భూర్భువస్సువరాది లోక వర్ణనము

మునులు ఇట్లు అడిగిరి -

ఓ లోమహర్షణ! నీవు లోకములను గురించిన సర్వమును మాకు తెలిపితివి. భువర్లోకము మొదలగు లోకములను, గ్రహ సంస్థానమును వాని ప్రమాణమును తెలుపుము అని మునులడుగ లోమహర్షణుడు ఇట్లు అనెను. ఆ మునుల ప్రశ్నలను వినిన-సూతుడు ఇట్లు అనెను.

సూర్య చంద్రుల కిరణ ప్రసారము కలదాక సముద్ర శైలపరివృతమై ఉన్న ప్రదేశము పృథివీ మండలము. భూమి యొక్క విస్తారమెంతో దానికి మీదనున్న అంతరిక్ష విస్తారము అంతే. భూమికి లక్ష యోజనములలో సౌర మండలము ఉన్నది. దానికి లక్ష యోజనములలో చంద్రమండలమున్నది. దానికి లక్షయోజనముల మీద నక్షత్ర మండలము ఉన్నది. ఆ నక్షత్ర మండలమునకు రెండు లక్షల యోజనములలో ఉత్తరమున బుధుడు. కలడు. అతనికంటే దూరములో శుక్రుడు, అంతే దూరములో అంగారకుడు (కుజుడు) గలరు. అక్కడకు రెండులక్షల యోజనముల దూరములో బృహస్పతియు అటకు రెండు లక్షల యోజనములలో శని, ఆ మీద లక్ష యోజనములలో సప్తర్షి మండలము దానికి లక్ష యోజనములలో జ్యోతిశ్చక్రమునకెల్ల కేంద్ర స్థానమైన ధ్రువ మండలము ఉన్నవి. ఈ అంతరిక్ష లోకము జ్యోతిర్మండలము. ఇది యజ్ఞఫలమునకు స్థానము. ఇజ్య (యజ్ఞము) ఇందు ప్రతిష్ఠితమై యున్నది. ‘క్షిప్రంహి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా’ మనుష్య లోకమున కర్మఫలసిద్ధి వేగముగ కల్గును.

ధ్రువలోకమునకు మీద ఒక కోటి యోజనములలో కల్పాంత జీవులు నివసించు మహర్లోకము ఉన్నది. దానిపై రెండు కోట్ల యోజనములలో జనోలోకము ఉన్నది. అది బ్రహ్మ మానసపుత్రులు నిర్మల చిత్తులునైన సనకసనందనాదులు ఉండెడి స్థానము. జనో లోకమునకు పైన ఎనిమిది కోట్ల యోజనములలో తపోలోకము ఉన్నది. అచట వైరాజులను దేహరహితులైన (విదేహులు) దేవతలు నివసింతురు. తపోలోకమునకు పైన ఆరు యోజనములలో సత్యలోకము విరాజిల్లుచున్నది. అచట సిద్ధాది మునులు ఉందురు. అది అపునర్మారకము. అనగా తిరిగి మరణ ధర్మములేనిది. పుణ్యలోకము బ్రహ్మ లోకము.

పాదగమ్యమైన భూభాగమంతయు భూలోకము. దీని విస్తారము చెప్పబడెను. భూమికిని, సిద్ధాదిముని సేవితమైన సూర్య లోకమునకు నడిమి భాగము భువర్లోకము (అంతరిక్షము) అని చెప్పబడును, ఇది రెండవలోకము. సూర్యునకు ధ్రువునకును నడుమ గల చతుర్దశ నియుత (లక్ష) పరిమాణమైన లోకము స్వర్లోకము. ఈ మూడు లోకములకు కృతకము (కర్మ సంపాద్యము)లను పేరు గలదు. అ మీద జన సప్త సత్యలోకములు మూడును అకృతకములు అనబడును. కృతక అకృతముల నడిమి భాగము మహర్లోకము. దీనికి కృతకాకృతకమని పేరు. ఇది కల్పాంతమందు శూన్యమగును. కాని నశింపదు.

మహామునులారా! సప్త మహాలోకములు, సప్త పాతాళములు నాచే చెప్పబడినవి. ఇది బ్రహ్మాండము యొక్క విస్తృతి. అండకటాహముతో క్రింద మీద నడుమ వ్యాపించి వెలగపండు విత్తనమువలె ఉండునది బ్రహ్మాండము. దీనికి పదిరెట్లు విరివిగల ఉదకము వహ్నిచే నావరింపబడి ఉన్నది. అగ్ని వాయువుచే, అది ఆకాశముచే ఆకాశము మహత్తత్వముచే పదేసిరెట్లు పరిమాణముగల దానితో ఆవరింపబడి ఉన్నది. మహత్తత్వమును ఆవరించి ప్రధానమున్నది. అది అనంతము. దానికి లెక్కలేదు. అది సమస్త సృష్టికి హేతువైన పరాప్రకృతి. ఇట్టి అనంత కోటికోటి ప్రకృతులందు దారువునందు అగ్నివలె, నువ్వులందు తైలమువలె, చేతనాత్మకమై పురుషత్వము-అనగా పరబ్రహ్మ వస్తువు ప్రధాన మందు వ్యాపించియున్నది. ఈ ప్రధానము పురుషతత్త్వము, సర్వభూతముల అనుభూతిలో ఉన్న విష్ణుశక్తిచే ధరింపబడి పరస్పరాశ్రయ ధర్మము కలవియై యున్నవి. ఆరెండింటి పృథగ్భావమునకు, సంశ్రయమునకు ఆ విష్ణు శక్తియే కారణము.

సృష్టి కాలమందు విష్ణుశక్తియైన మాయ (ప్రకృతి)యే కారణరూపమైన తత్త్వమునందు క్షోభకు కారణమగును. అదే ప్రథమ స్పందనము. ఈ శక్తి, వాయువు నీటి బిందువులందలి చలువను భరించినట్లు, ప్రధాన పురుషాత్మకమై, ఈజగత్తును భరించును. చెట్టు మొదట స్కంధము (బోదె)కొమ్మలు, రెమ్మలు, ఆకులతో మొదటి విత్తనమునుండి పుట్టును. ఆ చెట్టునుండి మఱల విత్తనము పుట్టును. ఈ క్రమమునందు పుట్టిన చెట్లు మొదలయిన వాని లక్షణములు తత్తద్రవ్యముల కారణములను అనుసరించి ఉన్నట్లే ఈ జగత్పరంపర (బీజపరంపర) అనంతమైన జగత్కారణమైన విష్ణువును అనుసరించి ఉండును. ఆ విష్ణువే అవ్యాకృత తత్త్వము. ఆ బీజము నుండియే మహత్తు అహంకారము సమిష్టి మనస్సు మొదలగునవి వ్యాకృతమగుచున్నవి. (అవ్యాకృతమునే అవ్యక్తమని వ్యాకృతమును వ్యక్తమని శాస్త్రము వ్యవహరించినది). అహంకార తత్త్వము నుండి దేవ వర్గము తత్పుత్రులు పౌత్రులు జనించిరి. బీజమునుండి మొలక, మొలక నుండి వృక్షము, తద్భాగములు పుట్టినపుడు బీజాదులకు నాశములేనట్లు భూతముల పరిణామము వలన మూలభూతములకు అపచయము లేదు. వృక్షమునకు ఆకాశము, కాలము మొదలైన ద్రవ్యములు సన్నిధానమాత్రమున కారణమైనట్లు, సర్వసాక్షి అయిన భగవంతుని సన్నిధాన మాత్రమున పొడమెడి నామరూపాత్మక వివిధ సృష్టివలన సర్వాధిష్ఠానమైన భగవత్తత్త్వమునకు ఉపచయాపచయములు లేవు. హరి పరిణామము లేకుండగనే కారణమగు చున్నాడు. ధ్యానపుగింజలో మూలము, కాడ, మొలక, ఆకు, కోశము, పువ్వు, క్షీరము, ధ్యానము, బియ్యము, ఊక, తవుడు మొదలైన పదార్థములు (అవ్యక్తముగ) ఇమిడియుండి తరువాత వ్యక్తమైనట్లు పరమాత్మయందు సృష్టి కారణ సామగ్రి అయిన అనేక కర్మబీజములు దేవాది ఉపాధులు జీవశరీరమును నిండియుండి విష్ణుశక్తివలన ఆపరమాత్మనుండి ఆవిర్భావమును పొందుచున్నవి. కావు ఈ జగమెల్ల పుట్టి పెరిగి, లయించుటకు హేతువైన విష్ణువే పరబ్రహ్మ మనబడును. అదియే పరంధామము, పరమపదము, సదసద్రూపము అనబడు పరతత్త్వము. చరాచరమైన ఈ జగత్తు అభేదదృష్టిచేత అతడే అగును. మూల ప్రకృతియు, వ్యక్తరూపమగు జగత్తును అతడే. ఆతని అందు సర్వము నిలుచుచున్నది. లయించుచున్నది. యజ్ఞకర్త, యజ్ఞము, యజ్ఞమున యజింపబడువాడు, యజ్ఞభోక్త, యజ్ఞఫలమును కూడా అతడే. సర్వస్వరూపుడడైన అతనినుండియే యుగాదికాలగణన మేర్పడినది. ఆ హరికి వ్యతిరిక్తము అయినది కొంచెమును లేదు. (23)