జరాసంధునితో బలరామ శ్రీకృష్ణ యుద్ధము

వ్యాసుడు అనియె -

మగదాధిపతి జరాసంధుని కూతుండ్రను అస్తిపాప్తి అనువారిని కంసుడు పెండ్లి ఆడెను. వారి భర్తను చంపినాడని వీని జరాసంధుని యాదవుడైన హరిని తాను చంపుటకు కోపముతో దండెత్తి వచ్చెను. వచ్చి మధురను ముట్టడించెను. వానికి ఇరువది మూడు అక్షౌహిణుల సేనయుండెను. బలరామకృష్ణులు అల్ప పరివారముతో వాని బలముతో పోరిరి. కొంతసేపటికి హలియు హరియు తమ పురాణాయుధములను చేకొనవలెనని సంకల్పించిరి. సంకల్ప మాత్రమున చక్రము, శార్ఙ్గము (విష్ణు ధనస్సు), అక్షయ బాణములు, అమ్ముల పొదులు రెండు, కౌమోదకి అను గదయు నింగినుండి ఆ మహావీరుల వద్దకు వచ్చెను. బలరాముని నాగలికూడ గగనమునుండి ఆతని చేతికందెను. మరియు అతనికి ఇష్టమైన సునందమను ముసలాయుధము (రోకలి) గూడ బలరాముని కరమున చేరెను. అవ్వల యుద్ధమున సేనతో మగధరాజును ఓడించి ఆ వీరులు వారి పురమును చొచ్చిరి.

ఆ దుష్టుడు ఓడిపోయెనుగాని, బ్రతికిపోయెనని కృష్ణుడు వానిని గెలిచినట్లు కాదను కొనెను. వాడు బలమును కూర్చుకొని మఱుల వారిపై తిఱుగబడెను. అప్పుడు వారి చేతిలో వాడు ఓడిపోయెను. దుర్మదమున అతడు ఇట్లు పదునెన్మిది దండయాత్రలు చేసి మాగధుడు కృష్ణ ముఖ్యులతో యాదవులతో పోరి అల్పావశిష్టమైన సైన్యముతో వెనుదిరిగి పోవుచుండెను. అన్నింటను యాదవ సైన్యము పెక్కుతీరుల సురక్షిత మగుట, కేవలము ఛత్రియగు విష్ణు అంశము యొక్క సాన్నిధ్య ప్రభావమే అది ఆ జగత్పతియొక్క మానుషా వతార లీలా విలాసమే. మనసు చేతనే జగమ్ముల సృష్టి సంహారములు చేయు భగవంతుడు శత్రువులపై అనేకములయిన అస్త్రములను విడచుట శత్రుపక్ష క్షయమునకై చేయు ప్రయత్న విస్తరమది ఎంత పాటిది? అయినను మానవులకు మానవ ధర్మాను వర్తనము ధర్మము కావున బలవంతులతో సంధియు తక్కువారితో విగ్రహమును ఈ మహానుభావుడు కృష్ణుడును చేయును.

సామదాన భేదోపాయములు ప్రదర్శించి తుదకు దండోపాయము ఉపయోగించి ఒకప్పుడు పలాయనమును (పారిపోవుటను) గావించును. లీలా మానుషమూర్తియగు ఆ జగత్ప్రభువు స్వేచ్ఛానుసారము వర్తించును. మానవ శరీరుల చేష్టలను కూడ ఇట్లు అనువర్తింప చేయును. (195)