బ్రహ్మ మహా పురాణము

ధ్రువ సంస్థితి నిరూపణము

ఇంకను మునులతో సూతుడు ఇట్లు చెప్పెను

భగవంతుడగు హరియొక్క తారా (నక్షత్ర) మయమైన రూపము శింశుమార నక్షత్రము అంతరిక్ష చక్రమునందు ప్రకాశించుచున్నది. దాని తోకయందు ధ్రువుడున్నాడు. అతడు తాను తిఱుగుచు చంద్రాదిత్యాది గ్రహములను త్రిప్పుచున్నాడు. తిరుగుచున్న ఈ ధ్రువుని అనుసరించి నక్షత్రములు చక్రమువలె తిరుగుచుండును. సూర్యచంద్రులు తారా నక్షత్ర గ్రహ సమూహము వాయుమయములైన సంబంధములచే ధ్రువునియందు అనుబద్ధములై ఉన్నవి. అంతరిక్షమందు జ్యోతిశ్చక్రము, శింశుమారాకారమున (మొసలివలె) ఉన్నదని వర్ణితమైనది. అమ్మూర్తికాధారమై హృదయమందు నారాయణుడు ఉన్నాడు. ఉత్తానపాదుని కుమారుడు ప్రజాపతిని ఆరాధించి తారా రూపమయిన ఆ శింశుమారము యొక్క తోక యందు ఉన్నాడు. శింశుమారమునకు ఆధారము సర్వాధ్యక్షుడైన జనార్దనుడు. ధ్రువునకు ఆధారము శింశుమార చక్రము. ధ్రువుని యందు భానుడు ఉన్నాడు. సురాసుర మానుష మయిన ఈ జగత్తంతయు ఆ సూర్యుని ఆధారమున నిలిచియున్నది. సూర్యుడు ఈ జగత్తునకంతకు ఏ విధానమున ఆధారముగ ఉండెనో చెప్పుచున్నాను. ఆ వృత్తాంతమును నావలన వినుడు!

సూర్యుడు ఎనిమిది మాసములు రసస్వరూపములైన జలములను పీల్చి వర్షించును. అ వర్షమువలన అన్నము దానివలన సకల జగత్తు పొడమును. తీక్ష్ణ కిరణములచే అర్కుడు (సూర్యుడు) జగమ్మునగల నీటిని ఆకర్షించి సోముని పోషించును. ఆయన వాయునాడీ మయమైన జలముచే ఆకాశమునందుండి పొగ, అగ్ని, వాయువుయొక్క సన్నిపాత స్వరూపమయిన మేఘములందు జలములను చిమ్మును. ఆ మేఘముల నుండి నీరుభ్రంశము కానందున ఆ మబ్బులకు ‘అభ్రములు’ అను పేరువచ్చినది. ఈ మేఘము నందున్న నీళ్ళువాయు ప్రేరణమున కాలజనిత సంస్కారమును బొంది నిర్మలములై వానగా అవనిపై పడును. ప్రాణికోటి పుట్టుటకు కారణములై, భౌమములయిన ఈ అప్పులు (నీళ్ళు) నదులు, సముద్రములు, భూమి ప్రాణి జన్యములని నాలుగు రూపములతోనున్న ఈ జలమును భగవంతుడైన సవిత అదానము చేయును (గ్రహించును). సూర్యుడు అభ్రగతము కాకుండ ఆకాశగంగా గతమైన నీటినికూడ కిరణములచే గ్రహించి అప్పటికి అప్పుడు అవనిపై వర్షించును. అట్టి ఆకాశ గంగోదకముల స్పర్శవలన పాపములు వాసిన మర్త్యుడు నరకము నకు పోడు. అది దివ్యస్నానమని ఋషులు చెప్పిరి. సూర్యదర్శన మాత్రమున దివంబు నుండి రవి కిరణములచే ఆ అకాశ గంగోదకము వెదజల్లబడును.

కృత్తికాది విషమ(బేసి) నక్షత్రములందు సూర్యుని దర్శనముతో వర్షించు ఆ ఉదకము దిగ్గజములెత్తి వర్షించినట్టి గంగోదకమని తెలియనగును. సూర్యుని కిరణముల ద్వారమున సరిసంఖ్యకల నక్షత్రములందు కురియువాన అప్పటికప్పుడు సూర్య కిరణములచే స్వీకరింపబడి వర్షింపబడినది. ఈ ఉభయమును నరులకు పాపహరము పుణ్యకరమును అగు దివ్యస్నానమని తెలియనగును. మేఘముల వెంట కురియు ఉదకము ఓషధులను పోషించును. ప్రాణుల కుజ్జీవనమగు ఆ జలము అమృతము. దానిచే పెంపొందిన సకల ఔషధీ గణము ఫలపాకాంతమై (పంటపండగానే నశించునదియై) ప్రజలకు సాధకమగును. అందుచే శాస్త్రచక్షువులగు మానవులు వేదములు చెప్పిన యజ్ఞము అహరహరము ఆచరించి దేవతల కాప్యాయనము కలిగింతురు. ఇట్లు యజ్ఞములు వేదములు బ్రాహ్మణాది వర్ణములు సర్వదేవనికాయము సకల పశుభూత సంఘాతము స్థావర జంగమాత్మకమైన సర్వజగత్తు వర్షాధారమున రాజిల్లుచున్నది. ఆవర్షము సూర్యుని వలన ఏర్పడుచున్నది. అట్టి సూర్యునికాధారమై ధ్రువుడున్నాడు. ఆతనికి శింశుమారము దానికి నారాయణుడును ఆశ్రయమై ఉన్నారు. శింశుమార చక్రహృదయ స్థానమందు నారాయణుడుండి సర్వ భూతములను ధరించుచు, సనాతనుడు సర్వాదిభూతుడై అలరారుచున్నాడు. భూ సముద్రాది సహితమైన బ్రహ్మాండము యొక్క స్వరూపమిది. మీకు తెలిపితిని. మరియేమి వినదలతురో ఆనతిండు అని పల్కెను (24)