వ్యాసుడు ఇట్లు చెప్పెను.
బలరాముని లీల మఱియొకటి వినుడు. నరకాసురునికి మిత్రుడు దేవవిరోధి ద్వివిదుడను వానరుడు ఉండెను. వాడు శత్రువులతో విరోధము పెట్టుకుని నరకుని చంపిన కృష్ణుని నిమిత్తముగా దేవతలకు బ్రతిక్రియ చేయుదునని యజ్ఞధ్వంసము చేయుచు మర్త్యలోకమునకు హాని చేసెను. సాధువుల మర్యాదలను చెరచెను. జీవులను జంపెను. దేశమును పురములను, గ్రామములను కాల్చెను. పర్వతములు ఎత్తి పడవేసి గ్రామములను పిండిపిండి చేసెను. శైలములలేపి నీళ్ళలో సముద్రములో బడద్రొబ్బెను. సముద్రమున నిల్చి క్షోభింపజేసెను. దానిచే వార్ధి పొంగి చెలియలికట్ట దాటి దారినున్న పుర గ్రామములను ముంచెత్తెను. కోరిన రూపుదాల్చి దూకుచు గంతులిడుచు పంటలను అన్ని విధముల చూర్ణములు చేసెను. వానిచే ఈ జగమెల్ల అపకరింపబడి వేదాధ్యయన ధ్వని, వేద పఠన శబ్దము లేక దుఃఖించెను.
ఒకతరి హలాయుధుడు రైవతోద్యానమున మద్యపానము చేయుచుండెను. ఆయన భార్య రైవతి మఱి కొందరు రమణులు ఆతనిని అనుగమించిరి. వారు తన కీర్తిని గానము చేయు చుండగా వారి మధ్యలో నిల్చి కుబేరునివలె వెలుగొందను. అంతట ద్వివిదవానరుడు వచ్చి అతని రోకలిని, నాగలిని గైకొని యెదుటబడి వినోద మొనరించెను. ఆ తరుణుల యెదుట ఇకిలించెను. నిండు కల్లుకుండల గిరవాటు వెట్టెను. వానిని పగుల వేసెను. బలరాముడు ఈసు గొని వానిని బెదరించెను. అయినను వాడు అతని అవమానించుచు కిలకిల ధ్వని చేసెను. అంతటలేచి హలి రోషముతో రోకలిని పట్టెను. వాడొక వెఱుపు గొలుపు రాతిబండను ఎత్తివిసరెను. హలి దానిని ఱోకట వేలతునకలు చేసి చిమ్మెను. ఆ కోతి దుమికి మీద పడగా బలుడు రోషమున వానిని వంచి ఱొమ్మున కొట్టెను. నడినెత్తిన గ్రుద్దెను. అంత ద్వివిదుడు రక్తము గ్రక్కికొని ప్రాణములుపోయి పడిపోయెను. పడుచున్నవాని యొడలున నా కొండ శిఖరము దేవేంద్రుని యొక్క వజ్రముచే కొట్టబడినట్లు విరిగి పడెను. అంతట దేవతలు బలరామునిపై పూలవాన కురిపించిరి. వచ్చి బాగుబాగు గొప్పపని చేసినాడవని కొనియాడిరి. ఈ చెడ్డకోతి దైత్యుల వైపు ఉపకారముచేయ లోకమున బాధించినాడు. భాగ్యవశమున వీడు నీచే కడతేర్పబడినాడని ప్రశంసించిరి. ఇట్లనంతమూర్తి విశ్వంభరాధారి బలదేవుని లీలలు అనంతములు. (209)