్యక్త, స్పష్ట, అస్పష్ట స్వరూపము కలది. ఈ వ్యక్తావ్యక్త తత్త్వము అవ్యక్త తత్త్వములో లయమునందును. ఆ అవ్యక్తమే అక్షరము, నాశము లేనిది, నిత్యము, సర్వ వ్యాపియై యుండును. అదియు సర్వ భూతాత్మకుడగు పరమాత్మ యొక్క అంశమే. సత్తామాత్ర, జ్ఞానమాత్ర, సత్, చిత్ రూపుడును అన్ని తత్త్వముల కంటె గొప్పవాడును అగు ఆ పరమాత్మునందే ఈ ప్రాపంచిక వ్యవహారమునకు సంబంధించిన నామము, జాతి మొదలగు కల్పనలు అన్నియు లయము పొందును. ఆ తత్త్వమే బ్రహ్మము పరంధామము పరమాత్మ, పరమేశ్వరుడు విష్ణువు అనబడును. అతనిని చేరినవారు మరల జన్మ లోనికి రారు. వ్యక్తా వ్యక్త స్వరూపయగు ప్రకృతియు అవ్యక్తరూపుడు అక్షరుడును-పురుషుడును ఈ రెండును పరమాత్మ యందు లయమగును. ఆయనయే అన్ని తత్త్వములకును ఆశ్రయ మగుచోటు. అతడు విష్ణువనుపేరుతో వేదముల, వేదాంతములయందు గానము చేయబడుచున్నాడు. వేదోక్తమగు కర్మలు ప్రవృత్తి ప్రధానములు నివృత్తి ప్రధానములు అని రెండు విధములు. ఋగ్యజుః సామవేదాను సారియగు మార్గమున యజ్ఞేశ్వరుడుగా యజ్ఞ పురుషుడుగా పరమాత్మను ఆరాధించుట ప్రవృత్తి మార్గము. జ్ఞానమూర్తి, చిద్రూపుడు, అగు ఆయనను జ్ఞానయోగమున ఉపాసించుట నివృత్తి మార్గము. ఆయన తత్త్వము వాక్కులకు అందరానిది. ద్విపరార్ధ పరిమితిగల కాలము విష్ణువునకు ఒక పగలు-అంతే ఆయనకు రాత్రి పరిమాణమును. ఇదికూడ లోక సామ్యమును బట్టి చెప్పుటయే కాని ఆ పరమాత్మునకు పగలును రాత్రియు అనునవి లేవు. ఓ ఋషులారా! ఈ చెప్పినది ప్రాకృతలయ స్వరూపము. (233)