బ్రహ్మ మహా పురాణము

ముచుకుందుడు కృష్ణుని స్తుతించుట

స్వామీ! దేవాసుర యుద్ధములందు ఉద్భటులైన దైత్యులెందఱో నీ తేజమునకు తట్టుకొనలేక పోయిరి. అట్టి నీ తేజస్సును నేను ఓర్వజాలను. సంసారపతితమైన జంతువునకు నీవొక్కడివే దిక్కు. ప్రపన్నుల ఆర్తిని హరించు నీవు నా యెడ ప్రసన్నుడవు కమ్ము. నా అశుభమును హరింపుము. సముద్రములు, పర్వతములు, నదులు, మేదిని, గగనము, వాయువు, నీరు అగ్నియు నీవే. పురుషుని కంటె మిగులపరమై వికల్పాత్మకమైన ఎల్ల జన్మములందు వ్యాపించి శబ్దాది విషయస్పర్శ లేక వృద్ధిక్షయ జరాదులు లేక ఉన్న కేవలమైన వస్తువు నీవే. నీవలననే చరాచరాత్మకము, స్థూలము, సూక్ష్మమునైన జగత్తు పొడమినది. పొడముచున్నది. పొడమనున్నది. మూరము అమూర్తమునైనది ఎల్లను నీవలనైననదే. నీకంటె మఱి ఏదియు లేదు. సంసారచక్ర పరిభ్రమణము చేయుచు తాపత్రయ తప్తుడనైన నాకు అత్యంతిక సుఖము అందలేదు. దుఃఖములను సుఖములని, ఎండమావులు జలాశయములని అనుకొంటిని. అది ఎక్కడలేని ఉడుకు దెచ్చిపెట్టినది. రాజ్యసుఖము పుత్రమిత్ర కళత్రాదికము శబ్దాది విషయ భోగము సుఖమని మఱగిన నాకు తుదకు అది తాపాత్మకముగా పరిణమించినది. దేవలోక గతినందితినిగాని ఆ దేవగణము నాసాహాయ్యము గోరినది. తండ్రీ! శాశ్వతమైన నిర్వృతి (పరమ తృప్తి) యెక్కడ? సర్వజగత్తుకు ప్రభువు స్థానమున ఉన్న నిన్ను ఆరాధింపక ఆ శాశ్వతానంద మెవడు పొందును? నీ మాయచే మూఢులై జన్మమృత్యు జరాది పాపానుభవములను పొంది ప్రేతపతిం జూతురు. ఆవల కాలపాశముల గట్టుపడి అతి దారుణముగ నరకము లందు అనేక విధములగు దుఃఖములనందుదురు. ఇది నీ విశ్వ స్వరూపము. నేను విషయలోలుడనై నీ మాయచే మోహితుడనై మమకారము అను మురికి గుంటలో తిరుగాడుచున్నాను పరమేశ్వర! స్తుతిపాత్రుడునైన నిన్ను శరణు కోరుచున్నాను. సంసారశ్రమచే ఉడికిన మనసుతో, నిర్విణ్ణుడనై (దుఃఖినై) పరమపదమైన పరంధామమైన నీయందు ముచ్చటగొన్నాడను”. (196)