బ్రహ్మ మహా పురాణము

బ్రహ్మాదికృత శివస్తుతి

ఉమామహేశుల వివాహమిట్లు జరుగగా ఇంద్రాదులగు అమరులెల్లరు అమందానంద భరితులయి మహేశ్వరునికి ప్రణమిల్లి అనేక సాభిప్రాయ పలుకులచేత వినుతించిరి.

ఇట్లు జగత్పతి, భగవంతుడు అయిన ఉమాపతి ఎల్ల సురలచే వినుతుడై ఓ నిర్జరులారా! మీకు నేను చూడ సౌమ్యుడనైతిని. వేగమే వరము కోరుకొనుడు ఒసంగెద. ఇందు సందియము లేదు అనగా ‘ఆ వరము నీచేతనే ఉండుగాక! కార్యావసరమందు దానిని ఇత్తువు గాక! అని దేవతలనగా ఆయనయు సరే అని ప్రమథగణములతో స్వభవనమున కేగెను. అద్భుతమైన ఈ శివ కల్యాణ మహోత్సవము దేవ భూదేవుల సమక్షమున గానముచేయు వాడు గణేశ భావమునంది సుఖించును. (37)