బ్రహ్మ మహా పురాణము

అ క్రూరుని తిరిగి రాక

వ్యాసుడు ఇట్లు అనెను -

“ఇట్లా యాదవుడు అక్రూరుడు గోవిందుని తలచుచువచ్చి నేను అక్రూరడనని పేరు చెప్పికొని తలవంచుకొని, హరికి నమస్కరించెను. (గోత్ర నామములు చెప్పికొని నమస్కరించుట విశిష్ట గౌరవపాత్రులగు గురువులకు దైవసమానులయెడ చేయవలసిన లక్షణము శాస్త్రీయము) శ్రీహరియు ధ్వజ వజ్ర పద్మ చిహ్నములుగల హస్తముచే అక్రూరుని తాకి, దరికిదీసికొని ప్రీతితో గాఢాలింగనము చేసికొనెను. బలరామకృష్ణులు అతనితో కుశల సంభాషణాదులు నెఱిపి వెంటనే అతనిని చేకొని తమ మందిరమున ప్రవేశించిరి. అతడును వారితో ముచ్చటలాడుచు విందారగించి సముచితముగ వారికి తానువచ్చిన విశేషమును తెలిపెను. కంసుడు దేవకీవసుదేవులను బెదరించుట, తన తండ్రియగు ఉగ్రసేనుని యెడ అతడు వర్తించుతీరు, తనను ఎందులకు కంసుడు పంపెనో ఆ విషయము ఎల్లను అతడు తెలుప విని, కేశి సంహారకుడగు భగవంతుడు దానపతీ! (ఓ అక్రూరా) ఇదెల్ల నాకు తెలిసినది. ఇందేమీ ఉచితమో అది ఆలోచించి చేసెదను. ఓ మహానుభావ! నీవింకొకలాగ అనుకొనకుము. నాచే కంసుడు హతుడు అయినట్లే తెలియుము. నేనును అన్నయ్య బలరాముడును నీతో రేపు మధురకు వత్తుము. గోపవృద్ధులు కూడ ఉపాయనములను పెక్కింటిని గొనివత్తురు. ఈ రేయి విశ్రమింపుము. చింతింప పనిలేదు. మూడు రాత్రులలోగా కంసుని పరివారముతో సహా సంహరింతు”నని కృష్ణుడు పల్కెను.