బ్రహ్మ మహా పురాణము

మార్తాండ జన్మ శరీరలిఖన వర్ణనము

“దివాకరుడు, శాశ్వతుడు, నిర్గుణుడు అని తెల్పితివి. తరువాత పండ్రెండు మూర్తులతో జన్మించినట్లు తెల్పితివి. తేజోరాశియైన యా వెల్గు స్త్రీ గర్భమందెట్లున్నది? ఎట్లు పుట్టెను. ఇది మాకు పెద్ద సంశయము తీర్పుము” అని మునులడుగ బ్రహ్మవారితో ఇట్లనెను.

దక్షునకు సౌందర్యవతులు ప్రసిద్ధలు అయిన అరువది మంది కుమార్తెలుండిరి. వారు అదితి, దితి, దనువు, వినత మొదలైనవారు. అందు పదముగ్గురను కశ్యపునకు ఇచ్చెను. వారి పుత్ర, పౌత్ర, దౌహిత్ర, సంతతి అనంతము. అదితి సంతతి దేవతలు, దితి సంతానము దైత్యులు అనగా రాక్షసులు. వారు అన్యోన్యము కలహించిరి. దానిచేత ముల్లోకములు ఆకులమగుటకు వగచి, అదితి సూర్యుని ఆరాధించెను. ఆమె సూర్యుని ఇట్లు స్తుతించెను.