బ్రహ్మ మహా పురాణము
సృష్టి ఉపసంహార లక్షణము
సర్వ భూతములకును జరుగు ప్రతి సంచరము. అనగా ప్రళయము మూడు విధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతికము, 3. అత్యంతికము. వానిలో (1. బ్రహ్మదేవుని ఆయుఃకాలము సమాప్తికాగా కల్పాంతమున జరుగు ప్రళయము నైమిత్తికము. 2. జీవునకు మోక్షము లభించుటయే అత్యంతిక ప్రళయము. 3. రెండు పరార్థముల కొకసారి జరుగునది ప్రాకృత ప్రళయము. అని వ్యాసుడు పలికెను).
మాకు పరార్థ కాల పరిమాణము తెలిపినచో దానికి రెట్టింపు కాలమగు ద్విపరార్ధముల తరువాత జరుగు ప్రాకృత ప్రళయము మాకవగతమగును. కనుక దానిని తెలుపుమని మునులు వ్యాసునడిగిరి. సంఖ్యల లెక్కింపులో కుడివైపునుండి ఎడమవైపుకు పోగా స్థానపువిలువ పదిరెట్లు పెరుగుచుండును. అట్లు పోగా పదునెనిమిదవ స్థానముతో పరార్ధమగును. ఒకట్లు పదులు నూర్లు-వేలు పదివేలు లక్ష-పది లక్షలు-కోటి పది కోట్లు ఇట్లుపోగా పదునెనిమిదవ స్థానములో ఏర్పడు సంఖ్య పరార్థము. అనగా 100, 000, 000, 000, 000, 000 (వంద కోటి కోట్లు) ఇది పరార్ధ సంఖ్య. ఇన్ని సంవత్సరముల కాలమునకు రెట్టింపు చేసినచో ద్విపరార్థము. ఇట్టి ద్విపదార్ధకాలమున కొకసారి జరుగు ప్రళయము ప్రాకృత ప్రళయము. అప్పుడు ఈ వ్యక్త స్పష్ట రూపముకల ప్రపంచమంతయు తన మూల కారణముతో కూడ అవ్యక్తమగు ప్రకృతి మూలతత్త్వమునందు లయమునొందును.
నైమిత్తిక ప్రళయము వివరింతును. కాల పరిమాణములో మానవుని ఱెప్పపాటు అన్నిటికి మూల పరిమాణము. అది నిమేషము అనబడును. అట్టి నిమేషములు పదునైదు (పదునెనిమిది) కాష్ఠా అనబడును. ముప్పది కాష్ఠలుకల పదునైదు కలలు నాడిక. రెండు నాడికలు ముహూర్తము. ముప్పది ముహూర్తముల కాలము, ఒక రాత్రింబగలు. ముప్పది అహోరాత్రములు మాసము. పండ్రెండు మాసములు సంవత్సరము. ఇట్టి మూడు వందల అఱువది సంవత్సరములు దేవతల సంవత్సరము. పండ్రెండు వేల దేవ సంవత్సరములు ఒక చతుర్యుగము. అనగా కృత త్రేతాద్వాపర కలియుగములు నాలుగు అగును. వేయిచతుర్యుగములు బ్రహ్మదినము. అదియే కల్పము. కల్ప కాలములో పదునాలుగు మంది మనువులు సృష్టిని లోక వ్యవహారమును నిర్వహింతురు. అట్టి కల్పాంతము. బ్రహ్మతో కూడ నైమిత్తిక లయము జరుగును. దాని స్వరూపము మిగుల భయంకరము. అది మొదట మీకు తెలిపి పిమ్మట ప్రాకృత ప్రళయ స్వరూపము వివరింతును వినుడు.
వేయి చతుర్యుగముల తరువాత మహీతలము చాలవరకు క్షీణించిపోగా నూరేండ్లు ఎడతెగని అనావృష్టి ఏర్పడును. బలము అంతగాలేని ప్రాణులనేకములు భూమిపై మిగుల పీడలపాలై నశించును. అంతట విష్ణుభగవానుడు, రుద్రుని రూపమున సమస్త ప్రజలను తనలో లయము చేసికొనుటకు యత్నించును. అతడు సూర్యుని ఏడుకిరణముల యందును నిలిచి సమస్త జలమును త్రాగును. ప్రాణులన్నియు అందుచే శోషించును. సముద్రముల నదుల కొండల సెలయేళ్ళ పాతాళములలోనున్న నీరంతయు ఇంకిపోవును. దానిచే నీరు మాత్రమే ఆహారముగా గల జీవరాశులును నశించి పోవును. అంతట ఏడు మంది సూర్యులు ఆవిర్భవించి వారు అన్ని దిక్కులకును ప్రజ్వలించుచు, పాతాళ తలము వరకుగల లోకమునంతటిని కాల్చివేయుదురు. వారి మూలమున ఈ భూమి పర్వతములు సముద్రములతో కూడ దగ్ధమయి తాబేలు వీపువలె అయిపోవును. అంతట ప్రళయకాలాగ్ని, రుద్రుని ఆదిశేషుని నిశ్శ్వాస వాయువుల తాపముచే సప్త పాతాళములను కాల్చివేయును. ఆ అగ్నియే పాతాళము నుండి భూ లోకమునకు అచటి నుండి స్వర్గమునకు కూడ పోయి వరుసగా మూడు లోకములను పూర్తిగా కాల్చివేయును.
అపుడు ఈ మూడు లోకములు జ్వాలల సుడులతో చుట్టివేయబడి కాలుచున్న వేపుడు మంగలము వలె నుండును. ముల్లోకములోని బ్రాహ్మణులను తాపముతో నిండి బలము ఉపక్షీణమై ఎచ్చటను నిలుచుటకు అవకాశములేక మహర్లోకమునకు పోవుదురు. అచ్చటను మహాతాపముతో తపించి అంతకు పై నున్న జనలోకమునకు పోవుదురు. అంతట రుద్ర రూపుడగు విష్ణువు తన నిట్టూర్పు ఆవిరులచే మేఘములను సృష్టించును. సంవర్తకములను పేరుతో ఆ మబ్బులు పెద్ద ఉరుములతో మెఱుపులతో ఆకాశమంతట క్రమ్మును. ఏనుగులవలె-కాటుకవలె నల్ల కలువపూలవలె-నల్లనివి, కొన్ని పొగరంగుతో, కొన్ని పచ్చనివి, కొన్ని పసపువలె, లక్కవలె, వైడూర్య రత్నముల వలె, ఇంద్ర నీలములవలె, శంఖముల వలె, మొల్లపూలవలె, జాజిపూలవలె, ఆర్ద్రపురుగులవలె, మనఃశీలవలె, తామర పూరేకులవలె, వెలిగెడి ఆమేఘములు అంతటను వ్యాపించును. నగరముల వంటి పర్వతముల వంటి గిడ్డంగుల వంటి మెట్టనేలల వంటి ఆకారములతో పెద్ద శరీరములతో పెద్ద ధ్వనులతో అవి ఆకాశమున నిండును. పెద్ద వానలు కురియించి ఆ భయంకరాగ్ని జ్వాలలను ఆర్పివేయును. ఆ అగ్ని చల్లారిన తరువాత కూడ ఆ మేఘములు ఎడతెగక వర్షించుచు లోకము నంతటిని నీటితో ముంచును. అవి బండి ఇరుసంత లావైన జలధారల నీటితో భూమిని నింపిన తరువాత ఊర్ధ్వరుకములనులోడ నింపును. ఇట్లు స్థిర్నర జీవులు జడచేతనే పదార్థములు అన్నియు నశించి లోకమంతయు అంధకారావృతమై ఉండగా అమేఘములట్లు నూరు సంవత్సరములకు పై కాలము ఎడతెగక వర్షించుచునే యుండును. (232)