బ్రహ్మ మహా పురాణము

స్వయంభు బ్రహ్మర్షి సంవాదము

ప్రవచన నిపుణా! పృథివియందు ఉత్తమమయినది ధర్మార్థకామమోక్షములను ఒసగునది అగు భూమిని, తీర్థములకెల్ల ఉత్తమ తీర్థమును తెల్పుమని మునులడుగగా, సూతుడు ఇట్లు చెప్పదొడంగెను ఇంతకుపూర్వము మునులు ఈ ప్రశ్నమును మా గురువులను అడిగిరి. కురుక్షేత్రమున నానాతరు లతాపుష్పఫలోప శోభితమైన తన ఆశ్రమమునందు ఆసీనుడై ఉన్న మహాభారత కర్తను, సర్వశాస్త్ర విశారదుని, ఆధ్యాత్మనిష్ఠుని, సర్వజ్ఞుని, సర్వభూత హితాభిరతుని, పురాణాగమవక్తను, వేదవేదాంగపారగుని, శాంతుని, మతిమంతులకు ఎల్ల అగ్రేసరుని, పద్మ పత్రాయతేక్షణుని, శ్రీవేదవ్యాసుని దర్శించువేడుకతో నిశిత వ్రతపరాయణులైన మునులు ఏతెంచిరి. అ వచ్చినవారు కశ్యపుని మొదలు కృష్ణాను భౌతుకుని వరకుగల పేర్లవారు. నక్షత్రములలో చంద్రునివలె వారిలో పరాశరసూనుడు శ్రీమంతుడు వ్యాసుడు మిక్కిలిగా తేజరిల్లెను. వేదవేత్తయగు అమ్ముని ఆ మునివరులను పూజించెను. వారును అతనికి ప్రతిపూజసల్పి కుశల ప్రశ్నములయిన తరువాత సాత్యవతేయుని ఇట్లు అడిగిరి.

ఓ మునివరా! వేదశాస్త్ర పురాణ ఆగమాది సర్వ సారస్వతమును భూత భవిష్యద్వర్త మానములను ఎరుగుదువు. మునిసత్తమా! రాగము అను మొసళ్ళు విషయములు అను ఉప్పు నీరు, ఇంద్రియములు అను సుళ్ళు కలిగి దురాశ అను కెరటములతో నిండి లోభగంభీరము దుస్తరము మోహముఅను రొంపియుకల్గి దుఃఖబహుళము కష్టతరము నిస్సారమైన సంసార సాగరమందుమునిగి నిరాలంబమై అచేతనమై ఉన్న జగత్తును జూచి మహానుభావుడవు అగు నిన్ను అడుగుచున్నాము. ఈ భయంకర సంసారమందు దేనిని సాధింపవలెను? ఏది శ్రేయస్సాధనము? దానిని ఉపదేశించి జగములను ఉద్ధరింపుము. ఈ అవనియందు దుర్లభము మోక్షదమునైన పవిత్ర క్షేత్రమును చెప్పుడు. ఈ మేదినియందు కర్మభూమి ఏదియో నీవలన వినదలచితిమి. కర్మభూమియందు నరుడు యథావిధిగా కర్మ మొనరించి పరమ సిద్ధిని పొందును. వికర్మవలన నరకమును పొందును. మోక్షభూమియందు మోక్షమును పొందును కావున మాకీ విషయములు వినిపింపుము అనగా, త్రికాలజ్ఞుడగు వ్యాసమహర్షి వారికి ఇట్లు అనతిచ్చెను.

మున్ను మేరుపృష్ఠమందు నానారత్నద్రుమలతా కుసుమ పల్లవ లలితమై, నానా మృగఖగకలకలమై, నానావర్ణ శిలాధాతు రంజితమై, నానామునిజనాశ్రమ సమన్వితమై, రమ్యము అయిన ప్రదేశమునందు ఆసీనుడై ఉన్నవాడు. జగన్నాథుడు, జగద్యోని, చతుర్ముఖుడు, జగన్నాధుడు, జగద్వంద్యుడు, జగదాధారుడు ఈశ్వరుడు, జగత్పతి, దేవదానవాదులచే వివిధ రీతుల సేవింపబడుచున్న బ్రహ్మను భృగ్వాది మునులు దర్శించి మ్రొక్కి ఇదే అంశములను అడిగిరి. భగవంతుడా! భూతలమున కర్మ భూమిని, దుర్లభమైన మోక్షపద క్షేత్రమును తెలుపుడు అనగా సురేశ్వరుడు ఇట్లు తెలుపబూనెను. (26)