మునులు “తపోధనా! పాపులు దక్షిణ మార్గమున ఎట్లు పోదురో సవిస్తరముగ ఆనతి ఇమ్మన వ్యాసులు ఇట్లనియె. ఆ మార్గము ఘోరాతి ఘోరము. ఆ ద్వారము ఘాతుకమృగ సంకులము. భయంకరము. నక్కల అరపులతో బ్రతిధ్వనించును. అగమ్యము. భూతప్రేత పిశాచ రాక్షస సంకీర్ణము. తలచికొన్న తనువు గగుర్పాటు చెందును. పాపులు ద్వారము దూరాననేకని బెదరి ప్రేలాపన చేయుచు మూర్ఛపడుదురు. అటుపై యమభటులు వారిని కొట్టుచు సంకెళ్ల పాశములగట్టి ఈడ్చుచు దండములచే బెదిరింతురు. ఆ జీవులు తెలివొంది రక్తమునందు తడిసి అడుగడుగున తడబడుచు దక్షిణ ద్వారమును ప్రవేశింతురు. ఆదారి ముండ్లతో గులకరాళ్లతో కత్తులతో పాషాణములతో ఒక్కెడ బురదతో దాటరాని గోతులతో ఇనుప సూదులట్టి దంగములతో, దుర్గమమై ఉండును. అందు జీవులు దుఃఖించుచు, ఒడ్డులం గూల్చు కొండలు చెట్లతో నిప్పులతో కూడిన దారిని పోదురు. కొన్ని యెడల ఒరకములు (హెచ్చుతగ్గులు) కొన్నియెడల మట్టి పెళ్లలు కణకణలాడు ఇసుక, పదునైన శంకువులు సలసలకాగు నేలతోడి నలుదారులు కలిసిన బాటలు కాలిన పాషాణములు కొన్నియెడల మంచుతో పీకదాక దిగిపోవు ఇసుక మేటలతో ముఱుగు నీటితో గనగనమండు నిప్పులతో కూడియుండును. సింహములు, తోడేళ్ళు, ఈగలు, దోమలు, దారుణములయిన పురుగులు, నొక్కెడ పెద్దపెద్ద జలగలు, మీద కొండ చిలువలు, కందురీగలు, విషము గ్రక్కు పాములు, దుష్టగజములు, పదునైన కొమ్ములతో దారినేల రాయు ఎడ్లతో, దున్నలతో, ఒంటెలతో కూడి ఉండును. రౌద్రములయిన ఢాకిని శాకిన్యాది పిశాచములు రాక్షసులు వ్యాధులు పీడింప ఆ దారిని పీడితులై పోవుదురు. మహాధూళి గ్రమ్మ, మహాప్రచండ వాయువులు వీవ, మహాపాషాణములు వర్షించుచుండ, యమభటులు బాదుచుండ, నిలువ నీడగానక, నొక్కెడ పిడుగుపాటున నొడలు పగుల, బాణవర్షమున బ్రద్దలుకాగా, దారుణముగ గొఱువులు పడుచుండ, పైని నిప్పులు కురియుచుండ, ఆదారిని జనుదురు. పెనుధూళి కురియుచుండ అందు బ్రుంగి ఏడురు. మేఘముల ఉరుములకు అడలి పోవుదురు. బాణ వర్షములచే చూర్ణమై పోయెదరు. పెద్ద ఉప్పునీటి దారలం తడియుచు పుండు వంటి చలిగాలికి బిగియుచు పగులుచు నొగులుచు ఆదారి ఆకలివడి తినుటకేమియులేక కుములుచు నిరాలంబము నిర్జలమునైన ఆ దుర్గమయ మార్గమునంబడి అతిశ్రమ గుడుచుచు దేహులు మూఢులు పాపాత్ములు ఆ వెంట జనియెదరు. యముని ఆజ్ఞకొని దూతలు అతి ఘోరరూపు లీడ్వ, ఒంటరిగ పరాధీనులై బంధుమిత్రాదులు లేక, తాము మున్ను చేసిన పాపములకు మఱిమఱి ఏడ్చుచు నడుమనడుమ యమభటులు నోరెత్త వలదని కొట్టుచుండ నోరు నాలుక ఎండగా ప్రేతలై నొగులుదురు. బక్కచిక్కిన మేనులతో జడిసి జడిసి పోవుచు ఆకలి చిచ్చునకు దహింపబడుచు సంకెళ్ళ బంధితులై కొందరు తలక్రిందుగా పాదములు మీదుగా గైకొని దూతలచే ఈడ్వబడుదురు. కొందరు మొగము క్రిందుగా ఈడ్వబడి ఏడ్తురు. అన్నము నీరు లేక మఱిమఱి దేహిదేహి అని అడుగుకొనుచు కంట నీరు పెట్టుచు గద్గదికతో చేతులు జోడించి దీనులై ఆకలి దప్పుల కుమిలి, మంచి భక్ష్యములు పేయములు భోజ్యములు గమగమ వాసనలు చిమ్ముచుండ జూచుచు మఱి మఱి ప్రాధేయపడి అడిగికొనుచు, పెరుగు పాలు నెయ్యియు కలిపిన అన్నము జూచి సుగంధభరిత పానీయములు, చల్లని నీటిని చూచి యమదూతలం బిక్క మొగము పెట్టి యాచించికొనుచుందురు. వారింగని యమదూతలు, భయంకరులు క్రోధమున కనుకెలకులు ఎఱ్ఱవడ బెదరించుచు ఇట్లందురు.
“సకాలమున మీరు హోమము చేయలేదు. విప్రుల కేమియు ఈయలేదు. ఎవరేని ఇచ్చుచున్న దానికి అడ్డు తగిలితిరి. దానివలని పాపమిది అనుభవింప వలసినది. అగ్నిచే కాలలేదు. నీటిపాలు కాలేదు. రాజులు దొంగలు అపహరింపలేదు. మున్న మీరు చేయని దానము ఇప్పుడు బ్రాహ్మణ ముఖమున ఈయబడుచున్నది. సాత్త్విక దానములు చేసిన సాధువులకు ఇవిగో అన్నపర్వతము లెదురగుచున్నవి. భక్ష్య భోజ్య లేహ్య పేయాది రూపమగు నాహార సమృద్ధి. ఇది మీకుగాదు. మీరు విప్రముఖమున ఎన్నడు ఇంత అన్నము పెట్టి ఉండలేదు. బ్రాహ్మణుల బూజింపనైన లేదు. ఆ విధముగ చేసిన పుణ్యాత్ములదీ అన్నసమృద్ధి. వారిది గొనివచ్చి మేము మీకెట్లు పెట్టగలము?
యమకింకరుల మాటలు విని దిగులువడి ఆకలికి కుమిలి ఆజీవులు దారుణ శస్త్ర పీడితుగుదురు. ఇనుప గుదియలు ఇనుపదుడ్లు శక్తితో మరపట్టి సపరిఘ బిందిపాల గదా పరశు బాణాదులచే వీపున బాదుచు పరమ నిర్దయులు కింకరులు వేధింప అరిగి యరిగి సింహవ్యాఘ్రాదులచే పాపులు భక్షింపబడుదురు. అట్లు మిగుల పీడించి కింకరులు పాపులను యమ ప్రభువు ఎదటకు గొంపోదురు. ఆయన ధర్మాత్ముడు, ధర్మకర్త, సర్వప్రాణి నియామకుడునైన యముడు ఇట్లు అతికష్టమైన దారింజని ప్రేతపురము జేరిన నరులను ప్రభువుకు ఎదురబెట్టి యమదూతలు వారువారు చేసిన కర్మములు నివేదింప ప్రాణులాయనను అతిభయంకరుని జూచెదరు. పాపముచే కనులు మూతవడి బుద్ధులుచెడి ప్రాణి కోరలతో భయంకరమై కనుబొమలు ముడివడి మిడిగ్రుడ్ల జడుపు కూర్చు మొగము, నిక్కినజుట్టు, పెద్దగడ్డముతో, పెదవులు అదర పదునెన్మిది చేతులతో కాటుకవలె నల్లని మేనితో సర్వాయుధములు కరములందు పూని పెద్దదున్న పోతునెక్కి పెద్దమబ్బువలె నిప్పులట్లు మండు కండ్లు రక్తమాల్యములుపూని ప్రళయ మేఘమట్లు ఉరుముచు సముద్రుని ఆపోశన పట్టునా అన్నట్లు, ముల్లోకములను మ్రింగునా అన్నట్లు, నిప్పులు క్రక్కుచున్నట్లు, దగ్గరగానిల్చి కాలాగ్ని ప్రభతో ఉన్న మృత్యువును చూచి, మహామారి కాలరాత్రియు వివిధ వ్యాధులు కష్టాలు నానారూపాలు శక్తి శూలాస్త్ర పాశ చక్రాంకుశ ఖడ్గాదులు దాల్చి వజ్రదండములు గొని చురకత్తులు అమ్ములపొదలు విండ్లును అసంఖ్యాకమును పూని మహావీర్యులు క్రూరులు కాటుకవలె నల్లని మేనికాంతిగలవారు సర్వాయుధహస్తులై యమదూతలు అతి భయానకులై ఘోరముగ పరివారమై కొలువ కొలువైన యముని చిత్రగుప్తుని పాపాత్ములు దర్శింతురు. యముడు ఉగ్రుడై వారిని ఉరిమి ఉరిమి చూచును. అపుడు చిత్రగుప్త భగవానుడు ధర్మ వచనములచే ప్రబోధించుచు ఇట్లనును.
“ఓ! పాపకర్ములారా! పరద్రవ్యాపహారులారా! రూపముచే బలముచే పొగరెక్కి పరదారాభిగమనము చేసిన ఫలమది అనుభవింపవలయును. దుఃఖము కుడువక తప్పదు. ఈ తప్పెవనిది కాదు. నాకడకు వచ్చినవారు ఈ రాజులు తెలివిచెడి బలగర్వితులై చేసిన తమ కర్మమును అనుభవించుచున్నారు. ఓ రాజులారా ! ప్రజానాశన మొనరించితిరి. అల్ప రాజ్య సుఖమునకై ఘోరములు చేసినారు. మీరు రాజ్య లోభముతో మోహముతో బలాత్కారముగ ప్రజలను దండించినారు. దాని ఫలము ఇపుడు అనుభవింపుడు. రాజ్యమేది ఇక్కడ భార్య యెక్కడ? ఏకాకియై చేసిన అశుభమును ఇపుడు అనుభవింపవలసినదే. ఏ బలముకొని ప్రజల బాధింతురో ఆ బలము ఇప్పుడు ఏ మాత్రము ఈ లోకమున గనబడదు. యమకింకరుల వలని బాధలకు గురియైతిరి. పాపము” అని ఇట్లు పలు తీరుల దెప్పి పొడుచుచు, నొవ్వనాడుచు, యముడుత్కట కోపియై పడదిట్ట నేడ్చుచు చేసిన పాపములకు పశ్చాత్తపించుచు, ప్రాణులు నోరెత్తక నిలురు. ధర్మరాజు ఇట్లు చిత్రగుప్తుని వారివారి కర్మల లెక్కలు చెప్పుమని విని ఆ పాపవిశుద్ధికి విధింపనగు దండనముల గూర్చి దండధరుడు ఇట్లు ఆదేశమిచ్చును.
“ఓరిచండ! మహాచండ! ఈ నరపతుల గొంపోయి నరకాగ్నులందు పడవేసి పాపముల నుండి విశుద్ధుల జేయుడు” అన వెనువెంటనే లేచి యమభటులు నృపులకాళ్ళు పట్టుకొని ఎత్తి విసరిపారవేసి పాపప్రమాణము బట్టి బండపై నడిచి పిడుగుచే మహాతరువు నట్లు కొట్టిరి. అంతట రక్తము ప్రవాహమెత్తినట్లు ముక్కుననోట జాల్కొన తెలివితప్పి అదేహి పడిపోవును. అటుపై దానిపై వాయువు వీవ తెలివిగొనినంత వారిని పాపవిశుద్ధికి నరక సాగరమున విసురుదురు. ఆ దూతలు మహాదుఃఖముల కుములు, మఱియుంగల జీవులను యమునికి నివేదింతురు. “ఇడుగో వీనిని మహాపాపిని మూర్ఛ బడవేసి కొని వచ్చితిమి. ధర్మ విముఖుడు నిత్యపాపరతుడు. ఇడుగో వీడు పరమలుబ్ధుడు. మహాపాతక ఉప పాతకములెన్నో చేసినాడు హింసాపరుడు అనాచారుడు. కూడరానిది కూడినవాడు పర ద్రవ్యాపహారి. కన్యావిక్రయి, కూటసాక్షి, కృతఘ్నుడు, మిత్రద్రోహి మరియు వీడు ధర్మనింద చేసినాడు. పాపములు చేసినాడు, దురాత్ముడు, వీనిని శిక్షించుటో రక్షించుటో ప్రభువు నీవు సెలవిమ్ము. నీవు చెప్పినది అమలుచేయుటలో మేము సర్వదా విధేయులము” అని ఇట్లు విన్నవించి ధర్మప్రభువు ఎదుట నిలిపి వేలకొలది లక్షకోటి నరకముల పడవైతురు. ఆపై మఱి కొందఱిని పట్టపోవుదురు. చేసినతప్పు నిర్ధారణచేసిన మీద తన కింకరులకు ఆనయిచ్చి వశిష్ఠాది మహర్షులేయే నేరములకు ఏయే దండనము విధించిరో అయారీతి దండింపజేయును. యమకింకరులు క్రోధమూని అంకుశముద్గర దందాడులు, ఱంపములు శక్తి, తోమరములు, కత్తులు, శూలములుగొని అడచి కొట్టికోసి యేసిగ్రుచ్చి నరకి చీల్చి పాపశోధనము చేయుదురు.
నరకముల భయానక స్వరూపము వాని ప్రమాణములు వినుడు. మహావీచి అను నరకము రక్తపూర్ణము. వజ్రకంటక మిశ్రము. పదివేల యోజనముల విరివిగలది పాపినందు ముంచి వజ్ర కంటకముల గ్రుచ్చి చీల్తురు. లక్షయేండ్లు అక్కడ గోహత్యచేసిన వాడు కూలియుండును. కుంభీపాకము మహాదారుణ నరకము. నూరు లక్షల యోజనములు ఉండును. కాలుచున్న రాగి బిందెలతో అది మిడమిడకాలు ఇసుక నిప్పులతో గూడి ఉండును. బ్రహ్మఘ్నుడు భూమి హర ధన నిక్షేపములను (నిధులను) హరించిన వాడచట కూలును. భూత ప్రళయముదాక జీవులందు కాల్పబడుదురు. అటుపై గౌరవము జ్వలించు వజ్ర బాణములతో నిండియుండును. అరువది యోజనముల పొడవు వెడల్పు గల్గియుండును. జ్వాలలు గ్రమ్ము ఆ నరకమున బాణములచే పాపులు చీల్చబడుదురు. అయోమయ నరకము మంజూషాకారము (బోసువంటిది) దానిలో పాపుల పడవేసి చెఱుకును ఆడించినట్లు అడింతురు. అదియును జ్వలించుచుండును.
అప్రతిష్ఠమను నరకము మలమూత్ర పురీష మయము. పాపియందు అధోముఖుడై కూలును. బ్రాహ్మణులను పీడించినవాడు బ్రాహ్మణ ద్రవ్యము అపహరించినవాడు దానిచే కూలును. విలేపకమను నరకము సలసలకాగు లక్కతో ఉండును. మద్యపానరతులు అందులో మున్గుదురు. మహాప్రభమను నరకము కాలిన శూలములతో నిండియుండును. ఆలుమగలకు తగవు పెట్టిన వారు ఆ శూలములచే పొడువబడుదురు. జయంతి అను ఘోర నరకము ఉక్కు పరచిన రాతినేల. పరభార్యాసంగమము చేసినవాడు దానంబడి ఉడికి పోవును.
శాల్మలమను నరకము నిప్పుల ముళ్ళతో నిండినది. బహుజన వ్యభిచారిణియైన స్త్రీ దానిని కౌగలించుకొనును. ఎవ్వరితరుల ఆయువు పట్టులకు తగులు అసత్యములు పల్కుదురో వాండ్ర నాలుకను లాగి ఱంపముల గోయుదురు. ఎవ్వరు సరాగములగు చూపులం పరాంగనం చూతురో వారి కన్నులం బాణములంగ్రుచ్చి పగిలింతురు. తల్లిని సోదరిని కోడలిని కూతురును పొందిన వాండ్రను, స్త్రీ బాలవృద్ద హంతకులను, పదునల్వురు ఇంద్రుల కాలము జ్వాలామాలాకాకులమైన రౌద్రమగు మహారౌరవమను నరకమున కూల్తురు. అది ఇరువది నాల్గు యోజనముల విరివియైనది. ఎవ్వడు పుర గ్రామ క్షేత్ర గృహాదులకు నిప్పు పెట్టునో ఆ మూఢుడు కల్పాంతముదాకపై నరకమున కాల్పబడును. తామిస్రమను నరకము లక్ష యోజనములు. కత్తులు పట్టిసములు ముద్గరములు పరచినది. అందు దొంగలను విసిరివైతురు. యమకింకరులు శూలశక్తి గదా ఖడ్గాదులచే కల్పశతము అచట పాపులను అడంతురు. తామిస్రము కంటె రెట్టింపు విశాలము మహాతామిస్రము. అందు జలగలు పాములు ఉండును. కారుచీకటి పరమ దుఃఖదము. మాతృ పితృ హంతకులు మిత్ర విశ్వాసఘాతకులు అందు బాడితెలం జెక్కబడుచుందురు. భూమి ఉన్నంత దాక దానిని అనుభవింతురు. అసిపత్రవనము (కత్తులబోను) మహాదుఃఖదము. కాలుచున్న కత్తులతో నిండినది. ఒక్క యోజనము విరివిగలది. అందు మిత్రఘ్నుడు భూత ప్రళయము దాక కత్తులచే నూరు ప్రక్కలు గావింపబడును. కరంభ వాలుకమను నరకము ఒక్క యోజనము. కూపాకారము, మిడ మిడ కాలు నిప్పులతో ముండ్లతో ఇసుకతో నిండినది. అందు ఒక లక్షా పదివేల మూడు వందలేండ్లు జనులను మాయోపాయములచే దారుణముగ మ్రగ్గుచేయుదురు. దహించిన వారు అదుదహింపబడుదురు. కాకోలమను నరకము కృమిమయము మలమయమును. మృష్టాన్నము తాను ఒక్కడ తిన్నవాడు దానిలో కూలును. మలమూత్ర శోణితమయము కుడ్మలమనునది. పంచ యజ్ఞములు మానిన వారు అందుబడుదురు. మాంసము రక్తముతో అది పాడుకంపు గొట్టుచుండును. భయంకరము. అభక్ష్యాన్న భక్షకులందు కూలుదురు. క్రిమి కీటకమయము, శవసంపూర్ణము మహా వటమను నరకము. కన్యా విక్రయము చేసినవాడు అక్కడ తలక్రిందుగా ఆ పెద్ద మఱిచెట్టు నుండి క్రిందపడును. తిలపాకమను నరకము దారుణము. పరులను పీడింప గోరిన వారు అందు గానుగ యందు నువ్వులట్లు ఆడింపబడుదురు. అందు సలసలక్రాగు నూనెలో ఉడికిపోదురు. మిత్రఘ్నుడు శరణాగత హంతకుడు వజ్రపాటకమను నరకమున వజ్రమయములైన గొలుసుల బంధింపబడును. పాలమ్మువాడు నిర్ధయముగ నిరుచ్ఛ్వాస మగు గాఢాంధకార బంధురము, గాలి ఆడని నరకమున పీడింపబడును. బ్రాహ్మణునికి చేయుదానమునకు అడ్డుపడినవాడు చేష్టలు దక్కియందు కుములును. గనగన మండు నిప్పుల నరకమగునట్టిది, అంగారోపచయము. విప్రునికి దానముచేసి చేయలేదన్న వాడు దానియందు పడును. మహాపాయి అనునరకము లక్షయోజనములు. అనృతము లాడినవానిని అందు అధోముఖముగా పడవేయబడును. మహాజ్వాలమను నరకము పెనుమంటలతో భయంకరము. పాపులు అందు దహింప బడుదురు. క్రకచమను నరకమున వజ్రము వంటి పదునైన ఱంపములచే అగమ్యామ గమనమును జేసిన పాపులు కోయబడుదురు. గుడపాకమను నరకము క్రాగుచున్న బెల్లపుపాకముయొక్క మడుగు. అందు వర్ణసాంకర్యము చేసిన వాడు పడవేయబడును. క్షుర ధారమను నరకము పదునైన కత్తుల నరకము. బ్రాహ్మణ భూమి కాజేసిన వాడందు కల్పాంతముదాక కోతలంబడును. అంబరీషమను నరకము. ప్రళయకాలాగ్ని దీపితము. నూరు కల్పకోటులందు స్వర్ణస్తేయి (బంగారపు దొంగ) కూలును. వజ్రకుఠానరకము కేవలవజ్రమయము. చెట్లను నరకిన వారు అందులోబడుదురు. పరితాపము ప్రళయాగ్ని మయము. విషము పెట్టినవాడు మధుహర్త (మధువు=తేనె) దానం బడును. కాల సూత్రము వజ్రసూత్రమయము. ఇతరుల పంటలను హరించిన వాడు అందుపడుదురు. కశ్మలమను నరకము చీమిడి శ్లేష్మముతో నిండినది. ఒక కల్పము అక్కడ నిరంతర మాంసాభిరుచి గలవాడుకూలును. ఉగ్ర గంధమను నరకము లాలా (చొంగ) మూత్ర పురీషమయము. పితరులకు పిండప్రదానము చేయని వారందు బడవేయబడుదురు. జలగలు తేళ్ళతో మండెడిదుర్భర నరకము పదివేల ఏండ్లు అందు తిండిపోతు కూలును. వజ్రమయము వజ్రమహానీడమను నరకమున ధనధాన్య హిరణ్యములను హరించిన వారు కుములుదురు. యమకింకరులు లేశలేశముగా దొంగలనట చెక్కుదురు. కాకిని గ్రద్దకువలె ప్రాణుల నరకి తినువాండ్రను యమకింకరులు కల్పాంతముదాక వారి మాంసమును వారిచేతనే తినిపింతురు. పరుల శయనాసన వస్త్రాదులను కాజేసిన వారిని శక్తి తోమరాదులచే యమభటులు ఖండింతురు. పండ్లు ఆకులు హరించిన కుబుద్ధులు గడ్డి నిప్పునం కాల్ప బడుదురు. కాలభటులు పరదార ధనాదుల యెడ బుద్ధిగల వాని గుండెలలో కాలిన ఇనుప శూలమును గ్రుచ్చుదురు. మనోవాక్కాయ కర్మలందు ధర్మ విముఖులైన పాపులు యమ లోకమున పలుఘోరములైన యాతనలందు వేలు లక్షలు కోట్ల సంవత్సరములు దుఃఖములు కుడువవలసి యుండును” (215).