బ్రహ్మ మహా పురాణము

యోగాధ్యాయము

 సంసార దుఃఖ నివారణౌషధమగు యోగమును తాము తెలిపినచో దానియందు పురుషోత్తముడు అవ్యయుడగు విష్ణుని అనుసంధానము చేయుదుము అని మహర్షులు కోరగా యోగ వేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసుడు మిగుల సంతోషముతో యోగ ప్రకారమును ఇట్లు చెప్పనారంభించెను.

ఓ విప్రులారా! సంసార నాశకమగు యోగమును తెలిపెదను. దాని అభ్యసించి యోగియైనవాడు పరమదుర్లభమగు మోక్షమును పొందగలుగును. మొదట యోగశాస్త్రములను శ్రవణముచేసి భక్తితో గురువును ఆరాధించి యోగవిషయములనెఱిగి ఇతిహాస పురాణ వేదములలో చెప్పిన విషయములను ఆహారగుణ దోషములను దేశకాలస్థితిగుణ దోషములను తెలిసికొని పిమ్మట సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడై ఎవరినుండి ఏదియు ప్రతిగ్రహించుటపై ఆశనుమాని, యోగమును అభ్యసింపవలెను. పేలపిండి, గంజి, మజ్జిగ, దుంపలు, వేళ్లు, పండ్లు, రవ్వతో వండిన అన్నము, యవపిండితో చేసిన వంట యోగసాధనకు పనికివచ్చు ఆహారము. మనస్సు ఆవేశముచెంది యున్నప్పుడు మనస్సు వికలమై ఉన్నప్పుడు శ్రమగా ఆకలిగా ఉన్నప్పుడు చలి ఉష్ణము గాలి బాధించుచున్నప్పుడు ధ్వనులు వినబడుచుండగా నీటి సమీపమున శిథిలమైన గోస్థానములో నాలుగుబాటలు కలిసిన ప్రదేశములో పాములు తిరుగుచోట శ్మశానములో నదుల చివరలలో అగ్ని సమీపమున చైత్యముల గ్రామములలో జనులు సమావేశమగుటకును దేవతా భావనతో, పూజించుటకును నాటిన చెట్ల దగ్గరను-పుట్టల దగ్గరను-భయమునకు అవకాశముగల చోట్లను, బావుల దగ్గరను, ఎండిన ఆకుల కుప్పల దగ్గరను, యోగసాధన ఎప్పుడును చేయరాదు. ఒకవేళ ఇట్టి చోట్ల యోగసాధనను మూఢుడై చేసిన ఎడల చెపుడు, బుద్ధి మాంద్యము, జ్ఞాపకశక్తి లోపము, మూగితనము, గ్రుడ్డితనము, జ్వరము కలుగును. అజ్ఞానము సంభవించును. నాలుగు పురుషార్థములకును దేహమే సాధనము కావున పై విషయములను పాటించి దేహమును రక్షించుకొనుచు యోగ సాధన చేయవలెను.

ఆశ్రమములో జనులులేనిచోట, రహస్య స్థానమున, శబ్దము వినబడనిచోట, నిర్భయమగుచోట, కొండమీద, శూన్యగృహమున, శుచిస్థానమున, అందమైనచోట, ఏకాంతస్థానమున, దేవాలయమున, రాత్రి యొక్క మొదటి జామున, చివరి జామున, పగలు ప్రాతఃకాలమున, మధ్యాహ్నమున యోగసాధన చేయతగును. తగిన ఆహారమును మితముగా భుజించుచు, ఇంద్రియముల జయించి సుఖమును నిశ్చలమునునై, ఎక్కువ ఎత్తునుకాని రమ్యమైన ఆసనమున ప్రాఙ్ముఖుడై కూర్చుండవలెను. సత్యవచనుడు, శుచి, తగినంత నిద్రకలవాడు, క్రోధము జయించినవాడు, సర్వభూతములకు హితమును కోరువాడు, చలి వేడి మొదలగు అన్ని ద్వంద్వములను సహించువాడు, మనసున నిబ్బరము కలవాడు, శరీరము పాదములు శిరస్సు సమముగా ఉంచినవాడు కావలెను. హస్తములను నాభిపై నిలిపి శాంతుడై పద్మాసనమున నుండవలెను. మౌనియై దృష్టిని ముక్కు కొనపై నిలిపి ప్రాణాయామము చేయవలెను. జ్ఞానేంద్రియములను ఐదింటిని మనస్సుతో కూడ హృదయములోనికి ఉపసంహరించవలెను. మునియై ప్రణవమును దీర్ఘముగా పూనికతో ఉచ్చరించుచు మిగుల నిశ్చలుడై తమోగుణ వ్యాపారము రజోగుణము చేతను రజోగుణ వ్యాపారమును సత్త్వగుణముచేతను కప్పివేసి కన్నులు మూసికొని నిర్మల శాంత స్థితిలో ఉండవలెను. ఇట్లు హృదయ గుహయందు దాగినవాడును సర్వవ్యాపియు నిరంజనుడును అగు పురుషోత్తముని తన చిత్తమున అనుసంధానము చేయవలెను. జ్ఞాన కర్మేంద్రియములను భూతములను మొదట క్షేత్రజ్ఞుడు అగు జీవచైతన్యము నందును తరువాత ఆక్షేత్రజ్ఞుని పరమాత్మ తత్త్వమునందును అనుసంధానము చేయవలెను. సహజ చంచలమగు మనస్సు బాహ్య విషయ సుఖములను వదలి పరమాత్ముని చేరిన వానికి యోగసిద్ధి నిశ్చయముగా కలుగును. చిత్తము విషయములపైకిపోక బ్ర్మమునందు లయమొందినచో యోగసమాధి ఫలమును సిద్ధింపజేయుటచే సాధకుడు పరమపదమును పొందును. యోగసాధకుని చిత్తము ఏకర్మాచరణమునందును ఆసక్తి నొందక ఆనందమును పొందినప్పుడు మోక్షము పొందును. జాగరిత స్వప్న సుషుప్తి స్థానములను దాటి తురీయావస్థలో ఉండు పురుషోత్తముని చేరినప్పుడు మోక్షము పొందును. జాగరిత స్వప్న సుషుప్తి స్థానములను దాటి తురీయావస్థలో ఉండు పురుషోత్తముని చేరినప్పుడు యోగసాధకుడు మోక్షసిద్ధి నొందును. ఏ కోరికలునులేక అన్నిటిని ప్రీతికరమైన వానినిగానే చూచుచు పరతత్త్వము తప్ప మిగిలినదంతయు అనిత్యమని ఎఱుగనిదే మోక్షము సిద్ధింపదు. యోగ సాధకుడు వైరాగ్యముతో నుండవలెను. ఇంద్రియ సుఖముల సేవింపరాదు. యోగమును అభ్యసింప వలెను. పద్మాసనముతో కూర్చుండుట నాసాగ్రమున దృష్టి నిలుపుట మాత్రమున యోగసిద్ధి కలుగదు. మనస్సు ఇంద్రియములు కలిసి లయము నొందుటయే యోగము.

ఓ ముని శ్రేష్ఠులారా! సంసారమోక్ష సాధనమగు యోగ ప్రకారమును తెలిపితిని. మఱియేమి వినగోరుదురో అడుగుడు” అనగా (235)