బ్రహ్మ మహా పురాణము

సూర్యభగవానుని స్తుతి

దేవతలకు ఆదేవుడవై ఆవిర్భవించితివి. భూమి యొక్క విభూతికెల్ల నీవే ఆధారము. నీవే సృష్టి స్థితి లయ కార్యములందు మమ్మూర్తులగుదువు. జగత్పతీ! నీకు మంగళమగుగాక! నీవు తాపము వర్షింతువు. జగత్ పతీ! జయము జయమని ఇంద్రాదులు సప్తర్షులు వివిధ స్తోత్రములచే తను, వాలఖిల్యాదులు వేదసూక్తములచేతను స్తుతించిరి. దేవతలకెల్ల మొదటి వాడు (దేవతలకు ముఖస్థానీయుడు) అగు అగ్ని భగవానుడు సంతోషముతో తరణిపట్ట బడుచున్న తరణిని నాథ! మోక్షమందినవారికి నీవు మోక్షస్వరూపుడవు. ధ్యాననిష్ఠులకు పరమధ్యేయమైన వస్తువవు. సర్వ భూతములకు నీవు పరమగతివి. కర్మకాండ ప్రవర్తనులకు నీవే గతివి. పూజ్యుడవు. దేవేశ! మాకు శం (సుఖము), అస్తు (కలుగుగాక) ద్విపదే (రెండు పాదాలుగల) జీవకోటికి అనగా మాకు సుఖమగుగాక. చతుష్పదే, నాలుగు పాదములు గలపశుజాతికి సుఖమగుగాక అని వేదసూక్తార్ధములతో విద్యాధర గణములు యక్షరాక్షస నాగ కులములు తలలు వంచి చేతులు జోడించి మనసునకును వీనులకును ఇంపుగ స్తుతులను పలికిరి. సర్వ భూతాధారమైన నీతేజస్సు భూతజాలము సహింప గలదగుగాక! అటు తరువాత హాహా హూహూ నామక గంధర్వులు నారద తుంబురులు షడ్జమధ్యమ గాంధార రూపగాన త్రయవిశారదులు కావున సూర్య పరమాత్మను గాంధర్వ విధితో సంకీర్తనము చేయ ఆరంభించిరి.

తాన మూర్ఛనాది వివిధ సంగీత ప్రయోగములచే బహుసుఖముగ వారు పాడిరి. విశ్వాచి, ఘృతాచి, ఊర్వశి, తిలోత్తమ, మేనక, సహజన్య, రంభ మొదలైన అప్సర స్త్రీ మణులు నర్తనము చేసిరి. హావభావ విలాసములచే అభినయించిరి. వీణావేణుమృదంగ ఝర్ఝర పణవపుష్కరపటహ ఆనక దేవదుందుభిశంఖాది వివిధ వాద్యములు శతము, సహస్రముల మ్రోయించిరి. పాటలుపాడు గంధర్వులచే ఆటలాడు అప్సరోగణములచే తూర్యవాదిత్రఘోషములచే సర్వ కోలాహల మయ్యెను. ఆ సమయమున వేల్పులెల్లరు చేతులు మొగిచి భక్తితో వంగి సహస్రాంశునకు ప్రణామములు చేసిరి.

అంతట సర్వస్వర్గసమావేశమునందు, కోలాహలమందు విశ్వకర్మ (దేవశిల్పి) మెలమెల్లన రవిబింబమును యంత్ర మెక్కించి చెక్కనారంభించెను. ఆయనచే భానుడా జానువుగ (మోకాళ్ళదనుక) నిపుణముగ లేఖనము చేయబడి తన అభినందనము లేనందున యంత్రమునుండి దింపబడెను. తేజోహానివలన గలిగిన రూపమును నిషేధింపలేదు. అందువలన ఆయన రూపము చక్కని వానికెల్ల చక్కనిదైమిక్కిలి శోభించెను. హేమంతవర్ష గ్రీష్మ ఋతువులకు హేతువైన వాడును, త్రిమూర్తులచే స్తుతింపబడు వాడును అగు భానుమూర్తి యొక్క ఈ స్వరూప తక్షణములు (చెక్కులను)విన్నవాడు ఆయుస్సమాప్తిలో సూర్య సాలోక్యమును పొందును. ఓమునిసత్తములార! సూర్యునిజన్మవృత్తాంతము ఆయన పరమోత్తమ రూపమును నేనుసంకీర్తించితిని. (32)