అని చెప్పి ఇంకను వ్యాసుడు ఇట్లు చెప్పెను.
అర్జునుడు అప్పుడు కృష్ణ బలరామ శరీరములను వెదకి, వానికిని మఱి ఇతర శరీరములకు సంస్కారమును గావించెను. మఱియును అష్టమహిషులు రుక్మిణి మొదలగువారు హరి శరీరమునందు పుట్టిన అగ్నియందు ప్రవేశించిరి. రేవతియు బలరాముని దేహమును కౌగలించుకొని, తత్స్పర్శవలన గలిగిన ఆనందముచే చల్లబడిన అగ్నియందు ప్రవేశించెను. ఆపై అర్జునుడు వారికి ప్రేతకృత్యములను యథావిధిగ జరిపి, తక్కిన జనమును, వజ్రుని తీసికొని వెళ్ళెను.
ద్వారవతి (ద్వారక) నుండి బయలుదేరిన వేలకొలది కృష్ణ భార్యలకు వజ్రునికి అతడు రక్షణను ఇచ్చి ఆదరించెను. కృష్ణునిచే భూమికి కొనిరాబడిన సుధర్మ అను దేవసభ (సింహాసనము) పారిజాత వృక్షము స్వర్గమునకు వెళ్లిపోయెను. హరి మేదిని విడిచి స్వర్గారోహణము చేసిననాడే కలి నల్లని శరీరముతో భూమికి దిగెను. మహాసముద్రము నిర్జనమైన ద్వారకను ముంచి వేసెను. ఒక్క కృష్ణ గృహమును మాత్రము ముంచలేదు. ఆ గృహమందు ఎపుడును భగవంతుడు ఈనాటికిని ఉండుటచే నేడును సముద్రుడు తన హద్దుదాటి దానిని ఆక్రమింపడు. అది మహాపుణ్య స్థానము సర్వపాపహరము. విష్ణువు క్రీడించిన స్థానము. దానిని దర్శించిన పాపము పోవును.
పార్ధుడు ధాన్యధన సమృద్ధమైన పంచనద దేశమందు యాదవ జనమున కంతకు నివాసము ఏర్పరచెను. ఆవల కలి ప్రభావముచేత మానవులలో లోభగుణము అంకురించెను. భర్తలను కోల్పోయిన స్త్రీలు, వారి వారిని ధనుర్ధారియైన ఒక్క అర్జునుడు తీసి కొనిపోయి రక్షణ ఇచ్చుట చూచి లోభవశులై పాపులైన చోరులకు సంబంధించిన అభీరులు (అడవి మూకలు) పొగరుగొని ఒండొరులతో ఇట్లు ఆలోచించిరి. ఈ అర్జునుడు ఒక్కడు విల్లుగొని భర్తలు చనిపోయిన స్త్రీ జనమును కొనిపోవుచున్నాడు. మనలను లెక్కచేయుట లేదు. కనుక మనబలము జూపింతము. భీష్మ, ద్రోణ, జయద్రధ, కర్ణాది వీరులను చంపి గర్వమెక్కి గ్రామవాసులగు మన బలమేదో ఎరుగకున్నాడు. బలాఢ్యులగు పెక్కు గ్రామముల వారినందరిని అవమానించుచున్నాడు. మీరెవ్వరును బదులు పలుక వలదు అని కర్రలు కత్తులు గొని దస్యులు (గూండాలు) వేలకొలది పరువులెత్తిరి. అంత అర్జునుడు వెనుదిరిగి అయ్యాభీరులం గని మీరు బ్రతుకదలతురేని వెనుకకు పొండు’ అన అతడి మాటను ధిక్కరించి వారెల్ల స్త్రీలను, కృష్ణ భార్యలను, అర్జునునిచెంత నుండి లాగికొని పోయిరి.
అంత అర్జునుడు యుద్ధమందు వమ్ముపోయి గాండీవము ఎక్కుపెట్టి పూనెను. కాని అది అతనికి అశక్యమయ్యెను. కష్టముమీద ఎక్కుపెట్టినను క్షణములో అది శిథిలమై పోయెను. దివ్యాస్త్రములు అతనికి జ్ఞాపకమే రాలేదు. చేతిలోనున్న తక్కిన అస్త్రములను వారిపై విసరెను. కాని అవి అన్నియు క్రుంగిపోయి శత్రు భేదనమును చేయవయ్యెను. ఖాండవ వనదహన సమయమున అగ్ని ఇచ్చిన అక్షయ బాణములుకూడ అప్పుడు క్షయించి పోయినవి. గోపాలురతో పోరుచున్న అర్జునునికి హైన్యస్థితి వచ్చెను. అపుడు అర్జునుడు శరజాలముచే బలాఢ్యులగు రాజులను నేను గెలుచుట కృష్ణునియొక్క బలమే అని తలంచెను. అతడు చూచుచుండగనే యుత్తమ స్త్రీ వర్గమును ఆభీరులు లాగికొని పోయిరి. కొందరు స్త్రీలు తమంతనే కామ ప్రవృత్తితో ఆ మూకవెంట పడిపోయిరి. అర్జునుడు శస్త్రాస్త్రములచే గొట్టుచుండ వాండ్రు పకపక నవ్వుచుండిరి. ఇట్లు పార్థుడు చూచుచుండగనే మ్లేచ్ఛులు వృష్ణ్యంధక కులాంగనలను అందరను కొనిపోయిరి.
అంత జిష్ణువగు అర్జునుడు కష్టము! కష్టమనుచు భగవంతునిచే విడువబడితినని ఏడ్చెను. అదే ధనుస్సు అవే అమ్ములు అదే రథము అవే గుఱ్ఱములు. వేదవిదుడు వేదానుష్ఠాతయు కాని వానికి చేసిన దానమువలె ఒక్క అడుగులో సర్వము వమ్మై పోయినది. ఆహా! వీధి ఎంత బలీయము. ఆ మహానుభావుడు లేనంతట వట్టిచేతగాని దద్దమ్మనై పనికి మాలిన వారిచే నవమానింపబడితిని. అవే బాహువులు అదే పిడికిలి, అదేచోటు, ఆ అర్జునుడనే యైయున్నాను. పుణ్యముతో నా స్వామితో నెడబాటుచే అంతయు నిస్సారమై పోయినది. నా అర్జునత్వము భీముని భీమత్వము కృష్ణుని వలన ఈయబడినవే. నిజము. ఆయన లేమి నీ చచ్చు గొల్లలకు నేను బెండువడితిని” అని ఇట్లు అర్జునుడు పలుకుచు ఇంద్రప్రస్థమునకు ఏగి యాదవ కుమారుడగు వజ్రుని అందు రాజును కావించెను. అడవిలోనున్న వ్యాసుని మహానుభావుని దర్శించి సమీపించి అడకువ దోప నమస్కరించెను. అట్లు మ్రొక్కిన యర్జునుని వ్యాస భగవానులు తేరిపార జూచి అర్జునుడేయని నిశ్చయమునకు వచ్చి “పార్ధా! ఈ విధముగా మిక్కిలి వన్నెదరిగి ఉన్నాడవేమి? గొర్రెలపరాగము వెంబడింపవలసి వచ్చెనా? బ్రహ్మ హత్యకు పాల్పడితివా? గెలుపునందు ఆశాభంగమై దుఃఖము గల్గెనా! చిన్నపోయి ఉన్నాడవు. నిన్ను యాచింప వచ్చిన సాంతానికాదులను లేదని నిరాకరించి పంపితివా! (సాంతినికుడు = పుత్రుడు మొదలగువాడు) అగమ్యాగమనము జేసితివా! (కూడని స్త్రీతో సంగమము) ప్రభతరిగి ఉండుటకు కారణమేమి! విప్రులకు పెట్టక నీవొక్కడవే మధురాన్నములను తింటివా! కాక దీనుల ధనములను హరించితివా? సూర్యవాతమునకు (వడదెబ్బకు) గురికాలేదు కదా! ఎట్లు శోభ గోల్పోయితివి? దృష్టి దోషము తగిలెనా నభోదక స్పర్శ కల్గినదా! (గోళ్లయొక్క స్పర్శ కల్గిన యుదకము అశుచి అన్నమాట) మట్టికుండ నీటిచే, ప్రోక్షింప బడితివా! (తడుప బడితివా) నీకన్న తక్కువ వారిచే గెలువబడితివా! ఇట్లు ఛాయ తరిగి ఉన్నావేమి ?” అని ప్రశ్నించెను.
అంతట పార్థుడు నిట్టూర్పు పుచ్చి “భగవంతుడ! వినుము” అని తన పరాభవ వృత్తాంతమును జరిగినది జరిగినట్లు చెప్పెను.
“మా బలము, మా తేజస్సు, మా వీర్యము, మా పరాక్రమము, మా సిరి, మా కాంతికి కారణము. ఎవరో అట్టి హరి మమ్ము వీడి వెళ్ళినాడు. చిరునవ్వుతో ముచ్చటించు మా స్వామి, ఆ మహానుభావుడు అన్యుడట్లు మమ్ము విడిచివెళ్ళినాడు. దానిచే నా సర్వాయుధములు తృణప్రాయములైనవి. అస్త్రములు, శస్త్రములు గాండీవముయొక్క మూర్తీభవించిన సారమెల్లతానైన ఆ పురుషోత్తముడు వెళ్ళిపోయినాడు. ఎవని చూపున మమ్ములను శ్రీ, జయము, సంపత్సమృద్ధి విడువలేదో అట్టి గోవిందుడు భగవంతుడు విడిచి వెళ్ళినాడు. భీష్మ ద్రోణులు అంగరాజు (కర్ణుడు) దుర్యోధనాదులు ఏ ప్రభువు ప్రభావముచే సమూలము నిర్దగ్ధులైలో అట్టి కృష్ణుడు భూమిని వదలిపోయినాడు. యౌవనముబాసి హతశ్రీయైవన్నె తరిగి చక్రాయుధుని విరహమువలన నేనొక్కడనే కాదు, ఈ పృథివి కుములుచున్నది. ఏ స్వామి అనుభావము వలన లీలవలన నేను అను అగ్నియందు భీష్మాదులు మిడుతలైరో అట్టి కృష్ణుని బాసి గొల్లలకు ఓడిపోయితిని. ఎవ్వని అనుభావముచే త్రిలోక ప్రసిద్ధమైనదో అట్టి గాండీవము కృష్ణుడు లేమిని గొల్లల బడితెలకు లొంగిపోయినది. హరిలేమిని ఎన్నో వేలమంది స్త్రీలు అనాథలు వట్టి కట్టెలతో దొంగలచే కొనిపోబడినారు. నా బలమును ధిక్కరించి గొల్లలు నేను గొనివచ్చుచున్న కృష్ణుని యంతఃపురమంతయు కర్రలతో అదలించి తోలికొనిపోబడినారు. నేను సిరి కోల్పోవుట వింతగాడు. బ్రతికి యుండుట అదే అత్యద్భుతము. నీచులవలని అవమానమను ఱొంపిని బూసికొని తాత! దిక్కుమాలి సిగ్గుమాలిన వాడనైతిని.”
ఈ విధముగా తెలుపబడిన అర్జునుని దుఃఖము విని దీనుడై ఏడ్చుచున్న మహాత్ముడైన ఆ పాండవుని యొక్క మాటలను విని నేను. ఇట్లు అంటిని. (వ్యాసుడు) పార్థ! సిగ్గుపడ వలదు. ఏడువకుము. సర్వభూతముల యెడల కాలము యొక్క గతి ఇట్టిదని ఎఱుంగుము. భూతముల పుట్టుకకు గిట్టుటకు కాలము కారణము. ఇది కాలనిమిత్తమని ఎరిగి స్థైర్యము నొందుము. నదులు, సముద్రములు, పర్వతములు, వసుధ, మనుష్యులు, పశువులు, చెట్లు, పాపములు కాలముచే సృజింపబడి కాలముచేతనే క్షయించును. సర్వమును కాల స్వరూపముగ తెలిసి శాంతిని పొందుము. ధనంజయ! కృష్ణ ప్రభావము నీవన్నది అంతయు అంతే. భారహరణమునకు భూమియందు అతడు అవతరించినాడు. భూదేవి భారవశయైమున్ను దేవతలదరి కేగినది. అందులకే కామరూపియైన భగవంతుడు అవతరించి ఆ పని జరిపినాడు. రాజులను కూల్చినాడు. తుదకుతాను జన్మించిన వృష్ణ్యంధక కులమును గూడ ఉపసంహరించినాడు. ఇతనికింక నీ భూతలమున చేయవలసినది కొంచెము కూడలేదు, అందుచే కృతకృత్యుడై భగవంతుడు యథేచ్ఛగా నిర్గమించినాడు. సృష్టిస్థితిలయములు మూడును శ్రీహరిలీలలే. పార్థ! పరాభవమునకు సంతాపపడకుము. పురుషుల పరాక్రమములు అందగుచుండును కాగలకాలములందు భీష్మ, ద్రోణాదులు నీచే కూలుట కాలమువలననే. పరమాత్మయను భావముననే వారి పరాభవము. తక్కువ వారివలన నీకు పరాభవము. ఆ దేవుడు స్థితిలయములు చేయునపుడు అన్య శరీరములందు ఆవేశించుచుండును. కాగలప్పుడు హరి నీకు సహాయుడయ్యెను. కానపుడు నీ శత్రువులు హరి దృష్టిలో పడినారు. నీవు గాంగేయునితోడి కౌరవులనెల్ల గూల్చితివన్న ఎవడు నమ్మును? అట్లే ఎందులకుగాని అభీరుల కోడితి వన్నను నెవడును నమ్ముడు? ఇవి సర్వ భూతముల యందు హరియొక్క విలాసము. అతని చేష్ట. నీచే కౌరవులు ధ్వంసమగుట, భీరులకు నీవు ఓడుట, నీ రక్షణలో ఉన్న స్త్రీలు దొంగలచేతిలో పడుట అను విషయములో జరిగినది నీకు చెప్పుచున్నాను వినుము.