బ్రహ్మ మహా పురాణము

కల్కి అవతారం

కల్కిమూర్తి శంభల గ్రామమున విష్ణు యశస్సను పేరున సర్వలోక హితమునకు అవతరించును. ఇవేగాక దితితో దేవగణములతో వచ్చిన అవతారములను బ్రహ్మవాదులు పురాణములందు కీర్తించియున్నారు. ఈ అవతార కీర్తనమందు దేవతలు గూడ తబ్బిబ్బు పడుదురు. వేదధ్వనితో బాటు పురాణకీర్తన ప్రవచనము జరుగవలెనను ఉద్దేశ్యముతో నా అవతార చరిత్ర వర్ణింపబడినది. కీర్తనీయుడైన సర్వ జగద్గురులైన విష్ణువుయొక్క ఈ చరిత్రను కీర్తించుట వలన పితృదేవతలు సంప్రీతులగుదురు. మరియు విష్ణువుయొక్క ఈ కథ కృతాంజలియై విన్నవాడు యోగీశ్వరేశ్వరుడైన ఆ స్వామియొక్క యోగమాయ విలాసములను విన్న నరుడు సర్వ పాపములనుండి విమోచనము నంది, సమృద్ధియైన బుద్ధిని (జ్ఞానమును) విస్తారములైన భోగములను, భగవత్ ప్రసాదము వలన శీఘ్రముగ పొందును. మునీంద్రులార! ఇట్లు నాచే అమిత తేజస్వియైన విష్ణువుయొక్క పుణ్యావతారములు సర్వపాపహరములు. సమగ్రముగా కీర్తింపబడినవి. (213)