సూర్యుడు కన్యారాశి యందున్నపుడు శ్రాద్ధము పెట్టిన ఏయే కోరికలు కోరునో అవి అన్నియు నెరవేరును. వారాహ పురాణము నందు జెప్పబడినట్లు పౌర్ణమాసి యందు పితృ శ్రాద్ధము పెట్టినయెడల దివ్య భౌమ అంతరిక్షములకు స్థావర జంగమములకును సంబంధించిన సర్వ కామములను పొందుదురు. సూర్యుడు కన్యారాశియందున్నపుడు పితృదేవతలు పిండమును కోరుదురు. రవి కన్యారాశి యందున్న పదునాఱు రోజులందు పితరులకు పిండ ప్రదానము చేయుట సర్వ క్రతువులు చేయుటే అని నారాయణుడు పలికెను. రాజసూయాశ్వ మేధముల ఫలమును సూర్యుడు కన్యారాశి గతుడైనప్పుడు నీళ్లు ఆకు కూరలు దుంపలతో పెట్టిన శ్రాద్ధము వలన సుఖముల నందును. ఉత్తర-హస్త నక్షత్రములందు సూర్యుడు ఉన్నపుడు భక్తితో పితృ దేవతార్చనము చేసిన స్వర్గము సిద్ధించును. రవి హస్త యందు ప్రవేశించిన వృశ్చిక రాశి ప్రవేశము చేయుదాక పితృపురి శూన్యమై ఉండును. వృశ్చికమును గూడ రవి దాటిపోయిన తఱి పితృ దేవతలు దేవతలతోగూడ నిట్టూర్పుపుచ్చి తన కులమువారికి శాపమిచ్చి తిరిగి పోవుదురు. అష్టక లందు మన్వంతరములందు గ్రహణమందు వ్యతీపాతమందు రవి చంద్రసమాగమ మందు (అమావాస్యనాడు) జన్మనక్షత్రమందు గ్రహబాధలు గల్గినపుడు పెట్టు శ్రాద్ధము పార్వణ శ్రాద్ధ మనబడును. రెండు అయనములందు రెండు విషువత్తులందు సంక్రాంతులందును యథావిధిగ శ్రాద్ధమున పెట్టవలెను. వీనిలో పిండ ప్రదాన నిర్వాపణములు అవసరము గావు. వైశాఖ శుక్ల తదియయందు కార్తిక నవమియందును సంక్రాంతి శ్రాద్ధ విధానమున పితరులను అర్చింపవలెను. భాద్రపద శుక్ల త్రయోదశి యందు మఘ యందు చంద్ర క్షయ పర్వమందు పాయసముతో శ్రాద్ధము పెట్టవలెను. అది దక్షిణాయన శ్రాద్ధ తుల్యము. వేదవేత్త శ్రోత్రియుడు నిత్యాగ్ని హోత్రియునైన బ్రాహ్మణుడు ఇంటికి అరుదెంచెనేని ఆ ఒక్కనితోనే యథావిధిగ శ్రాద్ధము పెట్టవచ్చును. శాస్త్రీయమైన శ్రాద్ధీయ ద్రవ్య సంపద సమకూరినప్పుడు పార్వణ విధానమున పితృ శ్రాద్ధమును చేయవలెను.
తల్లి దండ్రులకు, సంతానములేని పినతండ్రులకు, పెద్ద అన్నకు ప్రతి సంవత్సరము విశ్వేదేవతలతోకూడ పితృదేవతలకు తద్దినము పెట్టవలెను. విశ్వేదేవులు లేకుండ ఏకోద్దిష్ట శ్రాద్ధము నందు దేవ పితృ స్థానములందు ఇద్దరు బ్రాహ్మణులను అర్చింపవలెను. ఇట్లే మాతామహాదులకును జరుపవలెను. ప్రేతీ భూతుడైన జీవునకు భూమిపై పిండమును జలమును తిలలతో కుశలతో జల సమీపమందు పెట్టవలెను. బ్రాహ్మణులు పదునొకండవ దినమునను, క్షత్రియులు పదుమూడవ దినమునను, వైశ్యులు పదునారవ దినమునను, శూద్రుడు ముప్పది ఒకటవ దినమునను శుద్ధులగుదురు. అనగా అశౌచమును విడుతురు. సూతకము తుదను గృహమందు పండ్రెండవ దినమందును మాస మందును త్రిపక్ష మందును ఏకోద్దిష్ట శ్రాద్ధము పెట్టవలెను. సంవత్సరము తుదదాక ప్రతినెల మాసికము పెట్టవలెను. ఆపైన సపిండీకరణము పార్వణ విధానమున జరుపవలెను. అప్పటి నుండి చనిపోయిన జీవుడు ప్రేతత్వమును విడిచి పితృ దేవతాత్వమును పొందును. పితృ దేవతలు అమూర్తులు మూర్తిమంతులు అని రెండు విధములుగా నుందురు. నాందీముఖులు అమూర్తులు. పార్వణులు మూర్తిమంతులు.”
అటు పిమ్మట మునులు సపిండీకరణ విధానమును అనతిమ్మని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పెను.
“సపిండీకరణము నందు విశ్వేదేవతలు ఆహ్వానింపబడరు. అందొకటే అర్ఘ్యమీయవలెను. అగ్నౌకరణము ఉండదు. ఆవాహనముకూడ ఉండదు. బ్రాహ్మణులు బేసి సంఖ్యలో అర్చింపబడుదురు. ఆ సపిండీకరణ విధానమున మరొక విశేషము తెలిపెదను. తిల గంధోదకములచే కూడిన నాల్గు పాత్రములు ఉపయోగింపబడును. వానిలో పితరులకు మూడు ప్రేతకు ఒకటి. ప్రేత పాత్రమందలి అర్ఘ్యముచేత మిగిలిన మూడు పాత్రములను ‘యేసమానాః’ అనుమంత్రము జపించుచు ఉదకము చల్లవలెను. స్త్రీలకు గూడ ఈ ఏకోద్దిష్ట విధానమున జరుపవలెను. సంతానము లేని స్త్రీలకు సపిండీకరణము పెట్ట నవసరము లేదు. స్త్రీలకు, సంతానము లేనివారికి ఏకోద్దిష్ట విధానమున ప్రతి సంవత్సరము విధి విహితము. కొడుకులు లేని స్త్రీలకు జ్ఞాతులు, జ్ఞాతులు కూడ లేనపుడు సోదరులు శ్రాద్ధము పెట్టవలెను. మాతామహులకు దౌహిత్రుడు (కూతురి కొడుకు) ద్వ్యాముష్యాయణులను పేర పిలువబడు మనుష్యులు మాతామహవర్గమును యథావిధిగా పూజింపవలెను. వారికి నిత్యశ్రాద్ధమేకాక నైమిత్తిక శ్రాద్ధములుకూడ దౌహిత్రుడు పెట్టవలెను. సర్వాభావమందు అనగా తద్దినము పెట్టువాడు లేనపుడు స్త్రీలు స్వయముగా మంత్రరహితముగా శ్రాద్ధము పెట్టవలెను. ఏ దిక్కునులేని జీవులకు రాజు ఆయా జాతి పురుషులచే శవవాహనము దగ్గరనుండి సకలకర్మలు జరిపింపవలెను. సర్వ వర్ణములకు రాజు బంధువు.
నిత్య నైమిత్తిక శ్రాద్ధ విధానము చెప్పెద వినుడు. నిత్య శ్రాద్ధము సపిండీకరణానంతరము జరుపవలెను. అందు తండ్రికి పెట్టిన పిండము నుండి లేపము ప్రీతామహుడు పొందును. వానికి పైన నాల్గవవాడును లేప భుజుడగును. అతడును తండ్రి తాత ముత్తాత అను ఈ ముగ్గురు పురుషులు పిండ భుక్కులు. మిగిలిన పై మూడు తరముల వారు పిండ లేప సంబంధులు. ఇట్లు పితృ పితామహ ప్రపితామహులు వారికి వెనుకటి మూడు తరములవారు యజమానుడు కలిసి మొత్తము వీరు ఏడుగురు. వీరి అన్యోన్య సంబంధము సాప్త పౌరుషము. యజమానికి పై వారిలో అనులేప భుక్కులు వాని కంటె ముందు ఆ కుటుంబమున పుట్టినవారును నరకమునకు ఏగినవారు. పశు పక్ష్యాది జన్మలు ఎత్తిన వారు భూతాదులందు వ్యాపించి యున్నవారు. ఇందరకు యజమాని శ్రాద్ధము పెట్టి సంతృప్తి పరచును. అసంతృప్తి పరచుటలో అన్న ప్రకిరణము అన్నపు మెతుకులను చిమ్ముట అనుక్రియ చేయబడును. దానివలన పిశాచాది జన్మలందిన వారు తృప్తి పొందుదురు. స్నానము చేసిన వస్త్రమును విడిచిన నీటిచే వృక్ష జన్మ పొందినవారు తృప్తి పొందుదురు. భూమిమీద పడిన గంధోదక బిందువులచేత ఆ కులములో దేవత్వము పొందినవారికి అప్యాయనము కలుగును. పిండములు ఉద్ధరించిన తరువాత చల్లిన నీటి చినుకులచే పశుపక్ష్యాది జన్మలెత్తిన వారికి తృప్తి కలుగును. దంతములు కూడ రాని బాలురు కర్మ బహిష్కృతులైన వారు పితృ స్థానమందు సమ్మార్జనము చేసిన ఉదకము చేతను బ్రాహ్మణ పాద ప్రక్షాళనముచేసి ఉదకము పొందియు తృప్తి పొందుదురు. ఈ విధముగ యజమాని నిర్వర్తించిన శ్రాద్ధము నందు చిందిన నీరు చిమ్మిన అన్న విక్షేపము. అది శుచియైనను కాకున్నను దానినిపొంది ఆ కులమువారు ప్రస్తుతము అన్య యోనులందు పుట్టినవారు ఆప్యాయనము పొందెదరు. విధానమును అనుసరించి శ్రాద్ధము చేసినవారి పితరులు ఆప్యాయనముతో తృప్తిని పొందుదురు.
అన్యాయార్జిత విత్తములచేత పెట్టిన శ్రాద్ధము చండాల పుల్కసాది జాతులందు పుట్టిన వారికి తృప్తి కూర్చును. కనుక మానవుడు తుదకు ఆకు కూరతోనైన భక్తితో శ్రాద్ధము పెట్టిన యెడల వానికులమందు ఒక్కడును దుఃఖపడడు. ఆచారవంతులను నిత్యాగ్ని హోత్రులను జ్ఞానులను నిత్య శుచులను విశేషించి శ్రోత్రియులను భోక్తలనుగా నిమంత్రించి శ్రాద్ధము పెట్టుట ప్రశస్తమైన విషయము. త్రిణాచికేతుడు, త్రిమధువు, త్రిసుపర్ణుడు (నాచికేతాగ్ని విద్యను, త్రిమధు విద్యను, త్రిసువర్ణ విద్యను ఈ మూటిని అధ్యయనముచేసి వాని అర్థమును ఎరిగి ఆ అగ్నిచయనమును అనుష్ఠించినవారు) వేదాంగములను ఆరింటిని అధ్యయనము చేసినవారు మాతృపితృ భక్తులు మేనల్లుడు సామవేదము నెరిగినవారు యజ్ఞమున ఋత్విక్కుగా ఉండదగినవాడు తన పురోహితుడు తన ఆచార్యుడు ఉపాధ్యాయుడు-యజ్ఞమున జరుగు అన్ని క్రియా కలాపములలోను యజ్ఞమును జరుపుచు, జరిపించుచు అందరలోను మంచి చెడ్డలను పరిశీలించి చెప్పగల మహాపండితుడు-ఇట్టి వారిని భోక్తగా తీసికొనవలెను. మేనమామ తన భార్యకు, తండ్రి తన భార్యకు, సోదరుడు వియ్యంకుడు-ద్రోణపాఠకుడు-నాలుగు వందల గ్రామముల మొత్తములో ముఖ్య వేద పండితుడు, మండల బ్రాహ్మణుడు, ఒక మండలప్రదేశము మొత్తములో ప్రధాన వేద పండితుడు, పురాణములలోని తత్త్వ విషయములను ఎరిగినవాడు కూడని దానము గ్రహించనివాడు అకల్పుడు, దుస్సంకల్పములు లేనివాడు కల్ప సంతుష్టుడు, తన సత్సంకల్పము నెరవేరగనే సంతృప్తి పొందువాడు, ఇట్టి వారిని శ్రాద్ధము నందు భోక్తలుగ పెట్టవలెను. పంక్తి పావనులైన తాము ఏ పంక్తిలో కూర్చుండి భుజించెదరో ఆ పంక్తిలో భుజించిన వారందరును తమ శక్తిచే పవిత్రులను చేయగలవారు, అట్టి బ్రాహ్మణులను గూడ శ్రాద్ధమున భోజనమునకు పిలువవలెను. శ్రాద్ధమునకు ముందటి నాడే వీరిని పిలిచి కొని వచ్చి విశ్వేదేవ పితృస్థానములందు కూర్చుండబెట్టి అర్చింపవలెను. శ్రాద్ధము చేయు యజమానుడు కూడ వారితోపాటు మౌనాది నియమములను పూనవలయును.
శ్రాద్ధ భోజనము చేసినవాడు మైథునము సలిపిన యెడల వాని పితరులు ఆరేతస్సు నందు ఒక నెల పడియుందురు. స్త్రీని పొంది శ్రాద్ధమునందు బ్రాహ్మణుడుగ కూర్చుండి భోజనము చేసిన వాని పితృ దేవతలు రేతో మూత్రము ఆహారముగా గొని నెలరోజులు కుములుదురు. కావున చక్కగ తెలిసి ఉత్తముడైన బ్రాహ్మణులను నిమంత్రణము చేయవలయును. ఇది ప్రథమ కర్తవ్యము. తద్దినమునాడు స్త్రీ మైథునము చేసిన వారిని ఏమాత్రము నిమంత్రింపరాదు. ఉత్తమ బ్రాహ్మణుడు లభింపనపుడు భిక్షకొరకు వచ్చిన వారిని సరిగా అసమయమున ఇంటికి వచ్చిన యతులను యోగులను సాష్టాంగముగ మ్రొక్కి బ్రతిమాలి శ్రాద్ధమందు భోజనము పెట్టవలెను. పితృదేవతలు యోగము మీద ఆధారపడినవారు కావున వారి ప్రీతికి పూజింపవలసినవారు యోగులు వేయి మంది బ్రాహ్మణులకు ఒక్కయోగి సమానుడు. అతడు నీటిలో నౌకవలె యజమానిని భోక్తలను (పితృదేవతలను) తరింపచేయగలడు. ఈ విషయములో బ్రహ్మణాదులు గానముచేసిన పితృగాథల తాత్పర్యము ఇది.