బ్రహ్మ మహా పురాణము

మానవులకు ఉత్తమగతి ప్రాప్తి

అనగా “సర్వప్రాణులకు ఈశుడవును దేవతలచేతను, రాక్షసుల చేతను సమస్కరింపబడు ఓ భగవన్! శివా! మానవుల ధర్మాధర్మములను నాకు తెలిపి సంశయము తీర్చుము. మానవులు, మానసికములు, వాచికములు, శారీరకములు అగు ఏత్రివిధ కర్మ బంధములచే బంధింపబడుదురు? ఎట్లు విడుదల పొందుదురు? ఓ దేవా! ఏ శీలముచే ఎటువంటి కర్మచే ఏ ఆచరణములచే గుణములచే వారు స్వర్గము పొందుదురు?” అని పార్వతి పలికెను.

ఆ ప్రశ్నలను విన్న సదాశివుడు ఆమెతో ఇట్లు పలికెను-

ధర్మ తత్త్వమును ఎఱిగి నిరతము దానియందే ఉండు ఓ దేవీ! సర్వ ప్రాణులకు హితకరమై బుద్ధిని వృద్ధిచేయు నీ ప్రశ్నకు సమాధానము చెప్పెదను. వినుము: సత్య ధర్మములందు ఆసక్తులై, శాంతులై, అన్ని బాహ్యలక్షణములను వదలి సంశయ రహితులగు వారు బంధనములకు లోబడరు. అట్టివారు ప్రపంచోత్పత్తి ప్రళయముల తత్త్వము తెలిసి, సర్వజ్ఞులై కోరికలు లేక కర్మ బంధముల నుండి ముక్తి పొందుదురు. త్రికరణములతో ఏ ప్రాణిని హింసించక దేనియందు ఆసక్తి ని పొందనివారు దయకలిగి ప్రాణిహింస చేయక సత్ శీలము ప్రియా ప్రియముల యందు సమబుద్ధి కలిగి సర్వ ప్రాణులకు విశ్వసనీయులై ఇంద్రియ నిగ్రహము కలిగినవారు కర్మలచే బంధింపబడరు. స్వర్గమును పొందుదురు. ఇతరుల ధనములయందు దారలయందు ఆసక్తి లేక వారిని తల్లిగా చెల్లెలుగా తలచుచు, మొరటు సుఖమునకు కాక, తన భార్యను ఋతుకాలమున మాత్రమే ధర్మమునకై కలియుచు ధర్మముచే ఆర్జించిన దానితో జీవించుచు, తృప్తి నొందుచు దొంగతనము లేక సత్ప్రవర్తనము ఇంద్రియ జయము కలవారు స్వర్గము ఒందుదురు. వ్యర్థముగా ఏ ప్రాణికి అపకారము చేయక మనస్సున మాలిన్యము లేక దానము సత్కర్మము తపస్సు శీలము శుచిత్వము దయకలిగి జీవించు ఈ మార్గము దైవము నిర్ణయించినది. వివేకము కలిగి దీనినే మానవుడు అనుసరించవలెను” అని చెప్పిన పరమశివుని మాటలను వినిన పార్వతి “పూజ్యుడవగు దేవా! భూతపతీ! బంధమునకు కాని ముక్తికికాని హేతువులగు కర్మలను తెలుపుము” అని ప్రశ్నింపగా శివుడు ఆమెతో ఇట్లు అనెను:

“తన కొఱకేకాని, పరులకొఱకే కాని, జీవనమునకే కాని, ధర్మమునకే కాని, తన స్వేచ్చకే కాని అసత్యము పలుకరాదు. పరుషము, కటువు, నిష్టురము, కొండెములు, మిత్రభేదము కలిగించునది ఇతరులకు బాధ, ద్రోహమును కలిగించునది అగు మాట పలుకక మృదువై స్వచ్ఛ వర్ణములుకలిగి పాపములేక, తీయనైన పలుకులు అంతఃకరణ శుద్ధిగా కోపములేక మనోహరముగా పలుకువారు స్వర్గమును పొందుదురు. వాచికమగు ధర్మ స్వరూపము ఇది.

మానవుని స్వర్గలోక గతికి సాధనమగు మానసిక ధర్మములు చెప్పెదను వినుము. అతడు మనస్సును చెడుదానినిగా చేసినచో కర్మచే బద్ధుడగును. అరణ్యమున నిర్జన ప్రదేశమున పరధనము కనబడినను గ్రహించతలచక ఏకాంతమున లభించినను పరదారల కోరక-శత్రువులను మిత్రులను సమముగా మైత్రితో చూచుచు వేదశాస్త్రాధ్యయనము దయ శౌచము సత్యము కలిగి, తమ ధనములతో తృప్తులై ఏ ప్రాణియందు దయయే కాని వైరము లేనివారు స్వర్గమును పొందుదురు. జ్ఞానము, సత్కర్మలు, ఓర్పు మంచిమనస్సు కలవారిపై ప్రీతి ధర్మాధర్మ జ్ఞానముకలిగి తామాచరించు శుభ, అశుభ, కర్మలలో వేనియొక్క ఫలమునందును కోరికలు లేక జీవించువారు స్వర్గము నొందుదురు. ఈ చెప్పిన మానసిక పాపములను విడిచి దేవబ్రాహ్మణ భక్తికలిగి నిత్యము సత్కర్మలయందు ప్రయత్న పరులయి ఉండువారు స్వర్గము పొందుదురు. మానసిక సత్కర్మలు నీకు తెలిపితిని. మఱి ఏమి వినగోరెదవు?” అని అడుగగా పార్వతి “ఓ మహేశ్వరా! మానవుల విషయమున నాకొక సంశయము కలదు. మీరు దానిని వివరించి తీర్చవలయును. ఏ కర్మచే ఏ తపస్సుచే దీర్ఘాయువు లభించును? ఏ కర్మచే ఆయువు క్షీణించును? కర్మ విపాకము ఎట్టిది? కొందఱు మహా భాగ్యము కలవారు మఱికొందరు మందభాగ్యులు అగుటకు కొందరు గొప్పకులమున, మఱికొందరు తక్కువ కులమున పుట్టుటకు కొందఱు కొయ్య బొమ్మలవలె కురూపులు మఱి కొందఱు అందగాండ్రు కొందఱు ప్రజ్ఞాహీనులు మఱికొందఱు మహా ప్రజ్ఞకల పండితులు, జ్ఞానవిజ్ఞానవంతులు కొందఱు, అల్పవాక్కు కలవారు మఱి కొందఱు గొప్ప వాక్పాటవము కలవారై కనబడుటకు హేతువును తాము నాకు వివరించవలయును” అని ప్రశ్నించెను.

అప్పుడు శివుడు దేవీ! మర్త్యలోకమున ప్రతిమానవుడును తన కర్మకు తగినట్లు ఫలమును పొందు విధమును చెప్పెదను వినుము. యోగీంద్రుడే ఐనను ఎప్పుడును చేతిలో దండమును ఆయుధములను ధరించి ప్రాణి సమూహముల ప్రాణముల హింసించుచు వాటిపై దయలేక వానికి భయమే కలిగించుచు కీటకములకు పక్షులకుకూడ రక్షణనీయని వాడు నరకము పొందును. ఇట్టి ఏహింసను చేయనివాడు స్వర్గము పొందును. అట్టి ధర్మాత్ముడు స్వస్వరూపముతోనే ఉండును. హింసకుడు నరకమున భయంకరమును క్లేశములతో కూడినది అగు యాతననుపొంది, ఎట్లోదానినుండి బయటపడిన తరువాత కూడ మానవుడై జన్మించినను క్షీణాయువు అగును. పాపకర్మలు చేయుచు ప్రాణులను హింసించుచు వానికి అహితుడు అగుటయే అయుః క్షయమునకు హేతువు. శుభకర్మలను ఆచరించుచు, ఆయుధము ధరించక ఏ ప్రాణిని దండించక హింసించక ఏ ప్రాణినితానై చంపక చంపువారిని అనుమోదించక తనయందు వలెనే ఇతర ప్రాణి యందును భావము కలిగి ప్రాణుల యందు స్నేహము కల నరుడు దేవత్వమును పొందును. సముచితములగు సుఖములను అనుభవించి స్వర్గమున సంతోషమును పొందును. ఒకప్పుడు ఇట్టివాడు మానవుడై జన్మించినను దీర్ఘాయుడగును. ప్రాణిహింసను విడుచుటయే దీర్ఘాయువును పొందుటకు మార్గమని బ్రహ్మ విధించెను. (224)