“మునులారా! వినుడు. ఇంద్రద్యుమ్న మహారాజు అచ్చటకు పోయి చక్కని ప్రదేశములను, వింధ్య పాదమునుండి వెడలెడు పుణ్యనదులను దర్శించెను. సర్వపాపహారిణి గంగకు సమానమైనది. దక్షిణ సముద్రమున సంగమించునదియగు ‘స్విత్రోపల’ అను నది అచ్చట గలదు. దానికి ఇరువైపుల తీరములందు సస్యశ్యామలములు మనోహరములు అగు గ్రామములు నగరములు కనిపించును. అందలి ప్రజలు చక్కని వలువలు, నగలును దాల్చి పుష్టియు తుష్టియు కలిగి ఉందురు. చతుర్వర్ణములవారు స్వస్వధర్మ నిరతులై శుభలక్షణులై కనిపింతురు. నిరంతరతాంబూల చర్వణము, నిరంతర పుష్పమాలా ధారణము వారి ప్రత్యేక శుభచిహ్నము. విప్రులు వేద పూర్ణముఖులు-షడంగవిదులు. పదక్రమల జటాఘన పాఠులు, నిత్యాగ్ని హోత్రులు, ఉపాసకులు, సర్వశాస్త్రార్థ సమర్థులు, భూరి దక్షిణ లొసంగిన దీక్షితులు, సోమయాజులు, చయనులు.
రాజవీధులందు నలుదారులు కలిసిన చోట మండపములందు వనములందు ఉద్యానవనములందు, సభలందు, మేరులందు, దేవాలయములందు ఎచ్చటవిన్నను ఇతిహాస పురాణ ప్రవచనము సాంగ వేదాధ్యయనము కావ్యశాస్త్ర గోష్ఠులు వినిపించును.
ఆ దేశమందలి సుందరులు చక్కని రూపము యౌవనముగొని ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణ లక్షితలై శరత్కాల చంద్రబింబాననలై దివ్య వస్త్రములు తాల్చి బంగారు కంకణములను ధరించి కదళీ గర్భమునకు ఈడగు బంగరు చాయయు, ఎఱ్ఱతామర పూల పుప్పొడికి సమానమగు అరుణారుణ వర్ణమునుగల మేనులతో, ఆకర్ణాంత నేత్రములతో చక్కని నెమ్మోములతో నలుపు ఎక్కిన కురులతో దొండపండునకు ఈడగు పెదవులతో హావభావ విలాసములతో, కొందఱు తామరరేకుల కెనయగు నయనశోభ గలవారు కొందరు నల్లకలువరేకుల కీడగు కాటుక కండ్ల అందముగలవారునై ఉంగరాలు తిరిగిన ముంగురులతో మెటుపట్లు మెఱయు పలువరుస గల్గి పీనోన్నత స్తనభారమున సువర్ణ మణిమయ కంఠహారములు సుమమాలలు తూగుచుండగా మణిమయ కుండల కాంతులు చెక్కుటద్దముల మిఱుమిట్లు గొల్పు చుండగా సాక్షాద్దేవ సుందరులో అనునట్లు దర్శనమిత్తురు. వీణా వేణు మృదంగ వాద్యములు జతచేసి భక్తి భరితములైన చక్కని పాటలచేత ఆటలచేత పరమాత్మను పరవశింపజేయుదురు.
రాత్రి అనక, పగలనక అచట శంఖ దుందుభి నిర్ఘోషము వినిపించును. కామోన్మత్తమైన అవ్విలాసినుల నృత్య విలాసము, గాన మాధుర్యమును అనాదృశము. బిక్షువులు, వైఖానసులు, స్నాతకులు, బ్రహ్మచారులు, సిద్ధులు, వీరువారననేల మంత్రసిద్ధులు, రస సిద్ధులు, ఘటికా పాదుకా సిద్ధులు అచట స్వామి పరివారమై సేవింతురు.
ఇట్టి దివ్య క్షేత్రమును దర్శించి, ఆరాజు నిజముగ ఇదియే మానస క్షేత్రము. ఇది పురుషోత్తమము. తెలిసినది నాకిది తెలిసినదని ఉప్పొంగి మఱ్ఱి నీడకేగి ఇంద్రనీల మణిమయమగు ఆ నీలమేఘశరీరుని మూర్తినిగని ఆ కల్యాణ మూర్తి నాకు గోచరింప యత్న మొనర్తుగాక అని జన్నము లొనర్చుదును. తపములు ఆచరింతును. హోమములు చేయుదును. ధ్యానింతును. ఉపవసించి అర్చనలు ఒనరింతునుగాక అని అనన్యమనస్కుడై విష్ణ్వాలయ నిర్మాణము కావింతునుగాక అని నిశ్చయించెను. (46)