ఓ విప్రులారా! పాపాత్ములు పడవేయబడు రౌరవాది నరకములను గూర్చి ఇక వినుడు అని లోమహర్షణుడు ఇట్లనెను -
రౌరవము, శౌకరం, రోధము, తాలము, విశసనము, మహాజ్వాల, తప్తకుడ్యము, మహాలోభము, విమోచనము, రుధిరాంధము, వసాతప్తము, కృమీశము, కృమిభోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షము, పూయవహము, వహ్నిజ్వాల, అథశ్శిరము, నదంశము, కృష్ణ సూత్రము, తమస్సు, అవీచి, శ్వభోజనము, అప్రతిష్టము మావీచి అను. పరమదారుణములైన పెక్కు నరకములు కలవు. ఇవి యముని పరిపాలన దేశములు. శస్త్ర, అగ్ని, విషములు ప్రయోగించు యమభటులు పాపకర్మాసక్తిగలవారు వీనియందు ఉందురు.
దొంగ సాక్ష్యమిచ్చినవాడు, పక్షపాతబుద్ధితో మాట్లాడువాడు, అబద్ధము చెప్పువాడు గౌరవమునకు పోవును. భ్రూణహత్య నగరధ్వంసము, గోహత్య చేసినవాడు, జీవులకు ఊపిరి అడకుండ చేసినవాడు భయంకర గౌరవమునకు పోదురు. బ్రహ్మహత్యా కారకుడు, బంగారమును దొంగిలించినవాడు, వాని స్నేహితుడు శూకర నరకమున పడుదురు. క్షత్రియ వైశ్య ఘాతకులు, గురుపత్నిని, అప్పచెల్లెండ్రను కూడినవాడు రాజభటుని హత్య చేసినవాడు తప్తకుంభమను నరకమున కూలును. మద్య విక్రేత వధ్యపాలుడు ఉరితీయు స్థానమును కాయువాడు (లేక) వధింపదగినవానిని కాపాడినవాడు, కేసర విక్రేత (విషమును అమ్మువాడు) భక్తుని విడిచినవాడు తప్తలోహమను నరకమున కూలుదురు.
కూతురును, కోడలిని సంగమించినవాడు, మహాజ్వాలమను నరకమున పడవేయబడును. వేదదూషకుడు, వేదవిక్రయి అగమ్యగామి, శబలము అను నరకము పాలగును. దొంగ, హద్దుమీరినవాడును విమోహ నరకమున పడును. దైవ బ్రాహ్మణ పితృ ద్వేషియు, రత్నములను (శ్రేష్ఠ వస్తువులను) దూషించినవాడు కృమి భక్ష్యము అను నరకమును పొందును. దుర్యాగము చేసినవాడు, కృమీశము అను నరకము పాలగును. పితృదేవతా తిధులను విడిచి కుడిచినవాడు లాలా (దొంగ) భక్ష్యమను నరకమున పడును. బాణములను చేయువాడు వేధక నరకమున పడును, ఖడ్గాదులను చేయువాడును, కర్ణకారుడును, (కర్ణి ఒక విధమైన ఆయుధము) పరమదారుణమైన విశసనమను నరకమున పడును. అపాత్ర దానము పట్టినవాడు, అయాజ్యయాజనము (చేయకూడని వానిచే యజ్ఞము) చేయించినవాడు, నక్షత్ర సూచకుడు (జ్యోతిషశాస్త్రము దెలియకయే జాతక ముహూర్తములు చెప్పువాడు) అధోముఖ నరకము నందును. అతిథికి పెట్టక మృష్టాన్నము ఆరగించువాడు కృమిపూయ నరకమునకు పోవును. లాక్ష (లక్క), మాంసము, రసములు, మధుర పానీయములు, నువ్వులు, ఉప్పు అనువాని అమ్ము బ్రాహ్మణుడుకూడ కృమిపూయ నరకమున పడును. పిల్లి, కోడి, మేక, కుక్క పంది గుఱ్ఱము వీనిని పెంచువానికిని అదేగతి. రంగోపజీవి (నాటకములందు నటించి జీవించువాడు) జాలరి, కుండాశి, భగభక్షకుడు (వీర్యపానము చేయువాడు)లేక జారజుని నుతించువాడు, విషము పెట్టువాడు, సూచి, చాడీకోరు, పేచీ కోరు, మాహిషకుడు, (దున్నపోతుల వ్యాపారి), పర్వములందు స్త్రీ సంయోగము చేసిన బ్రాహ్మణుడు, కొంపలు అంటించువాడు, మిత్ర ఘాతకుడు, శకునములు చెప్పువాడు, గ్రామపాచకుడు, సోమవిక్రయ రుధిరాంధ కూపమున పడుదురు. తేనె పుట్టలను రేపినవాడు గ్రామ నాశనము చేసినవాడు వైతరణి అను నరకములో పడును.
రేతః పానము చేసినవాడు, మర్యాదోల్లంఘనము చేసినవాడు (సదాచారములను, కట్టుబాట్లను దప్పినవాడు) మాయాజీవనులు, ఆచారహీనులు, కృచ్ఛ్రము అను నరకమున పడుదురు. జౌరభ్రికులు (గొఱ్ఱెల మందచే జీవించువారు), మృగవ్యాధులు వహ్నిజ్వాలమను నరకమున పడుదురు. అపాకములందు (వండగూడని వస్తువులకు) అగ్నిని పెట్టినవాడు అదే నరకమున పడును. వ్రతలోపము, ఆశ్రమధర్మచ్యుతి చేసినవాడు నందంశ యాతనమను నరకమున పడును. దివాస్వాపకాలయిన బ్రహ్మచారులు, కొడుకుల దగ్గర అధ్యయనము చేసినవారు శ్వభోజనమను నరకమున పడుదురు. ఇట్టివి నూర్లకొలది వేలకొలది నరకములు కలవు. పాపములను చేసినవారు పొంది, విడిచి, అతను, ఆశరీరములనొంది అయా నరకములందు హింసింపబడుడురు. వర్ణాశ్రమ విరుద్ధమైన కర్మను త్రికరణములచే చేసినవారు నరకము పాలగుదురు. ద్యులోకమందలి దేవతలు, తలక్రిందులుగా ఉండు నరకలోక జీవులచే చూడబడుచుందురు. దేవతలు నరకలోక వాసులను అథోముఖులుగా చూచుచుందురు. జీవులు స్థావరములు, కృములు, జలజంతువులు, పక్షులు, పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు అనువరుసలో జన్మించి క్రమముక్తిని పొందుదురు.
స్వర్గమందు. ఎందరు జీవులుందురో నరకమందు అందరుందురు. పాపముచేసి ప్రాయశ్చిత్తము చేసికొననివాడు నరకమునకు పోవును. ఆయా పాపములకు అనురూపములైన ప్రాయశ్చిత్తములను పరమర్షులు స్మరించి (స్మృతులలో) పెద్ద పాపమునకు పెద్దగ చిన్నదానికి చిన్నగా ప్రాయశ్చిత్తములను తెల్పిరి. స్వాయంభువమనువు మొదలయిన వారు ఆ ప్రాయశ్చిత్త కాండను రచించిరి. అన్నిటికిని ప్రాయశ్చిత్తము కృష్ణస్మరణము. దానిని మించినదిలేదు. ప్రాయశ్చిత్తమనగా తపస్సు. పాపముచేసి అనుతాపము పొందెనేని, హరీస్మరణ చేసెనేని, దానిని మించిన పుణ్యసాధనము లేదు. దానిచే జీవి నారాయణుని చేరును. ప్రాతఃకాల అహోరాత్రములందు సంధ్యా సమయములందు నారాయణ స్మరణ చేసిన పాపక్షయమంది నరుడు నారాయణుని పొందును. ఎవ్వని మనస్సు జపహోమార్చనములందు, వాసుదేవునందు లగ్నమై ఉండునో వాడు ముక్తినొందును. విష్ణువునందు అప్పుడప్పుడు మనసు నిలువక చలించెనేని, వానికి దేవేంద్రాది పదవి లభించును. పునరావృత్తి లక్షణమైన స్వర్గగమనమెక్కడ? ముక్తి బీజమైన వాసుదేవ నామస్మరణమెక్కడ? కావున అహర్నిశము పురుషుడు, విష్ణు స్మరణ చేయుచు పాపక్షయము పొంది శుద్ధుడైనచో నరక దర్శనము జేయడు. స్వర్గము మనఃప్రీతి కూర్చునది, దానికి వ్యతిరేకము నరకము. నరక స్వర్గములనగా పాప-పుణ్యములే. అవి వానికి పర్యాయ పదములు, వాసుదేవైక చిత్తుడు అపునరావృత్తి లక్షణమైన సాయుజ్యముక్తికి అర్హుడన్నమాట.
ఒకే వస్తువు దుఃఖమునకు, సుఖమునకు, ఈర్ష్యకు, కోపమునకు కారణమగును. కావున ఏ వస్తువైనను దుఃఖాత్మకమే. ఆ వస్తువే ఒకప్పుడు కోపమునకు హేతువై అదే ప్రసన్నతకు కారణమగును. కావున కేవలము దుఃఖాత్మకము కేవలము సుఖాత్మకమును అయిన వస్తువు లేనేలేదు. సుఖ, దుఃఖాది లక్షణమైన ఈ పరిణామము కేవల మానసికము, బ్రహ్మజ్ఞాన మొక్కటియే జ్ఞానము. లౌకికము అయిన జ్ఞానము బంధమునకు, బ్రహ్మజ్ఞానము ముక్తికిని కారణమగును. ఈ ప్రపంచ వ్యవహారము తెలివివలననే జరుగును. కాని జ్ఞానమునకు భిన్నముగా ఏదియు లేదు. విద్య అవిద్యను వానిని బ్రహ్మజ్ఞానము, లౌకిక జ్ఞానమునుగా గ్రహింపవలెను. (మోక్ష విషయకమైన జ్ఞానమే జ్ఞానమనియు, తదన్య విషయకమైన తెలివి విజ్ఞానమనియు అమరుడు చెప్పెను) అవిద్యయామృత్యుం తీర్త్వా విద్యయాZమృతమశ్నుతే అనగా అవిద్యచే జరా మరణములను లేకుండా చేసుకొని, విద్యచే అమృతస్థితిని (మోక్షమును) పొందునని శ్రుతి చెప్పినది. ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానము బ్రహ్మజ్ఞానము అగును. ఇతరము విద్యాశబ్ద వాచ్యమై కేవలము పునరావృత్తికమైన ముక్తికి హేతువు అగును. తక్కిన వేదాంగాది విద్యలు, తదుచిత కర్మానుష్ఠానమును అవిద్యగా పేర్కొనబడి స్వర్గాది భోగమాత్ర సాధనములగునన్నమాట. వీనిచే చిత్తశుద్ధి వడసి పునరావృత్తి సమ్మితములైన పుణ్యలోక భోగములను పొందవచ్చును. కేవలము విద్యవలననే మోక్ష స్థితి కలుగునని భావము. ఈ విధముగ నాచే భూమండలము సమస్త పాతాళములు, నరకములు, మీకు చెప్పబడినవి. సముద్రము, పర్వతములు, ద్వీపములు, నదులు, సంక్షేపముగ చెప్పబడినవి. ఇంకేమి వినగోరుచున్నారు అని లోమహర్షణుడు మునులను ప్రశ్నింపగా(22)