బ్రహ్మ మహా పురాణము
పరశురామావతారము
ఇటుపై మహానుభావుడగు పరశురాముని అవతారమయ్యెను. అందు వేయి బాహువులచేత దుర్జయుడైన కార్తవీర్యార్జునుని ఆయన సంహరించును. రథమునందున్న కార్తవీర్యుని పరశురాముడు పుడమిపై పడగొట్టి అప్పటికిని మేఘమువలె గర్జించుచున్న వానిని హడలగొట్టి వేయి బాహువులను గొడ్డలిచే నటికెను. వాని జ్ఞాతులను గూఢ కొట్టెను. కోట్ల కొలది క్షత్రియులతో నిండి మేరు మంథర పర్వత భూషణమైన పృథివి ఇరువది యొక్క మార్లు దండెత్తి నిక్షత్రియమొనర్చెను. ఈ పాపము పోవుట కాయన అశ్వమేధమును కూడ చేసెను. మహాదాన పవిత్రమైన ఆయజ్ఞమందాతడు మరీచి వంశమువాడైన కశ్యపునకు, తాను గెల్చిన భూమిని దక్షిణగా ఇచ్చెను. మరియు ఆ అశ్వమేధమున గుణ్ఱములను రథములను ఏనుగులను లక్షయమైన బంగారమును గోవులను దానము చేసెను. ఇప్పుడును భృగునందనుడగు (భార్గవుడు) పరశురాముడు లోక హితము కొరకు మహాతపస్సు చేయుచు శ్రీమంతుడై, దేవునివలె ఉన్నాడు. ఇది, దేవపతి అవ్యయుడు శాశ్వతుడునైన విష్ణువు యొక్క పరశురాముడను పేరి అవతారము.