అప్పుడు మునులు అనిరి-
“పరలోకమునకేగి తమ కర్మానుగుణమయిన స్థానమందున్నవారికి కొడుకులు మఱియు వారి బంధువులు శ్రాద్ధ మెట్లు పెట్టవలయును” అనగా వ్యాస భగవానుడు ఇట్లనియె. “జగన్నాథునికి వరాహమూర్తికి నమస్కరించి తెలుపుచున్నాను. కల్పమును వినుడు. మున్న కోకాజలధి అందు మునిగిపోయిన పితరులను వరాహమూర్తియైన ప్రభువు శ్రాద్ధము గావించి ఉద్ధరించెనను అనగా మునులు అదెట్లు జరిగెనో అనతిమ్మ” న వ్యాసుడు ఇట్లు అనియె.
“త్రేతా ద్వాపర యుగసంధిలో మున్ను మేరుగిరి మీద దివ్యులు మానుషులు అయిన పితరులు విశ్వేదేవులతో వసించిరి. (పితరులకు దేవత్వము మనుష్యత్వము అను రెండు ధర్మములు గలవని శాస్త్రములు తెలుపుచున్నవి. కావున పితృపతియైన యమునికి నరక చతుర్దశి నాడు చేయవలసిన తర్పణము దేవతగా భావించి సవ్యముగానూ మనుష్యత్వమును భావించి ప్రాచీన రీతిగానూ చేయవచ్చునని ధర్మశాస్త్రములు తెలుపుచున్నవి.) అచట వారు కూరుచున్న తఱి సోముని కూతురు కాంతిమతియను దేవకన్య ప్రాంజలియై వారి ఎదుట నిలిచెను. వారు కళ్యాణి! నీవెవ్వతెవు. నీకు ప్రభువెవ్వడు? తెలుపుమనిరి. “నేను చంద్రకళను. మీకు ఇష్టమగునేని మిమ్ము నా ప్రభువులుగా వర్తించుచున్నాను. నా మొదటి పేరు ‘ఊర్జ’ ఆ పైని ‘స్వధ’ యను పేరున పిలువబడుచున్నాను. ఇప్పుడే మీరు ‘కోక’ అను పేర పిల్చినారు అని పలికెను. అంతట పితరులు ఆమె పలుకులు విని ఆమె మోము వంక చూచి తృప్తిచెందరైరి. (మోహపడి రన్నమాట) ఆ కన్యను ఊరక చూచుచు తనివి చెందక, యోగభ్రష్టులైనారని ఎరిగి విశ్వేదేవులు ఆ పితరులు అను వారిని వదలిపెట్టి స్వర్గమునకు పోయిరి.
చంద్రభగవానుడు తన కూతురు ఊర్జను ఇంట గానక కలతవడిన మనస్సుతో ఎటుపోయినదని ఆలోచించెను. అ సమాధిలో అతడామె కామముతో పితరులకడకు ఏగెనని వారిచే హృదయపూర్వకముగా ఆమె స్వీకరింపబడినదనియు తపోబలమున ఎఱింగెను. అంత గినుకగొని శశాంకుడు యోగభ్రష్ఠులై మనస్సు స్థాయిచెడి తండ్రి హద్దులోనున్న సాధ్వి! తెలియకుండ అట్టి కన్యను హరించితిరి గావున మీరు క్రింద బడుదురుగాక అని శపించెను. ఈ నా కూతురును స్వతంత్రురాలై ధర్మము విడిచి భరించి నందున కోకయను పేర హిమాద్రిపై ఒక నది అగుగాక అనెను. ఇట్లు శప్తులైన పితృదేవతలు యోగ భ్రష్ఠులై, హిమగిరి మొదటపడిరి. ఊర్జయు అక్కడనే హిమగిరి ప్రస్థమందు పడి సప్తసాముద్రమమ తీర్థమను చేరి కోకయనుపేర నూరు తీర్థములతో హిమగిరి శిఖరమును తడుపుచు అర్పణము చేయుటవలన (ప్రవహించుట వలన) సరిత్తు (నది) అనుపేరందెను. యోగమందిన పితరులు చల్లని నీటితోనున్న ఆ మహానదిని చూచిరి. కాని అది చంద్రుని కూతురగు ఊర్జయే అని ఎఱుంగరైరి. అంతట, పితరులను ఆకలిచే కుములుచున్నట్లు చూచి ఒక రేగు వృక్షమును, మధుక్షీరమును ఒసంగు ఒక ఆవును ఒసంగెను. దివ్యమైన క్షీరము కోకానది జలము రేగువండు అను నీ యాహారము పితృ దేవతల పోషణమునను నిరూపింపబడినది. ఆ విధమైన వృత్తితో (అహారాదుల సేవనముతో) జీవించుచున్న పితరులకు వేల యేండ్లు ఒక్క దినమువలె గడచెను.
ఈ విధముగా లోకమెల్ల పితృశూన్యమై స్వధాకారము వినిపింప అంతట దైత్యులు రాక్షసులు యాతుధానులు బలవంతులైరి. వారు విజృంభించి విశ్వేదేవులతో విడివడిన పితృగణములపై నలువైపుల నుండి వచ్చిపడిరి. అదిచూచి పితరులు రోషముగొని కోకానది ఒడ్డున ఉన్న ఒక రాతి నెత్తిపట్టుకొనిరి. ఆ రాయి తొలగగానే అనది వేగము ఎక్కువై నీటిచే పితరులను హిమాలయమును కూడ ముంచెత్తెను. పితరులంతర్హితులైనంతట రాక్షసులు తాండ్రచెట్టునెక్కి నిరాహారులై దాగికొనిరి. పితృదేవతలు నీటివెల్లువకు వంతచెంది ఆకటనకనకంబడి ఆనీటనే ఉండి విష్ణుని శరణొందిరి.
గోవింద! నీవు జయింపుము. జగన్నివాస! ఓ కేశవ నీదయచే మాకును జయమగు గాక! అప్రతిహత ప్రతాపుడవు. మమ్ము ఈ నీట మునిగిన వారిని ఉద్ధరింపుము. దారుణాకారులైన ఆరాక్షసులకు జడిసిపోవుచున్న మమ్ము ఓ వరాహమూర్తీ! రక్షింపుము. నీపుణ్య నామములు సంకీర్తనము చేసినంత రాక్షసులు భూత ప్రేత పిశాచాదులు నశింతురు. ధర్మాది పురుషార్థములు సిద్ధించును” అని ఇట్లు స్తుతింప వీని తన దివ్యమూర్తిని చూపి కోకానది ముఖమందు నీటమునిగి తలపై రాతిని ధరించి యున్న పితృగణమును చూచెను. అంతట వరాహమూర్తియై హరి పితృగణమును ఉద్ధరింప సంకల్పించెను. తన కోఱచేగొట్టి ఎత్తి ఆరాతిని విసరివైచెను. పితరుల నీటి నుండియే మీదికి ఆకర్షించెను. ఆ దివ్య వరాహము కోరయందున్న పితరులు బంగారమట్లు మెఱయుచు, విష్ణునిచే భయముక్తులైరి, అట్లు వారినెత్తి విష్ణు తీర్థమని పేరందిన ఆ తావున హరి వారిని లోహార్గలము నందలి జలమును ద్రావనిచ్చెను. ఆవల తన రోమముల నుండి పుట్టిన దర్భలను చెమట నుండి పుట్టిన నువ్వులను జేకొని కొఱుకంచు ఒకదానిని సూర్య సమానప్రభనుగ కల్పించి ఒక పాత్రను తీర్థముగా రూపొందించి కోటివటము క్రింద నిలువబడి గంగాధరమను తీర్థమందలి ఉదకమును తుంగ కూటమునుండి గైకొని యజ్ఞియములైన ఓషధులను మధుక్షీర రసములను గంధములను పువ్వులను గంధధూప దీపాదులను జేకొని సరస్సు నుండి ధేనువును సముద్రము నుండి రత్నములను గైకొని భూమిని కోరచే గీసి నీటం దడిపి భూమిని కుశలచే గీసి కొఱవిని దానిచుట్టు త్రిప్పి మఱలమఱల నీరుప్రోక్షించి శిరోకూపములందు ఉండి ప్రాగగ్రములైన (తూర్పు వైపు కొసలుగా నున్న) కుశలను గ్రహించి ఋషులను ఆహ్వానించి పితృ తర్పణము జేయుదుననెను. వారును చేయుమా అన ప్రభువు విశ్వేదేవులను పిల్చి సమంత్రకముగ వారికి విష్టరముల (ఆసనముల)ను ఒసంగి అక్షతలచే దేవతా రక్షచేసెను. సర్వ దేవతల అంశలతో బుట్టిన అక్షతలు ఓషధులు అన్నిదిశల అంతట రక్షణ ఇచ్చుటకు కల్పింపబడినవి. దేవ దానవ దైత్య యక్ష రాక్షసుల చరాచర మందెక్కడును వానికి క్షయము ఎవ్వరు కల్పింపజాలరు. కావున వానికి అక్షతములు అనుపేరు ఏర్పడినది. మున్ను విష్ణువు దేవతా రక్షణ కొరకే అక్షతల నేర్పరచెను. కుశలు గంధము యవలు పువ్వులచే అర్ఘ్యమొసంగి వరాహమూర్తి విశ్వేదేవులను ఇట్లు అడిగెను.
దివ్యులు మనుష్యులునుగూడ అయిన పితరులను ఆహ్వానించుచున్నాను అనెను. వారు పిలువుమన వారిని శుచియై పిలిచెను. నువ్వులతో మొదళ్ళు చివరలు కూర్చిన దర్భలను మోకాలిపై హస్తమానించి సవ్యముగ ఆసన మొసంగెను. అదేవిధముగ పితరులను పితృ స్థానమందున్న విప్రులకు ‘ఆయాంతు’ అను మంత్రము చెప్పుచు ఆహ్వానించెను. ‘అపహత’ అను మంత్రముచే అపసవ్యముగ అసురాదుల వలన రక్షణనిచ్చి పితరుల నామ గోత్రములతో ‘తత్పితరో మనోజరానావా ఆగచ్ఛత’ అను మంత్రము కూడ చెప్పుచు అవాహనము చేసెను. ‘సంవత్సరైః’ అను మంత్రముచే అర్ఘ్యమిచ్చెను. ‘యాస్తిష్ఠంత్యమృతా వాచోయన్మ అని యన్మే పితామహ’ అని తండ్రికి ప్రితామహునికి ‘యన్మే ప్రపితామహ’ అని ప్రపితామహునికి కుశ గంధపుష్ప తిల మిశ్రమైన అర్ఘ్యమును అపసవ్యముగ ఇచ్చెను. అట్లే మాతామహులకును విష్ణువు పొనరించెను. ఇట్లు గంధాదులచే అర్చించి ధూపదీపము లొసంగి ‘ఆదిత్యా వసవోరుద్రా’ అను మంత్రముతో నెయ్యి, నువ్వులు, దర్భలతో అన్నమును పాత్రయందలి అవ్వల మునులను చూచి ‘అగ్నౌకరిష్యే’ అని పలికి వారు కురుష్య (చేయుము) అని ప్రేరణ ఈయ సోమునికి అగ్నికిని యమునికిని మూడు ఆహుతులు ఇచ్చెను. ‘యేమామకేతి’ అను యజుర్మంత్ర సప్తకము జపించి హోమశిష్టమును నామ గోత్రములతో ఒక్కొక్కసారి మూడేసి ఆహుతులుగా పితృ స్థానమందు ఒసంగెను. ఇందు మిగిలిన అన్నమును పిండ పాత్ర యందుంచెను.
ఆ మీదట పరిశుద్ధము, (ప్రత్యగ్రము) ఒకేసారి ఉడికినది, నిలువ ఉండనిది, కూరలు తక్కువ పండ్లెక్కువయునై ఆఱు రసములు గల్గి అమృతోపమానమైన అన్నమును, బ్రాహ్మణుల కారగింప చేసి పిండపాత్ర అందు గూడ వడ్డించి మంత్రముతో నేయి తేనెయుంగూర్చి ‘పృథివీ’ అనియు ‘మధువాత’ అను ఋగ్వేద మంత్రమును పఠించెను. భోజనము చేసిన తర్వాత బ్రాహ్మణులకు ఐదు మంత్రములు ‘యత్తే’ అను ఋక్కుతో ఆరంభించి ‘నాధికం’ అను సమాప్తి మంత్రము వరకును జపించెను. త్రిమధు త్రిసుపర్ణ మంత్రములను బృహదారణ్యకమును మఱియు జపింపవలసిన సౌరసూక్త పురుష సూక్తములను గూడ జపించెను. విప్రులు భోజనము చేసిన తర్వాత ‘తృప్తాస్థ’ (మీరు తృప్తులైనారా?) అని అడిగి వారు ‘తృప్తాస్మ’ (తృప్తులమైనాము) అని అన్న తర్వాత అంతవరకు మౌనముతో భోజనము చేసిన బ్రాహ్మణులు మౌన విమోచనము చేయుటను సూచించు ఉత్తరాపోశన మొసంగెను. (219)