వ్యాసులిట్లనియె: చారుదేష్ణుడు, సుధేష్ణుడు, చారుదేహుడు, సుషేణుడు, చారు గుప్తుడు, చారుబిందుడు (చంద్రుడు), సుచారుడు అనువారు ఏడుగురు రుక్మిణి కుమారులు. చారుమతి అనునామె కృష్ణునకు కుమార్తె. కృష్ణునకు మఱి ఏడ్గురు భార్యలు కాళింది, మిత్రవింద, సత్య, నాగ్నజితి, జాంబవతి, నిత్యసంతుష్టయగు రోహిణి, మద్రరాజ కుమార్తె ఉత్తమ శీలముగలది అగు శీలమండల.
వీరుకాక పదహారు వేలమంది భార్యలు హరికి గలరు. ప్రద్యుమ్నుడు రుక్మి కూతురును స్వయంవరమున గ్రహించెను. ఆమె అతనిని స్వయంవరమందే స్వీకరించెను. అతనికి ఆమెయందు ‘అనిరుద్ధుడ’ను కుమారుడు కల్గెను. యుద్ధములందు నిరోధించుటకు శక్యముగాని బలసమృద్ధుడు అగుట వలన అతనికి ఆపేరువచ్చెను. వానికి రుక్మి పౌత్రిని ఇమ్మని కోరెను. అతడును కృష్ణునితో స్పర్ధ బెట్టుకొన్నను, దౌహిత్రునకు ఇచ్చెను. ఆ వివాహమందు బలరామాది యాదవులు రుక్మి రాజధానియగు ‘భోజకటము’నకు కృష్ణునితో తరలి వెళ్ళిరి. ప్రద్యుమ్న కుమారుని వివాహమచట అయిన తరువాత కళింగ రాజు మొదలైన వారు రుక్మింగని బలరాముడు పాచికలాట ఎరుగడు. కావున అతనిని జూదములోనే ఓడింతమని రుక్మికి యుక్తి చెప్పగా ఆరాజులు పిలిచి, తడిని బలగము కూర్చుకొని సభయందు బలరామునితో జూదమాడెను. ఆ ఆటలో రుక్మి వెయ్యి నిష్కముల పందెము గెలిచెను. రెండవ రోజున మఱి వేయి నిషములను గెలుచుకొనెను. ఆ మీద పదివేల నిషములను పందెము గాచెను. అత్తఱి కళింగరాజు బలరాముని చూచి పండ్లు బయలుపడ పరిహాసపూర్వముగ నవ్వెను. అయ్యెడ రుక్మి చెలరేగి బలభద్రుడు జూదమాడుట ఎరుగడు. ఐనను అహంభావముతో నేను ఆటగాడనని జూదమునకు సిద్ధపడినాడని గేలిచేసెను. హలాయుధుడు పండ్లు పైబడ, ఇకిలించిన కళింగరాజును బరిహసించుచు, పేలిన రుక్మిని జూచి కుపితుడై కోటి నిష్కములను పందెమొడ్డి గెలిచెను. రుక్మి పాచికలను విసరి పారవేసెను. బలరాముడట్లు గెలిచి ‘గెలుపు నాదియని’ బిగ్గరగపలికెను. ‘గెలుపు నాదని అబద్ధమాడకు మని’ రుక్మి అరచెను. నీ ఒడ్డిన పందెమునకు నేనామోదింపలేదు. ‘ఇట్లు గెలుపు నీది అగునేని నాది ఎందులకు గాదు’ అని రగడ చేయుచుండ ఆకాశవాణి గంభీరముగ పెద్దపెట్టున మహాత్ముడగు బలరాముని కోపమును బెంచుచు ‘బలరాముడే గెలిచినాడు రుక్మిమాట అబద్దము. ఏమియు పలుకక చేసినదియే చేసినట్లగును’ అనెను.
అంత బలరాముడు కోపముచే కన్నులెర్రబడ రుక్మిని కొట్టెను. ఎగిరెగిరి పడుచున్న కళింగ రాజునుకూడ బలరాముడు బలముచే పట్టి, వేనిని తెరచి నవ్వెనో ఆ పండ్లను ఊడ గొట్టెను. మఱియు ఆ జూదమందిరమందున్న బంగారు స్తంభమునులాగి వాని పక్షమున ఉన్న రాజులపై వైచెను. అంతట సభలో అంతటను హాహాకారములుపుట్టి రాజమండల మెల్ల పలాయనమయ్యెను. బలరాముడు కోపోద్రిక్తుడయ్యెను. రుక్మి బలునిచే హతుడగుట విని రుక్మిణికి, బలరామునకు జడిసి శ్రీకృష్ణుడు ఏమియు బలుకకుండెను. అటు పిమ్మట యదు సంఘము పెండ్లి కుమారుని అనిరుద్ధుని గొని కేశవునితో గూడ ద్వారకకు వచ్చెను. (201)