బ్రహ్మ మహా పురాణము

యమలోకమార్త స్వరూప వర్ణనమ్

మునులు ఇట్లు అడిగిరి-

“వ్యాసముని! మీ ముఖముచే గానముచేయబడిన పుణ్యధర్మములు అనెడి గానామృతమునకు తృప్తి చెందలేకున్నాము. భూతముల యొక్క పుట్టువు, ప్రళయము కర్మగతి అంతయు ఎరుగుదువు. అందువలన నిన్ను అడుగుచున్నాము. యమలోక మార్గము దుఃఖ క్లేశములను కల్గించునని సర్వభూత భయంకరమని మిక్కిలి దుర్లభమని విన్నాము. ఆదారివెంట నరులు యమసదనమునకు ఎట్లు వెళ్ళుదురు. ఆ దారి యొక్క దూరమెంత? నరక దుఃఖములను పొందకుండుటకు ఉపాయముగాగల దానధర్మ నియమాదు లెట్టివి? నరులు స్వర్గమెట్లు పొందుదురు. ఆ రెంటికిని స్థానములెన్ని? పుణ్యాత్ములెట్లు వెళ్ళుదురు. పాపులెట్లు వెళ్ళుదురు? స్వర్గమునకు కొంపోబడు జీవుని యొక్కయు, నరకమునకు కొంపోబడు జీవునియొక్కయు ఆకారము రంగు ప్రమాణములు ఎట్టివి?” అన వ్యాసుడు ఇట్లు చెప్పెను.

‘సంసార చక్రము అజరము. అనగ అది ఎన్నిటికిని శిథిలముకానిది. నిలుకడలేక తిరుగుచునే యుండును. ప్రాణోత్ర్కమణము జరిగినది మొదలు జీవుడు పయనించు యమమార్గ స్వరూపము నేను చెప్పెదను. మఱియొకడు చెప్పలేడు. యమలోకమునకు మనుష్య లోకమునకు నడుమగల అంతరము ఎనుబది ఆరు వేల యోజనములు. కాలిన రాగివలె అది క్రాగుచుండును. జీవులు తప్పక ప్రయాణము జేయవలసిన దారి అది. పుణ్యులు పుణ్యలోకమునకు, పాపులు నరకమునకు పోవుదురు. యముని రాజధానిలో ఇరువది రెండు నరకములున్నవి. వాని పేరులు: రౌరవము, రౌద్రము, శూకరము, తాళము, కుంభీపాకము, మహాఘోరము, శష్మిలము, విమోహనము, కేటాదము, కృమిభక్షము, లాలా భక్షము, భ్రమము, నద్యము, పూయవహము, రుధిరాంభము, అగ్ని జ్వాల, మహాఘోరము, సందంశము, శునభోజనము, ఘోరము, వైతరణి, అసిపత్రవనము.

ఆ దారిలో చెట్టునీట చెరువులు, సరస్సులు, బావులు, చలివెందరలు, విశ్రమించుటకు గృహముగాని ఉండవు. ఆ దారిలో నదులు, పర్వతములు, కొంచెము విశ్రమించుటకు చోట్లు ఉండవు. మరణ కాలము వచ్చినంతట బంధు మిత్రాదులను వదలి సర్వ జీవులు సర్వ వేళల చిన్న పెద్ద అనకుండ గర్భములో ఉన్న శిశువు సైతము ఏ స్థితిలో ఉన్నను, తుదకు నిద్రావస్థలో ఉన్నను, ప్రాణములు విడిచిన జీవి ఇహము అందు నిర్దిష్టమై ఉన్న ఆయుర్దాయమును అనుభవించి తుదకు ఆదారి వెంబడి ఏగవలసినదే. వద్దన్నను అది తప్పదు. జలాగ్నులు విషశస్త్రములు ఆకలి, పర్వతమునుండి పడుట మొదలగు ఏదో నిమిత్తమున దేహి ప్రాణములను వదలి ఈ పాంచభౌతిక మహా శరీరమును ఇక్కడ విడుచును.

తానుచేసిన కర్మానుసారము యాతనా శరీరమును సుఖదుఃఖములను అనుభవించుటకు మఱొక ధృఢమైన దానిని స్వీకరించును. ఆ శరీరముతో పాపి పాపమును పుణ్యుడు పుణ్యమును అనుభవించును. ప్రాణము పోవునపుడు తీవ్రమైన వాయువుచే రగుల్కొల్పబడి శరీరమందు సూక్ష్మముగ ఉన్న అగ్ని ప్రకోపించును. అది కట్టెలు లేకుండగనే మండు అగ్నివలె రగుల్కొని ఆయువు పట్టులను (మర్మ స్థానములు) బ్రద్దలు కొట్టును. ఉదాన వాయువు మీదికి లేచును. ఆ జీవి తిన్న ఆహారము, త్రాగిన నీరు, క్రిందికి పోకుండ నిరోధించును. ఎవడు బ్రతికి ఉండగ మంచినీళ్ళిచ్చి ఎవరికేని అన్నరసము పెట్టెనో వానికి ఆ ఆపద సమయమందు హాయి గల్గును. శ్రద్ధా పవిత్రమైన మనస్సుతో అన్నము పెట్టినవాడు ఆ యామార్గమున అన్నము లేకుండగనే తృప్తి నొందును. అనృతమాడనివాడు, ఎదుటివాని ప్రీతికి భంగము చేయనివాడు, ఆస్తికుడు, శ్రద్ధావంతుడు సుఖమైన మరణమును పొందును. దేవబ్రాహ్మణ పూజానిరతులు, అసూయారహితులు, శుక్లులు (అచ్చము పుణ్యములు చేసిన వారు) దాతలు ప్రేమంతులు (తప్పుపని చేయుటకు కల్గెడి సంకోచము హ్రీయనబడును) వీరు సుఖమృత్యువులు. (అనాయాస మరణులు) కామోద్రేక ద్వేషములకు వశుడుగాక ధర్మము తప్పక చెప్పినట్లు చేయుచు సౌమ్యుడై ఉండువాడు సుఖమైన చావు పొందును. దప్పికకు నీళ్లు, ఆకలికి అన్నము పెట్టిన నరులు సుఖమరణము పొందుదురు. ధనదాతలు యమమార్గములో చలిని జయింతురు. మంచి గంధము ఇచ్చినవారు తాపము పొందరు. ఇతరుల ఉద్వేగమును సహించినవారు ప్రాణోత్ర్కమణ వేదనను పొందరు. జ్ఞాన(విద్య) దాతలు, దీపమిచ్చినవారు మోహములో పడరు. కూటసాక్షి అసత్య వాది గురుశిక్ష పొందనివాడు వేదనిందకుడు మృత్యు సమయములో మూర్ఛలో పడుదురు.

ప్రాణము పోవు జీవునకు భయంకరులు, పాడుకంపు గొట్టువారు, బడితలు, బల్లెములు, దుడ్లు చేతబట్టినవారు, క్రూరులు, యమకింకరులు ఎదురు వత్తురు. వాండ్రు కంటబడగానే ఈ ప్రాణికి కంపము పుట్టును. మొర్రోయని బంధువుల కొఱకు ఏడ్చును. ఆ మాట కూడ అస్ఫుటముగా అన్ని అక్షరములు ఏక రూపమున వినిపించును. బెదరున జూపు బెదరును. కంథములో గురగురపుట్టును. అంతట వేదనామయమైన ఆ శరీరమును జీవుడు వదలును.

వాయువు ననుసరించి (వాత ప్రకోపముచే) కర్మ యాతనానుభవమునకు తలితండ్రులవలన ఏర్పడిన శరీరమునుగాక అదేరూపముననున్న శరీరమును సరిగా అదే ప్రమాణము అదే బాల్యాద్యవస్థగల అవయవములతో పొందును. ఆ తరువాత యమదూత పాశములచే కట్టివేయును. మరణవేదన పడుచు కాలమురాగా పంచ భూతములు దేహమును విడచి పెట్టును. ప్రాణము కంఠగతమైన సమయమున జీవుడు శరీరము నుండి విడదీయబడి ఎద్దువలె రంకెలు వేయును. షాట్కౌశికమైన ఆనందమయ (అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ) వాయు స్వరూపమున నిర్గమించును. తల్లితండ్రి మొదలగు సర్వ సంబంధులచేత విడువబడును. బిక్కమొగములు వెట్టి కన్నీళ్ళు గార్చుచు వారు చూచుచుండ తన శరీరమును (గూడును) విడచి వాయురూపుడై పోవును.

అంధకారబంధురము చుట్టు చీకటి ఆవరించినది, సుఖదుఃఖ ప్రదము, దుస్సహము, దురంతము, దురాసదము, దుర్నిరీక్ష్యము, దుర్గమమునై ఆ దారినిబట్టి పాపాత్ములు వెళ్ళుదురు.

యమకింకరులు పాశములచే కట్టి ముద్గరములచే కొట్టుచు లాగికొనిపోవుదురు. (ముద్గరము = పొట్టి ఇనుప దుడ్డు) యమదూతలు జీవుని ఆయుర్దాయమయి పోయినట్లు తెలిసికొని భల్లూకములు, పెద్దపులులు, గాడిదలు, ఒంటెలు, కోతులు, మండ్రగబ్బలు, తోడేళ్ళు, గుడ్లగూబలు, పాములు, పిల్లులు, గ్రద్దలు, డేగలు, నక్కలు ఎక్కివత్తురు. పెక్కు వికృత రూపములతో అనగా పందులు, కుక్కలు, పశువులు, దున్నలు మొదలగు రూపములతో వత్తురు. భయంకరమూర్తులు. వంకర ముక్కులు, మూడు కళ్ళు పెద్ద దవడలు దీర్ఘాండములు వ్రేలాడు పెదవులు గల్గి రక్త మాంసములు అలమిన శరీరములతో భయంకరమైన కోరలతో మండుచున్న నాలుకలతో పాతాళమువంటి ముఖములతో వికృతములైన నేత్రములతో పిల్లులు, గుడ్లగూబలు, మిణుగురు పురుగులు, అర్ద్ర పురుగులట్లున్న తిరుగుడు వడుచున్న కన్నులతో, మెల్లకళ్ళతో, నిప్పులట్లు మెఱయు చూపులతో, ఆ యమదూతలు కనిపింతురు. భయంకరమైన పాములట్లుండు అయోమయములైన భూషణములతో పుఱ్ఱెల మాలలు ధరించి బుసలుకొట్టు నల్లతాచుల కంథములకు చుట్టుకొని అగ్ని మంటలట్లున్న నిక్కిన తల వెంట్రుకలతో నూరు కదలు రాగిరంగు, గోరోచనపు రంగులోనున్న వ్రేలాడు గడ్డములతో కొందరికి రెండు నాలుగు పదహారు పది, ఇరువది మఱియు లెక్కలేనన్ని చేతులతో కొందరు వేయిచేతులతో మంటలు చిమ్ము వివిధ ఆయుధములతో పాశములతో, ఇనుప గొలుసులతో, దండములతోవచ్చి హడలుగొట్టుదురు. యముని ఆజ్ఞగొని జీవుల సత్వమాహరించికొనిపోయి యమసదనము జేర్తురు. తడబడుచు, ఏడ్చుచు, బొబ్బలు ఇడుచు, అమ్మ, నాన్న, కొడుకా అని చుట్టాలను పిలిచి ఏడ్చుచున్న కర్మచే చెడినవానిని శూలములచే పొడుచుచు, ఇనుప గుదియలచే అడచుచు వజ్ర సమానములైన దండములచే బాడుచు, కత్తులచే నరకుచు, పెల్లుగ ఆర్చుచు, కృద్ధులైన కింకరులు ఈడ్చుకొని పోవుచుండ ఆ జీవుడు దుఃఖమున కుమిలి మూర్ఛవడి ఉడుకెత్తిపోవ ఇట్టటు లాగుచు, సూదులట్లు గ్రుచ్చికొను కుశ కంటకములను ఈడ్చుచు పుట్టల దొర్లించుచు, శంకు పాషాణముల దొరలించుచు కులకరాళ్ళ కెరలించుచు గనగనమండు మంటలలో కాలేడి ఎండలో ఒకవంక నక్కలు తినుచుండ, జీవుడు నరక మార్గమున పోవును. ఇట పాపులు బెదరిబెదరి తడబడి ఆక్రందనము చేయుచు ఆదారిని జనుచుందురు. కాలిన నేలపై ముండ్ల కంచెలలో కాలుచు దానము చేయని పిసినిగొట్టులు పయనింతురు. జీవ ఘాతకులు రక్తము రసి మొదలగువాని పాడుకంపుతో గొడ్డు మేకపోతు శరీరముతో చర్మము కాలుచుండ వెళ్ళును. మఱియు పులుగులవలె కూయుచు ఆక్రందించుచు వికృతముగ ఆక్రోశించుచు వేదనకు గురియై వివిధాయుధములచే నరకబడుచు, పొడువబడుచు, జీవఘాతకులు ఆదారిలో పోవుదురు. మాంసము మెక్కిన జీవులు బల్లెములచే పొడవబడుచు అంపములచే కోయబడుచు ఎడ్లు దున్నలు మొదలగు వానిచే పొడవబడుచు పందులచే గీరబడుచు సూదులచే పొడవబడుచు కందురీగలు కుట్ట మధుఘాతకులు (ఇతరుల నోటి యందలి మధురమైన కూడు పడగొట్టినవారు) స్వామి ద్రోహము జేసినవారు, మిత్రఘాత, స్త్రీ ఘాత చేసినవారు యమకింకరుల శస్త్రములచే తెగిపోవలసి ఉండును. నిరపరాధములైన సాధు జంతువులను చంపిన వారిని, రాక్షసులు ఆదారిలో కొరికి తినుచుందురు. పరస్త్రీల వస్త్రములు అపహరించినవారు ప్రేతలై దిగంబరులై అమాలయమునకు పరువు లెత్తుదురు. గృహ క్షేత్ర సువర్ణ వస్త్ర ధాన్యాదులను దొంగిలించిన పాపులు పాషాణములచే బడితెలచే బాదబడుచు కీలుకీలు పట్టువిడి, రక్తములు కార ఆదారి వెంట పోవలసి ఉండును. బ్రాహ్మణులను కొట్టి ఘోష పెట్టించినవారు ఎండిన కాష్ఠములకు వేసి కట్టబడి కన్ను, ముక్కు చెవులు, కోయబడగా చీము, నెత్తురుచే అలముకొనబడి కాలుని గ్రద్దలచే నక్కలచే పీకికొని తినబడుచు, దండములచేత బాదబడుచు, మొరపెట్టుచు ఆతెరవున బోవుదురు. ఇట్టి ఘోరమైన జ్వాలా మయమైన రౌరవమను నరకము మానవులకు ఏర్పడినది.

కాలినరాగివలె మంటలు చిమ్ముచు మిణుగురులు చెదర, ముళ్ళజెముడు డొంకలతో నిండిన నిప్పుల ఇసుకతో నిండి వహ్ని కీటకమైన మార్గమున (వహ్ని=నిప్పుచేత కీటకము= నిష్ఠురము) మండుటెండకాయు దారిని చనవలసి ఉండును. ఇట్లెంతో దూరము గడచిన మీద రాగి ఇనుముతో నిర్మితమై లక్ష యోజనముల వైశాల్యము గల్గి నలుచదరముగా నాలుగు ద్వారములుగల యమనగరము వచ్చును. పదివేల యోజనముల ఎత్తైన బంగారు ప్రాకారములు దానికి గలవు. ఇంద్రనీలాది మణులచే అది శోభించుచుండును. దాని తూర్పు ద్వారమున దేవ దానవ యక్ష రాక్షస పన్నగాది గణములుండును. వందల కొలది పతాకములు ఎగురుచుండును. గంధర్వ అప్పరసలచట అడుచు పాడుచుందురు. ఆ తూర్పు ద్వారమున ప్రవేశము దేవఋషియోగి బృందములకు మాత్రమే కల్పించబడును. యక్ష సిద్ధాదర విద్యాధరులకు మాత్రమే, ఉత్తర ద్వారమున గంటలు మ్రోయుచుండును. ఛత్ర చామ రాదులు సొంపు నింపుచుండును. అది నానారత్నాలంకృతము. వీణా వేణు మృదంగాది మంగళధ్వనులు వినిపించుచుండును. ఋగ్యజుస్సామ వేద ఘోషముతోముని బృంద అందము గొలుపుచుండును. ఆ ద్వారము వెంట ప్రవేశము గలవారు ధర్మజ్ఞులు సత్య వ్రతులు. వేసవిలో మంచినీరు ఇచ్చినవారు. చలికాలమున వెచ్చదనము ఇచ్చినవారు. అలసట వడిన వారికి విశ్రాంతిని ఇచ్చినవారు. ప్రియ భాషణము చేసినవారు. దానశూరులు. మాతా పితృసేవాతత్పరులు. గురుశుశ్రూష చేసినవారు. అతిథిపూజకులు, వీరికి ఉత్తర ద్వారము ప్రవేశద్వారము. ఇక పడమటి ద్వారము రత్న భూషితము. రంగురంగుల రత్నాల మెట్లు తోమరములు అచట రాణించును. భేరీ మృదంగ శంఖాదుల ధ్వనులు కాహళముల మేళవింపు (కాహళం = బాకా) వినిపించును. హర్ష భరితులై శుభప్రదులైన సిద్ధులయొక్క బృందములచే అది మారుమ్రోయు చుండును. ఆ దారిని ప్రవేశము ఆనంద భరితులకు భక్తులకు సర్వతీర్థస్నానము జేసినవారికి. పంచాగ్నుల సేవించినవారికి పుణ్యతీర్థ యాత్రలందు, కాలంజర పర్వతములందు, అగ్నియందు మరణించినవారికి శత్రు నాశనము చేసికొన్నవారికి స్వామి(యజమాని) స్నేహితుడు లోకము గోవులు మొదలైన వాని రక్షణ కొరకు హతులైన శూరులకు, తపోధనులకు పశ్చిమ ద్వారమున ప్రవేశము ఈయబడును.

ఆ నగరమునకు దక్షిణ ద్వారము మహా భయంకరము, సర్వప్రాణి భయంకరము. హాహాకార మెత్తుచుండును. అంధకార బంధురము. సూదిమొనగల శిఖరములు ముళ్ళు తేళ్ళు వజ్ర కీటములు (కర్రల దొలుచు పురుగులు) వీనిచేత అడుగిడుటకు వీలుండదు. తోడేళ్ళు పులులు నక్కలతో సింహములు పిల్లులు గ్రద్దలు కణకణమండు ముఖములతో చరించు ఆ ద్వారమున సర్వాపకారులైన వారికి ప్రవేశము. గోబ్రాహ్మణ వృద్ధులను, బాధలో నున్నవానిని, శరణుజొచ్చిన వానిని, స్త్రీని, మిత్రుని, ఆయుధము చేతిలో లేనివానిని చంపిన వారికిది ప్రవేశద్వారము. పొందరాని గురుపత్ని మొదలైన స్త్రీలను పొందినవారు మూఢులు పరద్రవ్యాపహారకులు దాచనిచ్చిన వస్తువులు హరించిన వారు, విషము పెట్టిన వారు, నిప్పంటించిన వారు పర భూ గృహశయ్యా వస్త్ర భూషణాపహారులు పరుల లోపములనే వెదకు క్రూరులు, అనృత వాదులు గ్రామమునకు రాష్ట్రమునకు పురమునకు దుఃఖము కల్గించినవారు అబద్ధసాక్ష్య మిచ్చినవారు కన్యలను అమ్ముకొన్న వారు అభక్ష్య భక్షణ ప్రియులు కోడలిని కూతురును పొందినవారు, తల్లిని తండ్రిని కటువుగ మాట్లాడినవారు మరి మహాపాతకులుగ చెప్పబడినవారు. అందరు దక్షిణ ద్వారమున యమపురము ప్రవేశింతురు. (214)