కాలయవనోపాఖ్యానము

గోష్ఠమందు పురోహితుడు గార్గ్యుని బావమరది అని, షండుడని (నపుంసకుడని) యదువులందరి సన్నిధి యందు తూలనాడెను. యాదవులందఱు నవ్విరి. అంత అతడు కినుకగొని దక్షిణాపథమునకు వచ్చి యదువంశ భయంకరుడగు పుత్రునిగోరి తపస్సు చేసెను. ఆతడు శివుని ఆరాధించుచు లోహచూర్ణము మాత్రముతిని తపస్సు చేసెను. హరుడు అతని తపస్సునకు సంతుష్టుడై పండ్రెండవ సంవత్సరమున వరమిచ్చెను. పుత్ర సంతతిలేని యవనాధీశ్వరుడు అతనిని గౌరవించెను. వాని అంగనతో అతడు సంగమించి నంతట భ్రమర (తుమ్మెద) సమాన ప్రభగల కొడుకు పుట్టెను. కాలయవనుడను పేరుగల వానిని వజ్రకఠినమైన రొమ్ముగల వానిని తన రాజ్యమున పట్టాభిషేకించి యడవికిం బోయెను.

ఆ కాలయవనుడు బలమున మదమెక్కి అవనిలోగల బలవంతులైన రాజులు ఎవ్వరని అడుగ నారదుడు యాదవులని తెల్పెను. వాడు కోటివేలమంది మ్లేచ్ఛులతో చతురంగ బలముతో పెద్ద ఉద్యమము చేసెను. దినదినము ఎండలలో వాడు పయనించి, కసిగొని యాదవుల కొరకు మధురాపురికేగెను. అంతట కృష్ణుడు ఇట్లు ఆలోచించెను. “యవనులచే యాదవులము నశించుటచూచి మాగధుడు (జరాసంధుడు) యుద్ధమునకు ఏతెంచును. మాగధుని బలము క్షీణించినప్పుడు యవనుడు వచ్చును. ఈ విధముగ రెండువైపుల నుండియు యాదవులకు కష్టము వచ్చిపడినది. అందుచే యాదవులకొరకు అభేద్యమైన దుర్గ మొకటి నిర్మించెదను. ఆ దుర్గములు కలిగించు రక్షణచే అబలలు (స్త్రీలు) కూడ యుద్ధము చేయగలరు. అట్టి యెడ వృష్టి యదువంశముల వారి మాట చెప్పనేల? నేను మత్తుగొనికాని, ప్రమత్తుడనై లేక ఉన్నను నిద్రపోయినను ఎటకేని ప్రవాసము వెళ్ళినగాని, యాదవుల లోకువచూచి శత్రువులు వారిపై ఎక్కువగా విజృంభింతురు” అని గోవిందుడు ఆలోచించి మహా సముద్రుని పండ్రెండు యోజనముల మేర ఇమ్మని (సముద్రమును దూరముగా తొలగుమనికోరి) అచట ద్వారకాపుర నిర్మాణము చేసెను. అది మహోద్యానములు, పెద్దకోట, పెక్కుతటాకములు ప్రాకారములతో ఇంద్రుని రాజధాని అమరావతివలె ఉండెను. మధురాపుర వాసులను అక్కడికి గొనివచ్చి అందుంచి కాల యవనునికి దగ్గరగా ఉండునని తాను మధుర కేగెను. అందుండి సైన్యము తరలింపబడగా తాను నిరాయుధుడై అటకేగినంత అతనిని కాలయవనుడు చూచెను. వాడాయన వాసుదేవుడని, గ్రహించి చేత ఆయుధములు చేపూని మహాయోగులైనను మనసుల చేబట్టరాని ఆ స్వామిని వెన్నంటి తరిమెను. అట్లు తరుమబడి కృష్ణుడచ్చట, ముచుకుందుడను రాజు మహాపరాక్రముడు, నిద్రించుచున్న గుహలో ప్రవేశించెను. ఆ యవనుడు అచ్చటదూరి అటపరుండియున్న నరునిచూచి కృష్ణుడనుకొని పాదముచే తన్నెను. అతడు కన్ను తెరచి చూచిన క్షణములో యవనుడు అగ్నిచే కాలిపోయెను. ఆ ముచుకుందుడు మున్ను దేవాసుర యుద్ధమునకేగి మహారాక్షసులందఱిని జయించి దేవతలను నిద్రకావలెనని కోరెను. వారును నిదురించిన నిన్నెవ్వడు వచ్చి లేపునో వాడు దేహమున పుట్టిన అగ్నిచే అప్పుడే భస్మము కాగలడు అని వరమిచ్చిరి.

ఇట్లు అపాపాత్ముని, యవనునికాల్చి మధుసూదనుని చూచి “ఎవడు నీవు” అన “నేను చంద్రవంశమున వసుదేవునికి పుట్టినవాడను. యాదవుడ”నని హరి పల్కెను. ముచుకుందుడు ఆ పలుకులువిని వృద్ధగార్గ్యుని మాట స్మరించి సర్వేశ్వరుడని ఎఱిగి హరికి ప్రణతుడై ఇట్లనియె. అవును. నిన్నెఱుగుదును నీవు విష్ణు అంశమున ఉదయించిన వాడవు. మున్ను గార్గ్యుడు ఇరువది యెనిమిదవ ద్వాపరము చివర యదువంశమున హరి అవతారము జరుగునని చెప్పెను. ఆతడే నీవు. మర్త్యులకు ఉపకారము చేయ దయచేసిన వాడవు. సంశయములేదు. నీ అప్రాకృత దివ్యతేజము నేను సహింపలేను అని మహామేఘ గర్జాగంభీరమైన ధ్వనితో కృష్ణస్వామిని ఇట్లు స్తుతించెను.