వ్యాసుడు అనియె -
మాయామానుష రూపమున ఒకానొక పనికై అవనియందు అవతరించి గోపకులతో బృందావనమున సంచరించుచున్న తన ఫణామండలమున ధరణి నెల్ల ధరించిన శేషుని అవతారమై, మహత్తర కార్యములను నిర్వహించుచున్న బలరాముని ఉపభోగము కొఱకు వరుణుడు వారుణి అను తనశక్తిని పిల్చి ఓ మదిరా! నీవు అనంతుని కెంతయు ఇష్టమైన దానవు. అతడు నిన్ను ఆలకించుటకు అనువుగ అచటికి అరుగుము అనగా ఆవారుణి సంకర్షణుని సన్నిధానమునకు అరిగెను. బృందావనమందున్న కదంబ (కడిమి) వృక్షము యొక్క తొఱ్ఱలో వసించుచున్న ఆ వారుణి వలనకలిగిన సుగంధమును అద్భుతమైన మద్యపరిమళము బలదేవుడు ఆఘ్రాణించి తొలుతటి రుచిని గుర్తించి హర్షమొందెను. ఆవల ఆ చెట్టునుండి పడుచున్న మధ్యధారను చూచి మిగుల సంతోషించెను. గోపికలతో గోపకులతో గూడి గీతవాద్య నిపుణులు తన యశోగానము చేయుచుండగా ఆ వారుణుని త్రాగెను. శ్రమచే క్రమ్మిన చెమట బిందువులు ముత్యములవలె భాసిల్ల అతడు యమునకు వచ్చి స్నానము చేయుదునని పలికెను.
ఆ నది అతని మాటవిని తప్పత్రాగి మత్తుచే అన్నమాట అని అనుమానించి ఆమె అతని వద్దకు రాదయ్యెను. దానిచే కోపించి అతడు నాగలిగైకొని మదవివశుడై ఆ నది యొడ్డున పెల్లగించి లాగెను. పాపాత్మురాల! రావైతివి. మరి యెచటికేని నీ ఇచ్చననుసరించి పొమ్మనెను. ఆ నదీ దేవత అట్లు తటాలున ఆకర్షింపబడి, మార్గము విడిచి బలదేవుడున్న ఆ వనమును అంతను ముంచెత్తెను. మరియు శరీరము దాల్చి బెదరిన చూపులతో, ఓ హలాయుధా! అనుగ్రహము జూపుము. నన్ను వదలిపెట్టుమని పల్కెను. అతడు నా శౌర్యమును బలమును నీవు కించపరతువేని నా నాగలిచే నిన్ను అణచదలచి, వేయిపాయలుగా వెంట నిన్ను నడిపించెదను అన ఆమె మిక్కిలి జడిసిపోయి బ్రతిమాలగా, ఆమె ముంచెత్తిన భూ భాగమందు ఆమెను వదలెను.
ఆవల అతడు స్నానము చేయగా అద్భుతకాంతి వచ్చెను. తరువాత లక్ష్మి ఒక శిరోభూషణముగ నల్లకలువను వరుణుడు కానుకగా పంపిన కుండలములు పెట్టుకొని, వాడిపోని తామర పూమాలను, సముద్రుడు తనకు ఉచితములైన రెండు దివ్యాంబరములను బలభద్రునకు కానుకగా ఇవ్వగా వానిని ధరించెను. నీలాబ్జము నవతంసముగ ధరించి మణి కుండలము చెవికి బెట్టుకొని ఆ నీలాంబరములు కట్టుకొని పూలమాల దాల్చి కాంతి నొంది బలరాముడు మిక్కిలి శోభించెను. అచట రెండు మాసములు క్రీడించి మధురకు పోయి రైవతరాజు కూతురును రేవతిని పరిణయమాడెను. ఆమె యందు అతడు నిశరుడు, ఉన్ముఖుడు అను ఇర్వురు పుత్రులను కనెను. (198)