బ్రహ్మ మహా పురాణము

దశరథ రామావతారము

ఇరువది నాల్గవ త్రేతాయుగమందు విశ్వామిత్రుని పురస్కరించుకొని దశరథునకు కమలాక్షుడు అవతరించెను. ఆయన తనను నాల్గు విధములుగ ఒనరించుకొని సాక్షాత్ సూర్యునివలె వెలుగుచు రాముడను ప్రసిద్ధి నొందెను. లోకానుగ్రహమునకు రాక్షస నిగ్రహమునకు ధర్మసమగ్రవృద్ధి కొరకు మహాకీర్తిశాలి దయచేసినారు. సర్వభూతహితుడు నరేంద్రుడని ఆయనను అందురు. అతడు సర్వధర్మజ్ఞుడు. లక్ష్మణుడు అనుసరింప, పదునాలుగేండ్లు అరణ్యమున వసించి, తపస్సు చేసెను. ఆయన గృహిణి సీత. జగత్ప్రసిద్దురాలు. మున్నేను చెప్పిన మహాలక్ష్మియే సీతగా భర్తను అనుగమించినది. జనస్థానమున వసించుచు ఆయన వేల్పుల కార్యమును చక్కపెట్టినాడు. ఆయనకు అపకారియైన పరమ క్రూరుని రావణుని సీతజాడ నెరుగబోయి సంహరించినాడు. ఆ రావణుడు దేవాసుర యక్ష రాక్షస నాగాది గణములకు అవధ్యుడు. కారుమేఘమట్లున్న వానిని రాక్షస కోట్లు వెంబడించినవి. ముల్లోకములు ఆరావమెత్త జేసినందున (ఏడ్పించినందున) రావణుడను పేరుగన్న ఆ రాక్షసరాజును, దుర్జయుని, దుర్మదుని, దృక్తుని శార్దూల విక్రముని, దుర్నిరీక్ష్యుని, వరదాన గర్వితుని, మంత్రులతో సేనలతో గూడ సమూలముగ రామచంద్ర ప్రభువు సంహరించెను. అ చేసిన రావణ సంహారము సర్వ జగత్సంహారము చేసిన భూతపతి (శివుని యొక్క) చేతవలె దీపించెను. సుగ్రీవుని కొరకు మహాబలుడైన వానరేంద్రుడు వాలి హతుడయ్యెను. సుగ్రీవుడు అభిషిక్తుడయ్యెను.

మధువను రాక్షసుని కుమారుడు లవణుడు. వాడు మధువనమందు సంహరింపబడెను. మునుల యజ్ఞములను చెరచిన మారీచసుబాహులు శ్రీరామునిచే నిహతులైరి. మరియెందరో రాక్షసులు సంహరింపబడిరి. శాపవశులైన గంధర్వులు విరాధ కబంధులు ఆయనచే కూలిరి. ఆయన బాణములు అగ్ని రవి తేజస్స్వరూపములు. బంగారపు విచిత్రమైన పుంఖములు కలవి. ఆ మహానుభావునకు విశ్వామిత్రుడు అమోఘములైన శస్త్రాస్త్రములను ప్రసాదించెను.

మహానుభావుడైన జనక చక్రవర్తియొక్క యజ్ఞమందు రాముడు శివచాపమును విలాసముగ ఎత్తి విరచెను. ఈ పనులు చేసి ధర్మమూర్తి రామమూర్తి అవిఘ్నముగ పది అశ్వమేధ యాగములు చేసెను.

రాముడు రాజ్యము ప్రశాసించుచుండ, దొంగతనములు లేవు. వైధవ్య దుఃఖము లేదు. సర్వము శుభమయ్యెను. వాయుజలాగ్న్యాది భూత ప్రకోపమువలని భయములేదు. పెద్దవాండ్రు బాలురకు, ప్రేతకార్యములు చేయుటలేదు. క్షత్రియ జాతి బ్రహ్మచర్య పరమై ఉండెను. అనగా బ్రాహ్మణలకు అధీనులై ప్రవర్తించిరి. వైశ్యులు క్షత్రపరులైరి. శూద్రులు మూడు వర్ణములవారు చెప్పినట్లు వినిరి. అహంభావము లేనివారైరి. స్త్రీలు భర్తలను భర్త భార్యను అతిక్రమించి నడువలేదు. సర్వజగత్తు ప్రశాంతమయ్యెను. భూమి చోరరహిత మయ్యెను. రాముడొక్కడే భరించువాడు(భర్త)రాముడొక్కడే పాలించువాడు. పుత్ర సహస్రములతో అనేక వర్ష సహస్రములు ప్రజలు జీవించిరి. ప్రాణులును ఎట్టి రోగములు లేనివారుగా ఉండిరి. దేవతలకు ఋషులకు మనుష్యులకు అన్యోన్య సామరస్యము పృథివి యందు నెలకొల్పెను. ఇచ్చట పురాణజ్ఞులు రాముని యెడల చంచలమైన తత్వ జ్ఞానము గలవారు. ఆ బుద్ధిమంతుని మాహాత్మ్యమును గురించి ఈ క్రింది విధమైన గాథను గానము చేయుదురు.

రాముడు చామనచాయ మేనివాడు, రక్తాంతలోచనుడు, కళకళలాడు నెమ్మోము వాడు. ఆజానుబాహువు, ప్రసన్న ముఖుడు. సింహము నూపురము వంటి నూపురము గలవాడు. మహావీరుడు. ఆ రాముడు పదివేలేండ్లు రాజ్యముచేసెను. ఆయన రాజ్యమున ఋగ్యజుస్సామ వేదముల యొక్క ఘోషము జ్యాఘోషము (ధనుష్టంకారము) యెడతెగ కుండెను. ఇవ్వండి, తినండి అన్న ధ్వని నిర్విరామముగ వినిపించెను. సత్వ సంపన్నుడు గుణ సంపన్నుడైన రాముడు కేవలము తన తేజస్సుచే దేదీప్యమానుడయ్యెను. రాముచంద్రుడు చంద్రుని సూర్యులను మించి తేజరిల్లెను. పవిత్ర క్రతుశతము సంపూర్ణ శ్రేష్ఠ దక్షిణమైనదాని నతడు యజించెను. అయోధ్యను విడచి మహాబలుడు రాఘవుడు దివమ్మునకేగెను. ఇక్ష్వాకుల నందనుడైన దశరథ నందనుడు సగణముగ రావణుని చంపి స్వర్గమాక్ర మించెను.