బ్రహ్మ మహా పురాణము
వర్ణాశ్రమ ధర్మములు
మునులడుగగా వర్ణ ధర్మములను, నాల్గు ఆశ్రమ ధర్మములు వ్యాస భగవానుడు ఇట్లు అనతి ఇచ్చెను-
బ్రాహ్మణునికి దానము దయ తపస్సు దేవ పితృ దేవతాయజ్ఞములు స్వాధ్యాయము ప్రధాన ధర్మములు. నిత్యోదకి (స్నానాదులతో చలికి వెఱువక) త్రిషవణస్నాన నిరతుడు కావలెను. అగ్నులను ఉపాసింపవలెను. జీవనముకొఱకై ఇతరులచేత యజ్ఞములు చేయింపవచ్చును. శిష్యులకు వేదములు చెప్పవలెను. యజ్ఞనిమిత్తముగా తెలిసి (పాత్రాపాత్ర వివేకముతో) ప్రతిగ్రహము చేయవచ్చును. బ్రాహ్మణునికి చెప్పబడిన షట్కర్మలలో ప్రతి గ్రహము (దానము పట్టుట) కూడ విహితమయి యున్నది. సర్వ లోకమునకు హితమే చేయవలెను గాని అహితముచేయరాదు. సర్వభూతములతో మైత్రి బ్రాహ్మణునికి ఉత్తమధనము. ఋతు సమయమందే భార్యాభిగమనము ప్రశంసా పాత్రము.
క్షత్రియుడు మనఃపూర్తిగ ద్విజులకు దానములు యజ్ఞములు, వేదాధ్యయనము చేయనగును. జగద్రక్షణకై అస్త్రము పట్టి జీవించుట క్షత్రియుని ధర్మము. భూపాలనము కూడ ప్రధాన ధర్మము. దాననే రాజులు కృతార్థులు. యజ్ఞాది రక్షణము రాజు ధర్మము. దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట వర్ణధర్మ వ్యవస్థ చేయుటవలన రాజు అభీష్ట పుణ్యలోక గామియగును.
పశు పాలనము వాణిజ్యము కృషి (వ్యవసాయము) వైశ్యుని వృత్తిగా (జీవికగా) బ్రహ్మ యొసంగెను. అతనికి గూడ అధ్యయనము యజ్ఞము దానము ధర్మము అనునవి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానములు. బ్రాహ్మణ పురస్సరముగా కర్మాచరణము విహితము. అందులకే బ్రాహ్మణులను పోషించుట అందుకొరకే క్రయవిక్రయ వ్యాపారము, వడ్రంగము వైశ్యునికి విహితములు. శూద్రుడు దానములు ఈయవలెను. పాక యజ్ఞములు చేయవలెను. పాకయజ్ఞముచేతనే పితరులను అర్చించుట మొదలగు సర్వకర్మాచరణము విహితము. నౌకరులను భరించుటకు సర్వ పరిగ్రహములు చేయవచ్చును. ఋతుకాలాభిగమన మందఱికిని సామాన్య ధర్మము, అంతేకాదు సర్వభూతదయ ఓరిమి దురభిమానము లేమి, సత్యము, శౌచము, అనాయాసము, మంగళ కార్యాచరణము, ప్రియముగా మాట్లాడుట, సర్వులతోమైత్రి, దురాశ లేకుండుట ఇవి అన్ని వర్ణములకు అన్ని ఆశ్రమముల వారికిని సాధారణ లక్షణములు. ఇవిగాక బ్రాహ్మణాదులకు ఈ క్రింది ఉపధర్మములు (ఆపద్ధర్మములు అన్న మాట) కూడ చెప్పబడినవి. ఆపద్ధర్మముగా (జీవనము గడుపునపుడు) బ్రాహ్మణుడు క్షాత్ర ధర్మమును క్షత్రియుడు వైశ్య ధర్మమును వైశ్యుడు శూద్ర విహిత కర్మమును జేయవచ్చును. వైశ్య శూద్రులు సమర్థులైయుండి ఈ స్వధర్మములను విడువరాదు. ఆపద్ధర్మములో కూడ వారికిది త్యాజ్యము గాదు. కర్మ సాంకర్యము మాత్రము ఎన్నడును చేయగూడదు. ఇవి వర్ణ ధర్మములు చెప్పితిని. ఇక ఆశ్రమ ధర్మములను తెల్పెద తెలుసుకొనుము.
బాలుడుపవీతుడై, వేదాధ్యయనతత్పరుడై, గురు గృహమందు వసించుచు, బ్రహ్మచారియై ఉండవలెను. సదాచారమందు అభిలాషగొని గురు శశ్రూష చేయవలెను. (శశ్రూష= వినవలెనను కోరిక అనగా గురువు చెప్పినట్లు వినుట అనగా ఆ ప్రకారము నడచుట) వ్రతములను జేయవలెను. (అనగా బ్రహ్మచర్య నియమములను బాటింపవలెను) మనసు నిల్పి (అవధానము గొని)వేదము నేర్చుకోవలెను. మది కుదురుపరచుకొని ఉభయ సంధ్యలందు, అగ్నికార్య మొనరించి గురునకు అభివాదనముచేయవలెను. గురువు నిలువ బడిన, తాను నిలువబడి, నడచిన, వెంటనడచి, ఆయనకు క్రిందుగ కూర్చుండవలెను. గురునకు ప్రతికూలమైన పని వదలిపెట్టవలెను. ఆయనతో వేదము పఠింపవలెను. అతనికి ఎదురుగా గూర్చుండి వేరుతలపు గొనకుండవలెను. ఆపై భిక్షాన్నము తెచ్చికొని గురునకు నివేదించి తదనుమతిని పొంది తాను దానిని తినవలెను. గురువు దిగి స్నానముచేసిన తరువాత ఆ తీర్థమందు తాను దిగి స్నానము చేయవలెను. సమిధలు తీర్థమును ఆయనకై ప్రతికల్పము (అవసరమైనపుడెల్ల) తేవలయును. వేదములు చదివిన తరువాత గురుదక్షిణ సమర్పించి ప్రాజ్ఞుడై గార్హస్థ్యమందు బ్రవేశింపవలెను.
శక్తి కొలది గృహస్థుచేయతగిన కార్యములను అన్నింటినిచే పితృ దేతలను నిర్వాపముచే (తర్పణములచే), దేవతలను అతిథులను యజ్ఞములచే, మునుల అన్నదానము స్వాధ్యాయములచే సంతతిచేత, బ్రజాపతిని బలికర్మచే భూతములను సత్యవచనముచే నెల్లజగమ్మును అర్చించి పురుషుడు తాజేసిన ఈ పుణ్యకర్మ ప్రభావమున పుణ్యలోకములను పొందును. భిక్షాన్న భోజనులగు సన్యాసులు బ్రహ్మచారులు మఱియుం గల వారు ఈ గృహమునెడ (గృహస్థునెడ) నీలుతురు. కావున గార్హస్థ్యము. పరమాశ్రమ ధర్మము. వేదముల నేర్చుకొను పనితో తీర్థస్థానముకొరకు పృథివీ దర్శనము కొఱకు ద్విజులు వసుధపై సంచార మొనరింతురు. ఇల్లులేక ఆహారము లేక సాయంకాలమందు ఎవరు ఇండ్లకువత్తురో వారికి గృహస్థులు నిలువనీడ అని చెప్పబడినారు. అతడు వారికి మధురాతి మధుర భాషణముల స్వాగతము పలుకవలెను. (అయ్యా! దయచేయుడు అనవలయును) ఆ మీద దానములు చేయగోరు (అన్ని దానాదులు) ఇంటికి ఏగుదెంచిన వారికి పరుండ కూరుచుండ తినుటకు శయన ఆసన భోజనాదులను కూర్చవలయును. భగ్నాశుడై అతిథి ఎవ్వని ఇల్లు వదలి పోవునో, ఆ అతిథి తన పాపము ఆ ఇంటి యజమానికి ఇచ్చి వాని పుణ్యమునుగొని పోవును. ఈసడింపు, అహంకారము, డాంబికము, నింద, ఉపఘాత పారుష్యము గృహికి (అనగా ఇంటి యజమానికి) తగదు. గృహస్థీ (గృహస్థుడు) ఉత్తమ ధర్మము పాటించి సర్వబంధ ముక్తుడై ఉత్తమ లోకములను పొందగలడు.
వయస్సు పండినతఱి గృహాశ్రమి కృతకృత్యుడై భార్యను పుత్రులకు అప్పగించి వనమేగ వలెను. ఆమెతోనైన ఏగవచ్చును. రాలిన ఆకులు దుంపలు రాలిన పండును తినుచు జుట్టు గడ్డము జటలు పెంచికొని నేలం బరుండుచు అచ్చట మునియై సర్వులకు అతిథియై ఉండవలయును. చర్మములు రెల్లు దర్భలతో అల్లిన వానిని కట్టుకొనవలెను. పైని వేసికొనవలెను. తప్పక త్రిషవణ స్నానము చేయవలెను. దేవతార్చనము, హోమము, సర్వ అభ్యాగతపూజ, భిక్ష, బలిప్రదానము ఈ వానప్రస్థునకు ప్రశస్తమని చెప్పబడినది. అడవి నూనెలతో నభ్యంగ స్నానము కూడా వీనికి బ్రశస్తము. శీతోష్ణాది ద్వంద్వ సహనము తపస్సునకు నీ నియమములనుబూని వానప్రస్థుడు చరింపవలెను. అట్టి పుణ్యుడు అగ్ని వలె ఎల్ల దోషములను దహించి శాశ్వత పుణ్యలోకములు అందగలడు.
చతుర్థాశ్రమము భిక్షువునకు సంబంధించినది. సన్న్యాసమను పేరుగల ఆ ఆశ్రమ ధర్మమును తెల్పెదను ఎరింగికొనుడు. కళత్ర పుత్ర ధనాదులందు స్నేహములంబాయ వలెను. మాత్సర్యము ఏమాత్రము ఉండరాదు. త్రైవర్ణిక ధర్మములను, కర్మల నన్నింటిని విడువవలెను. మిత్రాదులకు మైత్రుడు, సముడునై ఎల్ల భూతములందు అట్లుండవలెను. జరాయుజములు (మావి వలన బుట్టినవి) అండజములు (పక్షులు) స్వేదజములు (చెమట వలన బుట్టు క్రిములు) ఉద్భిజ్జములు (విత్తు నుండి పుట్టు వృక్షాదులు) అగు వీనియందు ఎందును త్రికరణములచే ఎట్టి ద్రోహము చేయరాదు. సర్వ సంగములు వీడవలెను. ఒక ఊరిలో ఒకరాత్రి, పురమందు ఐదు రాత్రులు మాత్రమే ఉండవలెను. పశు పక్ష్యాదులందు ప్రీతి ద్వేషమును వీనికుండదు. ప్రాణయాత్రా నిమిత్తముగనే నిప్పులు అర్పుకొని జనములు భుజించిన తర్వాత ప్రశస్త వర్ణముల వారికడ భిక్షాటనము చేయవలెను. భిక్ష దొరకనిచో విషాదపడరాదు. దొరకిన హర్షపడరాదు. ప్రాణ యాత్రా మాత్ర మాత్రా కాలసంగముగొని వెడలిపోవలెను. మితిమీరిన పూజ లాభములను ఎల్లెడను సహించు కొనవలెను. కామము క్రోధము దర్పము లోభము మోహము మొదలగు దోషములను వీడి నాది నేనను భావము లేక (నిర్మముడు నిరహంకారుడై) ఉండవలెను. వానికి దేహమును వదలునపుడును భయము కలుగదు. తన మేనిలోని అగ్నిని తన ముఖమున అగ్ని హోత్రమాచరించి అనగా తనలోనున్న జఠరాగ్ని అందు వైశ్వానరాగ్ని అందు హవిస్సుగా పంచాహుతుల రూపమున ఆహారమున హోమ ద్రవ్యముగా వేల్చి అదిగూడ భిక్షా రూపమున తెచ్చికొన్న దానినే హోమము చేసి చితాగ్నులైన వారి యొక్క లోకములకు అతడేగును. (అగ్ని చయనము చేసిన వారేగు లోకములకు అని అర్థము) ఇక మోక్షాశ్రమ సన్యాసియో (విద్వత్సన్న్యాసి అన్న మాట) యథోక్త విధానమున ఆశ్రమ ధర్మము నిర్వహించి సంకల్పిత బుద్ధితో అనింధనమయిన జ్యోతివలె (కట్టెలులేని నిప్పువలె) ప్రశాంతమయిన ఆబ్రహ్మ లోకమును పొందును. ద్విజులకు మాత్రమే ఈ ఆశ్రమము చెప్పబడినది.” (222) అని చెప్పెను.