సూత! పురువంశమును, ద్రుహ్యుడు అనువు, యదువు, తుర్వసుడు అను వారి వంశములను వేర వేర వినవలతుమని బ్రాహ్మణులు అడుగ సూతుడు ఇట్లనెను.
మునిపుంగవులారా! ముందుగా మహాత్ముడైన పూరువు వంశమును గూర్చి మొదటి నుండి విస్తారముగా జెప్పుచున్నాను వినుడు.
పూరువు కుమారుడు సువీరుడు, వానికి మనస్యుడు, వానికి అభయదుడు. వానికి సుధన్వుడు, వానికి సుబాహువు, వానికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు దశార్ణేయుడు, కృకణేయువు, కక్షేయువు, స్తండిలేయువు, సన్నతేయువు, ఋచేయువు, జలేయువు, బలశాలియగు స్థలేయువు, ధనేయువు, వనేయువు అనుపదిమంది కల్గిరి. మరియు భద్ర, శూద్ర, మద్ర, శలద, మలద, ఖలద, నలద, సురస, గోచవల, స్త్రీ రత్న కూట అను పది మంది కుమార్తెలు జనించిరి. అత్రి వంశమందు ఉదయించిన ప్రభాకరుడను ఋషి వారందరకు భర్తయయ్యెను.
అతడు భద్ర యందు యశస్వియగు సోముని కనెను. సూర్యుడు రాహువుచే నిహతుడై (గ్రహణ మందు) ఆకాశము నుండి పడిపోవుచున్న తఱి, లోకము అంధకార బంధురమైన యెడ ఈ ప్రభాకరుని వలననే వెలుగు ఏర్పడెను. నీకు స్వస్తి (శుభము) గలుగుగాక! అని ప్రభాకరుడన్నంత సూర్యుడు అంతరిక్షము నుండి క్రిందికి పడడయ్యెను. ప్రభాకరుడు, అత్రి ప్రధానములయిన ఆత్రేయస గోత్రములకు కర్త అయ్యెను. యజ్ఞములందు అత్రికి బలము దేవతలచే కల్పింపబడెను. (ఇప్పటికిని యజ్ఞ సదస్సునందు ఆత్రేయస గోత్రులకు అగ్రపూజ ఇచ్చుట సంప్రదాయ సిద్ధమైనది) ప్రభాకరుడా పదిమంది పత్నుల యందు పదిమంది కుమారులను వేదపారగులను గోత్రకర్తలను గాంచెను. వారు స్వస్త్యా త్రేయులను పేర ప్రఖ్యాతి గనిరి.
త్రివిధ ధనశూన్యులు. (సూర్యుడు పడిపోవుట చూచి అత్రేయుడగు ప్రభాకరుడాయనకు స్వస్తియగుగాక అని అన్నందున ఆ గోత్రము వారికీ బిరుదు వచ్చినదన్నమాట) కక్షేయుని కుమారులు మువ్వురు. మహారధులు. సభానరుడు, చాక్షుషువు, పరమన్యువు అనువారు. సభానరుని కుమారుడు విద్వాంసుడగు కాలానలుడు. వాని కుమారుడు ధర్మజ్ఞుడగు సృంజయుడు. వాని పుత్రుడు వీరుడు, మహారాజును అగు పురంజయుడు వాని కుమారుడు జనమేజయుడు. మహాశాలుడు జనమేజయుని పుత్రుడు. మహాశాలుడు దేవతలలో విఖ్యాతుడు. సుప్రతిష్టగన్నవాడు అయ్యెను. మహాశాలుని కుమారుడు మహామనుడు దేవపూజితుడు. మిక్కిలి గొప్ప మనస్సుగల వాడు. ఆయన కొడుకులు ధర్మజ్ఞుడగు ఉశీనరుడు, మహాబలశాలియగు తితిక్షుడు అనువారిద్దరు. ఉశీనరుని పత్నులు అయిదుగురు. రాజర్షి వంశము వారు. నృగ, కృమి, నవ, దర్వ, దృషద్వతి యనువారు. వారి యందు ఉశీనరునకు వార్ధక దశలో తపః ప్రభావముచే కులోద్వహులైన కుమారులు ఐదుగురు. నృగకు, నృగుడు-కృమకు-కృమి, నవకు-నవుడు, దర్వకు సువ్రతుడు, దృష ద్వతికి శిబి అను ఔశీనర ప్రభువు జన్మించెను. శిబికి శిబులయుడను నల్గురు కొడుకులు. నృగునికి యౌధేయులు కల్గిరి. నవునిది నవయను రాష్ట్రము. కృమిది, కృమిలాపురి, సువ్రతునికి అంబష్టులు గల్గిరి. శిబియొక్క నల్గురు కుమారులు వృషదర్భుడు, సువీరుడు, కేకయుడు, మద్రకుడు అనువారు, వారిదేశములు సర్వ సంపత్సమృద్ధములగు కేకయములు, మద్రకములు, వృషదర్భములు, సువీరములు నను ప్రసిద్ధి చెందినట్టివి. తితిక్షువు పూర్వ దిక్కునకు రాజు అయ్యెను.
తితిక్షుని కుమారుడు ఉషద్రధుడు. వాని కుమారుడు ఫేనుడు. వానికి సుతపుడు వానికి బలి కలిగిరి. బలి మనుష్య జన్మము ఎత్తెను. అతడు బంగారపు తూణీరము (అమ్ముల పొది) గలవాడు. మహాయోగియై రాజ్యమేలెను. వంశోద్ధారకులగు ఐదుగురు కుమారులను భూమియందు గనెను. వారు అంగుడు, వంగుడు, సుహ్ముడు, పుండ్రుడు, కళింగుడు అనువారు, వారి పరంపరచే బాలేయమనుపేర క్షత్రవంశము ప్రసిద్ధిగాంచెను. బాలేయులును, బ్రాహ్మణులను, బలి వంశోద్ధారకులును, గూడ అయిరి. బ్రహ్మ సంతోషించినవాడై బలికి మహాయోగిత్వము కల్పపూర్ణాయువు, ధర్మతత్త్వార్ధ మెఱుంగుట సాటిలేని బలమున సంగ్రామమందు అజేయత్వము ధర్మ ప్రాధాన్యము, త్రైలోక్య దర్శనము, సంతాన ప్రాధాన్యము చాతుర్వర్ణ్య వ్యవస్థాపము అనను లక్షణములను వరముగ ఒసగెను. ఇందువలన బలి పరమశాంతిపడసెను. కాలక్రమమున నతడు స్వస్థానమును (పాతాళమును) చేరెను. అంగాదుల పేర ఆయా దేశములు; తపసిద్ధి అందియున్నవి.
అంగుని కొడుకు దధివాహనుడు. వాని కొడుకు దివిరధుడు. వాని పుత్రుడు ఇంద్రతుల్య పరాక్రముడు. విద్వాంసుడు అగు ధర్మధ్రుడు వాని పుత్రుడు చిత్రరథుడు, ధర్మరథుడు కాలంజరాద్రిపై యజ్ఞముచేసి ఇంద్రునితో గూడి సోమపానము చేసెను. చిత్రరథుని తనయుడు దశరధుడు, లోమపాదుడను ఖ్యాతినందెను. ఆయన కూతురు శాంత. ఆ దశరధునికి శాంత భర్తయైన ఋష్యశృంగుని అనుగ్రహముచే చతురంగుడను వాడు వంశోద్ధారకుడై జన్మించెను.చతురంగునికి పృథలాక్షుడు. వానికి చంపుడు అనుకొడుకు పుట్టెను. (ఈతని రాజధానియే చంపాపురి. ఇంతకుముందు ఈ నగరము ‘మాలిని’ అనబడెను) అతనికి పూర్ణభద్రుని ప్రసాదమున హర్యంగుడు గల్గెను. వైభాండకి (ఋష్యశృంగముని) మంత్రములతో ఇంద్రుని ఉత్తమ వాహనమైన ఐరావతమును ఆ హర్యంగుని ఏనుగుగా భూమికి దింపెను. హర్యంగుని తనయుడు ఛద్రరథుడను రాజు. వాని కొడుకు బృహత్కర్మ అను నరేంద్రుడు, వాని పుత్రుడు బృహద్గర్భుడు వానితనయుడు బృహన్మనుడు, రాజేంద్రుడగు వాని కుమారుడు జయద్రధుడు, వాని పుత్రుడు దృఢరథ మహారాజు. వాని సుతుడు విశ్వజిత్తయిన జనమే జయుడు. వానికుమారుడు వైకర్ణుడు. వానిపుత్రుడు వికర్ణుడు. వానికి నూర్గురు కొడుకులుకల్గిరి. వారంగ వంశవర్ధనులు, అంగవంశ రాజులను అందరిని తెల్పియుంటిని. వారందరు సత్యవ్రతులు. మహాత్ములు, సంతాన వంతులు, మహారథులు, రౌద్రాశ్వ తనయుడైన ఋచేయుని వంశమిక వర్ణించెద; వీనుడు.
ఋచేయుని తనయుడు మతినారుడు. వానికొడుకులు పరమ ధార్మికులు ముగ్గురు. వసురోడుడు. సుబాహువు అనువారు. అందరు వేదవిదులు. బ్రహ్మణ్యులు. సత్య సంగరులు. మతినారుని కూతురు ఇల. ఆమె స్త్రీ అయ్యు బ్రహ్మవాదిని అయ్యెను. ఆమె తంసుని భార్య. వారికొడుకు రాజర్షి, ప్రతిభాశాలియైన ధర్మనేత్రుడు. ఆయన బ్రహ్మవాది. పరాక్రమవంతుడు. అతనిభార్య ఉపదాసవి. వారికి దుష్యంతుడు, సుష్మంతుడు, ప్రవీరుడు, అనఘుడు అనువారు నల్గురు కుమారులు.
దుష్యంతునికి శకుంతల యందు ఉదయించినవాడు భరతుడు. సర్వదమనుడను ఖ్యాతినందెను. అతడు పదివేల ఏనుగుల బలముగలవాడు. చక్రవర్తి. ఆయన పేరనే భారత వర్షము. అందలి ప్రజలు భారతులను పేరును పొందిరి. భరతుని తనయులు మాతృశాపమున నశించిరి. ఆ కథ ముందు తెలిపితిని.
బృహస్పతి (అంగిరస్సు)యొక్క కుమారుడు భరద్వాజుడు భరతునిచే పెక్కు యాగములు చేయించెను. కాని అవి పుత్ర సంతానము విషయములో వితధములు (వ్యర్ధములు) కాగా భరద్వాజుని వలన (నియోగమువలన) ఆతనికి వితథుడను పుత్రుడు కలిగెను. వాడు కలిగిన వెంటనే భరతుడు దివమునకు వెళ్ళెను. అతనికి పట్టము గట్టి భరద్వాజుడు వనమున కేగెను.
వితధునికి ఐదుగురు సుతులు కల్గిరి. సుహోత్రుడు, సుహోత, గయుడు, గర్గుడు. కపిలుడు అనువారు. సుహోత్రుని కొడుకులు సత్యవాదియగు కాశికుడు నరపతియగు గృత్సమతి అనువారు. గృత్సమతి పుత్రులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులును. కాశికుని కుమారుడు (కాశేయుడు) దీర్ఘతపుడు. దీర్ఘతపుని కుమారుడు విద్యాంసుడైన ధన్వంతరి. ఆయన కుమారుడు కేతుమంతుడు వాని కుమారుడు విద్వాంసుడైన భీమరధుడు. వాని కుమారుడు వారణాసి ప్రభువగు దిశోదాసుడు. దిశోదాసు కొడుకు ప్రతర్ధనుడు వీరుడైన ప్రభువు ఆతని కుమారులు వత్సడు, భార్గవుడు. వత్సరాజ పుత్రుడగు అలర్కుడను రాజు బుద్ధిమంతుడు. హైహయుని దాయాద్యమును (రాజ్యమును)హరించెను అంతియ గాక దివోదాసుడు హరించిన పితృ రాజ్యమును తిరిగి సంపాదించుకొనెను.
అలర్కుడు కాశీరాజు బ్రహ్మణ్యుడు సత్యసంగరుడు అరువది ఆరువేల ఏండ్ల యువకుడై రూప సంపన్నుడై ఉండెను. లోపాముద్ర ప్రసాదమున దీర్ఘాయువు పొందినాడు. చివరి వయస్సున క్షేమక రాక్షసుని చంపి రమ్యమైన వారాణసీ నగర నిర్మాణము చేసెను. అలర్కుని కొడుకు క్షేమకుడు వానిసుతుడు వర్షకేతుడు. వాని తనయుడు విభువు. విభుని కొడుకు అనర్తుడు. సుకుమారుడు వాని కొడుకు, వాని తనయుడు సత్యకేతువు ధర్మమూర్తి. వత్సునకు వత్సభూమి. భార్గవునివలన భర్గభూమియు కలిగెను. భార్గవ వంశము నందు అంగిరసుని పుత్రులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగలరు.
బ్రాహ్మణోత్తములారా! అజమీఢుని వంశమును గురించి మీరు విందురుగాక! సుహోత్రుని పుత్రుడు, బృహన్నామకుడు వానికి తనయులు ముగ్గురు. అజమీఢుడు ద్విమీఢుడు-పురుమీఢుడు. ఆజమీఢుని భార్యలు నీలిని, కేశిని, ధూమిని, అనువారు ఆజమీఢునకు కేశినియందు ప్రతాపవంతుడగు జహ్నువు కలిగెను. అతడు సర్వమేధమను మహాసత్రయాగ మొనరించెను. గంగాదేవి ఆయనను భర్తగా భావించి వినీతురాలివలె అభిసరించెను. అతడు ఇష్టపడకున్నంత అతని యజ్ఞసదస్సును ముంచెత్తెను. జహ్నువు అందులకు కోపించి ఇదిగో నీ నీరమును సంక్షేపించి త్రాగెదను చూడుమని త్రాగివైచెను. ఋషులు చూచి ఆమెను అతని కుమార్తెగా ఒనర్చిరి. యవనాశ్వుని కూతురగు కావేరిని అతడు పరిణయ మయ్యెను. గంగా శాపమున అటుతరువాత కావేరియొక్క సగము మేను నదీరూపమయ్యెను. జహ్నుని తనయుడు అజకుడు. వాని కుమారుడు బలాకాశ్వుడు. వాని సుతుడు మృగయా ప్రియుడు కుశికుడు. అడవిజాతులతో పెరిగినాడు. అతడు ఇంద్రతుల్యుడగు సుతుడు కావలెనని తపము చేసెను. ఇంద్రుడు హడలి గాధియను పేరుతో తానే స్వయముగ వానికి ఉదయించెను. గాధి తనయుడు విశ్వామిత్రుడు. అష్టకుడు అతని కొడుకు. వాని కొడుకు తౌహీ. ఇది జహ్ను గణము.
అజమీఢుని రెండవ వంశము. అజమీఢునికి నీలియందు సుశాంతి పుట్టెను. వానిది పురుజాతి, వానికి వాహ్యాశ్వుడు కల్గగా, వానికి అయిదుగురు పుత్రులు కల్గిరి. ముద్గలుడు సృంజయుడు, బృహదిషురాజు. పరాక్రమ శాలియగు యువీనరుడు, కృమీలాశ్వుడు అనువారు. ఈ అయిదుగురు దేశములను రక్షింప జాలుదురు అని ప్రసిద్ధి.
ముద్గలుని దాయాదుడు మౌద్గల్యుడు. ఆయన వలన ఇంద్రసేన ప్రధృశ్వుడను కొమరుని గన్నది. సృంజయుని కుమారుడు పంచజనుడనువాడు. వాని కొడుకు సోముదత్తుడు. వాని కొడుకు కీర్తిశాలి సహదేవుడు. వానిపుత్రుడు సోమకుడు. అజమీఢ వంశము యొక్క క్షీణదశలో సోమకుడు పుట్టెను. వాని కొడుకు జంతువు. వానికి నూర్గురు కుమారులు. వారిలో చిన్నవాడు వృషతుడు. వాని కొడుకు ద్రుపదుడు. ఇంతవరకు అజమీఢ వంశము గురించి చెప్పబడినది. వారు సోమకులను పేరుతో ప్రఖ్యాతి పొందిరి.
మునిశ్రేష్ఠులారా! అజమీఢుని మహిషి ధూమిని పతివ్రత. వ్రతాచరణపరాయణ. సంతతికై పదివేలేండ్లు దుశ్చరమైన తపమాచరించి అగ్ని హోత్రము సేయుచు మితభోజనయై అగ్నిహోత్ర సమీప దర్భలందు శయించెను. ఆమెతో అజమీఢుడు సమావేశమంది, ధూమ్రవర్ణుడు, చక్కనివాడగు ఋక్షుడను కుమారుని గాంచెను. ఋక్షుని వలన సంవరణుడు వానికి కురువుగల్గెను. అతడు ప్రయాగ నుండి వెళ్ళి కురుక్షేత్రము నిర్మించెను. అది పవిత్రము, రమణీయము, పుణ్యవంతులచే సేవింపబడునది. ఆయన వంశీయులే కౌరవులు. కురుని కుమారులు నల్వురు. సుధన్వుడు, సుధనుడు, పరీక్షిత్తు మహాపరాక్రమవంతుడగు అరిమేజయుడు. పరీక్షిత్తు కొడుకులు జనమేజయుడు, శ్రుతసేనుడు, ఆగ్రసేనుడు, భీమసేనుడు. వీరందరు శూరులు, బలశాలురు. జనమేజయుని తనయుడు బుద్ధిశాలియగు సురధుడు. వాని సుతుడు విదూరథుడు. వాని కొడుకు మహారథుడగు ఋక్షుడు. రెండవ వాడు భరద్వాజుని వలన అదే పేర ప్రఖ్యాతిపొందెను. సోమ వంశమందు ఇద్దరు ఋక్షులు, ఇద్దరు పరీక్షిత్తులు, ముగ్గురు భీమసేనులు, ఇద్దరు జనమేజయులు గల్గిరి. రెండవ ఋక్షునికి భీమసేనుడు ఉదయించెను. వానికి ప్రతీవుడు. వానికి శాంతనుడు. దేవాపి, బాహ్లీకుడు అను మువ్వురు పుత్రులు కల్గిరి. శాంతనునికి భీష్ముడు ఉదయించెను.
బ్రాహ్మణులారా! బాహ్లీకుని వంశము వినుడు. బాహ్లీకునికి కీర్తి శాలియగు సోమదత్తుడు, వానికి భూరి భూరిశ్రవుడు, శలుడు. దేవాపిముని. అతడు దేవతలకు ఉపాధ్యాయుడు అయ్యెను. చ్యవన పుత్రుడు కృతకుడు అతనికి ఇష్టుడయ్యెను. శాంతనుడు కౌరవ శ్రేష్ఠుడు. అతడు రాజయ్యెను.
త్రిలోక ప్రసిద్ధమైన శంతను వంశము తెల్పెద. శంతనుని వలన గంగదేవ్రతుని కన్నది. అతడే భీష్ముడు. (గాంగేయుడు), పాండవులకు పితామహుడు. శంతనుని భార్య కాళి విచిత్రవీర్యుని గాంచెను. విచిత్ర్య వీర్యుని క్షేత్రమందు (భార్యయందు) కృష్ణ ద్వైపాయనుని వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టిరి.
ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధనాదులు నూర్గురు గల్గిరి. దుర్యోధనుడు రాజరాజయ్యెను. పాండురాజు కుమారుడు ధనంజయుడు. ఆయనకు సౌభద్రుడు (సుభద్ర కొడుకు) అభిమన్యుడు పుట్టెను. వానికి పరీక్షిత్తు పారిక్షిత్తుఁ (జనమేజయుడు) వానికి కాశియందు ఇద్దరు సుతులు పుట్టిరి. మహారాజగు చంద్రాపీడుడు, మోక్షజ్ఞుడగు సూర్యాపీడుడు అనువారు. చంద్రాపీడుని కొడుకులు నూరుమంది. వారు మంచి విలుకాండ్రు, జానమేజయమను పేర ఈ క్షాత్రవంశము ప్రసిద్ధికెక్కినది.
అందు మొదటివాడు సత్యకర్ణుడు వారణాసీ నగరమందు ఉండెను. ఈతడు పరాక్రమశాలి, యజ్వ. విపుల దక్షిణుడు, వాని దాయాదుడు శ్వేతకర్ణుడు. ప్రతాపశాలి. అపుత్రకుడై వనమున కేగెను. అతనివలన వనమున యదువంశమునందు పుట్టినదియు సుచారుని కుమార్తెయు అగు మాలిని (గ్రాహమాలిని) గర్భవతి కాగా శ్వేతకర్ణుడు పూర్వము సంకల్పించిన మహాప్రస్థానమున కేగెను. మాలినియు ప్రియుని వెంబడించి మార్గమందు సుకుమారుడైన కుమారుని ప్రసవించెను. ఆ శిశువును అక్కడనే విడిచి, మహాప్రస్థానమున పతుల ననుగమించిన ద్రౌపదివలె మహానుభావురాలగు ఆమె రాజు ననుగమించెను.
ఆ విడిచిపెట్టిన శిశువు పర్వతమందు ఏడ్చుచుండగా, దయచూప మేఘములు ఆ మహాత్మునికి నీడ ఇచ్చెను. శ్రవిష్ఠా కుమారులు ఇద్దరు పైప్పలాది కౌశికుడను వారు జాలి గొని అబాలుని జలమునందు కడిగిరి. అంతకుముందే ఏడ్చుచు పాషాణ మందు దొరలిన ఆ బాలుని రక్తసిక్తమైన శరీరము యొక్క ఇరుపార్శ్వములు మేకవలె నలుపు ఎక్కినవి. అందువలన ఆ బాలునికి ఆ మునులు అజపార్శ్వుడు అను పేరుపెట్టిరి. అతడు రేమకుని ఇంట ఇద్దరు బ్రాహ్మణులచే పెంచబడెను. రేమకుని భార్య అతనిని తన పుత్రునిగా ఎత్తుకొనగా ఆమెకు అతడు కొడుకయ్యెను. అతనికా బ్రాహ్మణులు మంత్రులైరి.
వారి పుత్ర పౌత్రులు సమాన జీవనులైరి. ఇది పౌర వంశచరిత్ర. మహానుభావులైన పాండవులగాథ. ఈ విషయములో పరమ ప్రీతినందిన ధీమంతుడగు నహుష కుమారుడగు యయాతిచే వార్ధక దశలో క్రింది చెప్పబడిన అర్థముగల శ్లోకము ఒకటి గానము చేయబడినది. ఈ భూమి చంద్రార్క గ్రహశూన్యమైన కావచ్చును. కాని ఎన్నటికి అపౌరవము కాదు. అనగా పురువంశాంకురము ఎన్నటికిని ఉండకపోదు. ఇది పౌరవంశ చరిత్ర. దీనిని మీకు నేను విస్తరముగా తెలిపితిని.
ఇక తుర్వసువు ద్రుహ్యుడు, అను యదువుల యొక్క వంశములను చెప్పెదను. తుర్వసుని కొడుకు వహ్ని వాని కొడుకు గోభానుడు. అతని కొడుకు ఐశానుడు. ఇతడు రసరాజితుడు. వాని కుమారుడు కరంధముడు. వానిపుత్రుడు మరుత్తుడు. మఱియొక అవిక్షితుని పుత్రుడగు మరుత్త మహారాజు నాచే ఇంతకుముందు చెప్పబడెను.
మరుత్తు విపుల దక్షిణములైన యజ్ఞములు ఆచరించెను. వానికి సంతతి లేదు. సంయత అను కూతురు మాత్రము కల్గెను. ఆమె యజ్ఞదక్షిణగా సంవర్తునకు ఈయబడినది. ఆమె దుష్యంతుడు అను కుమారుని కనెను. ఇట్లు యయాతి శాపముచే తుర్వసు వంశము పురువంశములో చేరెను.
దుష్యంతుని కుమారుడు కరూరోముడనురాజు. వాని కొడుకు ఆహ్లీదుడు. అతనికి నల్గురు కుమారులు, పాండ్యుడు, కేరశుడు, కాలుడు. చోళరాజు అనువారు. దృహ్యుని కుమారుడు బభ్రుసేతు మహారాజు. అతని కొడుకు అంగారసేతుడు. అతడు మరుత్తులకు రాజు. ఆ వీరుడు యౌవనాశ్వునిచే అతికష్టముతో యుద్ధమందు కూల్చబడెను. పదునాలుగు మాసములా ఘోర యుద్ధము జరిగెను. అంగార సేతువు కొడుకు గాంధారుడు. అతనిపేరనే గాంధారమను దేశము ప్రఖ్యాతి కెక్కెను. గాంధార దేశమందలి గుఱ్ఱములు ప్రశస్తములు.
అనువు కొడుకు ధర్ముడు, ధర్ముని కొడుకు ద్యూతుడు. వాని కొడుకు వనదహుడు. వాని కొడుకు ప్రచేతనుడు. వాని కొడుకు సుచేతనుడు. ఇట్టి వంశానుక్రమముగల తుర్వసు వంశీయులు నాచేత చెప్పబడిరి. యదు కుమారులు దేవకుమారతుల్యులు ఐదుగురు. సహస్రాదుడు, పయోదుడు, క్రోష్ఠ నీలుడు, అంజికుడు. సహస్రాదుని కొడుకులు పరమధార్మికులు ముగ్గురు. హైహయుడు, హయుడు వేణుహయరాజు. హైహయుని కుమారుడు ధర్మనేత్రుడు. వాని కొడుకు కార్తుడు. వానికొడుకు సాహంజుడు, వాని పేర ‘సాహంబని’ అను పురము ఏర్పడెను. మహిష్మంతుని కొడుకు భద్రశ్రేణ్యుడు, ప్రతాపశాలి. వాని తనయుడు దుర్దముడు. వాని తనయుడు బుద్ధిమంతుడు కనకుడు. వాని కుమారులు నల్గురు. కృతవీర్యుడు, కృతౌజనుడు, కృతధన్వుడు, కృతాగ్ని. వీరిలో కృతవీర్యుని తనయుడు అర్జునుడు (కార్తవీర్యార్జునుడు),
ఇతడు సప్త ద్వీపములు ఏలెను. వేయిబాహువులు కలవాడు. సూర్యునట్లు వెలుగు రథముతో ఒక్కడు వసుధామండలమెల్ల జయించెను. పదివేల ఏండ్లు దుశ్చరమైన తపము చేసి దత్తాత్రేయులను ఆరాధించెను. దత్తగురుడు అతనికి నాల్గు వరములు ఇచ్చెను. వేయి చేతులు కల్గుట, అధర్మమునుండి సజ్జనులను రక్షించుట, స్వభూమండలము జయించి ధర్మమున ప్రజారంజనము చేయుట, రణరంగమున అనేకమందిని జయించి, చివరకు రణరంగంలోనే సర్వాధికుడైన వానిచేతిలో వధింపబడుట అనునవి ఆ వరములు. యుద్ధము చేయుచుండగా యోగశక్తిచే యోగీశ్వరునికి వలె బాహుసహస్రము ఆవిర్భవించు చుండును. అతడు సముద్రములు. నగరములు, పట్టణములతో గూడినవి అగు సప్తద్వీపయైన వసుంధరను ఎల్లను గెల్చుకొనెను. ఏడు ద్వీపములందు నేడువందల యజ్ఞముల నతడు నిర్వహించెను. అన్ని యజ్ఞములు శతసహస్రదక్షిణములు, అన్నియు కాంచన యూపములు, కాంచన వేదికములు. అన్నిటను సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసలు అలంకరించుకొని విమానములపై యరుదెంచి నిత్యము నాతని యజ్ఞము నలంకరించిరి. ఆ యజ్ఞమందు దేవర్షియు, వరీదాసు కొడుకును గంధర్వుడును విద్వాంసుడునగు నారదుడు అతని మహిమ కధరువడియతని జన్నమందు ఈ గాధలను గానము చేసెను.
నారదుడు పాడిన గాథలివి-యజ్ఞ దాన తపస్సులచే, విక్రమముచే, శ్రుతముచే (పాండిత్యముచే) కార్తవీర్యార్జునుని స్థితి ఏ రాజును పొందజాలడు. సప్త ద్వీపములందును జనములకు ఆతడు డాలు, కత్తి, రథముకలవాడై, యోగియై, ఎట్టయెదుట కనబడుచుండును. ద్రవ్య నష్టము, శోకము, విభ్రమము అనునవి ధర్మపాలనలో ఉండు ఆతనికి లేవు. సర్వరత్న భాజనుడు, సమ్రాట్టు, చక్రవర్తియును అతడే పశుపాలకుడు, క్షేత్రపాలుడును గూడ అయ్యెను. యోగి అగుటచే ఆ కార్తవీర్యార్జునుడు వర్షించుటలో పర్జన్యుడు అయ్యెను. మేఘము తానే అయ్యెను. వింటినారి దెబ్బలచే కఠినమైన చర్మముగల బాహుసహస్రముచే అతడు శరత్కాలమందు వేయి కిరణములచే వెలుగొందు భాస్కరునివలె తేజరిల్లెను.
మాహిష్మతీ నగరమందు కర్కౌటకుని కొడుకులను నాగులను జయించి వారిని ఆ నగరమందే మనుష్యులలో ఉంచెను. పద్మనయనుడగు అతడు వర్షాకాలమునందు విలాసముగా తన బాహువులచే ఉబికిన సముద్ర వేగముచే నడనీటివాలును ఎదురెక్కించెను. క్రీడించుచున్న ఆ కార్తవీర్యార్జునిచే తిరస్కృతయై ఆతడు ఏలు గ్రామములను మాలాకారమున చలించు వేలకొలది కెరటములతో చుట్టుకొనిపారు నర్మదానది భయపడుచు అతనికి అభిముఖముగా వచ్చెను. అతడు వేయిచేతులచే సముద్రమును క్షోభింపచేయగా పాతాళవాసులగు మహాసురులు భయపడి నిశ్చేష్టులయి సముద్రమందు నక్కినక్కిదాగిరి. మహాతరంగములు చూర్ణితములు అయ్యెను. మహామీన తిమింగలాది జలజంతువులు చలించిపోయెను. నురుగురాసులు గాలిచే భగ్నమాయెను. సుడులు సంకులము లయ్యెను. ఇట్లు ఆతడు మందరగిరి మథన పరిక్షిప్తమగు క్షీరాబ్ధినట్లు అబ్ధిని సంక్షోభపరచెను. అమృతమథన మందువలె శంకితులయి వేలకొలది నాగులు తటాలున లేచి వెఱచుచు రాజవరుని తిలకించి పడగలువంచి వినతులై సాయాహ్నమందు వాయు కంపితములైన అరటి బోదెల గుంపులట్లు వణకుచు అతని శరణమందిరి. అతడు శర పంచకముచే రక్తముకారి తడిసిపోయిన సేనాసమేతులైన లంకేశ్వరుని అల్లె త్రాళ్ళతో బంధించి మోహింపజేసిలోగొని మాహిష్మతీ నగరమున బంధించెను.
తన కుమారుడట్లు కార్తవీర్యార్జునిచే బంధితుడగుట విని పులస్త్యబ్రహ్మ (రావణుని తండ్రి) కార్తవీర్యార్జునుని దర్శించి యాచించిన మీదట రావణుని అతడు విడిచిపుచ్చెను. వాని బాహు సహస్రముచే కావింపబడిన ధనుష్టంకారము ప్రళయసమయ పర్జన్య ఘోషణ భీషణమ్మై పిడుగులు పడినట్లు బెట్టదమాయెను. ఏమి ఆశ్చర్యము! భార్గవరాముని పరాక్రమము కార్తవీర్యుని బాహుసహస్రమును హేమతాళ వనంబునట్లు భేదించెను. దప్పికగొని అగ్ని ఒకప్పుడు కార్త్యవీర్యుని భిక్షమడుగ, ఆవీరుడు ఆయనకు పురములు, గ్రామములు, ఘోషములు, పల్లెలు దేశములతోడి సప్తద్వీపములను భిక్షగనొసంగెను. అగ్ని ఆవినోదమును తెలుసుకొనవలెనని అన్నిటిని దహించివేసెను. కార్తవీర్యుని ప్రభావముచే అగ్ని అట్లు పర్వతములు, వనములతో గూడ దహించెను. వరుణ కుమారుడావపుడను వాని యాశ్రమము గూడ కార్తవీర్యునితోగూడి మసిసేసెను. వరుణ కుమారుడు తేజస్వియు, ఉత్తముడు అగు వశిష్ఠుడనువాడు. ఆ ముని అపవుడను ప్రఖ్యాతినందెను, అపవుడు కోపించి అర్జునుని శపించెను. ఓరీ! హైహయ! నేను నివసించు వనమును గూడ విడువ వైతివి. కావున నీ చేసిన దుష్కర్మమును మరొక్కడు నాశనము సేయగలడు. రాముడను పేరుగల మహావీరుడు, జమదగ్నికి కుమారుడుగా ఉదయించి నీ వేయిబాహువులు నరికి, ఆ బ్రాహ్మణ తపస్వి నిన్ను సంహరింపగలడు అనెను. ఏ కార్తవీర్యునకు ద్రవ్యనాశనము లేదో! ఆ కార్తవీర్యార్జునునికి ఇంతకుముందు పొందిన వరములు అన్నియు ఈరీతి ఫలించెను. ప్రబలుడైన వానిచేతిలో మరణము అతడు కోరుకొనెను. కోరినట్లు ఆపన మహాముని శాపము వలన పరశురాముని చేతిలో అతడు వీరస్వర్గము పొందినాడు.
ఆ కార్తవీర్యునకు కుమారులు నూర్గురు. అందు ఐదుగురు మిగిలిరి. వారు బల శాలురు, శూరులు, ధర్మపరులు, కీర్తిశాలురు. శూరశేనుడు, శూరుడు, వృషణుడు, మధుపధ్వజుడు, జయధ్వజుడు అనువారు. జయధ్వజుడు అవంతీదేశమును ఏలినవాడు. జయధ్వజుని తనయుడు తాలజంఘుడు. వాని కుమారులు నూర్గురు తాలజంఘులు అనుపేర బరగిరి. హేహయుల వంశమందు నీతిహోత్రులు, సువ్రతులు, భోజులు, అవంతులు, తౌండికేరులు, తాళజంఘులు ప్రసిద్ధులు. భరతులు, సుజాతులు మొదలగువారు పెక్కుమంది కూడా ఉన్నందున వారిని పేర్కొనశక్యముగాదు. విప్రులారా! వృషుడు మొదలయిన యాదవులు పుణ్యాచరణ పరాయణులు, వృషుడు, వంశధరుడు (మూల పురుషుడు). వాని కుమారుడు మధువు వానికి నూర్గురు కుమారులు. అందు వృషణుడు వంశకర్త. వాని సంతతి వృష్ణులు. మధువను వాని సంతతి మాధవులైరి. యదువుపేర యాదవులని హైహయులు పేరందిరి. కార్తవీర్యుని జన్మచరిత్ర కథనము నిత్యము పఠనము చేయువానికి విత్తనాశము కలుగదు. పోయిన సొత్తు దొరకును. మహామునులారా! ఇవి యయాతి కుమారులు అయిదుగురి వంశములు.
యయాతి కుమారులు అయిదుగురు పంచ భూతములవలె లోకములను ధరించి నారు. కావున వారి చరిత్ర సంకీర్తనముచే ఈ చరాచరాత్మక పంచభూతజగత్తు ఎల్ల ధరింపబడును. ఉద్ధరింపబడును. ఈ పంచవంశ విసర్గము విన్నరాజు ధర్మార్ధ నిపుణుడు వశియును (జితేంద్రియుడు) కాగలడు. అయిదు పరములందగలడు. అవి ఆయువు, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, విభూతి, ఈ పవిత్ర చరిత్ర ధారణమువలన, శ్రవణము వలన ఈ చెప్పిన ఫలము నిశ్చయము. కోష్టువంశము ఇంకను తెల్పెద వినుడు. యజ్ఞ కర్త ధర్మాత్ముడు వంశధారకుడు అగు యదుక్రోష్టువుల వంశముల వృత్తాంతము సర్వపాప విమోచకము. ఈ వృష్టి వంశమందు శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణ రూపమున అవతరించెను. (13)