బ్రహ్మ మహా పురాణము

సాంఖ్య యోగము

మునులు ఇట్లనిరి “ఓ వ్యాసమహామునీ! నీ ముఖమను క్షీరసముద్రము నుండి ఉద్భవిల్లిన వాగ్రూపమగు అమృతమును ఎంత త్రావినను మాకు తృప్తి కలుగుటలేదు. అందుచేత సంసార విముక్తిని కలిగించు యోగమును ఓ పురుషోత్తమా! సాంఖ్యమును గూడ మాకు విస్తరించి చెప్పుము. మాకు వినుటకు కుతూహలము కలుగుచున్నది. ప్రజ్ఞావంతుడును శ్రోత్రియుడు-తన శాఖకు చెందిన వేదమును సంపూర్ణముగా అధ్యయ నము చేసిన ద్విజుడు-యజ్ఞములు ఆచరించిన ప్రసిద్ధుడు-విశేషముగ అన్ని విషయ ములను ఎఱిగినవాడు, అసూయలేనివాడు, సత్య ధర్మములయందు స్థిరబుద్ధికలవాడు అగు ముముక్షువు, తపస్సు బ్రహ్మచర్యము సర్వ కర్మఫల త్యాగము చేసియు మేధావం తుడయ్యు ఏ సాధన మున్నచో ముక్తినందును? సాంఖ్యము చేతనా? యోగముచేతనా? మాకు తెలుపుము. పురుషుడు ఏ ఉపాయముచే ఇంద్రియములకును మనస్సునకును తత్త్వము నందు ఏకాగ్రత సంపాదించ కలుగును? వివరింప వలయును అని ప్రార్థించిరి. (పురుషుడనగా జీవుడు-మగవాడని కాదు.)

వ్యాసుడు ఇట్లు అనెను: జ్ఞాన తపస్సులు ఇంద్రియ నిగ్రహము సర్వసంగ పరిత్యాగము లేనిదే ఎవరును సిద్ధి పొందలేరు. స్వయంభూబ్రహ్మ యొక్క మొదటి సృష్టియగు ఐదు మహాభూతములును జీవుల దేహ సముదాయమునందు ఇమిడియున్నవి. భూమినుండి దేహము (దేహములోని గట్టి అంశ) జలమునుండి ద్రవాంశము, అగ్ని నుండి కన్నులు, వాయువు నుండి ప్రాణా పానాది వాయువులైదు, ఆకాశమునుండి ఉదరము ఏర్పడినవి. జీవుల నడకలో విష్ణువు బలమునందు ఇంద్రుడు ఉందురు. ఉదరమున అగ్నియుండి ఆకలిని ఏర్పరచును. చెవులలో దిక్కులు జిహ్వయందు సరస్వతి ఉండును. చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియములు మరి ఐదు కర్మేంద్రియములు కలిసి ఈ పదియు తమకు ఆహారమునకై శబ్ద స్పర్శ రూప రస గంధములను అయా కర్మేంద్రియ వ్యాపారములను కోరుచుండును. జీవాత్ముడు మనస్సును, మనస్సు ఇంద్రియములను, ప్రేరణ చేయుటచే ఆయా పది ఇంద్రియ వ్యాపారములును జరుగుచున్నవి. మనీషి (విద్వాంసుడు) మనస్సు తోనే తనలోనున్న ఆత్మను చూచును. ప్రకాశమునొందిన మనస్సుతో తప్ప ఆత్మను ఇంద్రియములతో దర్శింప, అనుభవింప శక్యముకాదు. ఈ దృశ్య ప్రపంచమంతయు ఆ మహాతత్త్వముతో వ్యాప్తమై యున్నది. స్థిర చర జడ చేతన పదార్థములన్నిటి యందును అతడొక్కడే నిలిచియున్నాడు.

జీవుడు తనలో సర్వ భూతములను సర్వభూతములలో తనకంటే అభిన్నుడగు పరమాత్మను చూడగలిగినచో బ్రహ్మమే తానగును. దృశ్య ప్రపంచమునందు ఏ రూపమున ఎంత ఆత్మకలదో, పరమాత్ముని యందును అదే అంతే తత్త్వము కలదని ఎటిగినవాడు అమృతత్వమును, మోక్షమును పొందును. తాను బ్రహ్మమే అగును. సర్వభూతములును తానై సర్వ భూతములకు హితుడగు ఆ మహానుభావుడు పాదములు లేకయే సంచరించువాడు. కాన ఆతడు నడచుమార్గము ఏదియో దేవతలుకూడ ఎఱుగజాలరు. ఆకాశమున పక్షుల మార్గమువలె నీటిలో చేపలమార్గమువలె, జ్ఞానుల మార్గము ఎవరికిని కనబడదు. అన్ని భూతములను కాలము పరిపాకము నొందించి తనకు లోబరుచుకొనును. కాని కాలమును కూడ పరిపాకము నొందించుచు తన అధీనములో నుంచుకొను పరతత్త్వమును ఎవరోతప్ప ఎఱుగజాలరు. ఆ పరతత్త్వమునకు మీద క్రింద, అడ్డముగా, ప్రక్కగా మరల మరల మధ్యలో ఇదియున్నది అనిచెప్ప శక్యముకాదు. ఏలయన అంతయు తానేయగు ఏకైక, అఖండ పదార్థమది. ఈ లోకములన్నియు దానియందు ఉన్నవి. అవి అదియే కనుక వానికి వెలుపల ఏదియు లేదు. వింటి త్రాటి నుండి వెడలిన బాణమువలె సూటిగా మనో వేగముతో ఎంతదూరము ఎంతసేపు పరుగుతోపోయినను ఆ మహాతత్త్వము యొక్క కడపటి మేర దొరుకదు. దానికంటే చిన్నదికాని పెద్దదికాని ఏదియులేదు. అతత్త్వమునకు కాలు సేతులు కన్నులు తలలు నోళ్ళు చెవులు అన్ని వైపులకును కలవు. అది అంతట అన్నిటిని ఆవరించి యున్నది. అది చాల చిన్నవానికంటె చాలచిన్నది, చాల పెద్దవానికంటె చాల పెద్దది. అన్ని భూతముల లోపల ఎప్పుడు ఉండియు అది కనబడకుండును. ఈ తత్త్వము క్షరము అక్షరము అని రెండు విధములు. సర్వ భూతముల యందును సర్వ భూతముల రూపముతోను ఉన్నది క్షరము నశించునది. దివ్యము అమృతమునగు తత్త్వము అక్షరము-నశింపనిది. హంస అని వ్యవహరింపబడు ఈ పరతత్త్వము స్థావరములు, చరములు (కదలని కదలగల) సర్వభూతముల యందును దేహము అనెడి నవద్వారములుకల పురమును (రెండు ముక్కులు, రెండు చెవులు, రెండు కన్నులు, నోరు, గుదము, మర్మాంగము మొత్తము తొమ్మిది) నిర్మించుకొని నియమములతో ఇంద్రియములను తన అధీనములో ఉంచుకొనియుండును. ఆయనకు మనకువలె సంకల్ప, వికల్పములు ఉండవు కనుకను అన్ని ప్రాణుల శరీరములను తన అధీనమున ఉంచుకొనుటచేతను అతనిని హంస అందురని తత్త్వవేత్తలు చెప్పుదురు. ఇది ప్రపంచ రూపమున ఉండుటచే క్షర రూపమైనది. ఈ రూప వికల్పములు లేని అవికారియైన కూటస్థ రూపము అక్షరము. దానిని ఎఱిగిన వాడు అది తానేయగును. ఇదియే తత్త్వసారము.

వ్యాసుడు ఇట్లు అనెను:

ఓ విప్రులారా! మీరడిగిన తత్త్వ వివేచన రూపమగు సాంఖ్యతత్త్వమును ఉన్నది ఉన్నట్లు తెలిపితిని. ఇక మీదట యోగప్రకారమును తెలిపెదను. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు ఏకత్వమొందునట్లు చేయుచు సర్వవ్యాపియగు ఆత్మను ఎఱుగు ఉత్తమ జ్ఞానము - మనస్సును బాహ్యేంద్రియములను నిగ్రహించుకొని ఆధ్మాత్మతత్త్వము నెఱుగుట అభ్యసించుచు కామము క్రోధము లోభము భయము స్వప్నము అనెడి ఐదు యోగదోషములను విడిచి, తనలో తానే అనందమును తృప్తిని పొందుచు పవిత్రములగు కర్మలు మాత్రము అనుష్ఠించుచు, ఆత్మ తత్త్వము ఎఱుగవలెను. మనోనిగ్రహముచే క్రోధమును సంకల్పములు విడిచి కామమును సత్త్వగుణము పెంచుకొనుటచే స్వప్నము, నిద్ర, మనస్సు, నిబ్బరముచే తిండిపై కామ సుఖముపై వాంఛను కంటితో కాలుసేతులతో చేయు పనులను మనస్సుతో కన్నులను చెవులను పవిత్ర కర్మతో మనస్సును వాక్కును ఏమఱుపాటు లేకుండుటచే భయమును వివేకవంతులను సేవించుటచే కపట ప్రవృత్తిని ఇట్లీ యోగదోషములను ప్రయత్నముతో జయింపవచ్చును. ఎప్పుడును అగ్నులకు బ్రాహ్మణులకు దేవతలకు నమస్కరించుచుండవలెను. మనస్సునకు తోచినట్లు ఇతరులను నొప్పించు పొగరుమాటలు పలుకరాదు. సర్వ చరాచర భూతాత్మకుడగు పరమాత్ముడు స్వయంజ్యోతియై ప్రకాశించు తేజోరూపుడు. ఈ పరమాత్మ రూపమగు తేజస్సు వృద్ధి నొందుటకు పాపము నశించుటకు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము, ఋజు (వంకరగాని) స్వభావము క్షమశౌచము మనఃశుద్ది ఇంద్రియ నిగ్రహము అనునవి సాధనములు. సర్వభూతముల యందు సమబుద్ధి కలిగి యత్నము లేకయే లభించిన దానితో జీవించుచు పాపములు విడిచి తేజస్సు వృద్ధిపరచుకొని లఘు ఆహారము తినుచు ఇంద్రియములను కామక్రోధములను జయించి ఇంద్రియములను మనస్సును ఏకాగ్రములుగాచేసి, రాత్రి మొదటి కడపటి జాములందు పరతత్త్వమున మనస్సు నిలిపి తత్త్వసాధనము చేయవలెను. ఏ ఒక్క ఇంద్రియమైనను కోరికలతో తడిసినచో పర్వతము ప్రక్కనుండు మిట్టనుండి నీరువలె జీవుని ప్రజ్ఞ పరతత్త్వము నుండి క్రిందికి జారును. కనుక చేపలపట్టువాడు గాలముతో వలె మనస్సుతో శ్రోత్రము చక్షుస్సు జిహ్వ, ఘ్రాణము అనుక్రమమున జ్ఞానేంద్రియములను నిగ్రహించి మనస్సున నిలిపి పిమ్మట మనస్సులోని సంకల్పములను కూడ అణచి దానిని హృదయమున నిలుపవలెను. దానిని ఆత్మతత్త్వముపై నిలుపవలెను. అప్పుడు పొగలేని నిప్పువలె మేఘావరణములేని సూర్యునివలె ఆకాశమందలి మెఱుపువలె పరమాత్మ తత్త్వము ప్రకాశించును. అది తనయందు తానై అంతయు తనయందు అంతయందు తానై వ్యాపించి యున్నది. బ్రాహ్మణులు-మనీషులు (బ్రహ్మతత్త్వమునందు శ్రద్ధగలవారు, మనస్సును దానిపై నిలిపినవారు అగు మహాత్ములు, మహత్ గొప్ప, ఆత్మా=మనస్సు కలవారు, నిబ్బరము కలవారు మహావివేకవంతులు సర్వభూతములకును హితము కోరువారును మాత్రమే ఆ తత్త్వమును దర్శింపగలరు. ఈ చెప్పినవిధమున ఏకాంతమునందు పరిమితమగు నియత కాలమున కూర్చుండుచు నిశితమైన పవిత్ర కర్మలు మాత్రమే ఆచరించుచు తత్త్వమును అభ్యసించినచో అక్షరతత్త్వముతో ఏకమగును. (అభ్యసించుట అనగా ఆ పనిలో సిద్ధి కలుగునంత వరకు మరల మరల చేయుచుండుట) ఇతరులు పొగడినను, తిట్టినను, నమస్కరించినను, లేకున్నను దానిని మంచిగాగాని చెడుగాగాని తలచక లాభమున సంతోషించక, లభించనపుడు దుఃఖించక, అన్నివిషయములందు సమదృష్టియై అన్ని భూతములయందు వాయువువలె సమాన భారము కలవాడై ఎడతెగక ఆరు మాసములకు తక్కువ లేకుండ సాధనము చేసినచో శబ్ద బ్రహ్మానుభవము కలుగును. ఇది మట్టిగడ్డ, ఇది బంగారము, ఇది గొప్పది, ఇది కాదు అని తలచుచు లోకులు పొందు దుఃఖముల చూచి తాను ఆ భేదబుద్ధి వదలవలెను. ఎన్నడును అజ్ఞానముచే ఈ అభ్యాస యోగమును విడువరాదు. అట్లైనచో ఎంత తక్కువ కులమున పుట్టినను స్త్రీకాని, పురుషుడుకాని ముక్తిని పొందుదురు.

ఓ బ్రాహ్మణులారా! మనీషులైనవారు ఇట్టి మార్గము అనుసరించినచో అజుడు, పురాణుడు, సనాతనుడు, ఇంద్రియాతీతుడు అగు ఆ వాసుదేవుని దర్శించి ఆ బ్రహ్మతత్త్వముతో ఒక్కటిగా అగుదురు. (236) అని వ్యాసుడు మునులకు తెల్పెను.