బ్రహ్మ మహా పురాణము
కంసవిచారము
వ్యాసుడు అనియె -
అంతట కంసుడు మనసు తొట్రుపడగా, ప్రలంబుడు, కేశి మొదలయిన అసుర ప్రముఖులను పిల్చి ఓ ప్రలంబ! మహావీర! కేశీ! ధేనుక! పూతనా! అరిష్టా నా మాటలను ఆలింపుడు. దురాత్ములు దేవతలు నన్ను చంపయత్నించుచున్నారు. నేను వీండ్రను లెక్క సేయను. దేవకికి పుట్టిన పిల్ల చెప్పిన మాటలు ఆశ్చర్యము గల్గించినవి. వారెంత యత్నము చేయుచున్నను వారియెడ నాకు పరిహాసము గల్గుచున్నది. అయినను ఆ దుష్టులకు అపకారము చేయయత్నింప వలసినదే. త్రికాలములందు నిత్యమయిన మృత్యువు నా కొరకు పుట్టినట్లు ఆ బాలిక చెప్పినది. కావున ఏ పిల్లవాని యందు మిక్కిలి బలము కాన్పించునో, వెదకి వానిని తుదముట్టింపుడు” అని
ఇట్లు ఆజ్ఞ ఇచ్చి కంసుడు ఇంట ప్రవేశించి, దేవకీ వసుదేవులతో వైరము దోపకుండ ఇట్లనియె. ఊరక మీశిశువులను నేను చంపితిని. కాని ఎవ్వడో మఱి ఒకడు నా నాశనమునకు పుట్టియున్నాడు. మీరు బాధపడకుడు. భావి తప్పదు. మీకు ఇద్దరి పిల్లలు లేరు గదా! ఆయుర్ధాయ సమాప్తియందు ఎవడు చంపబడడు? అని దేవకీ వసుదేవులను అనునయించి కారాగారమునుండి వదలిపెట్టి, సంతోషపరచి తన అంతర్గృహమున బ్రవేశించెను.