బ్రహ్మ మహా పురాణము
భవిష్య కథనము
ఓ వ్యాసమహామునీ! ప్రళయకాలము దగ్గరలో నున్నదో దూరములో నున్నదో మాకు తెలియదు. కనుక ఎప్పుడు ద్వాపరయుగము అంతమై కలియుగము ఆరంభమగునో ప్రళయము ఎప్పుడు వచ్చునో గుర్తించు విధము తెలిసికొనగోరి ఇటకు వచ్చితిమి. అల్పమగు ధర్మానుష్ఠానముతోనే అధికమగు ధర్మఫలము లభించు విధమును ధర్మము నాశము నొందుటచే మహాభయంకరమగు ప్రళయ సమయమును గుర్తించు విధమును ఓ మునీ! మాకు తెలుపుము.
యుగాంత కాలమున రాజులు ప్రజలను రక్షింపకయే పన్నులు గ్రహించుచు తమ్ము తాము రక్షించుకొనుట యందు ఆసక్తి కలిగియుందురు. క్షత్రియులు కానివారు రాజులు అగుదురు. బ్రాహ్మణులు శూద్రుల సేవించి జీవింతురు. శూద్రులు బ్రాహ్మణుల ఆచారములను పాటింతురు. వేద పండితుల కాండపృష్ఠులు (వేదములను నిరర్థకముగా మోయు వారు) అగుదురు. కర్మానుష్ఠానము సరిగా చేయకయే హవిస్సును అగ్నిలో వేల్చెదరు. అన్ని కులములవారును ఒకే పంక్తిలో భుజింతురు. జనులు శిష్టాచారములు లేక ధనము ముఖ్యమని భావించుచు మద్యమాంసములయందు ప్రీతికల వారగుదురు. నరాధములై మిత్రుల భార్యలను అనుభవింతురు. దొంగలు రాజువలెను రాజులు దొంగలవలెను ప్రవర్తింతురు. భృత్యులు తమకు అర్హముకాని దానిని అనుభవింతురు. ధనములకు గౌరవము కలుగును. సత్ప్రవర్తనకు ఆదరము కలుగదు. భ్రష్టుడైన వానిని ఎవరును నిందింపక మెచ్చుకొందురు. పురుషులు వివేకహీనులు. జుట్టు ముడివేసికొనక విడిచినవారు విరూపులు అగుదురు. పదునాఱేండ్లలోపు స్త్రీలకే కాన్పు అగును. జనపదములలో అన్నము అమ్మబడును. నడి వీధులలో వేదము విక్రయించబడును. స్త్రీలును మానమును అమ్ముకొందురు. బ్రాహ్మణులు అంత్యజులగు వారితో కలిసి వసించుచు శూద్రులవలె మాటలాడుచుందురు. శూద్రులు తెల్లని దంతములు కలవారు-ఇంద్రియముల జయించినవారునై, తలలు బోడిగా చేసికొని కాషాయ వస్త్రములు ధరించి కపటధూర్త బుద్ధితో జీవించుచు ధర్మము ప్రవచింతురు. కుక్కలు ఎక్కువగును. గోవులు తగ్గును. సాధువులును తగ్గిపోవుదురు. గ్రామాంతములందు నివసింపవలసిన వారు గ్రామ మధ్యమునను, గ్రామ మధ్యమున ఉండవలసిన వారు గ్రామాంతమున నివసింతురు. జనులు అందరు సిగ్గులేని వారై తత్ఫలముగా నశింతురు. బ్రాహ్మణులు తపోయజ్ఞ ఫలములు అమ్ముకొందురు. ఋతుధర్మములు తారుమారు అగును. రెండేండ్ల గిత్తలచే నాగళ్ళు లాగింతురు. వానలు క్రమము అనుసరించి కురియకుండును.
దొంగల వంశములలో పుట్టినవారందరును ప్రభువులగుదురు. దానికి తగినవారు గానే ప్రజలు ఉందురు. తండ్రులకు ఈయదగినవి అన్నియు ఇతరులకు ఈయబడును. కుమారులు గాని, ఇతర మానవులు గాని తాముతాము ఆచరించవలసిన ధర్మములను ఆచరింపరు. భూమి ఎక్కువ చవిటినేలయగును. త్రోవలు అన్నియు దొంగలతో నిండిపోవును. తండ్రి నుండి దాయభాగముగా వచ్చిన ఆస్తిని కుమారులు పంచుకొనుటలో లోభముతో నిండినవారై పరస్పరము కలహించుకొనుచు తామే ఎక్కువ హరించుకొన వలెనను ప్రయత్నముతో కూడినవారై ఉందురు. స్త్రీలు తమ సౌకుమార్యము, రూపము నశించి పోగా కేశములతో మాత్రమే అలంకారము చేసికొందురు. పురుషుడు నిర్వీర్యుడై ఉండియు అట్టి భార్యలతో సుఖింతురు. భార్యతో సుఖించుటయే పరమ సుఖముగా భావింతురు. జనులు చాల భాగము దుఃశీలము కలవారై అనార్యులై ఉందురు. నిరుపయోగముగా రూప సౌందర్యములను పోషించుకొందురు. పురుషులు తగ్గిపోవుదురు. స్త్రీల సంఖ్య అధికమగును. పైరులలో పంట తక్కువగును. యాచకులు ఎక్కువగుదురు. ఒకరికి ఒకరు ఇచ్చుకొనుట ఉండదు. రాజ దండనము చోరపీడల వలన బాధనొంది జనులు నశింతురు. యువకులు కూడ వృద్ధులవలె అలవాటులు కలవారుగా ఉందురు. శీలములేని వారే సుఖింతురు. వర్షాకాలమందును పరుషమైన గాలులు ఇసుకను వర్షించుచుండును. పరలోకము లేదా ఉన్నదా అని సందేహింతురు. క్షత్రియులును, వైశ్యులవలె ధన ధాన్యములపై ఆధారపడి జీవింతురు. బంధు ప్రీతి తగ్గిపోవును. ఒడంబడికలు శపథములు పనిచేయక నశించును. ఋణము తీర్చు విషయములో సద్వ్యవహారముండదు. సంతోషము నిష్పలమై క్రోధము సఫలమగును. అనగా కోపముచేసిన వారికి మనుష్యులు భయపడుదురే కాని నిదానముగా చెప్పినమాట వినరు. పాడికే మేకలను గొర్రెలను కట్టి వేసికొందురు. యజ్ఞములు శాస్త్ర విధానమును అనుసరింపకయే జరుగుచుండును. నరులు ఎవరికివారు తామే పండితులమనుకొనుచు శాస్త్ర ప్రమాణములతో పనిలేక ఆయా కార్యములు ఆచరింతురు. శాస్త్రవిషయములను ప్రవచించువారుండరు. పెద్దలను సేవించి విషయములను తెలిసికొనకయే తనకు విషయము తెలిసెననును. ప్రతివాడును కవియే. నక్షత్రములు సరియైన యోగములతో ఉండవు. బ్రాహ్మణులు తమ ధర్మ కర్మములను సరిగా ఆచరింపరు. రాజులు దొంగల వంటి వారగుదురు. బ్రాహ్మణులు మోసగాండ్రు, కల్లు త్రాగువారు అగుదురు. అశ్వ మేధయాగము చేయుదురు. యాగము చేయింపతగనివారిచే యజ్ఞములు చేయింతురు. తినరాని దానిని తిందురు. ధనాశాపరులగుదురు. అందరును “భోః” అను శబ్దమును ఉచ్చరింతురే కాని ఒక్కడును అధ్యయనము చేయడు. స్త్రీలు గడ్డితో తలలు కప్పికొందురు. నక్షత్రముల కాంతి తగ్గును. దిక్కులు తారుమారగును. సాయం సంధ్యాకాలపు ఎఱుపు, దిక్కులు మండుచున్నట్లు కనబడును. కుమారులు తండ్రులకును, కోడళ్ళు అత్తలకును, పనులు ఆజ్ఞాపింతురు. బ్రాహ్మణులు హోమములు చేయరు. ఏమియు ఇతరులకు మిగల్చక అంతయు తామే తిందురు. నిద్రించుచున్న భర్తలను మోసగించి స్త్రీలు మఱియొక చోటికి పోవుదురు. స్త్రీలు రోగులుగాను, రూపహీనులుగాను, ప్రయత్నపరులుగాను తమ తప్పులు గుర్తించువారుగాను ఉండు భర్తలను పొందరు. ఉపకారికి ఎవరును ప్రత్యుపకారముకూడ చేయరు.
ఇట్లు యుగాంతమున ధర్మము లోపింపగా మనుష్యులు కష్టములు పొందుచు ఏ ఆహార విహారములు కలిగి ఏ కర్మలాచరించుచు ఏ కోరికలు కోరుచు ఎంత ప్రమాణము (ఎత్తు కొలతలు) ఎంత ఆయువు కలవారై కాలము గడుపుచు మరల కృతయుగమును అందుకొందురు? అని మునులు వ్యాసునడిగిరి.
అటుమీదట క్రమముగా ధర్మము భ్రష్టమైపోగా ప్రజలు సద్గుణ హీనులగుదురు. శీలము నశించును. ఆయువు క్షీణమగును. బలము తగ్గును. దానిచే దేహము వన్నె తఱుగును. దానిచే వ్యాధుల బాధ కలుగును. దానిచే వైరాగ్యము కలుగును. దానిచే ఆత్మజ్ఞాన సిద్ధికై ప్రయత్నించి దానిని పొంది మఱల జనులు ధర్మశీలురు అగుదురు. ఇట్లు మఱల ఉన్నత స్థితికిపోయి పోయి కృతయుగమును అందుకొనెదరు. అంతకులోగా మాత్రము కొందఱు నామమాత్రమునకు ధర్మశీలముకలవారు-కొందఱు ధర్మము తెలిసియు పట్టించుకొనని తటస్థులు-కొందఱు అల్పముగా ధర్మశీలము కలవారు-కొందఱు వేడుకకు మాత్రము ధర్మమును అనుష్ఠించువారు-అగుదురు. ప్రత్యక్షముగా ఇంద్రియములకు గోచరించునదే ప్రమాణమని కొందఱు-అనుమానము-హేతువుచే నిర్ణయించినది-కూడ ప్రమాణమే అని మఱికొందఱు ఏ ప్రమాణముతోను పనిలేదని మఱికొందరు వాదింతురు. నాస్తికత్వమును పూనువారు ధర్మమును లోపింపజేయువారు అగుదురు. బ్రాహ్మణులును తామే పండితులమను అహంకారముతో నుందురు. అప్పటికి పని జరుగు విషయములమీద మాత్రము శ్రద్ధ కలవారై శాస్త్ర జ్ఞానము లేక దాంభికులై పరమార్థతత్వ జ్ఞానము లేకుందురు. ఇట్లు ధర్మము నశించగా జనులు మరల శ్రేష్ఠులగు పెద్దలను ముందుపెట్టుకొని దానగుణము సుశీలము కలవారై శుభము కలిగించు కర్మలను ఆచరింతురు. జనులు సిగ్గులేక సర్వము భక్షింతురు. తమకై అన్నియు దాచుకొందురు. నిర్దయులు అగుదురు. జ్ఞానము సాధించుట యందు నిష్ఠ ఉండదు. అట్టి స్థితిలో జ్ఞాననిష్ఠ కలవారు మాత్రము అల్పకాల తపముతోనే సిద్ధి పొందుదురు. యుగాంతమున తక్కువ కులములవారు బ్రాహ్మణుల ప్రవర్తనమును వహింతురు. మహాయుద్ధములు-మహావర్షములు-పెనుగాలులు-తీవ్రమగు ఎండలు సంభవించును. రాజులు కర్మవాదులు అయి భూమిని రాజ్యమును అనుభవింతురు. రాక్షసులు బ్రాహ్మణులై జన్మింతురు. వారు స్వాధ్యాయము వషట్కారములు మొదలగు యజ్ఞ వాక్కులు లేక జనులను చెడుమార్గములలో నడుపుచు దురభిమానులై సర్వము భక్షించుచు వ్యర్థముగా కపటమునకు మాత్రము కర్మానుష్ఠానము చేయుదురు. వారు మూర్ఖులు ధనప్రధానులు లోభులు క్షుద్రులు క్షుద్రులను పరివార జనముగా పెట్టుకొనినవారు శాశ్వతమగు ధర్మమును వదలి లోకవ్యవహారమునకై పాటుపడువారు అగుదురు. పరధనముల హరింతురు. పరదారలను అశింతురు. కామముతో దురాత్ములై, కపటులై సాహసముమీద ఇష్టము కలవారై ఉందురు. బ్రాహ్మణులు ఇట్లు కాగా మునులు అనేక లక్షణములతో ఉందురు. జనులలో జరుగరాని చెడుగులు జరుగును. ప్రధాన పురుషులుగా ఏర్పడిన వ్యక్తులను గూర్చిన కథలకు ప్రాముఖ్య మిచ్చి అట్టివారిని పూజించుచుందురు. జనులు పంటలు-పైరులు-వస్త్రములు భక్ష్యభోజ్యములు-వస్తువులు దాచుకొను పెట్టెలు దొంగిలించు వారగుదురు. దొంగల ధనము హరించు దొంగలు, వధించువారిని కూడ వధించు క్రూరులు అగుదురు. ఇట్లు దొంగలు-ప్రాణివధ చేయువారు నశించిపోగా ప్రజలకు క్షేమము కలుగును. ఇట్లు లోకము నిఃసారమై క్షోభము చెందగా ఏమియుచేయలేక పన్నుల బరువు మోయలేక జనులు అడవులకు పారిపోవుదురు. యజ్ఞకర్మలు లోపించుటచే జనులకు రాక్షసుల-క్రూరమృగముల-కీటకమూషిక సర్పముల వలన భయమెక్కువగును. ప్రజలలో క్షేమము సుభిక్షము ఆరోగ్యము బంధు సమృద్ధి ఉండవలెనను ఉద్దేశము కలవారెవరైన నున్నచో అట్టివారు నరశ్రేష్ఠులని భావించవలసిన కాలమువచ్చును ఇట్టి స్థితిలో జనులు నిఃసారులై తమ వారితో కూడ స్వదేశములు విడిపోవుదురు.
జనులంతట కుమారులను వెంట తీసికొని భయముతో పారిపోవుచు కౌశికీ నదిని (హిమాలయ సమీపమున) దాటి ఆకలితో బాధపడుచు అంగ వంగ కళింగ కాశ్మీర కోసల దేశములను కొండ లోయలను హిమవత్పర్వత ప్రాంతమును సముద్ర తీరము నంతటిని ఆశ్రయించి నివసించుచు తమకు తామే శ్రమించి సంపాదించుకొనిన ఎండుటాకులు తినుచు, చర్మములు, చెట్ల నారలు ధరించుచు జీవింతురు. భూమి శూన్యమును కాక, అడవియును కాక ఉండును. ప్రభువులు ప్రజల రక్షింపని వారగుదురు. మానవులు మృగములను, చేపలను, పక్షులను, క్రూర మృగములను, పాములను, పురుగులను, తేనెను, ఆకుకూరలను, పండ్లను, దుంపలను, వేళ్ళను, ఎండుటాకులను తిని జీవింతురు. తమ వంశమువారిపై కూడ స్నేహభావము లేక కర్రలతో చేసిన శంకువులతో కొట్లాడుకొనుచు మేకలను, గొర్రెలను, గాడిదలను, ఒంటెలను పశువులుగా పోషించుకొనుచుదురు. నదీ తీరములను ఆశ్రయించి నివసించుచు నీటికై నదీజల ప్రవాహములను అడ్డు కట్టలతో అడ్డగింతురు. జుట్టు మొలచినది మొలచినట్లు లోపల మురికితో నిండి పెరుగుచుండ అట్లే వదలుదురు. కొందఱికి సంతానము అధికము. కొందఱికి సంతానమే కలుగదు. కుల శీలములు ఉండవు. వండిన ఆహార పదార్థములు అమ్ముచు, కొనుచు వానితో వ్యాపారము చేయుదురు. ప్రజలు హీనులై హీన ధర్మమును అనుసరింతురు. విషయ సుఖములకు పాల్పడి దుర్బలులు రోగులునై, ఇంద్రియములు క్షీణములై జరాశోకములచే బాధ నొందుదురు. ఆయువు తగ్గునని భయము కలుగగా, చివరకు ఇంద్రియ సుఖముల నుండి వెనుకకు మరలుదురు. లోక వ్యవహారము చేతకాక పోవుటచే వైరాగ్యము కలిగి సత్పురుషుల దర్శించి సేవించవలెను అను కోరిక కలుగును. సత్యముపై శ్రద్ధ కలుగును. పెద్దల ఆజ్ఞను పాటించి సద్గుణముల వైపునకు మరలుటచేత ధర్మమే మంచిదని తోచి దానిననుష్ఠింతురు. కోరికలు తీరుటకు అవకాశము లేకపోవుటచే ధర్మశీలులు అగుదురు సుఖ క్షయముచే బాధనొంది చిత్తసంస్కారము సంపాదింతురు. ప్రాణులపై దయకలుగును. ఇట్లు పాదపాదక్రమమున మరల ధర్మము వృద్ధియగుట కారంభమగును. ఇట్లు మరల జనులు కృత యుగములోనికి వత్తురు. కాలము ఎప్పుడును ఒక్కటియే. కలియుగమున ధర్మక్షయము-కృతయుగమున ధర్మవృద్ధి-ఇదే భేదము. చంద్రుడొక్కడే రాహువు కప్పినచో మలినుడై-విడిచినపుడు ప్రకాశించును కదా! కలియుగమున పరబ్రహ్మతత్త్వమును అర్ధ వాదముగా, పొగుడుటకు చెప్పిన గొప్పమాటగా భావింతురు. కృతయుగముతో ఆ పరబ్రహ్మము వేదముచే తెలియదగిన వస్తువునుగా గ్రహింతురు. ఆ తత్త్వము కలిలో తెలియరానిదై వివేచింపరానిదై శత్రుభావముతో చూడబడును. కలిలో తపస్సు అనునది ఇష్టముతో వేడుకకు చేయుపనిగా ఉండును. కృత యుగములో అదే తపస్సు గౌరవించబడును. ఇదే రెంటికి భేదము. సద్గుణములున్నచో కర్మలనుష్ఠించగలరు. కర్మలు అనుష్ఠించినచో గుణములు సంస్కారమును పొంది శుద్ధములగును. ఆయా యుగములందలి పురుషుని యోగ్యతను బట్టి దేశ కాలానుసారముగా వారివారి కోరికలును ఆచరణములు ఉండునని ఋషులు చెప్పిరి. యుగయుగమునను పురుషుని యోగ్యతానుసారమే ధర్మార్ధ కామ మోక్ష సాధనకై కర్మానుష్ఠానము దేవతల అనుగ్రహము శుభములు పుణ్యములు అగు కోరికలు జనులకు కలుగును. ఇట్లు యుగముల పరివర్తనములు విధి చేసిన సృష్టి స్వభావము అనుసరించి అనాదినుండియు ప్రవర్తిల్లుచున్నవి. ముందును ఇట్లే ప్రవర్తిల్లుచుండును.
ఈ జీవలోకము కూడ యుగ స్వభావము ననుసరించి క్షయమును వృద్ధిని పొందుచు మార్పు లను పొందుచుండునే కాని ఒక్క క్షణము కూడ మార్పులేక నిలుకడగా నుండదు. (231)