బ్రహ్మ మహా పురాణము

భూమికృత కృష్ణస్తుతి

‘స్వామి! వరాహమూర్తివై నన్నుద్ధరించినపుడు ఆ నీ స్పర్శవలన ఈ పుత్రుడు పుట్టినాడు. నీ ఇచ్చినవాడు వీడు. నీ చేతిలో కూలినాడు. ఈ కుండలములను గైకొనుము. ఈ నరకుని సంతానమును రక్షింపుము. నా భారమును దింపుటకు నీవీ లోకమున అంశావతారము ఎత్తినావు. అనుగ్రహసుముఖుడవు కమ్ము. నీవు కర్తవు, వికర్తవు. (వేరు చేయువాడు) సంహర్తవు. సృష్టిహేతువవు. జగత్ స్వరూపుడవు. నిన్ను నేనెక్కడ స్తుతింపగలను, వ్యాపించువాడవు. వ్యాపింపబడువాడవు. చేయువాడవు. చేయదగు పని చేయుటయు నీవె. సర్వ భూతములకు ఆత్మ స్వరూపుడవు. నేనెక్కడ స్తుతింతును. ఆత్మ (జీవుడు), భూతాత్మ (భూత స్వరూపము) పరమాత్మవు నీవె. నరకుడుచేసిన దానిని తప్పిదము కాకుండ క్షమింపుము. ప్రసన్నుడవు కమ్ము. వీడు నా కుమారుడు. నీచేత బడినాడు” అని భూదేవి హరిని స్తుతించెను.

కృష్ణుడు ధరణితో ‘అట్లే’ అని నరకుని ఇంట ఉన్న రత్నములను తీసికొనెను. (రత్నములనగ మణులేకాదు ఆయా వస్తువులలోకెల్ల ఉత్తమమయిన సమస్త వస్తువులు) అంతఃపురమున పదహారువేలు పైన నూర్గురుగల కన్యకలను గూడ గైకొనెను. నాలుగు దంతములు గల ఆరువేల ఏనుగులను అచ్చట చూచెను. కాంభోజ దేశీయులైన గుఱ్ఱములు ఇరువది యొక్క నియతముల సంఖ్యగలవి వాని ఇంట ఉన్నవి. నరకుని కింకరులచే అప్పటికప్పుడు గోవిందుడు ద్వారకాపురికి తరలింపజేసెను. వారుణచ్ఛత్రము అచ్చట కనిపించెను. అట్లే మణి పర్వతమును. హరి దానిని ఖగరాజు గరుడునిపైకి ఎక్కించెను. సత్యభామతో తాను అధిష్ఠించి అదితికి కుండలములు ఇచ్చుటకు స్వర్గమునకు పోయెను. (102)