బ్రహ్మ ఇట్లు అనియె -
ఆ మార్కండేయుడు వటపత్రశాయి అయిన ఆబాలుని గర్భమందు బ్రవేశించి సమస్త భూమండలమను అందుచూచెను. సప్త సముద్రములను, సప్త ద్వీపములను, సప్త కులాచలములను, సర్వరత్ననిధి అయిన మేరువును దర్శించెను. ఆ మేరుపర్వతము సర్వరత్న నిధి నానాముని సమాకీర్ణము. సర్వవృక్షములకు స్థానము వింతలకెల్ల స్థానము. సింహ వ్యాఘ్రాదులకు నిలయము. ఇంద్రాది దేవతలు సిద్ధచారణ గంధర్వ అప్సర వర్గములకు విహార స్థానము.
శ్రీమంతమగు ఆ మేరువును చూచుచు అబాలుని ఉదరమందు చనిచని కురుక్షేత్రాది పుణ్యక్షేత్రములను పుణ్యనదులను, తీర్ధములను, కృషి గోరక్ష, వాణిజ్యాది వృత్తులను చేయు మానవులను సర్వ జనావాసమయిన నగర గ్రామములను ఇది అది అననేల బ్రహ్మాది స్తంభపర్యంతమైన సర్వ బ్రహ్మాండమును, భూర్బుస్సర్ మహస్తప సృత్యమును ఊర్ధ్వలోకములను అతల, వితల, పాతాళ, సుతల, రసాతల, మహాతల, తలాతల అధోలోకములను ఆ స్వామి ఉదరమందు వీక్షించెను. ఆ దేవుని అనుగ్రహమున అందాతని గతికడ్డులేకుండెను. అందట్లు తిరుగాడుచు అతడా విష్ణువు యొక్క శరీరమునకు తుద కానడయ్యెను. అంతట నవ్వరదుని అముని శరణు జొచ్చెను. అవ్వల నామహా పురుషుడు ముఖము తెఱువ అందుండి తటాలున వాయువేగమున వెలికి వచ్చెను. (64)