బ్రహ్మ మహా పురాణము

రుద్రాఖ్యానము

సర్వాంతర్యామియైన రుద్రుడు ఉమాదేవికి ప్రియము చేయువాడై సర్వదేవతలను సిద్ధవిద్యధరులను ఋషులను గంధర్వ నాగ యక్షాదులను మఱి యజ్ఞమునకు వచ్చిన అందఱిని పారద్రోలి సర్వశ్రేష్ఠ పదార్థములతో నిండిన యజ్ఞమును సర్వసంభారములతో నశింపజేసెను. స్వామి ప్రతాపమునకు భీతినొంది ఇంద్రాదులు శాంతి కరవై, కైలాసమున కేగి వరదుడైన ఆ శూలపాణిని దక్షయజ్ఞ ధ్వంసకుడైన భగవంతుని శరణందిరి. అప్పుడు పరమశివుడు ఏకామ్రక (కాంచీ) క్షేత్రమందు సర్వకామప్రదుడై ఉండెను.

మునులు- “సర్వభూత హితాభిలాషియైన శివుడేల ఆ దక్షుని యజ్ఞమును సంహరించెను. సర్వదేవతలు అందు అలంకరించి ఉన్నారు గదా! స్వల్ప కారణమున అట్లు జరిగినదని మేము అనుకొనము. మీవలన విన మిక్కిలి కుతూహలము అగుచున్నది” అని అనగా, బ్రహ్మ ఇట్లు అనియె-దక్షునికి ఎనమండుగురు కూతుండ్రు. వారందరు వివాహితులు. వారిని తండ్రి రావించి తనయింట సత్కరించెను. వారును పుట్టింట ఆదరమంది వసించిరి. వారిలో పెద్దదియగు సతి అను శివుని భార్యను దక్షుడు రుద్రుని ద్వేషించి పిలువడయ్యెను. అందులకు అల్లుడు పరమేశ్వరుడు నైజముగ దనప్రభావమున తానున్నవాడు కావున ఆమామగారి యెడ ఏకొంచెము వినయము చూపడయ్యెను తండ్రి గృహమునకు చెల్లెండ్రందరు వచ్చిరని సతీదేవి ఎఱింగి తానును, పిలువకున్నను అటకేగెను. తండ్రి అందరు కూతురుల కంటె ఆమెను హీనముగ చూచి వారికంటె తక్కువగ ఆదరించెను. అంతట సతీదేవి కినుకగొని తండ్రితో ఇట్లు అనెను.

నాకన్న ఈ కన్యలు చిన్నలు. నేను పెద్ద ఆడపడుచును. నన్ను గౌరవింక ఉన్నావు, అంతేకాదు అలుసు చేసితివి. నేను ఇందఱిలో పెద్దను, యోగ్యతలోను పెద్దను. నన్ను సత్కరింప వలసిన వాడవు. నీవు ఎందుకు ఉపేక్ష చేసితివి?

అని సతీదేవి అనగా విని దక్షుడు కన్నెఱ్ఱ చేసి ఇట్లు అనియె.

ఆ నాకన్నియలు నీకన్న అన్ని విధముల మిన్నలు. యోగ్యులు. వారి భర్తలుగూడ నాకెంతేని కూర్తురు. బ్రహ్మిష్ఠులు, వ్రతనిష్ఠులు, ధర్మిష్ఠులు, యోగనిష్ఠులు, గుణగరిష్ఠులు, నిటలాక్షుని(శివుని) కంటె పలువిధముల అందఱు మెచ్చదగినవారు. వారు వశిష్ఠుడు, అత్రి, పులస్త్యుడు, అంగిరుడు, పులహుడు, క్రతువు, భృగువు, మరీచి అనువారు. పశుపతి వారితో గూడ స్పర్ధ గొనును. వారును అతనిని ద్వేషింతురు. అందువలన నిన్ను నేను గౌరవింపను. నాకు శివుడు ప్రతికూలుడని మూఢ బుద్ధియైన దక్షుడు ఆమెతో అనెను. శాపమునకు తాను గురి కావలసిన వీధి ననుసరించి ఇట్లు ఋషులను అల్లుని తూల నాడెను. అంతట ఆ దేవి కోపము తెచ్చికొని తండ్రితో

త్రికరణములచేత పరిశుద్ధురాలనైన నన్ను గర్హించితివి. కావున నీ వలన వచ్చిన ఈ దేహమును ఇదిగో ఇప్పుడే విడుచుచున్నాను అనెను.

అని ఆ అవమానము సహింపలేక దుఃఖముతో ఆదేవి దక్షునితో ఇంకను ఈ మేను విడిచి మఱియొక ఉపాధితో వెలుగొందుచు నేను పొరపాటు పడని దాన ధర్మనిష్ఠనై పరమేశ్వరునికి ధర్మపత్నిని అయ్యెదనుగాక.

అని అక్కడనే కూర్చుండి, దుష్టుడగు దక్షుని సాధించుటకు తాన తనయందగ్ని ధారణ చేసెను.

ఆ అగ్ని వాయు ప్రేరితుడై ఆమె అన్ని అవయవములందుండి వెలువడి ఆమెను భస్మ మొనరించెను. శూలపాణి ఆమె నిర్యాణ వార్తను విని, తండ్రి కూతుండ్ర సంవాదమును ఉన్నదున్నట్లు తెలిసికొని భగవంతుడన శంకరుడు కుపితుడై దక్ష వినాశమునకై ఉద్యుక్తుడయ్యెను.

అట్లు కోపించి శంకరుడు ఇట్లు అనియె. “ఓ దక్షా! పిలువని పేరంటముగ వచ్చి సతీదేవి నీచే అవమానితురాలైనది కావున నీ తక్కిన కూతుళ్లు మగలతో ఉత్తమరాండ్రు కావున వైవస్వత ద్వితీయ మన్వంతరమున నీ మహర్షులు అయోనిజులై నీ యజ్ఞమునకు వత్తురు. చాక్షుష మన్వంతరమున బ్రహ్మ గావించు సత్రయాగమందు హోమము జరుగగా ఇట్లు జరుగును. అని సప్తర్షులను శపించి రుద్రుడు దక్షుని కిట్లు శాపమిచ్చెను. చాక్షుష మన్వంతరమున ప్రాచీన బర్హిపౌత్రుడు ప్రచేతసుని పుత్రుడునై దక్షుడను నీ పేరుతోనే మారిషయందు నీవు జనింతువు. ఆ మారిష వృక్షములకు కన్యయై జనించును. నేను అక్కడ గూడ దుర్బుద్ధివగు నీకు ధర్మకామార్థ యుక్తములయిన నీ కర్మాచరణములందు మఱిమఱి విఘ్నములు గావింతును అని పలికెను. ఇట్లు శప్తుడై ఆదక్షుడును రుద్రునకిట్లు ప్రతిశాప మిచ్చెను. ఓ క్రూరుడా! నా కొఱకు ఈ మహర్షులనుగూడ తూలనాడితివి. కావున యజ్ఞములందు దేవతలతో బాటు నిన్నెవ్వరును యజింపరు. ఒక వేళ నీకు ఆహుతి ఇచ్చినను, (రుద్రునికి ఇచ్చిన ఆహుతి అనంతరము) పవిత్రులగుట కుదరక స్పర్శగావింతురు. యుగాంతము వరకీ లోకముననే నీవుందువు. దేవతలతోబాటు నీకు పూజ ఉండదనెను.

ఆ మాటలకు పరమ శివుడు దేవతలు తమలోగల చతుర్వర్ణములవారితో కలిసి భుజింతురు. వారితో కలిసి నేను భుజింపను. వేరే భుజింతును. అన్ని లోకములకు మొదటిది భూలోకమందురు. అలోకమును నా అంతట నేనొక్కడనే ధరింతును. నీ ఆజ్ఞతో గాదు. (నీ ఆజ్ఞ అక్కర లేదు) ఈ కర్మ భూమిని ధరించినంతట ఎల్లలోకములు శాశ్వతముగ సుస్థిరములై నిలువ గలవు. అందుచే నేను ఈ భూలోకమందే ఉందును. అదియు నీ యాజ్ఞచేత గాదు అని అనెను.

అమిత తేజోమూర్తి అగు రుద్రునిచే నిట్లు దక్షుడు నొవ్వనాడబడి స్వాయంభువ మూర్తిని విడిచి (ప్రజాపతిత్వము గోల్పోయి) మనుజులందు ఇక్కడ మానవ లోకమున జనించి దక్షుడను పేరుతోనే గృహస్థుడై యజ్ఞములందు యజమానుడై దేవతలతో గూడ ఎల్ల యజ్ఞములను ఆచరించెను.

ఆ మీదట సతీదేవి వైవస్వత మన్వంతరమురాగానే హిమవంతునికి మేనకయందు ‘ఉమా’ అనుపేరుగలదై అవతరించెను. ముందు సతియను పేరంది ఆ మీద ‘ఉమ’ అను నామమందెను. శంభునికి ఈమె సహధర్మచారిణి. ఆయన ఈమె ఎన్నడును విడిచి ఉండడు. మరీచి కుమారుడైన కశ్యపుని అదితి, నారాయణుని శ్రీదేవి. ఇంద్రుని శచీదేవి, విష్ణుని కీర్తి, సూర్యుని ఉష, వశిష్ఠు అరుంధతియు వలె శంకరుని ఈమె ఎన్నడును విడువదు. పరమేశ్వరునకు ఈమె నిత్యానపాయిని.

మున్ను ఇట్లు ఆ దక్షుడును, చాక్షుష మన్వంతరమందు బ్రహ్మ గావించిన యజ్ఞమునందు ప్రాచీనబర్హికి పౌత్రుడుగను ప్రచేతసులకు పుత్రుడుగనునై మారిషయందు జన్మించెను. ఇది మునుపు త్రేతాయుగమున వైవస్వత మనువు కాలమున బ్రహ్మ వరుణ దేవతాకమైన రూపము ధరించి గావించిన యజ్ఞమునందు దక్షుని జన్మము జరిగినది. అల్లుడు మామలకు కలిగిన ఈ విరోధము జన్మాంతరమును పొందినది. కావున ఉత్తములు ఒండొరులు విరోధము పెట్టుకొనగూడదు. శుభా శుభకర్మ ఫలములచే భావితుడై (అనగా ప్రారబ్ధమునకు అధీనుడై) ఉండు జీవుడు ఆకారణముచే జాత్యంతరమందు పుట్టినపుడు వానికిని పూర్వజన్మ ఖ్యాతి (యోగ్యత)రాదు. ఆ పుట్టువులో కార్యాకార్య విచక్షణత ఉన్నను తొల్లిటి కర్మానుభవమెంత వారికిని తప్పదన్నమాట అని చెప్పగా

బ్రహ్మ పలుకులు విని మునులు ఇట్లనిరి. “దక్షకన్య సతీదేవి రోషముగొని మేను విడిచి పర్వతరాజింట జనించెగదా! అపుడు మఱల నా భవానికి భవునితో సమావేశము ఎట్లు అయినది? వారికా ఘట్టమునందు జరిగిన సంవాదమేమి? ఆ మహాపుణ్య జన్మమందు స్వయంవర మెట్లయ్యెను? వారి కల్యాణ మహోత్సవము అచ్చెరువు కొల్పునది. గదా! అదెల్ల సవిస్తరముగ ఆనతీయవలసినదిగా మా ప్రార్థన. మనోహరమైన ఆ పుణ్యకథ మేము విన కుతూహల పడుచున్నాము” అనగా బ్రహ్మ ఇట్లనియె.

ఓ మునివర్యులార! పాపహరమగు ఆ ఉమా శంకర కల్యాణము పవిత్రము. కామ ఫలదము. ఒకప్పుడు తన ఇంటికి అరుదెంచిన కశ్యప మహర్షిని హిమవంతుడు పుణ్యయశఃకరమగు ఒక వృత్తాంతమును ఇట్లు అడిగెను. మునీ! ఏమి చేసిన అక్షయపుణ్య లోకములు గల్గును? పరమోత్తమ ఖ్యాతి దేనివలన వచ్చును? సత్పురుషులు ఎవ్వరెట్లు పూజింపవలసి ఉందురు అది ఆనతిమ్మని అడుగగా కశ్యపుడు ఇట్లనెను.

నీ తెల్పిన భాగ్యమెల్ల సంతానమువలన గలుగును. నేను (చతుర్ముఖ బ్రహ్మ) పరమర్షులు ఎల్లరు సంతాన లాభముచే ఖ్యాతి గన్నారము. గిరీంద్ర! నీవు చూచుట లేదా! ఇంకను అడిగెదవేమి? మున్ను నేను చూచిన వృత్తాంతమిది దీనిని చెప్పెద వినుము. వారణాసి కేగుచు ఆకాశమందున్న ఒక నూతన దివ్య విమానము గాంచితిని. దానికి క్రిందుగ ఒక గుంట నుండి యొక ఏడుపుధ్వని విన్నాను. నా తపశ్శక్తిచే దానిని ఎఱింగి అచటికేగి దాగి నిలిచితిని. అటనొక పవిత్రమూర్తి తపస్వి తీర్థముల సేవించి అభిషేకము గావించుకొని అదారినేగుచు ఒక బెబ్బులికి బెదరి అగుంట దరికి పరువిడి వచ్చెను. అక్కడ ఒక అవురుగడ్డికాడను పట్టుకొని వ్రేలాడు మునులనుచూచెను. అట్లుచూచి ఆర్తుడై దుఃఖించులను ఎవ్వరుమీరు? ఈ గడ్డి దుబ్బును ఊతగాగాని మొగములు క్రిందికి వాల్చి వ్రేలాడుచున్నారు. మీ దుఃఖమునకు విముక్తి కలుగగలదు చెప్పుడు. అనగా పితరులు ఇట్లు అనిరి.

మేము పుణ్యకర్ముడవగు నీ తండ్రులము, తాతలము, ముత్తాతలమును. నీ పాప కర్మముచే మేమిట్లు క్లేశపడుచున్నాము. ఈ గుంట గుంటగాదు నరకమే. నీవే ఈ అవురు గడ్డిదుబ్బు. నిన్నే ఊతముగా చేసికొని వ్రేలాడుచున్నాము. నీవుబ్రతికి నన్నాళ్ళు మేము ఇచ్చట ఇట్లుందుము. నీవు మరణించినంతట మేము నరకము పాలగుదుము. నీవు పెండ్లి చేసికొని గుణవంతుని పుత్రుని గంటివేని మేము ఈ పాపమునుండి ముక్తులగు దుము. వేరు ఏ తపస్సు యొక్క తీర్థముల యొక్క ఫలమునను మాకు విముక్తిరాదు. బుద్ధిమంతుడవు కావున నీ పితరులను మమ్మీ నరక భయము నుండి తరింపజేయుము. అన కశ్యపుడు

అట్లే చేసెదనని చెప్పి అతడు వృషభవాహను ఆరాధించి అగర్తము నుండి పితరులను ఉద్ధరించి వారిని శివుని ప్రమథగణముల నాయకులను కావించెను. తాను సువేశుడను పేర బలశాలియై రుద్రుని గణనాయకుడయ్యెను. కావున ఓ శైలేంద్ర! తీవ్ర తపస్సుచేసి గుణశాలియైన సంతానమును కనుము. పరమసుందరిని కూతురుని గాంచుము.

ఇంకను బ్రహ్మ ఇట్లు అనెను. ఇట్లు ఆ ఋషిచే తెలుపబడి, కొండల ఱేడు (హిమవంతుడు) నియమమును పూని అనుపమమయిన తపస్సు గావించెను. దానిచే నాకు సంతుష్టి గల్గినది. వెంటనే నేనాతని కడ వ్రాలితిని. నీ తపమ్మునకు మెచ్చితిని. వరమిచ్చెద నడుగుమంటిని. సర్వ గుణాలం కారుని కుమారుని కోరెద నాయెడ సంతుష్టుడైతివేని అనుగ్రహింపుమని శైలరాజు అనియెను.

అతని మాటవిని, యాతని మదికనువైన వరము ఇచ్చితిని. ఓ శైలరాజు! ఈ తపః ప్రభావమున నీకొక కన్య ఉదయించును. దాన నీవు పరమశోభనమైన కీర్తి నొందెదవు. ఎల్లవేల్పులు నిన్నర్చింప కోటి తీర్థములకు నెలవై పావనుడవై దేవతలకెల్ల పూజనీయుడవయ్యెదవు. ఆ కన్నియ నీకు పెద్ద కూతురగును. మరి ఇద్దఱు కన్యలు కలుగుదురు.

బ్రహ్మ అన్నట్లు గానే హిమవంతుడు మనయందు కన్యకను గాంచెను. మేనాదేవి యందు హిమవంతుడు మఱి కొంత కాలమునకు అపర్ణ ఏకపాటల ఏకపర్ణ అనుకన్యలను కనెను. ఆకుకూడ తినక అపర్ణయు మఱ్ఱియాకు ఒకదానిని తిని ఏకవర్ణయు పాటలమను చెట్టునాకొకటి తిని, నీడను నిలువక ఏకపాటలయు తపస్సు చేసిరి. ఇట్లు వారు వేయి ఏండ్లు తపస్సు గావించిరి. అప్పుడు తల్లి మేన మాతృ ప్రేమతో ఉ+మా తపస్సు వద్దు చాలింపుము అనెను. అట్లు తనను నిషేధించుచున్నను తీవ్రతపస్సు కావించినందున అదే పేరుతో అనగా ‘ఉమా’ అనుపేరుతో దేవతలకు పూజనీయయై ప్రఖ్యాతి నందెను.

చరాచరాత్మకమైన ఈ జగత్తు త్రికుమారీకము అనగా ఈ ముగ్గురు కుమార్తెలతో (శక్తులతో) నిండినది. వీరి తపోవృత్తాంతమును భూమి ఎంతవఱకు ధరించునో అనగా ఈ చరిత్ర భూ లోకమునందు వాడబడినంత కాలము తపోమూర్తులైన ఈ ముగ్గురు శక్తులు యోగభూమిక యందుండి స్థిరయౌవనులై లోకమాతృకలై బ్రహ్మచారిణులై తమ తపస్సుచే ఎల్లప్పుడు లోకములను అనుగ్రహింతురు. వారిలో జ్యేష్ఠురాలు (పెద్దది) శ్రేష్ఠురాలు గూడ. మహాయోగ బలముతో గూడి మహేశ్వరుని పొందినది.

భృగు కుమారునికి ఏకపర్ణ భార్య అయ్యెను. ఆమె దేవలుడను పుత్రునిగనెను. ఆ మువ్వురు కుమారికలలో మూడవ ఆమె ఏకపాటల అలర్కుని కుమారుడగు జైగీషవ్యుని పెండ్లాడినది. ఆమెకు శంఖ లిఖితులను ఇద్దరు పుత్రులు అయోనిజులు గల్గిరి. నీకేను దెల్పిన ఉమాదేవి పరమసుందరి. ఆమె తపన్తీ వ్రతముచేత ముల్లోకములు పొగలు గ్రమ్ముట చూచి నేను (బ్రహ్మ) అమెతో దేవీ కళ్యాణివి నీవు తపస్సుచే లోకములనేల తపింప జేయుదువు. నీచేత ఈ జగత్తు సృష్టింపబడినది. నీవు దానిని పుట్టించినదానవు. నీవు దీనిని నశింపజేయదగదు. నీ తేజముచే ఈ లోకములను అన్నిటిని ధరించుచున్నావు. ఓ జగన్మాతా! నీవు కోరునదేమో మాకు ఇప్పుడు ఇక్కడ తెలుపుమనగా, దేవి నేనెందులకీ తపస్సు చేయుచున్నానో నీవే ఎరుంగుదువు. మరల నన్నేల ప్రశ్నింతువనెను.

బ్రహ్మ ఇట్లు అనియె-

అంతట నేను ఆమెతో ఇట్లంటిని. ఎవని కొఱకు నీవీ తపస్సు చేయుచున్నావో అతడు తానేవచ్చి ఇచట నిన్ను వరింప గలడు. నీకు దగిన వాడు ఆ శర్వుడు. సర్వలోకేశ్వరులకు ఈశ్వరుడు. మేము ఆయన వశములోని కింకరులము. ఆ దేవదేవుడు స్వయంభువు. ఆయన ఉదారరూపుడు. విలక్షణ రూపుడును. ఆయనకు సమానరూపుడు మఱిలేరు. కొండలమీద వసించు వాడతడు. చరాచర సృష్టికి ఈశ్వరుడు ఆయన. మొట్టమొదటివాడు. ఊహకందనివాడు. ఇంద్రునికి ఈడగు వర్చస్సుతో ఇందుబింబము భరింపకుండ ఆదిశేష సమానమైన వర్చస్సుతో భీకరమగు రూపముతో నీదరికి తానే రాగలడు. (34)