అని చెప్పి ఇంకను బ్రహ్మ ఇట్లు అనెను-
ఆ రాజు అవంతీనగర మందు (ఉజ్జయిని యందు) ప్రజలను స్వసంతానమట్లు పాలించెను. సత్యవచనుడు శూరుడు సర్వసుగుణ సంపన్నుడు, ధార్మికుడు, జ్ఞాని, బుద్ధిశాలి, సర్వశాస్త్రజ్ఞుడు, పరరాజుల గెల్చినవాడునై అతడు ప్రతాపమున రవిని రూపముచే అశ్వినీ కుమారులను, పరాక్రమమున ఇంద్రుని ప్రజారంజకమున చంద్రుని పోలియుండెను. అశ్వమేధాది యజ్ఞములను దానములను తపస్సులను ఆచరించి అష్టైశ్వర్య సంపన్నుడై ఉండెను. విప్రులకు ప్రతి యజ్ఞమందును సువర్ణ మణిముక్తాదులను, ఏనుగులను, గుఱ్ఱములను ఒసంగెను. కంబళులు, అజినములు, వస్త్రములను, ధన, ధాన్యములను, సర్వ సమృద్ధముగ ఒసంగెను. భక్తిని, ముక్తిని ఇచ్చు సర్వయోగేశ్వరుని హరిని సేవింప నిచ్ఛ జనించి సర్వ నిగమాగములను ఇతిహాస పురాణములను వేదవేదాంగములను పరిశోధించి, ఋషులు తెలిపిన నియమములను పాటించి, వేదపారగులయిన విప్రుల సేవించి గురుసేవలొనర్చి పరమావిధి ధర్మమునందుకని కృతార్థుడయ్యెను.
వాసుదేవ తత్త్వమునంది భ్రాంతి జ్ఞానము విడరాడి మోక్షేచ్ఛగొని ఇంద్రియము లెల్ల నిగ్రహించి భగవంతుని ఎట్లు ఆరాధింతునని ఆమూర్తిని ధ్యానించుచు ఉజ్జయిని నుండి మంత్రులు, పురోహితులు, భృత్యసపరివారముగ, చతురంగ సైన్యముతో, అంతః పురాంగనలతో, వందిమాగధులు చేయు స్తుతులతో బ్రాహ్మణాది చాతుర్వర్ణములవారు వివిధ కులముల వారు, వివిధ వ్యాపారులు, కవులు, గాయకులు, పౌరులు, గ్రామాంతరము పోవు తండ్రిని తనయులట్లు తనను వెంబడింప, దక్షిణ సముద్ర తీరమునకు ప్రస్థాన మొనరించెను. అక్కడ నానారత్న పూర్ణము, తిమి తిమింగలాది నానాజంతు సమాకలము, పరమ గంభీరమును, పవిత్రము మంగళము తీర్థములకెల్ల ఉత్తమ తీర్థము. సర్వ పుణ్యనద నదీ నాయకము అయిన ఆ సాగరమును దర్శించి ఆశ్చర్యమంది తత్తీరమందు విడసెను. అవ్వార్థి తీరము సర్వవృక్ష మనోహరము. సర్వ ఋతుకుసుమ ఫలభరితము చిలుకలు గోరువంకలు నెమళ్ళు చకోర చక్రవాకములు కలకలారావములు శ్రుతి మనోహరముగ అందు వినిపించుచుండెను. మల్లికా కుందమందారము ఆది వివిధ తరులకు సుమవాసనలిట ఇంపు గొల్పుచుండెను. విద్యాధర గంధర్వ కిన్నర అప్సరోగణములు అందు ఆడుచు పాడుచు నిత్యము విహరించుచుండును. నందన సమానములు అగు ఉద్యానవనములు హంసకారండకాది జలపక్షుల విహార స్థానములు పద్మాకరములు అందు ఆశ్చర్యకరములై ఉండెను. ముల్లోకములకు పూజనీయమగు పది యోజనముల పొడవు ఐదు యోజనములు వెడల్పుగల ఆ దివ్య క్షేత్రమును ఆరాజు దర్శించి ఆనంద వివశుడయ్యెను. (44)