వ్యాసులు అనియె -
‘ఇంద్రుడు ఐరావతమెక్కి ద్వారవతియందున్న కృష్ణుని చూడవచ్చి, అతనికి నరకాసురుని చర్యలను తెలిపెను. దేవతలకు దిక్కయిన నీవు మనుష్యరూపమున ఉండియు సర్వదుఃఖ ప్రశమనము జేసినావు. తపశ్శాలుర రక్షణకు, అరిష్టుడు మొదలగు కంసునివరకు గల జగత్తుకు ఉపపద్రవమైన వారిని నశింపజేసితివి. నీ బాహుదండము చేతను ప్రబోధము చేతను త్రిభువనములు రక్షణముపొంది దేవతలు యజ్ఞములందు హవిర్భాగములు ఆరగించి తృప్తులగుచున్నారు. నేనిప్పుడు ఎందులకు వచ్చితినో విని, ప్రతిక్రియకు యత్నింపుడు. భూమి పుత్రుడు నరకుడు అనువాడు ప్రాగ్జ్యోతిష పురాధిపతి సర్వభూతములకు బాధ చేయుచున్నాడు. దేవసిద్ధులు సురులు మొదలగువారి కన్యకల హరించి తనయింట నిర్బంధించినాడు. ఉదకమును స్రవించు వరుణుని యొక్క గొడుగును వాడు హరించెను. మణులకు ఆకరమైన మందరపర్వత శిఖరమును గొనిపోయినాడు. మాతల్లి అదితియొక్క కుండలములను అమృతము స్రవించువానినిగా జేసినాడు. ఇప్పుడు ఐరావతము కావలెనను చున్నాడు. వాని దుష్కృత్యము నీకు నివేదించినాను. ఇందుకు చేయవలసిన ప్రతిక్రియ నీవు స్వయముగా విమర్శింపుము.
అనినవిని భగవంతుడు దేవకీసుతుడు అల్లననవ్వి ఇంద్రునిచేయి పట్టుకొని పీఠము నుండి లేచెను. తలచినంతన వచ్చిన గరుత్మంతునిపై సత్యభామను ఎక్కించి ప్రాగ్జ్యోతిష పురమునకేగెను. ఇంద్రుడు ఐరావతమునెక్కి ద్వారకావాసులు చూచుచుండ స్వర్గమునకు వెళ్ళెను.
ప్రాగ్జ్యోతిష పురము చుట్టునూ నూరు యోజనములు భయంకరములైన పాశములచే చుట్టబడి ఉండెను. పరసైన్య నిరోధమునకు ఏర్పడిన ఆ పాశములను సుదర్శనాయుధము విసరిహరి ఖండించెను. అవ్వల మురాసురుడు ఎదిరింపరాగ హరి వానిని కడతేర్చెను. మరియు వాని కొడుకులను ఏడువేలమందిని మిడుతలనువలె చక్రధారాగ్ని దగ్ధులను చేసెను. అచ్చటనే హయగ్రీవుని చంపి బుద్ధిశాలియగు హరి తొందరతో ప్రాగ్జ్యోతిష పురమునకు బరువెత్తెను. అచ్చట నరకునితో మహాసైన్యముతో ఘోర యుద్ధమయ్యెను. గోవిందుడు వేలకొలది దైత్యులను కూల్చెను. అవ్వల శస్త్రాస్త్రములను వర్షించుచున్న భౌముని మీదికి చక్రాయుధమును విసరి దైతేయ చక్రసంహారి వానిని రెండుగ జేసెను. నరకుడు కూలగా భూదేవి అతిదికి ఇచ్చిన కుండలములుగొని జగన్నాధు సన్నిధికి వచ్చి ఇట్లనెను.