ఇంద్రద్యుమ్నునితో పరమేశ్వరుడు -
రాజా! యక్ష, గంధర్వాదులు, మహేంద్ర, బ్రహ్మ, రుద్రాదులలో నేను ఎవ్వడను గాను, పురుషోత్తమునిగా నన్ను ఎఱుంగుము. సకల పాపములు హరించు అనంత బల పౌరుషములు గలవాడను. అనంతుడను. అశేష భూతకోటికి ఆరాధనీయుడను. జ్ఞానగమ్యుడని, వాసుదేవుడని, యోగులు ఎవరిని పేర్కొందురో, వేదాంతములు ఎవ్వరిని గురించి తెల్పునో అట్టి యోగగమ్యమగు వస్తువును నేను. త్రిమూర్తులు నేనై ఉన్నాను. దిక్పాలులందరు నేనే. అఖిల చరాచర జగత్తును నేను. నా కంటె అన్యములేదు. నీ యెడల సంప్రీతిని పొందితిని. వరము కోరుకొనుము. నా దర్శనము పుణ్యము చేయని వానికి కలనైన గాదు. నీవు దృఢభక్తి సంపన్నుడ వగుటచే ప్రత్యక్షముగ నన్ను జూచితివి. అని పలికెను. అప్పుడు భూమిపతి శరీరముపుల కింపుచుండగా ఆ దేవుని పలు విధములుగా స్తుతించెను.
“ఓ లక్ష్మీనాథా! పీతాంబరధారీ! శ్రీనివాసా! నమస్కారము. ఆదిపురుషుడు సర్వేశ్వరుడు, సర్వతోముఖుడు, సనాతనుడు అగు విష్ణుదేవునికి నమస్కరించెను. శబ్దములకు అతీతుడు, గుణాతీతుడు, భావాతీతుడు, నిర్లిప్తుడు, నిర్గుణుడు, సూక్ష్మమైనవాడు. సర్వజ్ఞుడు శంఖ చక్ర గదా ముసలధారియు నీలోత్పలదళ శ్యాముడు. వరప్రదాత, శేషశాయియు, క్షీర సాగరశయనుడు, సర్వపాప హారియునగు హృషీకేశునికి నమస్కరించెదను. మోక్షకారణ భూతుడవు, వ్యాపకుడవు, నాశరహితుడవు, దేవదేవుడవు అగు నీకు నమస్కరించెదను” అని ప్రాంజలియై ప్రణామము ఆచరించి వినయమున రాజు ఇట్లు పలికెను. ‘జగన్నాథ! దేవాసుర గంధర్వ యక్ష, రాక్షస, సిద్ధ, సాధ్య, విద్యాధర, నాగ, గుహ్యక, కిన్నరాదులు సర్వశాస్త్ర పారగులు, సన్యాసులు, యోగులు, వేదార్థ చింతనులు మోక్షమార్గవిదులు ఏ పరమపదమును ధ్యానింతురో నిర్గుణము, నిర్మలము, శాంతము అగు దేనిని పొంద కోరుదురో అట్టి పదమును నీ ప్రసాదమున పొందకోరుచున్నాను.
అంత భగవంతుడు ‘ఓ రాజా! మంచిది, నీకు శుభమగుగాక. నీ కోరిన స్థానమును అందుకొనుము. నా అనుగ్రహమున అది నీకు లభించును. సందేహము వలదు. పదివేల తొమ్మిది వందలేండ్లు నీవు రాజ్యమేలుదువు గాక. ఆ మీద నా దివ్యపదము గాంతువు. నీ కీర్తి శాశ్వతమగును. ‘ఇంద్రద్యుమ్న సరస్సు’ అను పేర ఈ తీర్థము యజ్ఞాంగ సంభవము. ఇందు స్నానము చేసిన జీవి ఇంద్రలోకము పొందును. ఇచ్చట పిండప్రదానము చేసిన ఇరువది తరములవారు స్వర్గమును పొందుదురు. అచ్చట అప్సరసలచే గంధర్వ గానము ఆలపించుచు పూజింపబడి పదునల్గురింద్రులు పాలించునంత కాలము విమానము అధివసించి నీవు విహరింతువు. ఈ సరస్సునకు దక్షిణ దిశ నైఋతి మూల ఒక మఱ్ఱి చెట్టున్నది. దానివద్ద ఒక మండపముగలదు. దానిచుట్టు మొగలి పొదలున్నవి. వివిధ తరు సంకులమైన ఆ ప్రదేశమున కొబ్బరి మొదలగు తోటలు సంపెంగ పూలతోటలు చాలగలవు. ఆషాఢశుక్ల పంచమి పితృ దేవతాకమయిన మఘానక్షత్రమందు మండపమున వేంచేపుజేసి ఏడురోజులు నిలిపి నృత్యగీత క్రీడా వినోదములచే అర్చించి సువర్ణ దండము లగు చామరములచే నీ చోపులిచ్చుచు రత్న భూషిత వ్యజనములచే వీచుచు ఒక స్తంభమును అచ్చట ప్రతిష్ఠించి బ్రహ్మచారి యతి స్నాతకులు గృహస్థులు, వానప్రస్థులు నానావిధ స్తోత్ర పాఠములచే ఋగ్యజుస్సామములచే మమ్ము (బలరామ కృష్ణులను) స్తుతింతురు. ఇట్లు మమ్ము దర్శించి భక్తితో మ్రొక్కిన భక్తులు పదివేలేండ్లు వైకుంఠమున వసింతురు. ఆ పుణ్యమును అనుభవించి, తిరిగి ఈ ఇలపై విప్రులై జనించి కోటీశ్వరులై చతుర్వేదులై విరాజిల్లుదురు.
అని ఇట్లు హరి అతనికి వరమిచ్చి విశ్వకర్మతో కనుమఱుగయ్యెను. ఆ రాజు అనందభరితుడై కృతార్థుడనైతిని అనుకొని బలరామ కృష్ణులను, సుభద్రను, దేవ విమానము వంటి మట్టి రథమును ఎక్కించి, ఊరేగించి, పురోహితమంత్రి సామంతాదులతో చక్కని పవిత్ర ప్రదేశమందు శుభలగ్నమున ప్రతిష్ఠించి యథావిధిగ అర్చించి ఆచార్య ఋత్విర్జనంబులను భూరిదక్షిణలచే సత్కరించెను. ఆ మీద బెక్కు యజ్ఞములు చేసెను. కృతకృత్యుడై ఐహిక భోగములను విడిచి విష్ణుపదమందెను. ఇది ఈ పురుషోత్తమ క్షేత్ర మహిమ. మరియేమి కోరుచున్నారు. అనగా మునులు ఇట్లనిరి. “పురుషోత్తమ క్షేత్రయాత్ర ఎప్పుడు ఎట్లు చేయ వలెను! పంచతీర్థ విశేష మేమి! అందొక్కొక్క తీర్థస్నానంబు వలనను, దానముల వలనను, దేవతా దర్శనంబు వలనను, ఏయే ఫలములు లభించును? తెలుపుమని వేడిరి. అంత బ్రహ్మ ఇట్లనియె -
“కురుక్షేత్రమందు నిరాహారియై ఒంటికాలిపై నిల్చి డెబ్బది వేలేండ్లు చేసిన తపస్సు యొక్క ఫలమీ క్షేత్రమునందు జ్యేష్ఠ శుద్ధ దశమినాడు ఉపవాసముండి జగన్నాథుని దర్శించినంత మాత్రాన గల్గును. జ్యేష్ఠమందే పంచతీర్థయాత్ర చేసి శుద్ధద్వాదశినాడు పురుషోత్తముని దర్శించవలెను. దానిచే విష్ణులోకమును శాశ్వతముగ పొందును. దూరముననుండి అయినను పురుషోత్తముని దినదినము కీర్తించిన చాలును. విష్ణుపురమును పొందును. హరిచేతిలోని చక్రము అల్లంత దూరమందుండి అయినను ఆలయము ఉపరి భాగమునందు ఉన్న దానిని చూచి నమస్కరించిన అతడు పాప విముక్తుడగును. (51)