లోమహర్షణుడు ఇట్లు అనియె .....
సత్యవ్రతుడు భక్తితో, కృపతో, పట్టుదలతో, వినయముతో, విశ్వామిత్రుని భార్యను పోషించెను. మృగముల వేటాడి తెచ్చిన మాంసమును అముని ఆశ్రమ సమీపమున చెట్టు కొమ్మకు వ్రేలాడగట్టెను. ఉపాంశువ్రతమూని (ఇందియములను, మనసును నిగ్రహించి-చేయు వ్రతము) ద్వాదశవార్షిక (పన్నెండు సంవత్సరముల) దీక్షగొని తండ్రి ఆ దేశమున ఆదేశమందు వసించెను. యజ్ఞకర్తలకు కులగురువులకుగల సంబంధము అనుసరించి, వశిష్ఠుడు అయోధ్యా రాజ్యమును రాణివాసమును తానే పర్యవేక్షించెను. సత్యవ్రతుడు మాత్రము అజ్ఞానము వలన భావి దైవఘటనము వలనను కులగురువగు వశిష్ఠుని యెడ అధికమైన క్రోధము వహించెను. తండ్రి కుమారుని బహిష్కరించు తఱి వశిష్టుడు పెక్కు కారణములచే వలదనడయ్యెను. పాణిగ్రహణ మంత్రములకు సప్తపదితో సమగ్రత యేర్పడును కావున సత్యవ్రతుడు సప్తపదిలో కన్యను అపహరింప లేదు. ఓ బ్రాహ్మణులారా! వశిష్ఠుడు ఆ ధర్మ మెఱిగియు, నన్ను రక్షించుట లేదని సత్యవ్రతుడు వశిష్ఠునిపై కోపము వహించెను. వశిష్ఠ భగవానుడు గుణబుద్ధితోనే అట్లు చేసెను. కాని సత్యవ్రతుడు వానిని తటస్థునిగ తలంచెను. తండ్రియగు వశిష్ఠునకు కుమారుడగు సత్యవ్రతునిపై అసంతుష్టి కలిగెను.
ఆ కారణమున ఆ రాజ్యమున ఇంద్రుడు పండ్రెండు సంవత్సరములు వర్షములు లేకుండజేసెను. అందులకు ప్రాయశ్చిత్తముగా సత్యవ్రతుడు ద్వాదశవార్షికమైన కఠోరదీక్షను పూనగలడని దానివలన నీకులమునకుఁగల కళంకము పోగలదని ఎఱిగియే వశిష్ఠుడు ఆనాడు అడవికి పోవుటను వలదనడయ్యెదు. అటుతరువాత మాంసము కరవై, సత్య వ్రతుడు క్షుధాతురుడై క్రోధ మోహములచే మిక్కిలి శ్రమించి వశిష్ఠుని కామధేనువును హరించెను. తాను వసించు దేశ ధర్మమును అనుసరించి అటవిక క్రూరవృత్తిచే దానిని చంపి ఆమాంసమును విశ్వామిత్రుని కుమారులచే కూడ తినిపించెను. అది విని వశిష్ఠుడు అతని ఎడ కోపముతో ఇట్లు అనెను. “ఓరి క్రూరుడా! ఇపుడు గురుధనమగు గోవును అపహరించి సంహరించుట ఆ మాంసమును ప్రోక్షింపకయే ఆరగించుట అను ఈ రెండు శంకువులను (పాపములను) చేసియుండక పోయెన యెడల తండ్రియే చేసిన నీ మొదటి అపరాధమును నిస్సంశయముగా పోగొట్టి ఉండెడివాడను. ఇప్పుడు మూడు శంకువులను జేసి, నీవు త్రిశంకువైతి” అని వశిష్ట మహర్షి పలికెను. అటు తరువాత తన కుటుంబ భరణము చేసినాడని ప్రీతుడై విశ్వామిత్రుడు వరమేదేని అడుగుమగా ఆ నృపకుమారుడు అశరీర స్వర్గము అనుగ్రహింపుమని యాచించెను. అనావృష్టి భయము పోయిన తరువాత విశ్వామిత్రుడు వానిని తండ్రి రాజ్యమున అభిషిక్తుని జేసి సశరీర స్వర్గము కొఱకు యజింపజేసెను. దేవతలు, వశిష్టులు చూచుచుండగనే వానిని ఆ ముని స్వర్గ మెక్కించెను.
ఆరాజు భార్య సత్యరధ కేకయ వంశజురాలు! ఆమె పుణ్యాత్ముడగు హరిశ్చంద్రుడను కుమారుని కనెను. ఆ హరిశ్చంద్రుడు త్రైశంకవుడు (త్రిశంకుని కుమారుడు) అనుపేర ప్రఖ్యాతి నందెను. రాజసూయము కావించి సమ్రాట్టు (చక్రవర్తి) అని యశమందెను. ఆయన పుత్రుడు రోహితుడు. అతని కొడుకు హరితుడు. హరితుని కొడుకు చంచువు. చంచువు పుత్రుడు విజయుడు. అతడు సర్వంసహా (భూమి) విజేత. అందువలన అతడు విజయుడు అనబడెను. వాని కొడుకు రురుకుడు. ధర్మార్థ కోవిదుడైన రాజు. వాని కొడుకు వృకుడు. వాని కుమారుడు బాహువు. హైహయులు-తాలజంఘులు ఆ రాజును జయించిరి. అతని భార్య గర్భవతియై ఔరుని ఆశ్రమమందు చేరెను. బాహువు కుమారుడు సగరుడు. అతడును ధర్మపరుడు, సత్యనిష్ఠుడు. కృతయుగము వాడు. తల్లికి సవతిపెట్టిన గరముతో (విషముతో) బాటు పుట్టినందున సగరుడని పేరొందెను. ఔర్వుని ఆశ్రమమునందు జనన సమయమున శుక్రుని రక్షణము పొంది క్షేమముగా జన్మించెను. ఆ భార్గవుని వలననే ఆగ్నేయాస్త్రమును పొంది తాలజంఘులను హైహయులను సంహరించి, భూమండలమెల్ల జయించెను. శక పహ్లవ పారదులను పేరబరగిన క్షత్రియుల యొక్క ధర్మమును (నాస్తిక ధర్మమును) ఖండించెను.
ఈ విధముగా లోమహర్షణుడు చెప్పి ఇంకను సందేహములు కలవా తెలుపుడని ప్రశ్నింపగా ఆ మహామునులు
“సగరుడు విషముతో ఎట్లు జనించెను? శకాదుల ధర్మములను క్రుద్ధుడై ఏల నిరసించెను. ఈ కథ మాకు సవిస్తరముగ ఆనతిమ్ము” అని అడిగిరి. లోమహర్షణుడు ఇట్లు అనియె.
బాహువు వ్యసని అయినందున హైహయులు, తాలజంఘులు, శకులును అతని రాజ్యమును అపహరించిరి. హైహయుని పక్షమున శకులు, యవనులు, పారదులు, కాంభోజులు, పహ్లవులు అను ఐదు గణములవారుకూడ చేరిరి. రాజ్యము పోయి బాహువు వనమున కేగెను. పత్నియు అతని వెంటచనెను. అతడక్కడ ప్రాణములు విడిచెను. అప్పటికతని భార్య గర్భవతి. ఆమెకు సవతి గరము (విషము) పెట్టెను. వనమందు ఆ సాధ్వి భర్తతో సహగమనము చేయుటకు చితి ఎక్కెను. భృగువంశీయుడైన జౌర్వుడు అను ముని ఆమెపై జాలిపడి ఆమెను మరణ ప్రయత్నమునుండి నివారించెను. ఆయన ఆశ్రమమందు ఆ శిశువు గరముతోగూడ జన్మించెను. అందుచే సగరుడను పేరు పొందెను.
జౌర్వుడు అతనిని వేదశాస్త్రములు చదివించి, ఆగ్నేయాస్త్రమందు శిక్షణ యొసంగెను. క్రుద్ధుడైన రుద్రుడు పశువుల జంపునట్లు ఆగ్నేయాస్త్ర బలముచే హైహయుల వధించి మంచి కీర్తిని పొందెను. అవ్వల శక, యవన, కాంభోజ, పారద, పహ్లవులను నిశ్శేషముగా బరిమార్చుటకు పూనుకొనెను. వారు వశిష్ఠుని శరణు కోరిరి. ఆయన వారికి అభయమొసగి, సగరుని వారించెను, గురువచనములను ఆలించి ఆతడు వారినిగాక వారి ధర్మమును ఖండించి వారందరి వేషములను మార్చెను. వేషముల మార్పు ఎట్లు జరిగినదనగా, శకులకు అర్ధముండనము (సగము తల గొరుగుట) గావించి వదలెను. యవన, కాంభోజులకు సంపూర్ణముండనము (పూర్తి తల గొరిగింపు) గావించెను. పారదులను తల విరబోసికొన జేసెను. పహ్లావులకు గడ్డములను ఉంచెను. వారెల్లరును నిస్వాధ్యాయ (వేద విద్యనేర్చు అర్హత) వషట్కారులం (వేద పఠనములో అగ్నిలో హవిస్సులు వ్రేల్చెడి ధర్మము) గావించెను. అనగా యజన యాజనాది వేదకర్మ దూరుల చేసెనని భావము. శరాదులు కోణిసర్పులు మాహిషకులు దర్వులు, చోళులు, కేరళులు అనుపేర వారందరు క్షత్రియులే. కాని వారి ధర్మమాతనిచే నిరాకరింప బడినది. అనగా వెలివేయబడిరి. ఇదంతయు వశిష్ఠుని ఆజ్ఞచేతనే అతడు ఒనరించెను.
ధర్మముచే జయమందిన ఆ సగర చక్రవర్తి వసుంధరను గెల్చి అశ్వమేధ దీక్షగొని గుఱ్ఱమును వదలెను. ఆ గుఱ్ఱము తూర్పు, దక్షిణ సముద్ర ప్రాంత తీరమున సంచరించు చుండగా ఎవ్వనిచేతనో హరింపబడి భూమియందు ప్రవేశింపజేయబడెను. అపుడా రాజు తన కొడుకులు అఱువదివేల మందిచేత ఆ భూమిని త్రవ్వించెను. వారందఱు సముద్రము చొచ్చి భూమిని త్రవ్వి పోయిపోయి ఆది పురుషుడగు హరిని, కపిల రూపమున నున్న విష్ణువును కాంచిరి. ఆ సమయమున ఆ దేవుడు నిదురలో ఉండెను. వారి రాకచే గల్గిన చప్పుడు వలన అతడు కనులు తెఱచెను. అందుండి వెడలిన తేజస్సుచే ఆ సగరులు నల్గురు, తరువాయిగా అఱువది వేలమందియు దగ్ధులైరి. అప్పుడు దగ్ధమైనవారు పోగా, మిగిలిన సగర వంశవర్ధనులు బర్హికేతువు, సుకేతువు, భర్మరధుడు, శూరుడైన పంచజనుడు అనువారు మాత్రమే. భగవంతుడు కపిలుడు ఱేనికి ఇక్ష్వాకువంశము, అక్షయముగ ఉండునట్లును కీర్తిమంతమగునట్లు వరమును అనుగ్రహించెను. సముద్రుని కుమారునిగ ఇచ్చి అక్షయ స్వర్గవాస సౌఖ్యమునుగూడ ఒసంగెను. సముద్రుడు ఆ సగరుని కర్యముగొని వచ్చి యిచ్చి నమస్కరించెను. ఆ పుణ్యకర్మ ప్రభావముచే సముద్రుడు సాగరుడు గూడ అయ్యెను. (సముద్రుడు సగరుని కుమారుడని ప్రఖ్యాతి పొందెను) సగర చక్రవర్తి అన్యఅశ్వమేధాశ్వమును బడసి తిరిగి వచ్చి నూరశ్వమేధ యాగములు ఆచరించెను. అతని కుమారులే సాగరులను ప్రఖ్యాతి నందిన వారు అఱువదివేల మంది అని విన్నాము. అనవిని మునులు సగరునికి వీరులగు కుమారులు అఱువది వేల మంది ఎట్లు కల్గిరి? ఎట్లు విక్రమించిరో తెలుపుమన లోమహర్షణుడు ఇట్లనెను.
సగరునికి ఇద్దరు భార్యలు. విదర్భ దేశాధీశుని కూతురు కేశిని పెద్దభార్య. అరిష్టనేమి కూతురు మిక్కిలి అందగత్తె, మహతి అనునది రెండవది. ఔర్వుడు వారిని చూచి, అరువదివేలమంది కొడుకులు కావలెనో, వంశోద్ధారకుడైన కొడుకు ఒక్కడు కావలెనో కోరుకొండని వరమొసంగెను. ఒకతె అరువది వేలమంది కొడుకులను, మరొకతె ఒక్క వంశధరుడగు పుత్రుని కోరిరి. అంత ఆ మహాముని అట్లే అగుగాక అనెను.
పంచజనుడను మహాతేజస్వియగు రాజు ఒకతెకు గల్గెను. రెండవ ఆమె బీజపూర్ణమైన ఒక తుంబుని (సొరకాయను) ప్రసవించెనని ప్రసిద్ధి. అందు నువ్వు గింజలంత వారు అరువదివేల మంది శిశువులు ఉండిరి. సమయమును అనుసరించి సుఖముగ పెంపొందిరి. అమె వారిని ఘృత పూర్ణ (నేతితో నిండియున్న కుండల) కుంభములలో ఉంచెను. ఒక్కొక్కని పోషణమున ఒక్కొక్కతెదాదిని ఏర్పరచెను. పదినెలలలో క్రమముగ ఆ శిశువు లందుండి బయలుదేరి సగరునికి ప్రీతి వర్ధనులైరి.
నారాయణ తేజస్సున ప్రవేశించిన అమహానుభావులలో ఒకడు పంచజనుడనువాడు రాజయ్యెను. అతని కుమారుడు వీర్యవంతుడగు అంశుమంతుడు. అంశు మంతుని సుతుడు దిలీపుడు. ఖట్వాంగుడను పేర అతడు సుప్రసిద్ధుడు. ఈతడు స్వర్గము నుండి ఈ లోకమునకు వచ్చి ముహూర్త కాలముండి, బుద్ధితోను సత్యముతోను ముల్లోకముల ఒక్కటి చేసెను. దిలీపుని దాయాది భగీరథుడు. అతడు గంగను అవనికి అవతరింప జేసినవాడు. ఆ గంగను సముద్రమందు సంగమింప చేసిన మహానుభావుడు. నదులలో ఉత్తమోత్తమమైన గంగను ఆ విధముగా భగీరథుడు తన కూతురుగా చేసికొనెను. అందువలననే గంగ భాగీరథి అయ్యెను.
భగీరథుని కుమారుడు శ్రుతుడు. అతని పుత్రుడు నాభాగుడు. అతడు పరమోత్కృష్టమైనవాడు, ఉత్తముడు. నాభాగుని పుత్రుడు అంబరీషుడు (నాభాగి). సింధు ద్వీపుడు అనువానికి అతడు జనకుడు. సింధుద్వీపుని కొడుకు అయుతాజిత్తు. అతని కొడుకు ఋతుపర్ణుడు. అక్షహృదయ మెరిగిన ఘనుడు. అనగా పాచికల ఆటలో మిగుల నైపుణ్యము గలవాడు, బలశాలి. నలునికి మిత్రము. ఋతుపర్ణుని కొడుకు అత్తపర్ణి. గొప్ప కీర్తిమంతుడు. వాని కుమారుడు సుదాసుడు ఇంద్రుని స్నేహితుడు. వాని బిడ్డడు సౌదాసుడు. అతడు రాజై, కల్మాష పాదుడు-మిత్ర సహుడనియు పేరు పొందెను. వాని కొడుకు సర్వకర్మ. వాని కుమారుడు అనరణ్యుడు. వాని తనయుడు నిఘ్నుడు. నిఘ్నుని వలన అన మిత్రుడు రఘువు అని ఇద్దరు రాజ శ్రేష్ఠులు కల్గిరి. అనమిత్రుని సుతుడు విద్వాంసుడైన దువిదుహుడు. వాని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు వీరుడగు రఘువు. రఘువు శ్రీరాముని ముత్తాత. ఇతడు మహాబలుడై అయోధ్యా పట్టణమునకు మహారాజుగ ఉండెను.
ఆయన కొడుకు అజుడు. ఆయనకు దశరథుడు ఉదయించెను. దశరథుని యొక్క కుమారుడు రాముడు. రాముని కుమారుడు కుశుడు. కుశనందను అతిథి. అతిథి యొక్క పుత్రుడు నిషధుడు. నిషధుని సుతుడు నలుడు. నలుని కుమారుడు నభుడు. నభుని బిడ్డడు పుండరీకుడు. వానికి క్షేమధన్వుడు. వానికి దేవానీకుడు ఉదయించిరి. దేవానీకుని కొడుకు అహీనగువు వాని కొడుకు సుధన్వుడు. వాని కొడుకు శలుడు. శలపుత్రుడు ఉక్యుడు. ఉక్యుని కొడుకు వజ్రనాభుడు, వాని కొడుకు నలుడు. పురాణములందు నలులు ఇద్దరేఖ్యాతికెక్కినారు. ఒకడు వీరసేనుని కుమారుడు, రెండవవాడు ఇక్ష్వాకు వంశజుడు. వీరు వివస్వతుని వంశమందలి తేజస్సమృద్ధులైన రాజులు. ప్రజలకు పోషకుడును, శ్రాద్ధదేవుడును అగు ఆదిత్యుని ఈ వంశవృత్తము పఠించునాతడు సంతాన వంతుడయి ఆదిత్యుని యొక్క సాయుజ్యము నందును. (8)
సోమోత్పత్తి వర్ణనమ్
ఇంకను మునులలో లోమహర్షణ సూతుడు ఇట్లనెను- ఓ విప్రులార! సోముని తండ్రియైన అత్రి భగవానుడు ఋషి. ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. అతడు గొప్ప తపమొనరించినవాడు. అతడు మూడు వేల దివ్య సంవత్సరములు తపమాచరించెనని ప్రసిద్ధి. ఆయన యొక్క తేజస్సు మీదికి ఎగజిమ్ముకొనెను. అదియే సోమరూపము దాల్చెను. ఆయన కళ్ళనుండి నీరు దిక్కుల ప్రకాశింప జేయుచు పది తెఱుంగుల స్రవించెను. దశ దీశాధి దేవతలు ఏకమై వీధి ఆనతి చేత ఆ తేజస్సును ధరింపబోయి శక్యముగాక జార విడిచిరి. వసుధపై బడిన ఆ సోమ రూపమయిన వీర్యమును జూచి లోక పితామహుడైన బ్రహ్మ లోకహితమునకై తన రథము ఎక్కించుకొనెను. అత్రి కుమారుడు అట్లు పడుట చూచి బ్రహ్మ కుమారులు దేవతలు మునివరులు పొగడిరి. అట్లు స్తుతింపబడు సోముని తేజస్సు లోకముల నాప్యాయనము చేయుటకై అన్ని దిక్కులయందును నెల్లెడల అలము కొనెను. ఆ సోముడు బ్రహ్మ యొక్క రథమునందు అధిష్టించి సాగర పరీవృతయైన ఈ వసుంధరను ఇరువది యొక్క మారులు ప్రదక్షణము చేసెను. ఆయన తేజస్సు భూమి యందు ప్రవేశించెను. అందుండి సర్వౌషధులు సర్వజగదాధార భూతములై మొలచినవి. ఆ సోముడు స్తుతులచే స్వకీయ సత్కుృతులచే తేజస్సు వడసి పద్మ గర్భుని అనగా బ్రహ్మ దర్శనమునకై తపమొనరించెను. బ్రహ్మవిదగ్రగణ్యుడగు అతనికి బ్రహ్మ బీజౌషధుల యొక్కయు విప్రుల యొక్కయు జలము యొక్కయు సామ్రాజ్యము ఒసగెను. సౌమ్యులకెల్ల సౌమ్యుడగు అతడు దానిని పొంది, సహస్ర శత దక్షిణలతో కూడి ఉన్నదగు రాజసూయ యాగము చేసెను. ముల్లోకములలోను అకైరవబంధువు దక్షిణ ఇచ్చెనని వినపడసాగెను. ఆ రాజసూయాధ్వరమున సదస్యులై బ్రహ్మర్షులు దక్షిణలను అందుకొనిరట. హిరణ్యగర్భుడు (బ్రహ్మ), అత్రి, భృగువు ఆ యజ్ఞమునందు ఋత్విజులైరి. బహుమునిపరివృతుడై హరి అందు సదస్యుడయ్యెను. ఆసోముని, సినీ కుహువు, ద్యుతి, పుష్టి, ప్రభ, వసువు, కీర్తి, ధృతి, లక్ష్మి అను తొమ్మండ్రు దేవతా సుందరీమణులు సేవించిరి. అవబృధస్నాతుడై సర్వ దేవర్షిపూజితుఁడై పది విధముల దిక్కులను ఉద్భాసింపఁజేయుచు సోమరాజేంద్రుడు వెలుగొందెను. ఎవరికిని పొందరాని యైశ్వర్య మంది ఋషి సత్కార సంభృతమై తనకు లభించెనని ఉప్పొంగి అవినయము ననయమునకు (అవినీతి) లోబడి అతడి మతిపోయినంత అతడు అమిత ఐశ్వర్య మదమోహితుడై కానక బృహస్పతి భార్యను తారను బలాత్కారమున హరించెను.
దేవతలు, దేవర్షులు మఱిమఱి యాచించినను, వినక అతడు తారను అంగిరసునికి (బృహస్పతికి) అప్పగింపకయే పోయెను. అపుడు అంగిరసుని మడమల ద్రొక్కికొని ఉశనసుడు (శుక్రుడు) వచ్చెను. రుద్రుడు అజగవమ్మను విల్లుకొని పార్ష్ణిగ్రాహుడయ్యెను. వారు సోముని పైకి యుద్ధమునకు పోయిరి. అతడును బ్రహ్మశిరోనామక అస్త్రము తీసుకొని దేవతలపైకి విసరెను. దానిచే అవేల్పుల కీర్తి కళంకిత మయ్యెను. తారకామయమను ప్రఖ్యాతమైనది. ఆ యుద్ధము అక్కడ దేవదానవలోక క్షయకరమయ్యెను. మహామునులారా! అందు మిగిలిన దేవతలు, తుషితులు అను దేవతలు సనాతనుడును ఆనాదిదేవుడునగు బ్రహ్మను శరణుజొచ్చిరి.
పితామహుడంతట శుక్రుని, రుద్రుని (శంకరుని) వారించి స్వయముగ తారను ఆంగిరసునికి అప్పగించెను. బృహస్పతి ఆ ఇల్లాలిని అంతః ప్రసవగ గమనించి (‘గర్బిణి అగుట గ్రహించి) క్రుద్ధుడై నాకు హక్కయిన ఈ యోనియందు గర్భము దాల్చుట నీకు ఉచితముగాదనిన ఆమె ముంజ గడ్డియందుంచెను. ఆ శిశువు పుట్టినంతనే దివ్య శరీరమును పొందెను. సురవరులంతట సంశయమంది తారతో, నిజము చెప్పుము. ఈ బాలుడు సోముని కొడుకా లేక బృహస్పతి బిడ్డడా అనగా అమె వేల్పుల ప్రశ్నకు బదులు పలుకదయ్యెను. అపుడు చోరహస్తకుడగు ఆ కుమారుడు అమెను శపింప బూనిన వారించి, బ్రహ్మ తారా! ఇందు నిజమేది చెప్పుము. వీడెవ్వని కొడుకు? అనగా ఆమె ప్రాంజలియై సోముని వాడని అనెను. అయ్యెడ సోముడా పాపని శిరంబు మూర్కొని వానికి బుధుడని నామకరణము ఒనరించెను. ఆ బుధుడు గగనమున ప్రతికూలముగ ఉదయించుచుండును. అతడు వైరాజ మనువు పుత్రిక యందు పుత్రుని కనెను. ఆ పుత్రునకు పురూరవుడను పుత్రుడు జనించెను. పురూరవునకు ఊర్వశియందు ఏడురు మహాత్ములైన కుమారులు ఉదయించిరి. ఇది సోముని జన్మ వృత్తాంతము. ఇది కీర్తింప కీర్తి కలుగును. ఈ సోమవంశ సంకీర్తనము ధన్యతను ఆయుష్యము, ఆరోగ్యము, పుణ్యమును కూర్చును. సంకల్ప సాఫల్యము గూర్చును. సోమ జన్మ వృత్తాంతము విన్నవాడు పాప విముక్తిని పొందగల్గును. (9)