బ్రహ్మ ఇట్లు అనియె-ఇట్లు నేను అనంతమహిమగల పురుషోత్తమ క్షేత్ర మహిమయు భుక్తిముక్తులను, ఇచ్చునని తెల్పితిని. అచ్చట కృష్ణుని సంకర్షణుని సుభద్రను దర్శించినవారు ధన్యులు, ముక్తులును సమంత్రకముగా ఒసంగిన హవిస్సు అగ్నిని పొందినట్లు కృష్ణుని రాత్రులందు ఉషః కాలమునందు చేయు ధ్యానము వలన భక్తులు దేహము విడిచి కృష్ణుని పొందుదురు. శయనము నుండి లేవగానే కమలాక్షుని హరిని బలరాముని సుభద్రను తలచుకొనువారు విష్ణుసాలోక్యమందుదురు. వర్షఋతువు నాల్గు మాసములు ఆ పురుషోత్తమ క్షేత్ర నివాసము చేయువారు భూమినిగల సర్వ తీర్థములు సేవించిన ఫలము పొందురు. ఇంద్రియ నిగ్రహముచేసి కోపము జయించి ఎల్లపుడు అచట వసించువారు తపః ఫలమును పొందుదురు.
అన్య తీర్థములందు పదివేలేండ్లు చేసిన తపస్సు యొక్క ఫలము పురుషోత్తమ క్షేత్రమున ఒక్క మాసము ఆచరించిన లభించును. బ్రహ్మచర్యాదులచే నిస్సంగులై చేయు పుణ్యమిచ్చట సేవించిన కల్గును. ఇది సర్వయజ్ఞ ఫలప్రదము. ఇచట దేహము విడిచిన ముక్తి కల్గును. మఱ్ఱి వృక్షమునకు సాగరమునకును నడుమ మేనువిడిచిన ముక్తి సిద్ధముగా లభించును. క్రిమికీటకాదులు పశుపక్షులు ఇక్కడ శరీరము విడిచిన పరమ గతినందును. అన్యతీర్థముల వెంట తిరుగవలెననుకొనుట వట్టి భ్రాంతి. పురుషోత్తమదర్శన మొనరించిన వాడు పురుషోత్తముడగును. అతడు ప్రకృతికి అతీతుడు. వేదపురాణము లందుచేతనే హరి పురుషోత్తముడని కీర్తించెను. దారిలో, శ్మశానములో, గృహమున, మఱియెచ్చటనైనను, శ్రీపురుషోత్తమ క్షేత్రమున ఇష్టమున్నను లేకున్నను దేహమును వీడిన మనుజుడు మోక్షమంది తీరును.
అందువలన మోక్షకాంక్షులు పురుషోత్తమ క్షేత్రమున దేహము త్యాగము చేయయత్నింపవలెను. పురుషోత్తమ మాహాత్మ్యమును మించినది కలుగదు, కలుగబోదు. క్షేత్ర గుణ సంపదలో కొంతను మాత్రమే నేను చెప్పితిని. సమగ్రముగా తెలుప సాధ్యపడదు. ఓ మునులారా! మీరు మోక్షార్థులైన యెడల ఆ పుణ్య క్షేత్రమందు వసింపుడు అని మునులతో వ్యాసుడు పలికెను. బ్రహ్మ వచన మాలించి ఆ మునులు ఆ క్షేత్రమందు వసించి పరమపదమందిరి. (177)