బ్రహ్మ మహా పురాణము

కృష్ణ నిర్యాణము

ఇంకను వ్యాసుడు ఇట్లు చెప్పెను

ఇట్లు కృష్ణుడు బలదేవుని సాయమున విశ్వరక్షణకొఱకు దుష్టరాజన్య శిక్షణము చేసెను. ఫల్గునునితోగూడి నారాయణుడు అక్షౌహిణులన్నింటిని కూల్చి భూదేవి బరువునుదించెను. ఇటుచేసి విప్రులు ఇచ్చిన శాపము నెపమున యదుకులమును గూడ ఉపసంహరించెను. ద్వారకను వదలి మానవాకారము విడిచి ఆ స్వయంభువు నిజాంశమున లిటిగి నిజస్థానమును విష్ణులోకమున ప్రవేశించెను.

“అతడు విప్రశాప మిషమ్మున స్వకులమును ఎట్లు ఉపసంహరించెను”. మనుష్య దేహమును ఎట్లు వదలెను? అని మునులు అడిగిరి అందులకు సమాధానముగా వ్యాసుడు ఇట్లు పలుక దొడగెను.

యదు కుమారులు పిండారకమను తీర్థమున కణ్వ నారద విశ్వామిత్రులను గాంచిరి. నడిప్రాయపు మదముచేత భావికార్య ప్రేరణము చేతను జాంబవతీ పుత్రునికి సాంబునికి అడువేషమువేసి సాగినడచి ప్రణామపూర్వకముగ వారిని గూర్చి ఈవిడ కొడుకు కావలయుననుచున్నది. స్వామీ! పుత్రుని కనగలదా? అనిరి. యదుబాలురచే వంచితులై ఆమునులు దివ్యజ్ఞాన సంపన్నులు సువ్రతులు కావున వారి నాశనమునకు అప్పుడు శాపమిచ్చిరి. కుపితులై ఈమె ముసలముపే కనగలదనిరి. దానిచే అఖిల యాదవకులము విచ్ఛిన్నము కాగలదనిరి. ఇట్లు శపింపబడిన ఆయాదవ బాలురు పోయి ఉగ్రసేనునికి యథా తథముగా తెలిపిరి. సాంబుని కడుపు నందుండి ముసలము పుట్టెను.

ఉగ్రసేనుడు ఆ ముసలమును ఇనుపరజనుగా కొట్టించెను. అది సముద్రమునందు పడవేయబడి మేక పెంటికలట్లు పొడి అయ్యెను. ఇనుప రోకలి అది చూర్ణితమై ఇనుపగుదియగా (తోమరముగా) తయారయ్యేగాని దానిని అంతకంటె ఎక్కువగా పొడిసేయలేక దానిని గూడ సముద్రములో పడవేయగా ఒకచేప దానిని మ్రింగెను. ఆ చేపను చంపి దాని కడుపునుండి ఆ ఇనుప గుదియ ఒకజాలరి గైకొనెను. మధువైరి భగవంతుడు ఆ నిజమెఱింగియు విధివశుడై దానిని మఱొకలాగున చేయుటకు ఇచ్ఛగింపను లేదు.

దేవతలుపంప నొక దూత వచ్చి కేశవునికి ప్రణతిచేసి ఏకాంతమందు “నేను దేవదూతను ఏలికవారికడకు దేవతలు పంపగా వచ్చితిని. వసువులు అశ్వినులు మరుత్తులు, రుద్రాదిత్యులు, సాధ్యులనుగూడి ఇంద్రుడు తమకు ఇట్లు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇదే వినుడు. త్రిదశుల ప్రార్థనచే భూభార హరణమునకై నూరేండ్లకు పైని భగవంతుడవు ఈ ధరణిని అవతరించితివి. దుష్టదైత్యులు నీచే హతులైరి. భూమి బరువు దింపబడినది. ముక్కోటి దేవతలిప్పుడు అనాథులైరి. (దిక్కులేని వారైరి) దేవాధిపత్యమందుదురు గాక! జగన్నాథ! నూరేండ్లు గడచినవి. తమకు అభిమతమేని ఇపుడు స్వర్గమునకు దయ చేయవలయును మఱియు నీకు ఇక్కడ ఉండుటకు భూలోకమందే అభిలాషయేని ఇక్కడనె ఉండవచ్చును. ఏలినవారి సేవకులము మేమిట్లు సేయుమని చెప్ప తగిన వారముకాము.” అని విన్నవించగా, అంతట భగవంతుడు ఇట్లనెను. “నీవు అన్నదంతయు నేనెఱుంగుదును. కాని యాదవుల యొక్క క్షయముగూడ నాచే ఆరంభింపబడినది. ఎవ్వరిరిని చంపరాని వారగు యాదవులచేగూడ భూమికి బరువనునది తప్పదు. దీనిని ఏడు రాత్రులలో సత్వరమే దింపెదను. సముద్రమునకు గొంపోబడిన ద్వారకను తిఱిగితీసు కొనివచ్చి యాదవులను ఉపసంహరింపజేసి స్వర్గమును అలంకరింతును. మానవదేహము వదలి సంకర్షణునితో అటకు వచ్చినాడననియే, ఇంద్రుడు దేవతలును అనుకొనవలసినది. భూభార కారణమైన జరాసంధాదులు హతులైరి. వారివలన వసుధ భారము యాదవులపై కెత్తబడినది. ఆయీ భారమును నేను దింపి అమరలోక పరిపాలనమునకు రాగలను” అని ఇట్లు వాసు దేవునిచే తెలుపబడి దేవదూత ఆయనకు ప్రణమిల్లి దేవయానమున ఇంద్రుని సన్నిధికేగెను.

భగవంతుడు అప్పుడు దివ్య భౌమాంతరిక్షములైన ఉత్పాతములను దర్శించి వెంటనే ప్రభాస తీర్థమున కేగుదమనెను. అప్పుడు పరమ భాగవతుడు (భగవద్భక్తుడు) ఉద్ధవుడు ప్రణతుడై హరితో “ఇప్పుడు నా చేయవలసిన పని సెలవిమ్ము. ఏలినవారిప్పుడు యదుకుల మెల్లను ఉపసంహరింతురని తోచుచున్నది. యదుకుల నాశనము కాగల నిమిత్తములను చూచుచున్నాను అనగా భగవంతుడు ఇట్లు అనియె.

“ఉద్ధవ! నా ప్రసాదముచే నీవు దివ్యగమనమున గంధమాదన పర్వతమందున్న పుణ్యమగు బదరిక ఆశ్రమమునకు చనుము. మహీతల మంతటిని పవిత్రముచేయు ఆ నరనారాయణ స్థానమందు నాపై మనసుంచి నా ప్రసాదమున అక్కడ నీవు సిద్ది నందగలవు. నేను కులమెల్లను ఉపసంహరించి స్వర్గమునకు ఏగుదును. నేను విడిచిన ద్వారకను సముద్రుడు ముంచును అని పలుక విని ఉద్ధవుడు పదముల వ్రాలి నారాయణుని అనుమోదితుడై నరనారాయణ స్థానమునకు ఏగెను.

అప్పుడు ఆయాదవులందరు శీఘ్రగములైన రథములను ఎక్కి, కృష్ణ బలరాములతో ప్రభాసమునకు చనిరి. కుకురాంధకులను వారు నియమము పూని వాసుదేవుని ఆమోదమున సురాపాన మొనరించిరి. అట్లు తప్ప ద్రావినవారికి అన్యోన్య సంఘర్షణమున కలహాగ్ని రేగి యాదవ వంశక్షయ హేతువయ్యెను. వారు దైవముచే బలాత్కరింపబడినవారై, శస్త్రాస్త్రములచేత ఒండొరులు కొట్టుకొనిరి. శస్త్రములై పోయి దగ్గరనున్న ఏరకమును (గుంద్రమూల అను గడ్డిపోచలను) బట్టిరి. వారదిపట్టినంత వజ్రమట్లు కనిపించెను. దానితో మిగులదారుణముగ నొకరినొకరు కొట్టుకొనిరి. ప్రద్యుమ్న సాంబాదులు, కృతవర్మ, సాత్యకి, అనిరుద్ధాదులు, పృధువు, వివృధువు, చారువర్మ, చారువు, అక్రూరుడు ఏరకారూపమైన వజ్రములచే కొట్టుకొనిరి.

హరి వారిని వారు హరిని వారించుకొనిరి. హరి సాయపడ వచ్చినాడనుకొని ఒండొరులను కొట్టుకొనిరి. కృష్ణుడును కుపితుడై యేరకాతృణపుంజము గుప్పిట పట్టెను. అది యాదవ వధకనువైన ముసలము. (గుప్పెడు ఇనుప దుడ్డు) అయ్యెను. ఆతతాయులై దానిచే యాదవులను హరి నిశ్శేషముగా గొట్టెను. వారును త్వరగవచ్చి ఒండొరుల బాదు కొనిరి.

అటుపై అర్ణవ మధ్యము నుండి చక్రాయుధుని జైత్రరధము (జయశీలమైన రథము), దారుకుడు (సారథి) చూచుచుండగనే అశ్వములచే కొంపోబడెను. చక్రము గద (కౌమోదకి), శార్ఙ్గ (హరివిల్లు), తూణము (అమ్ముల పొది), శంఖము (పాంచజన్యము), కత్తి (నందకము) హరికి ప్రదక్షిణముచేసి అదిత్య మండల మార్గమును బట్టి ఏగెను. (స్వరాదిత్యే అను శ్రుతి ననుసరించి స్వర్ణము ఆదిత్య మండలమని రహస్యము) ఒక్క క్షణములోనే అటయాదవ వంశ క్షయమయ్యెను. మహాశూరు లొక్క కృష్ణుడు దారుకు డును (రథసారధి) మిగిలిరి.

ఒకచెట్టు మొదట నాసనమువైచి కొని కూర్చుండియున్న బలరాముని దరికి ఏగి వారిద్దరు అతని ముఖము నుండి వెడలుచున్న మహాసర్పమును దర్శించిరి. ఆ సర్పము పెద్ద పడగలతో అతని మొగము వెలువడి సిద్ధులు నాగులు పూజింప సముద్రమునకు ఏగెను. సముద్రుదు అర్ఘ్యమునుగొని ఎదురేగెను. మహేంద్రులచే పూజితుడై ఆసర్పము ఆనీట ప్రవేశించెను. బలరామ స్వామి నిర్యాణముంగని

“బలరాముని నిర్యాణము, యాదవకులక్షయము దీనినంతను నీవు వసుదేవునికి ఉగ్రసేనునికి దెల్పుము. నేనును యోగ సమాధి నిలిచి ఈ కళేబరమును విడితినని ద్వారకా వాసులైన జనమునకు చెప్పుము. ఈ ద్వారకా నగరమును సముద్రుడు ముంచి వేయును. అందువలన సిద్ధముగా పూస్పబడిన రథములతో అర్జునుని రాక కెదురు చూడుడు. పాండవుడైన అర్జునుడు నిష్క్రమించిన తరువాత ద్వారకామధ్యమందు మీరుండ వలదు. అతడెటకేగునో అచ్చటకు అతనితో మీరును ఏగవలయును. నీవేగి కుంతీ కుమారునికి అర్జునునకు నేను చెప్పిన మాట చెప్పుము. నా పరిగ్రహము (భార్యా వర్గము)ను నీవు నీశక్తికొలది రక్షింపవలయును అని పలికి అర్జునితో గూడి నీవు ద్వారవతి యందలి జనమును వెంటపెట్టుకొనిపొమ్ము. వజ్రుడు యాదవులకు రాజు కాగలడు అని హరి దారుకునితో అనెను. (210)