వ్యాసులు అనిరి -
వసుదేవుడు కారాగృహము నుంచి విముక్తిపొంది నందుని బండియెక్కి నాకు పుత్రుడు కల్గినాడని ఆనందభరితుడు అగుచున్న నందుని జూచెను. మఱియు అతనితో ఆదరముగొని నీకీ వార్ధకమందు పిల్లవాడు కల్గినాడు. రాజునకు మీరు ఏటేట చెల్లింప వలసిన పన్ను కట్టుటకు వచ్చి అది చెల్లింపబడెగదా వచ్చినపనియైనది. శీఘ్రముగ గోకులమునకు ఏగుడు. నాకు అక్కడ రోహిణి యందు శిశువు పుట్టినాడు. మీ బిడ్డనట్లు వానిని తమరు రక్షింప వలయును అనియె.
నందాది గోపకులు బండ్లమీద ధన భాండముల నెక్కించుకొని తెచ్చిన ధనమును పన్ను చెల్లించి వ్రేపల్లె యందు ఉండగా, బాలఘాతినియైన పూతన వచ్చి నిదిరించుచున్న కృష్ణుని ఎత్తుకొని ఒకరేయి పాలిచ్చెను. ఆమె ఎవనెవ్వనికి చను గుడిపెనో వాని శరీరము నశించుచుండును. కృష్ణుడు ఆ రాక్షసి స్తనము రెండు చేతుల నొత్తి పట్టుకొని కోపమున ప్రాణములు త్రావివైచెను. అది అరుచుచు ప్రేగులు తెగి ప్రాణము పోయి, భూమిపై పడి పోయెను. దాని ఆరుపువిని హడలిపోయి మేల్కని వ్రేపల్లెలోని జనము పూతన ఒడిలో ఉన్న కృష్ణుని, కూలిపడియున్న ఆ రక్కసిని చూచిరి. యశోద తటాలున కృష్ణుని ఎత్తుకొని జడిసి పోయి ఆవుతోక తలచుట్టుతిప్పుట, నుదుట గోమయము బొట్టుపెట్టుట, మున్నగు అంగరక్షలు చేసి, చంటి పిల్లలకగు దోషమును వారించెను. మఱియు ఆ తల్లి ఇట్లు రక్షాకవచము బఠించెను.
ఎవని బొడ్డునందు ఉద్భవించి తామర పువ్వునుండి జగత్తు పొడమినదో, ఆ సర్వభూత కర్తయగు హరి నిన్ను రక్షించుగాక! ఎవ్వని కోర తుట్టతుద ధరింపబడిన ధారుణి సర్వ జగత్తును ధరించుచున్నదో ఆ వరాహరూపము దాల్చిన వేల్పు కేశవుడు నిన్ను రక్షించుగాక! నీ గుహ్యమును జఠరమును విష్ణువు, నీ పిక్కలను పాదములను జనార్దనుడు రక్షించుగాక! ఎవ్వడు వామనమూర్తియై క్షణములో మూడడుగులిడి ముల్లోకములను ఆక్రమించెనో, ఆ వామనమూర్తి ఆయుధములగొని నిన్ను బ్రోచుగాక. గోవిందుడు నీ శిరస్సును గాక! కేశవుడు నీకంఠమును రక్షించుగాక! నీ ముఖము నీ బాహువులు నీ ముంజేతులను మనస్సును సర్వేంద్రియములను అవ్యాహతైశ్వర్యుడు అవ్యయుడు అగు నారాయణుడు రక్షించుగాక! నలుదిక్కుల నిన్ను వైకుంఠుడేలుగాక! విదిక్కులందు మధుసూదనుడు బ్రోచుగాక! అంబరవీథిని హృషీకేశుడు, మహీధరుడు భూమి నందును నిన్ను రక్షించుగాక! అని ఇట్లు యశోదమ్మచేత మంగళాశాసనములు చేయబడిన బాలకుడు బండిక్రింద పొత్తిళ్ళపై పరుండబెట్టబడెను. అంతట గోపకులు కూలిన పూతన కళేబరమును చూచి చచ్చిన దానిని చూచియు అడలిపోయి ఆశ్చర్యము పొందిరి.
ఒకతఱి ఒక బండి క్రింద పరుండిన మధుసూదనుడు రెండు పాదములు మీదికెత్తి పాలకై ఏడ్చుచుండెను. ఆ స్వామి పాదముల తోపునకు ఆ బండి తలక్రిందుఅయ్యెను. అందున్న పాలకడవలు అన్నియు బోర్లపడెను. అంత ఆ గోప గోపీజనము హాహాకారము చేసిరి. అందఱు వచ్చి వెల్లకిలపరున్న శిశువు చూచి, ఈ బండి ఎవ్వని వలన తిరుగు పడినదని అడిగిరి. అచ్చట ఉన్న పిల్లలు ఈ పిల్లవాని వలననే ఇది పడినది. ఏడ్చుచు ఈతడు పాదములు ఆడింప అవి తగిలి ఈ బండి తలక్రిందులైనది. ఈపని మఱి ఎవ్వనిది కాదనిరి. అదివిని గోపకులు ఇంకను వింతపడిరి.
నందగోపుడు ఆబిడ్డను ఎత్తికొని వెఱగుపడెను. యశోద అబ్బురపడి పగిలిన కుండ పెంకులుగల బండిని పెరుగు, పూలు, పండ్లు, అక్షతలచే అర్చించెను. గర్గాచార్యులు గోకుల మందు వసుదేవు ప్రేరణముచే (కంపభీతిచే) ఎవ్వనికిని తెలియరాకుండనే ఆ బలరామకృష్ణులకు జాతకర్మాది సంస్కారములు చేసెను. ఆ ముని పెద్దవానిని రాముడని, చిన్న వానిని కృష్ణుడని పేర్కొనెను. అత్యల్ప కాలముననే ఆ బాలురు మహాబల సంపన్నులయిరి. కాలుచేతులు ఆడించుచు క్రమముగా ప్రాకుచు వెలిబూడిద మెడల పూసుకొని ఇట్టటు నడయాడుచుండ ఆ అన్నదమ్ములను చూచి ఆ తల్లి యశోద పట్టలేని సంతోము గలదయ్యెను. గోవాటమునందు, లేగల దొడ్డియందు ఆ బాలురు ఆనాడే పుట్టిన లేగదూడల తోకలు పట్టుకొనిలాగుచు, ఇద్దరు ఒక్కచోట నడయాడుచు ఆటలాడుచుండ యశోద వారిని పట్టలేనిది అయ్యెను. కొన్ని సందర్భాలలో ఆ తల్లి కోపగించుకొని కృష్ణుని త్రాడుగొని ఱోలికి గట్టి ఓరోరి అల్లరి పిల్లవాడ! నీ చేతనైన ఏది ఎటువెళ్ళెదవో చూచెదనని ఇంటి పనులు చక్కపెట్టు తొందరలో ఉండ ఆ బాలుడు రోలును ఈడ్చుకొనుచు పోయిపోయి రెండు మద్ది చెట్ల నడుమ పోయి ఇరుకుత్రోవ యందు పోవుచుండ ఱోలు తిరుగుడువడి తాక, ఆ చెట్లు పెనుకొమ్మల కూలి పడిపోయెను. అంత అచ్చట పొడమిన కటకట శబ్దమువిని బెదరి వ్రేపల్లె జనము గ్రమ్ముకొని ఆ పెనుమ్రాకుల మొదళ్ళు పెల్లగిల కొమ్మలు విఱిగి పుడమిబడ జూచిరి. దానితోబాటు వచ్చియురాని పలువరుస మందహాసమును ఇంపును నా మ్రాకులజంట నట్టనడుమ బొజ్జదిఱుగ పెనురజ్జువున గట్టబడిన పలుదిట్టయై చిట్టి కుఱ్ఱని చూచిరి. దామముచే ఉదరమున కట్టబడినవాడు కావున దాన అతడు దామోదరుడయ్యెను. అప్పుడు గోపవృద్ధులు నందాదులు బెదరిపోయి ఎడనెడ ఇట్లు కల్గు మహోత్పాతములకు జడిసిపోయి ఇచ్చట పనిలేదు ఎటకేని కారడవికి బోవుదము అనుకొనిరి. వ్రేపల్లెలో కన్పించిన పెక్కురకముల ఉత్పాతములివి. పూతన కూలుట, బండి తలక్రిందులగుట, పెనుగాలి, మఱియే ఇతర దోషము లేక చెట్లు కూలిపడుట - ఇవన్నియు మనకు నాశనహేతువులు. అందుచే ఇచ్చట నుండిలేచి ఇపుడు బృందావనమున కేగుదుము గాక. భౌమమయిన ఉత్పాతదోషము ఏర్పడకుండ నీ పల్లెను విడచిపోవలయునని నిశ్చయించిరి. మరియు తమతమ వారిని బందుగులను విలంబము వలదు లెండు లెండని హెచ్చరించి అందఱు బండ్లెక్కి గోధనములతో (మందలతో) నాలమేపరులను వ్రజవాసులను పిలిచికొనుచు మందలుగా తరలిపోయి. క్షణములో ఆ వ్రజవాటము సర్వావయవ భంగముపొంది కాకి కూతలచేత భయపడి పోయెను.
భగవంతుడు కృష్ణుడు గోవుల క్షేమాభివృద్ధులను కోరి శుభమయిన మనస్సుతో బృందావనమును ధ్యానించెను. అందుచే మిక్కిలి పరుషమైన గ్రీష్మకాలమునకూడ వర్ష ఋతు ధర్మములుతోచి వానకారునంబోలె ఎటజూచిన లేత పచ్చికలు ఆశ్చర్యము కొలిపెను. సర్వ గోకులము అట్లు బృందావన నివాసమయ్యెను. వారెక్కి వెళ్లిన బండ్లు నిలిపిన అవ్వన వాటము అర్థచంద్రాకారమున శృంగార మొలికించె. రామదామోదరులు అక్కడ ఆలకాపరులైరి. ఆ గోవుల మందలందు, గోశాలలందు (గోష్ఠములందు) సువిలాసముగ ఆ బలరామకృష్ణులు ఆడుకొన చొచ్చిరి. తలయందలి కొండెసిగలందు నెమలి పింఛములను దోపుకొని ఆ అడవి పూలను జుట్టులందు తురిమి పిల్లన గ్రోవులు ఊది కొనుచు, లయాను గుణముగ వాద్యములు వాయించుచు, ఇరువంక జులుపములు వ్రేల అగ్నికుమారులో అన్నట్లు (కుమారస్వామి పోలికతో) నవ్వుచు కేరుచు కేరింతలు కొట్టుచు ఆవనమందు సంచరింపసాగిరి. ఒండొరులంగని పరియాచకము లాడుకొనుచు అంగడి కాండ్రకూడి దూడల మరలించు కొనుచు ఇట్లు సరసన వారు ఏడు ఏండ్ల ప్రాయమువారైరి.
ఎల్లలోకములను కాచువారు, అచ్చట అట్లు దూడలంగాచువారైన తఱి నింగినెల్ల మబ్బులు క్రమ్మ వర్షపు ధారల దశదిశలు ఒక్కటి గావించి వానాకాల మేతెంచె. ఎటు చూచిన చెట్లు చేమలు తీవలు మొగ్గదొడిగి కొన్ననలుపూసె. ఇంద్ర గోపములు మెఱసి మరకతమణి పద్మ రాగములు పొదవినట్లు అందము గుల్కి నదీజలపూరములు కట్టలు త్రెంచుకొని నడమంత్రపు సిరినొంది దుందుడుకువడ చెడగరుల మనస్సులట్లు ఉన్మార్గగాములు (దారితప్పి నడచునవి) అయ్యెను. సమయముగాని సమయములైనను స్వేచ్ఛగా ఆ మందకువచ్చి ఆ వీరులు బలరామకృష్ణులు ఈడుజోడు వారింగలిసి అమరులట్లు ఆ బృందావనమందు ఆటలాడిరి. (174)