ఓ వ్యాసా! ఎఱుక శక్యము కాని విష్ణుమాయా తత్త్వము నీవలన వింటిమి. కల్పాంతమున జరుగు మహాప్రళయమును, సృష్టి ఉప సంహారమును వినగోరుచున్నాము అని మునులు వ్యాసుని అడిగిరి.
“ప్రాకృత ప్రళయమున సృష్టి ఉప సంహారము జరుగు విధము వినుడు. మానవుల మాసము పితరులకును సంవత్సరము దేవతలకును ఒక అహోరాత్రమగును. కృత, త్రేతా ద్వాపరము కలి అను చతుర్యుగము బ్రహ్మకు ఒక పగలు. ఇది దేవతల పండ్రెండువేల సంవత్సరములకు సమానము. కల్పాదియందలి కృతయుగమున సృష్టియు కల్పాంతమునందలి కలియుగమున ఉపసంహారము, ప్రళయమును జరుగును” అని చెప్పగా
ధర్మము నాలుగు పాదములతో నడువక వైకల్యమునొందు కలియుగ స్వరూపము వినగోరెదమని మునులనిరి.
కలియుగమున నరులు ఋగ్యజు సామవేదములు ప్రమాణముగా వర్ణాశ్రమాచార ధర్మములయందు ప్రవర్తించరు. వివాహములు ధర్మములు ఉండవు. శిష్యులు గురువులను ఆదరించరు. పుత్రులు తమ ధర్మమును పాటించరు. అగ్నిహోత్రాది క్రియలు ఉండవు. ఏకులమున పుట్టినవాడైనను, బలమున్నచో సర్వేశ్వరుడై పాలకుడగును. అన్ని వర్ణములందును జనులు తమ కుమార్తెల మూలమున ధనమార్జింతురు. విప్రులు తమకు తోచిన ఏదో యొక విధానమున యాగ దీక్షను వహింతురు. తమకు తోచిన విధానమున ప్రాయశ్చిత్తములు చేయుదురు. ఎవరు ఏది చెప్పిన అదే శాస్త్రము. అందరును అందరకును దేవతలే. అందరకును అన్నియు బ్రహ్మచర్యాది ఆశ్రమములే. తమకు ఏది ఇష్టమై అనుష్ఠించినచో వారికి అదియే ఉపవాసము. అదే తపస్సు అదే దానము. కొంచెము ధనమున్నను మదము హెచ్చును. బంగారు మణులు రత్నములు అన్నియు నశించగా, స్త్రీలకు కేశములే అలంకారమునకు సౌందర్యమునకు కారణమై యుండును. స్త్రీలు ధనవంతునే భర్తగా గ్రహింతురు. ధనహీనుడగు భర్తను వదలుదురు. సేవకులు తమకు ఎక్కువ ధనము ఇచ్చినవానినే యజమానునిగా గ్రహింతురు. ధనమునకు గృహములే ప్రధానోపయోగము-తెలివి ఉన్నందులకు ధనము ఆర్జించుటయే ప్రధాన ఉపయోగము-ఆస్థి ఉన్నందులకు సుఖములే ప్రధానోపయోగము అని కలియుగ జనులు భావింతురు.
కలియుగమున స్త్రీలు స్వేచ్ఛా ప్రవృత్తి-విలాసములయందు వాంఛ కలిగి ఉందురు. అన్యాయముగా ధనమార్జించిన పురుషులను స్త్రీలు వాంఛింతురు. మిత్రులు కూడ ఎంత వేడినను మానవులు అల్పముగా కూడ తమ ధనమును వదలుటకు ఇష్టపడరు. మనస్సు ఎప్పుడును లౌకికమైన పురుషార్థములను సాధించుటయందే ఉండును. పాలెక్కువగా ఇచ్చుటనుబట్టియే గోవులపై గౌరవము. జనులు తరచుగా అనావృష్టికి గుఱియై ఆకలిచే బాధనొందుచు ఆకాశమువైపు వానకై చూచుచుందురు. వేళ్ళు పండ్లు ఆకులు తినుచు తమ్ముతాము చంపుకొనుచుందురు. కఱువులతో పడరాని బాధలు పడుచు తట్టుకొనలేక సుఖములులేక ఉందురు. స్నానము చేయకయే ఆహారము తిందురు. అగ్నిని దేవతలను అంధులను పూజింతురు. పిండోదకాది పితృ క్రియలు చేయరు. స్త్రీలు విషయసుఖ వాంఛ చిన్నదేహము అధికాహారము తినుట ఎక్కువ సంతానము తక్కువ భాగ్యము కలవారగుదురు. వారు రెండు చేతులతో తలగోకికొందురు. దేహమును నిండుగా కప్పుకొనక ఉందురు. పెద్దల యొక్క భర్త యొక్క ఆజ్ఞమీరుదురు. తమపొట్ట నింపుకొనుచు కోపనలై దేహసంస్కారములేక అసత్యములు పరుషములు మాటాడుచుందురు. దుఃశీలము కలిగి దుఃశీలురగు పురుషుల యందు ఆసక్తి దుష్ప్రవర్తనము కలిగి ఉందురు.
బ్రాహ్మణులు ఉపనయనములేకయే వేదాధ్యయనము చేయుదురు. గృహస్థులు హోమము, తగినట్లు దానములు చేయరు. యతులు అడవులలో నివసించుచు మొఱటైన ఆహారము తినుచు పుత్రాది స్వజనముపై ప్రీతి కలిగియుందురు. ప్రభువులు ప్రజలను కాపాడకపోగా పన్నులను పేరుతో ప్రజల ధనమును హరించుచుందురు. అశ్వరథ గజములు ఉన్న వాడే రాజు; బలహీనుడే సేవకుడు. వైశ్యులు కృషి వాణిజ్యము వంటి తమ వృత్తులు విడిచి వడ్రంగము మొదలగు పనులతో శూద్రవృత్తితో జీవింతురు. శూద్రులు అధములై సన్యాసివేషముతో ఉండి ధర్మములు సంస్కారములులేక భిక్షావృత్తితో యతివలె జీవింతురు. జనులు కఱవువలన పన్నులవలన బాధలుపడలేక గోధుమలు యవలు ఆహారముగా తిను దేశములకు పాఱిపోదురు. లోకమున వేద మార్గము నశించి, అవైదిక ప్రవర్తనపెరిగి, అధర్మ మెక్కువైనందున జనులు అల్పాయువులు అగుదురు. శాస్త్ర విహితములుకాని ఘోర తపస్సులు చేయు జనులను రాజు దండించక పోవుటచే, రాజ దోషము వలన పసివారు మరణింతురు. ఎనిమిది తొమ్మిది పది ఏండ్ల మగవారివలన ఐదాఱేడేండ్ల స్త్రీలకు కాన్పులు అగును. పండ్రెండేండ్ల కంటె పై బడి చాల తక్కువమంది జీవింతురు. తక్కువ తెలివి వ్యర్థముగా వేషము ధరించుట దుష్టమగు అంతఃకరణము కలిగి జనులు అల్ప వయస్సుననే మరణింతురు.
వైదిక మార్గము ననుసరించి, వారికి హాని కలిగినప్పుడెల్ల అధర్మము పెరుగునని ఎఱుగవలెను. అప్పుడే కలి విజృంభించును. ధర్మమును ఆచరించువారి ప్రయత్నములు నెఱవేరకుండును. వేదవాదములందు ఆసక్తి తగ్గును. నరులు అవైదికుల ప్రభావమునకు లోబడుటచే సర్వస్రష్ట-సర్వేశ్వరుడగు విష్ణుని అర్చింపకుందురు. వేదములతోను బ్రాహ్మణులతోను దేవతలతోను నీటితో పవిత్రత సంపాదించుటతోను పనియేమి? అని పలుకుచుందురు. వానలు ఎక్కువగా కురియవు. పంటలు ఎక్కువగా పండవు. పండ్లలో సారమెక్కువగా ఉండదు. అణుప్రాయమగు ధాన్యము. మేకపాలకు ప్రాముఖ్యము. వట్టివేళ్ళ గంధము పూసికొనుట అధికమగును. నరులకు అత్తమామలే గురువులుగా మిత్రులేముని శ్రేష్ఠులుగా అగుదురు. నరులు మామగారలు చెప్పినది వినుచు మానవుడు తనపని తాను చేసికొనునపుడు ఎవరికి ఎవరు తండ్రి? ఎవరు తల్లి? ఎవరు కుమారుడు? అందురు. అల్ప ప్రజ్ఞ కలవారై వాఙ్మనఃకాయిక దోషములకు వశులై అనుదినమును పాపములను చేయుచుందురు. సత్యము శౌచము సిగ్గు వీనిని విడిచిన వారికి కలుగవలసిన దుఃఖములన్నియు కలిగి, జనులు బాధలు పడుదురు. స్వాధ్యాయము స్వధా స్వాహ వషట్కారములు లోపించును. సరియగు బ్రాహ్మణులు అరుదుగా ఉందురు. కృతయుగమున దీర్ఘ కాలము తపస్సుచేసి సాధించిన పుణ్య స్కంధమును కలియుగములో అల్పకాలములోనే సాధించుకొందురు.
“ఏ కాలములో అల్ప ధర్మమును ఆచరించినను అధిక పుణ్య ఫలము కలుగునో తెలుపు”మని వ్యాసుని మునులడిగిరి.
“ఓ విప్రులారా! ధన్యమగు అల్ప క్లేశముతో తపస్సు చేసినను మహాఫలము లభించును. ఈ విషయములో స్త్రీలును శూద్రులును మఱియు ధన్యులు. కృతయుగమున పండ్రెండేండ్లు తపస్సు చేయుటచే కలుగు ఫలితము త్రేతాయుగమున ఒక సంవత్సరము ద్వాపరమున ఒకమాసము కలిలో ఒక అహోరాత్రముతోనే కలుగును. తపస్సు బ్రహ్మచర్యము జపము మొదలగువాని ఫలము కలియుగములో ఇట్లు నరుడు అల్పశ్రమముతోనే పొందగలడు. అంతేకాక కృతయుగమున ధ్యానముచేత త్రేతాయుగము యజ్ఞముల చేత ద్వాపరములో అర్చనముచేత కలుగు ఫలము కలియుగమున కేశవ సంకీర్తనముతోనే కలుగును. బ్రాహ్మణులు కలియుగమున ఉపనయనము చేసికొని వేద వ్రతములు అనుష్ఠించుచు వేదాధ్యయనము చేయవలెను. తరువాత ధర్మానుసారముగ సంపాదించిన ధనముతో విధానమును అనుసరించి యజ్ఞములు చేయవలెను. వ్యర్థముగా భాషించుట, భుజించుట, ధనమార్జించుట బ్రాహ్మణులు పతితులు అగుటకు హేతువగును. కనుక విప్రులు ఆయా విషయములలో నిగ్రహము కలిగి ఉండవలెను. వారు ఏ విషయముల నైనను సరిగా చేయకపోవుట దోషకరము. భోజ్యములను తినుట పానీయములను త్రావుట వలన ద్విజులకు కోరికలు నెరవేరవు. జనులును అట్టి బ్రాహ్మణులకు అధీనులై అన్ని కార్యములయందును ప్రవర్తించినచో వారు ఎంతో శ్రమకు ఓర్చి వినయవంతులై జనులచే ఆయా యజ్ఞాదులను చేయింతురు. శూద్రుడు బ్రాహ్మణులను సేవించుచున్నచో పాక యజ్ఞమునకు అధికారము కలిగి తాను సాధింపదగిన ఉత్తమ లోకములను సాధించు కొనును. త్రికరణములతో పతిసేవ చేయుట వలన స్త్రీలు తన భర్తతోపాటు అతడు పుణ్యములు చేసి సాధించిన లోకములకేగి సుఖింతురు.
ఓ బ్రాహ్మణులారా! మీరు ఏ విషయము తెలియగోరి ఇక్కడకు వచ్చితిరో అది తెలిపితిని. ఇంకను ఏమి కావలయునో అడుగుడు.” (230)