బ్రహ్మ మహా పురాణము

సంకరజాతి లక్షణ వర్ణనమ్

అంతట మునులు మహానుభావ! నీవు సర్వజ్ఞుడవు. మఱియు సర్వభూత హితాభిలాషివి. భూత భవిష్య వర్తమానములు నీకు కరతలామలకములు. ఏ కర్మచే నడతచే వర్ణములకు అధమ స్థితి వచ్చును? ఉత్తమ స్థితియును కల్గును? అనతిమ్ము. శూద్రుడు ఏ కర్మ మాచరించి బ్రాహ్మణత్వ మందును. వినగోరెదము” అని అడుగగా వ్యాస భగవానులు ఇట్లనిరి.

“హిమగిరి శిఖరమందాసీనుడైయున్న మహాదేవుండైన త్రిలోచనుని శైలరాజతనయ మ్రొక్కి ఇట్టిదే ప్రశ్న అడిగినది. ఓ భగనేత్ర నాశన! పూషదంత వినాశన! దక్షక్రతుహర! బ్రహ్మమున్ను చాతుర్వర్ణ్య ధర్మములను అడిగెను. ఏ కర్మ విపాకముచే బ్రాహ్మణాదులు క్షత్రియాది జన్మము లందుదురు. ఈ అనులోమ విలోమ వర్ణ సాంకర్య మెట్లు గలుగునో నా సంశయమును వారింపుము అన శివుడిట్లు చెప్పెను.

“దేవీ! బ్రాహ్మణ్యము దుర్లభము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వభావముచేత ఏర్పడిరని నా తలంపు. తరువాత దుష్కర్మము ఒనరించి సహజసిద్ధమైన బ్రాహ్మణ్యము నుండి దిగజారును. బ్రాహ్మణుడు మొదలయినవారు తమ స్వధర్మ మందుండిరేని బ్రాహ్మణ్యమును పరమావధిగ బడయుదురు. ఎవడు విప్రధర్మము విడిచి క్షత్రియ ధర్మము ఆచరించునో అతడు, విప్రత్వము కోల్పోయి క్షత్రియ యోనిం జనించును. ఇట్లే వైశ్యాది వర్ణము లందును స్వధర్మ పరిత్యాగము చేసినవాడు జనించును. శూద్రత్వముదాక పతనమైన విప్రుడు బ్రహ్మలోక భ్రష్టుడై వర్ణ సాంకర్యమందును.

శూద్రుడు స్వధర్మముచే జ్ఞానవిజ్ఞానములనంది, శుచియై, ధర్మజ్ఞుడై, ధర్మనిరతుడై స్వధర్మ ఫలము వడయును. అనగా క్రమముగ ఉన్నత వర్ణములందు జన్మించి బ్రహ్మత్వ సిద్ధినిగూడ అందును. మున్ను బ్రహ్మ ఉదాహరించిన అధ్యాత్మ జ్ఞానము, నిష్ఠాసిద్ధిని ధర్మపరులెట్లు పొందుదురో ఆవిషయములు ఇవి. ఉగ్రాన్నము, గణాన్నము, శ్రాద్ధాన్నము, మైలఅన్నము, మృష్టాన్నము, శూద్రాన్నము, ఎన్నడును తినరాదు. ఇది బ్రహ్మ ముఖము నుండి వచ్చిన వాక్కుగాన (వేదము) పరమ ప్రమాణమని నా అభిప్రాయము.

శూద్రాన్న శేషము కడుపులోనుండగా చనిపోయిన ద్విజుడు ఆహితాగ్ని యజ్ఞ కర్తయు శూద్రుడై పుట్టును. దానికి ప్రాయశ్చిత్తము గూడలేదు. ఏయే వర్ణములవారి అన్నము జఠరమందుండగా ఎవ్వడు చనిపోవునో వాడు ఆ వర్ణములందు పుట్టును. అక్కడ విమర్శలేదు. దుర్లభమైన బ్రాహ్మణ జన్మమంది అభోజ్యాన్నములు తిన్నవాడో పతితుడై తీరునో బ్రాహ్మణుడు సురాపానము, బ్రహ్మహత్య దొంగతనము వ్రతభంగము శౌచలోపము స్వాధ్యాయ లోపముచే లుబ్ధుడై వైకృతికుడై శఠుడై వ్రతదూరుడై వృషలిని సంగమించి కుండాశనముచేసి సోమము అమ్మి, నీచుల సేవించి భ్రష్టుడగును. గురుతల్పగుడు గురుద్వేషి గురువుల పరిహసించువాడు బ్రహ్మ ద్వేషి బ్రాహ్మణ్య పతితుడగును. ఈ పాపములు చేయక శుభకర్మములు ఆచరించి శూద్రుడు బ్రాహ్మణుడు అగును. వైశ్యుడు క్షత్రియుడుగాను శూద్రుడు న్యాయము తప్పక యథావిధిగ స్వధార్మచరణము చేసి అందరికిని తాను అతిథియై అందరి భుక్త శేషమును తిన్నవాడు, వారికి శుశ్రూష పరిచర్య చేసినవాడు, సన్మార్గమందు స్థిరుడైనవాడు, దేవతల భూదేవులను పూజించినవాడు ఋతుకాల స్త్రీ సంగమము చేసినవాడు, నియతమయిన ఆహారము తిన్నవాడు వృథామాంసము తిననివాడు వైశ్యత్వమును పడయగలడు.

ఋత వచనుడు అహంభావము లేనివాడు. సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతుడు. సామ నిపుణుడు బ్రహ్మ యజ్ఞాది నిత్య యజ్ఞములు చేయువాడు స్వాధ్యాయ పరుడు ఆచారశీలుడు ఇంద్రియములను తన అధీనమున ఉంచుకొన్నవాడు సత్కార్యకర్త సర్వవర్ణముల యెడ అసూయ లేనివాడు గృహస్థ వ్రతమూని రెండువేళల మాత్రమే భుజించుచు శిష్ట శేషము యజ్ఞ శేషము ఆరగించుచు నిష్కాముడు నిరహంకార మతి యథావిధి కాలముగ హోమము చేయుచు అగ్న్యుపాసన చేయువాడు సర్వులకు ఆతిథ్య మొసగుచు శేషాన్నము మాత్రమే తాను భుజించువాడు అగు వైశ్యుడు త్రేతాగ్నిమాత్ర సంపాద్యమైన బ్రాహ్మణత్వములడుగ ఆ వైశ్యుడు తొలుగ క్షత్రియుడై పుట్టి జన్మాది సంస్కారములు పొంది మంచి దక్షిణ నిచ్చి యజ్ఞములు చేయువారికి దానములు చేసి స్వర్గము కోరి అధ్యయనము చేసి త్రేతాగ్ని హోత్రియై ఎల్లపుడు తడిచేతితో దానములు చేయును. చేయి ఆరకుండ ధారాపూర్వకముగ (బహుదానములు చేయుచునన్నమాట) ప్రజలను ధర్మమున బాలించుచు సత్యవచనుడై ఆచారవంతుడై సత్యము అయిన ధర్మములను జేయుచు ధర్మ దండముచే దగ్ధుడుగాక (రాజందఱిని దండించు వాడయ్యును అతనిపై శాస్త్రవిహిత ధర్మ దండనమనునది ఒకటి ఉండి అతని అదుపులో పెట్టుచుండును. దానిచే రాజు దగ్ధుడు కాకపోవుట అనగా దానికి లోబడి ప్రజారక్షణ శిక్షణలు చేసి దానికి విధేయుడై ఉండవలెను) ధర్మ కామార్ధములను మూడు పురుషార్థములను సాధించుచు కార్యములచే కార్యసాధనములచే నియమింపబడినవాడై ప్రజలవలన అఱవవంతు మాత్రమే పన్ను గ్రహించువాడై స్వేచ్ఛగొని గ్రామ్య ధర్మములను సేవింపక అర్థశాస్త్రము చక్కగ ఎఱిగి ఋతుకాలమందు పత్నీ సమావేశము పొంది (సదా బ్రహ్మచారియై) సదోపవాసియై (నియమిత భోజనములు రెండిటి నడుమ ఎట్టి అల్పాహారములు గొనకుండు వాడు సదోపవాసి) స్వాధ్యాయనిరతుడై శుచియై గృహమందుండి మూడువర్ణముల వారికిని ఆతిథ్యమిచ్చుచు మంచి మనసుతో నిత్యము అన్నమడుగు శూద్రులకు సిద్ధమైయున్నది రండనుచు స్వార్థముచేకాని కామముచేగాని ఏకొంచెమును చూడక కేవలము పితృదేవత అతిథి నిమిత్తముగానే సాధనము చేయుచు, తన ఇంటనే తాను భిక్షాన్నమును సేవించి, ద్వికాలమగ్ని హోత్రములు చేయుచు, గోబ్రాహ్మణ హితమునకై మాత్రమే ప్రవర్తించుచు, యుద్ధమందు వెన్నుజూపక అందులో మరణించినను త్రేతాగ్ని మంత్రపూతమయిన ఉపాధితో శరీర మింకొకటి ప్రవేశించి ద్విజుడగును. అప్పుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై వేద పారగుడై సుసంస్కృతుడై వైశ్యుడిట్టి క్షత్రియత్వమును బడయును. శూద్రుడును ఆగమ విధానముచే (వైదిక ప్రక్రియతో కాదు) సంస్కారములను పొంది ద్విజుడగును.

బ్రాహ్మణుడే అగుగాక అసద్వృత్తముచే సర్వసంకర భోజనముచే బ్రాహ్మణ్యమును కోల్పోయి శూద్రత్వమందును. శుచి కర్మాచరణముచే దేవీ కటాక్షముచే మనస్సు శుద్ధినంది జితేంద్రియుడైన శూద్రుడును ద్విజునియట్ల సేవింప దగినవాడని బ్రహ్మ స్వయముగ పల్కెను. స్వభావ కర్మచేత శూద్రుడు ప్రవర్తించునేని అతడు ద్విజుల కంటెను విశుద్ధుడని నా తలంపు. యోనికాదు (జన్మకాదు) సంస్కారము కాదు, శ్రుతికాదు, సంతానము కాదు, ద్విజత్వమునకు కారణము కేవలము వృత్తమే (నడవడియే). బ్రాహ్మణుడను ఈ సర్వ జాతీయు లోకమందు వృత్తమును అనుసరించి విధింపబడును. వృత్తముననున్న శూద్రుడు గూడ బ్రాహ్మణత్వమందును. ఓ రమణి! బ్రహ్మ స్వభావమనగా సర్వత్ర సమత్వమని నా తలంపు. నిర్గుణము నిర్మలమునైన బ్రహ్మ ఎవ్వనియందు ఉండునో అతడు ద్విజుడు. (బ్రహ్మ విషయక జ్ఞానము కలవాడన్నమాట) ఇట్టి పవిత్రులు ఒక స్థానము ఒక అధికారము అనిలేని ఒక విలక్షణ స్థితికి నిదర్శనమై ఉందురు. ప్రజాసృష్టి చేయు బ్రహ్మయే స్వయముగా ఇట్లు చెప్పెను. బ్రహ్మపదార్థము యొక్క మహాక్షేత్రము పాదములచే ఈ లోకమందు బ్రాహ్మణ రూపమున సంచారము చేయుచున్నది. అక్కడపడిన విత్తనము ఆ కృషి (వ్యవసాయము) పరమందు ఫలవంతమగును. నిత్యసంతుష్టుడై బ్రాహ్మణ మార్గమును అనుసరించి సంహితాధ్యయనము నిత్యము చేయుచు, గృహమందు ఉత్తమ గృహస్థై, నిత్యము స్వాధ్యాయమే బ్రతుకుగా వేదాధ్యయనముచే సంపాదనచేసి బ్రతుకక యుండు విప్రుడు నిత్యసన్మార్గవర్తి, ఆహితాగ్ని, అధ్యయనపరుడునైన విప్రుడు బ్రహ్మ భావమున కర్హుడగును. బ్రాహ్మణ్యము వీడక మనసు నియమించుకొని దానిని జన్మ కారణమైన సహజ ద్విజత్వము చేతను సత్ర్పతి గ్రహముచేత దానముల చేయుటచేతను విహితకర్మా చరణములచేతను కాపాడుకొన వలయును. ఇది చాల గుహ్యమైన విషయము. శూద్రుడు ద్విజుడు కాగల విధానము ద్విజుడు ధర్మచ్యుతి నొంది శూద్రుడగు రీతియు నీకు తెల్పితిని. (223)